Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

సత్త్రియ నృత్యం

వికీపీడియా నుండి
ప్రకృతి ఒర, 64 సత్త్రియ వ్యాయామాలలో (మాతి అఖోర) ఒకటి

సత్త్రియ లేదా సత్త్రియ నృత్యం భారతదేశానికి చెందిన ఎనిమిది ప్రధాన శాస్త్రీయ నృత్యాలలో ఒకటి. సత్త్రియ నృత్యం 500 సంవత్సరాల చరిత్రగల అస్సాంకు చెందిన శాస్త్రీయ నృత్యం. భక్తి భావనని వెలిబుచ్చడానికి ఉద్భవించి ఒక కళారూపంగా పెంపొందింది. 15వ శతాబ్దం నుంచి అస్సామీ సంస్కృతిలో సత్త్రాలు (అస్సాం యొక్క వైష్ణవ ఆశ్రమాలు) ఒక భాగంగా, సంప్రదాయంగా ఉన్నాయి. అస్సామీ సంస్కృతి, సాహిత్యాలకు ప్రధాన ప్రేరకుడైన వైష్ణవ సాధువు, కళాకారుడు, శ్రీమంత శంకరదేవ, అతని శిష్యుడైన మాధవదేవ సత్త్రాలను ప్రథమంగా స్థాపించారు. ప్రతి సత్త్రమూ ఆధ్యాత్మికత మరియూ కళలు కేంద్రంగా ఉన్న ఒక జీవనశైలిని ప్రబోధించేవి. అవి సంగీతము, నృత్యము, నాటకాలు ప్రధానముగాగల లలితకళాకేంద్రాలుగా మిగిలిపోయాయి. ఈ సత్త్రాల సంఖ్య అనతికాలంలోనే 700కు మించిపోయింది.

శంకరదేవ, సత్త్రాలలో ప్రదర్శించడానికి తను రూపొందించిన అంకియ నాట్ (ఒక విధమైన అస్సామీ ఏకాంక నాటికలు) కు అనుబంధంగా ఈ నాట్య పద్ధతిని రూపొందించాడు. సత్త్రాలలో పుట్టి, అక్కడ అభివృద్ధి చెందిన నాట్యము కావటం వలన దీనికి సత్త్రియ నృత్యముగా ప్రసిద్ధికెక్కింది. సత్త్రియ నృత్యానికి మూలాధారము పౌరాణిక గాథలే. పౌరాణిక బోధలను సామాన్యప్రజలకు అర్థమయ్యే రీతిలో, మనోరంజకముగా చెప్పే ప్రయత్నములో పుట్టిన కళారూపమే సత్త్రియ.

సాంప్రదాయకంగా సత్త్రాలలో మగ సాధువులు (భొకొత్) మాత్రమే తమ దినచర్యలలో భాగంగా లేదా ప్రత్యేక పండుగ సందర్భాలను పురష్కరించి ప్రదర్శించే ఈ నృత్యం 19వ శతాబ్దపు రెండవ భాగంలో సత్త్రాలనుంచి బయటి ప్రపంచాన్ని చూసింది. ప్రస్తుతం ఈ నృత్యాన్ని సత్త్రాలలో సభ్యులు కానివారు కూడా ఆడ, మగా తారతమ్యం లేకుండా అందరూ నేర్చుకోవటమేకాక వేదికలపై కలిసి ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నృత్యాన్ని సోలోగా, బృందముగా కూడా ప్రదర్శిస్తున్నారు. పూర్యము సత్త్రాలు చాలా కఠినమైన నిర్ధిష్ట నియమాలను పాటించేవి. సాంప్రదాయ కట్టుబాట్లు, కచ్చితమైన నియమ పాలన, శాస్త్రయుక్త పరిశోధన పట్ల విముఖత సత్త్రియ నృత్యాన్ని ఎనిమిదవ భారత శాస్త్రీయ నృత్యంగ పరిగణించడాన్ని ఆలస్యం అయ్యేట్లు చేసాయి. 2001లో సంగీత నాటక అకాడెమీ సత్త్రియ నృత్యాన్ని ఎనిమిదవ భారత శాస్త్రీయ నృత్యంగా పరిగణించింది.

శాస్త్రీయ నృత్యానికి అవసరమైన అన్ని నియమాలూ సత్త్రియ నృత్యంలో ఉన్నాయి.

  1. విధాన పరమైన నాట్యం, నాట్య శాస్త్ర, అభినయ దర్పణ, మరియూ సంగీత్ రత్నాకర్.
  2. ప్రత్యేక నృత్యకళా రీతి (మార్గ్)
  3. 500 ఏళ్ళుగా వస్తున్న సంప్రదాయం.
  4. నృత్యానికి కావలసిన విషయాలు నృత్త (స్వచ్ఛమైన నృత్యం), నృత్య (భావప్రకటన), నాట్య (అభినయం).

సత్త్రియ నృత్యంలో వీటి కలయికలూ అంతేముఖ్యం; శాస్త్రీయ రాగం భక్తిపారవశ్య గీతాలు (బూర్‌గీత్) (శంకరదేవ కంపోజ్ చేశారు), సంగీతం. ఢోల్, ఢంక, బాఁసురి, వయొలిన్. కంజీర లాంటి వాద్యపరికరాలు వెన్నంటి ఉంటాయి. సత్త్రియ నృత్యములోని ఆంగీకము, ఆభరణాలు అలంకరణ, అస్సామీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సత్త్రియ సాధకులకు అత్యంత మానసిక, శారీరక దృఢత్వం అవసరం. సత్త్రియ నాట్యభంగిమల ప్రదర్శనకు సంపూర్ణ ఏకాగ్రత, భక్తి అవసరం.

సత్త్రియనృత్యాన్ని అనేక వర్గాలుగా విభజించవచ్చు. అందులో కొన్ని: అప్సర నృత్య, బేహార్ నృత్య, ఛాలీ నృత్య, దశావతార నృత్య, గోసాయి ప్రవేశ, ఝుముర, నాడు భంగి, మన్చోక్ నృత్య, బార్ ప్రవేశ, నటువ నృత్య, గోపీ ప్రవేశ, రాస నృత్య, రాజగర్హియ ఛాలీ నృత్య, సూత్రధార.

మూలాలు

[మార్చు]