నాట్య ధర్మి
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
లోకథర్మి, నాట్యధర్మి అను రెండు ధర్మములు కలవని నాట్య శాస్త్రం భరతుడు చెప్పినాడు. ఈ ధర్మములు లోకస్వభావము అనువర్తింపజేయునవి.లోకమునకు ఒక అర్ధము ప్రజలు. అందువలన ఈ ప్రజల ప్రవృత్తులకు యోగ్యములగు వాచికాహార్యాది విషయములను చెప్పు ప్రసంగమున లోక, నాట్య ధర్మముల విచారణను భరతుడు గావించెను.
లోకధర్మము
[మార్చు]లోకథర్మమునకు వ్యతిరేకమైన ధర్మము నాట్యమున కనిపించ వీలులేదని భరతుని ప్రథమ సిద్ధాంతము. ఈ సిద్ధాంతమే అరిస్టాటిల్లో కూడా కనిపించును. ఈలోకగతమగు ప్రక్రియాక్రమము కవి, నాట వ్యాపారమున వైచిత్ర్యమునందును రంజనాధిక్య ప్రాధాన్యము నందగా రూపకమున నాట్యధర్మి కలదని అనుచుందురు.
స్వభావభావోపగతం శుద్ధం తు వికృతం తధా
లోకవార్తాక్రియోపేత మజ్గలీలా వివర్జితమ్
స్వభావాభినయోపేతం నానాస్త్రీ పురుషాశ్రయమ్
యదీ దృశం భవే న్నాట్యం లోకథర్మీ తుషా స్మృతా!
అని భరతుడు ముందు లోకథర్మిని వివరించెను. స్వాభావికముగా నున్న స్థాయి వ్యభిచార్యాది భావములతో నున్నది, శుద్ధము, స్వవికల్పితవ్యామిశ్రితము, లోకప్రసిద్ధమగు వ్యవహారముచే శుద్ధము, నర్తనాద్యంగ లీలారహితము, స్వాభావికమగు బలపతన ప్రహారాద్యభినయముతో కూడినది, నానాస్త్రీ పురుషాశ్రయము నైన నాట్యమున లోకథర్మి కనిపించును.
యధావృతవస్తుసూత్రము కవి వర్ణింపగా, నటుడు ప్రయోగించగా లోకథర్మి ప్రతీతమగును. ఇట్టి ప్రయోగమున భావనావ్యాపారము గాని, రంజనా వైచిత్రము గాని కనిపించవు. కాని ఇచట లోకథర్మాశ్రయత్వ ముండుటచే ఇది లోకదర్మి అనబడుచున్నది.
నాట్యధర్మి
[మార్చు]అతివాక్య క్రియోపేత మతిసత్త్వాతిభావకం
లీలాజ్గహారాభినయం నాట్యలక్షణ లక్షితం
స్వరాలజ్కార సంయుక్త మస్వస్థ పురుషాశ్రయం
యదీ దృశం భవే న్నాట్యం నాట్యధర్మీ తుషా స్మృతా!
అని నాట్యధర్మి గురుంచి చెప్పబడింది. ఇతి హాసాది వాక్య విలక్షణముగా గావించబడు ఉచితరంజ కేతివృత్తకల్పనాత్మికమగు క్రియ ఇచట కనపడును. స్వాభావిక చిత్తవృత్తికి విలక్షణమగు కవికల్పితచిత్త వృత్యంతరముతో కూడినది, శోభా ప్రధానముగా మనోహరములగు అంగహారములతో కూడిన అభినయము, నాట్యలక్షణలక్షితమగు ప్రయోగము, స్వరాలంకార సంయోజనముతో కూడినది, స్త్రీపురుషాన్యోన్యవిభావాత్మకము కనిపించుచున్నది నాట్యధర్మి.
లోకేయ ధభియోజ్యంచ పద మత్రోపయుజ్యతే
మూర్తిమ త్సాభిషాంచ నాట్యధర్మీ తుషా స్మృతా,
ఆసన్నోక్తం చ యద్వాక్యం నశృణ్యంతి పరస్పరమ్
అనుక్తం శౄయతే యచ్చ నాట్యధర్మీ తుషా స్మృతా.
శైలయాన విమానాని చర్మవర్మాయుధ ధ్వజాః
మూర్తియంతః ప్రయుజ్యంతే నాట్యధర్మీ తుషా స్మృతా!
లోకమున గర్హించదగ్గ విషయమును పదమాత్రమున తెలియజేయునది, లోకమున కళాశిల్పకల్పనా కలితమైన విషయమునుగూడా ప్రయోగయోగ్యముగా జేయునది నాట్యధర్మి. దగ్గరగా నున్న ఒకపాత్ర జనాంతికముగా పలుకు వాక్యమును రెండవపాత్ర వినజాలకపోవుట, ఆకాశభాషణాదికమున ఆముక్రమగు వాక్యమును వినగల్గుట నాట్యధర్మిలో కనిపించగలవు. శైలము, యానము, విమానము చర్మవర్మాయుధధ్వజములు సాక్షాత్తుగా కనిపించక పోయినను, రూపవంతములుగా భాసించునట్లు నాట్యధర్మి యందు అభినయింపబడుచున్నది. దారువస్త్ర చిత్రాది రూపములతో ఖేటకాదులు అభినేయములు కాగలవని భావము.
