Jump to content

నార్మన్ బోర్లాగ్

వికీపీడియా నుండి
నార్మన్ బోర్లాగ్

నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ హరిత విప్లవ పితామహుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ప్రపంచ వ్యాప్తంగా వందలాది కోట్లమందిని ఆకలి బాధలనుండి, పస్తులనుండి రక్షించిన వాడు. బోర్లాగ్ 1914, మార్చి 25న అమెరికా లోని అయోవాలో ఒక వ్యవసాయ కుటుంబములో పుట్టాడు.

బాల్యము, విద్య

[మార్చు]

బోర్లాగ్ నార్వే దేశమునుండి 1854లో అమెరికాకు వలస పోయిన కుటుంబములో మూడవ తరము వాడు. తండ్రి హెన్రీ ఆలివర్ బోర్లాగ్. తల్లి క్లారా. 106 ఎకరముల పొలముపై ఏడేళ్ళ నుంచి పందొమ్మిదేళ్ళ వయసు వరకూ పొలం పని, చేపలు పట్టడం, వేటాడ్డం, కోళ్ళు పశువులతో కాలక్షేపం, ఆటపాటలతో గడిపాడు. తాత ప్రోత్సాహము వల్ల మిన్నిసోటా విశ్వవిద్యాలయంలో చేరి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరినాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్‌ పాథాలజీ, జన్యు శాస్త్రం‌లో పీహెచ్‌డీ చేశాడు.

కృషి పరిశోధన

[మార్చు]

పరిశోధనల్లో ఆయన దృష్టి గోధుమ పంట మీద పడడం ప్రపంచానికి గొప్ప మేలు చేసింది. చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టిరకం గోధుమ వంగడాలను కనిపెట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు. 1960 ప్రాంతంలో కరువుకాటకాలతో అల్లాడుతున్న ఇండియా, పాకిస్థాన్‌ దేశాల్లో ఆ వంగడాలను పరిచయం చేశాడు. 1963లో ఆయన ఇండియా కూడా సందర్శించాడు. ఇరవయవ శతాబ్ది ద్వితీయార్థంలో ప్రపంచాన్ని తీవ్ర కరవునుంచి బయటపడేసి వంద కోట్ల మంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన ఆవిష్కరణలు తోడ్పడ్డాయి. ఆయన ఆవిష్కరణల వల్ల 1960, 1990 మధ్య కాలంవలో వ్యవసాయ దిగుబడులు రెండింతలకు మించి జరిగాయి.[1] అది హరిత విప్లవంగా మారింది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో సైతం కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్‌ కనిపెట్టిన గోధుమ వంగడాలను వాడుతున్నారు. బోర్లాగ్‌పై 2006లో 'ది మ్యాన్‌ హూ ఫెడ్‌ ద వరల్డ్‌' అనే పుస్తకం వచ్చింది.

పురస్కారాలు

[మార్చు]

ఆహార పంటల కొరతను తీర్చినందుకు 1970లో బోర్లాగ్‌కు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. బోర్లాగ్‌ 2009, సెప్టెంబరు 12న తన 95వ ఏట మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రప్రభ దినపత్రిక, తేది 14.09.2009
  2. http://www.google.com/hostednews/ap/article/ALeqM5gb_fsKObiTI2Quwargw4snaBhKuAD9AM79R81%7Ctitle=Nobel[permanent dead link] Prize winner Norman Borlaug dies at 95