Coordinates: 17°03′52″N 80°12′46″E / 17.064400°N 80.212814°E / 17.064400; 80.212814

నాగుల వంచ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగుల వంచ,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, చింతకాని మండలానికి చెందిన గ్రామం.[1]

నాగుల వంచ
—  రెవిన్యూ గ్రామం  —
నాగుల వంచ is located in తెలంగాణ
నాగుల వంచ
నాగుల వంచ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°03′52″N 80°12′46″E / 17.064400°N 80.212814°E / 17.064400; 80.212814
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండలం చింతకాని
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,767
 - పురుషుల సంఖ్య 3,327
 - స్త్రీల సంఖ్య 3,440
 - గృహాల సంఖ్య 1,988
పిన్ కోడ్ 507208
ఎస్.టి.డి కోడ్ 08742

ఇది మండల కేంద్రమైన చింతకాని నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]1669 నుంచి 1687 వరకూ డచ్ వారి అతిపెద్ద వ్యాపార కేంద్రం ఒకటి ఈ గ్రామంలో నిర్వహించబడింది.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1988 ఇళ్లతో, 6767 జనాభాతో 2456 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3327, ఆడవారి సంఖ్య 3440. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1818 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 204. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579744.[3] పిన్ కోడ్: 507208. ఎస్.టి.డి.కోడ్ = 08742.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చింతకానిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఖమ్మంలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

నాగులవంచలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగులవంచలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

నాగులవంచలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 85 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 174 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 69 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 131 హెక్టార్లు
  • బంజరు భూమి: 350 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1647 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1874 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 254 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

నాగులవంచలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 73 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 11 హెక్టార్లు
  • చెరువులు: 124 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 46 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

నాగులవంచలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

ప్రత్తి, వరి, మొక్కజొన్న

  • ఈ గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో నూతన ఆలయ నిర్మాణం కోసం, విగ్రహాలను గర్భగుడిలో నుండి తొలగించి, విగ్రహాలకు క్షీరాభిషేకం, జలాభిషేకం చేశారు. రు. 44.6 లక్షలతో నూతన ఆలయం నిర్మించడానికి అనుమతి మంజూరు అయినది. నిర్మాణ పనులు జరుగుచున్నవి. 2015 మొదటి భాగంలో ప్రారంభోత్సవం జరుగగలదు. [1]&[2]
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పడిశాల లక్ష్మీనారాయణ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామ చరిత్ర[మార్చు]

ఖమ్మం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉన్న ‘నాగులవంచ’కు కూడా రాముడు తన అరణ్యవాస సమయంలో వచ్చాడనే కథనాలు వున్నాయి.. ‘వంచ’ అంటే ‘వాగు’ అని అర్థం. శ్రీరాముడు ఇక్కడి వంచలో స్నానం చేశాడట. ఇక్కడున్న అతి ప్రాచీన కోదండ రామాలయంలో భద్రాచలంలో ఉన్నట్లే సీతారాములు ఒకే వేదికపై దర్శనమిస్తరు. ఇక్కడే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెస్తున్నటువంటి శిల్పం కూడా చిత్రితమైంది. సమీపంలోని గజగిరి నరసింహస్వామి గుట్టపై ఉన్న దేవుడు ప్రసిద్ధి చెందిన మంగళగిరి పానకాల స్వామిలా ఎంత పానకం పోసినా తాగేస్తాడట. అంతేకాదు, ఇదే నాగులవంచలో సీతారాములు సృష్టించుకున్నవిగా చెప్తున్న సీతానగర్, రామసముద్రం అనే రెండు చెరువులు కూడా ఉన్నాయి. . కొన్ని ప్రత్యేకమైన అమారిల్ (amaril) అనే ఖనిజాలతో పాటు ఇక్కడ దొరికే నూలు వస్త్రాలను మరింత నాణ్యతతో తయారుచేయించుకుని వారి దేశాలకు సరఫరా చేయించుకోవడం కోసం డచ్ కంపెనీ ఇక్కడ తమ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించుకుంది. దాదాపు రెండు దశాబ్దాలు తమ కార్యకలాపాలను సాగించింది. వ్యాపారం పేరుతో స్థానికులపై వారు చేస్తున్న దాష్టికం, శ్రమదోపిడీ మితిమీరి పోవడంతో స్థానికులు ఆగ్రహించారు. అక్టోబరు 13 తారీఖు 1687 లో తమనెత్తికెక్కి తైతక్కలాడుతున్న ఆ కంపెనీని ఏ ప్రత్యేకమైన నాయకత్వం లేకుండానే స్థానికులు మూకుమ్మడిగా నేలమట్టం చేసారు. ఈ కథ ఆ తర్వాత మూడువందళేళ్లకు జరిగిన భారతస్వాతంత్ర్య పోరాట గాథకు ఏమాత్రం తీసిపోదు. విదేశీ ఆధిపత్యాన్ని ఎదిరించి పోరాడటానికి నిజంగా భారతదేశంలోని తొట్టతొలి చారిత్రక ఉదాహరణ ఇదేనేమోకానీ ఈ విషయాన్ని గురించి తెలుసుకునేందుకు తెలుగులో నాకింతవరకూ సరైన సమాచారం దొరకలేదు. డచ్ కంపెనీల గురించి వారు అక్షరబద్దం చేసుకున్న విషయాలే మనకి ఉపయోగపడుతున్నాయి. అప్పటి వస్త్ర పరిశ్రమకు ఆనవాళ్ళుగా నీలిమందు తొట్లు అనేకం ఇప్పటికీ ఉన్నాయి. వంశపారం పర్యంగా అదేవృత్తిలో కొనసాగుతున్న నేతకార్మికుల అనేక కుటుంబాలకు ఇప్పటికీ అదే జీవనాధారం. ఈ కుటుంబాలన్నీ అప్పటి చారిత్రకు సాక్ష్యాలు కూడా.

నాగులవంచలోని ప్రాచీన మట్టికోట ఎప్పటి కోటో దాని మధ్యలో తర్వాత కాలంలో చక్కటి ఘడీ కట్టారు. ఇప్పుడు సినీహీరో రామ్ చరణ్ తేజ బంధువుల ఆధీనంలో వున్న ఈ కట్టడంలో ఒక ప్రయివేటు పాఠశాల నడుస్తోంది. అచ్చంగా మట్టి రాళ్ళతో ఇంతెత్తున కట్టిన గోడ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇన్ని వందలేళ్ళ తర్వాత ఇన్ని వర్షాలు వరదలూ ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుని ఇంకా ఆ మట్టిగోడ అంతెత్తున నిలబడివుండటమే ప్రత్యేకత అయితే. గోడకు నాలుగు వైపులా వున్న మట్టిబురుజుల పైకి ఎక్కేందుకు లోపటి వైపునుంచి మెట్లదారి నిర్మాణం మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చెత్తాచెదారం పేరుకునివుంది కొన్ని పురుగులూ ఎలుకలూ వంటివి చేరివున్నాయి వాటిని కొంచెం జాగ్రత్తగా తప్పిస్తే ఇప్పటికీ దానిమీదకు మెట్లదారిగుండా చేరుకోవచ్చు. మట్టికోట గోడలపై అనేక రాతిపై చెక్కిన శిల్పాలు అమర్చారు. కొన్ని శిల్పాలు చెక్కిన రాళ్ళు పక్కన పడేసి ఉన్నాయి.

అసలీపేరేమిటి?

పౌరాణిక కథనాల ప్రకారం రాముడు దండకారణ్యంలో చేస్తున్న తన అరణ్యవాస సమయంలో ఈ ఊరికి కూడా వచ్చాడని చెపుతారు. వంచ అంటే వాగు అని ఒక అర్ధం అందుకేనేమో పాలలా తెల్లని గోదారి ఒడ్డున వున్న గ్రామం పాలవంచ అయ్యింది. ఇక్కడి వంచలో సీతారాములు స్నానం చేసారట కాళీయుడి లాగానే ఈ ప్రాచీన వంచలో నాగులు వుండేవేమో అందుకే నాగులవంచ, నాగులొంచ అయ్యుంటుంది. ఇక్కడి ప్రాచీన కోదండ రామాలయంలో భద్రాచలంలో వున్నట్లే సీతారాములు ఒకే వేదిక మీద దర్శనం ఇస్తారు. ఈ గ్రామంలోనే సీతారాములు సృష్టించుకున్నవిగా చెప్తున్న సీతాసాగర్, రామసముద్రం అనే రెండు చెరువులు కూడా వున్నాయి

మరో రకంగా చూస్తే

నాగపూజ ఎక్కువగా జరిగే ఈ ప్రాంతంలో నాగుల చవితినాడు పుట్టమీద వుంచి మొక్కే ఎర్రగళ్ళ పైవస్త్రాన్ని ‘‘గావంచా’’ అంటారు. నిఘంటువు అర్ధంలో గావంచా అంటే అప్రధాన వస్త్రం, స్నానాది సమయాలలో తుడుచుకునుటకు ఉపయోగించే చిన్న బట్ట లేదా తువ్వాలు అని అర్దం. మహాత్మాగాంధీ వాడివ కొల్లాయి గుడ్డ కూడా ఒక గావంచానే, విశాఖపట్నం ప్రాంతంలో ఈ గావంచా అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఓడల్లో రవాణా విశాఖ నుంచే జరగటం వల్లకూడా అప్పటి ఆ మాటలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చేరటానికి కూడా అవకాశం ఉంది. అంటే వస్త్ర పరిశ్రమకు కాణాచి అయిన ఈ ప్రాంతంలో ఈ గావంచాలను ఎక్కువగా తయారుచేసేవారా? అదీ నాగుల చవితికేనా లేక నాగులు అనే నేతపనివాడు లేదా నాగులు దుకాణం వల్లకానీ వచ్చివుంటుందా? ఏమో చరిత్రను జాగ్రత్తగా దాచుకోకపోతే ఇదిగోండి ఇలాగే పూడిపోయిన మట్టిలో ఆధారాలకోసం వెతుక్కోవలసి వస్తుంటుంది.

చారిత్రిక నేపథ్యం[మార్చు]

నీలిమందు వర్తకంకోసం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయిన డచ్‌వారిపై స్థానికుల తిరుగుబాటు జరిగింది. 1687, అక్టోబరు 13న నాగులవంచను వదిలివెళ్లినట్లు డచ్ వారు తమ చరిత్రలో రాసుకున్నారు. అలా స్వాతంత్ర్య పోరాటానికంటే, బ్రిటీష్ పాలనకంటే ఎంతో ముందు నాగులవంచలో తిరుగుబాటు ఉద్యమం జరిగింది.[4]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (11 October 2019). "లడాయికి సై సై అన్న నాగులవంచ". www.ntnews.com. కట్టా శ్రీనివాస రావు. Archived from the original on 12 అక్టోబరు 2019. Retrieved 12 October 2019.

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ఖమ్మం/మధిర; 26,అక్టోబరు-2013; 2వ పేజీ.[2] ఈనాడు ఖమ్మం /మధిర; జనవరి-11,2014; 1వ పేజీ. [3] ఈనాడు ఖమ్మం/మధిర; 2014,జనవరి-28; 1వ పేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=నాగుల_వంచ&oldid=3833170" నుండి వెలికితీశారు