లలితై రంగవిన్యాసై స్తధోతిప్తపదక్రమైః
వృత్యతే గమ్యతే చాపి నాట్యధర్మీతుషా స్మృతా
యోయంస్వభావో లోకస్య సుఖదుఃఖ క్రియాత్మకః
సోజ్గాభినయసంయుక్తో నాట్యధర్మీ ప్రకీర్తితా
యశ్చ కక్ష్యా విభాగోయం నానావిధిసమాశ్రితః
రజ్గపీఠ గతః ప్రోక్తో నాట్యధర్మీ తుషా భవేత్.
ఆవేష్టితాది చతుర్విధకరణములలో స్వీకరింపబడిన వర్తనాదులయందు వ్యాపృతములైన లలితాంగ విన్యాసములతో, చతుస్తాలాద్యుక్షిప్తములగు పద పరిక్రమములతో పోవుచున్నట్లు. వర్తించచున్నట్లు నటీనటులను భాసింపజేయునది నాట్యధర్మి. ఏతత్ప్రాణితమగు నాట్యము సుఖదుఃఖక్రియాత్మకమగు లోకస్వభావము అంగాభినయసంయుక్తముగా జూపగా నాట్యధర్మీ సంకల్పితమగుచున్నది. అంగాభినయమనగా తోద్యాదికముతో కూదిన అభినయమని అర్ధము. ఈ అభినయము లోకస్వభావమును తెలుపునది. నాట్యధర్మి సర్వాభినయ ప్రకాశిసారము. నానావిధసమాశ్రితమగు కక్ష్యావిభాగమున, రంగపీఠగతమై అభినేయమగునదియే నాట్యధర్మి.
భరతుడు లోకథర్మి, నాట్యధర్మి అని రెండు విధములుగా ధర్మిని స్వీకరించుచు లౌకికజగత్తుకు, కావ్యజగత్తుకు విశిష్టధర్మయంశమున సాదృశ్యమును ప్రతిపాదించుచున్నాడు.లౌకికథర్మ జనితములై తదాశ్రితములైనవి అభినయములు. అంగా నాట్య లోకథర్ములకు విషయ సంపద సమానమే. కాని సూత్రబద్ధమై, అభినయాత్మకమై, సత్త్వ కుణోపేతమై ఉండునది నాట్యధర్మి.
స్వభావసిద్ధమైనది లోకథర్మి. తత్సంస్కార రూపమైనది నాట్యధర్మి. మరుణవదాదులు నాట్యమున ప్రదర్సించక, కేవలము సూచించబడుచున్నవి. అనగా రజస్తమోగుణములు నాట్యమున వినబడినను, సత్త్వమే దర్శనయోగ్యము.
లోకమున మనము నిత్యము చూచునది, అనుభవించునది లోకథర్మి. కాని నాట్యమున ఇదిఅంతయు చూడజాలము కనుక కొన్ని మార్పులు అవసరము. ఈ మార్పులను నాట్యధర్మి యందు ఉన్నాయి. శబ్దమున, గానమున, వేషమున నాట్యధర్మి యొక్క వైశిష్ట్యము ఉంది. ఉదారములు, మధురములు అగు శబ్దములనే కవి ప్రయోగించును. ఈ శబ్దము అర్ధములతో కూడినదై ఉండవలెను.
వాచికాభిమయమున గల సంగీతము నాట్యధర్మిగా పరిగణింపబడెవలెనన్న స్వరాలంకారములతో కూడిఉండవలెను.
రంగస్థలము ఉంది. జీవితములోని సన్నివేశములను కవి ఇందు గ్రహించును, రూపకములోని పాత్రలు రంగస్థలముననే ప్రదర్సించబడునవి. ఇందుచే జీవితమున గల రంగస్థలము నాట్యములోనికి అనువదించ బడజాలదు. జీవితమును కనబడు ఇండ్లు, మేడలు, ప్రయాణములు మొదలగు ముఖ్యసన్నివేశములు రంగస్థలమున చూపబడజాలవు. కావున వీటికి ప్రత్యామ్నాయముగా కొన్ని కల్పించబడుచున్నవి.
లోకథర్మవ్యతిరేకమైన ధర్మమేమియు నాట్యమున లేదు. కాని లోకములోని ప్రక్రియాక్రమము అధికరంజనాత్మకముగా, విచిత్రముగా, విశిష్టముగా చూపునది నాట్యధర్మి. అనగా లోకానుసరణమును వైచిత్ర యోగ్యతమున విశిష్టముగా కవి ప్రదర్సించవలెను. స్వభావసిద్ధము, స్వతఃసిద్ధము అగు లోకథర్మిని విశిష్టముతో తెలుపునది నాట్యధర్మి.
లౌకికజగత్తుకు కావ్యజగమే మూలము. భావనావ్యాపార ప్రధానమైన కావ్యజగము బహిర్దృశ్యమాన నానాత్వభిన్నత్వముల కేకత్వానన్యత్వముల ఆపాదించ గలుగుచున్నది.కావ్యజగమున ప్రవేశించి పారిశుద్యమున అందనిదేదియు లౌకికజగత్తులో లేదు. కనుక బాహ్యజగత్తు కూడా భావనా విశిష్టమైనప్పుడె వ్యవహారయోగ్యమగును.కావ్య జగమున లేని జ్ఞానముకాని, శిల్పముకాని, ప్రవృత్తికాని లౌకిక జగమున లేనేలేవు.
మూలము
[మార్చు]- 1957 భారతి సంచిక. వ్యాస కర్త శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి.