నేతకారుడు
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పట నుండి ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు.వ్యాసం శీర్షిక తప్పుగా ఉంది.నేతకాడు అని ఉండాలి.అసలు వ్యాసంలో శీర్షికకు సంబందించిన విషయసంగ్రహం సంపూర్ణంగా లేదు. ఇది ఎవరినో విమర్శించినట్లుగా ఉంది.వికీ శైలిలో లేదు.వర్గీకరణ లేదు.10 రోజులలో లోపు వికీశైలిలో, తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నేతకారుడు పేజీలో రాయండి. |
వస్త్రాలను నేయు వానిని నేతగాడు (Weaver) నేతకారుడు అని, మగ్గం (Hand weaving machine) పై బట్టలు నేసి వాటిని అమ్ముకొని జీవించే వాళ్ళని చేనేత నేత కారులు, నేతగాళ్ళు అని లేదా సాలెవాళ్ళు అని అంటారు.[1] వీరు చేయు వృత్తిని చేనేత అంటారు. మగ్గం అనే సాధనము ఉపయోగించి వీరు చీరలు, పంచెలు వంటివి నేస్తారు.గ్రామీణ జీవనోపాధికి వ్యవసాయం తరువాత చేనేత రంగం ప్రధాన ఆయువుపట్టు. తెలుగు రాష్టాల జనాభాలో దాదాపు 12శాతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పాలకుల నిరాదరణకు గురవుతున్న చేనేత పరిశ్రమ ప్రస్తుతం తిరోగమనంలో పయనిస్తోంది.[2] అటకెక్కుతున్న మగ్గాలే దీనికి నిదర్శనం.
ఆగస్టు 7 ను నేతకారుల లేదా చేనేతకారుల దినోత్సవంగా ప్రకటించారు, 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి, విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలు పునిచ్చారు. అప్పటి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7ను భారత జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు.[3]
ప్రస్తావనలు
[మార్చు]నేపధ్యం
[మార్చు]భారతీయత సాంస్కృతిక కళలలో చేనేత ఒకటి. కనులకు ఇంపుగా రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యం మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత రంగానికి, నేత పనివారికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతీయుల జీవితంతో పెనువేసుకొని, భారతీయుల సంస్కృతికి అది అద్దం పడుతుంది. భారతీయ చేనేత కళాకారుల సృజన అద్భుతమైనది. వస్త్రాలు నేయడంలో వారి ప్రతిభ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది.
భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతులు చేయబడేవి. రెండువేల సంవత్సరాల క్రితం `హంస’ డిజైన్లతో ఉన్న భారతీయ వస్త్రాలు ఈజిప్టు కైరో నగరంలో లభ్యమయ్యాయి. అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్ చీరలను నేసిన ఘనచరిత్ర ఉన్న దేశం మనది.
భారతీయ ఉపఖండంలో వస్త్ర కళ, ఎగుమతుల చరిత్ర దాదాపు 5,000 సంవత్సరాల ముందు నుండి ఉంది. సింధు లోయ నాగరికత అభివృద్ధి చెందిన సమయంలో కూడా ఫాబ్రిక్ తయారీ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని కనుగొనబడింది.
హరప్పా, మోహెంజో-దారో వద్ద జరిపిన త్రవ్వకాల్లో స్పిన్నింగ్ వీల్ మాదిరిగా ఉన్న రాట్నం కనుగొన్నారు. రెసిస్ట్-డైయింగ్, హ్యాండ్-పెయింటింగ్, ఎంబ్రాయిడరీ పద్ధతులు కాకుండా, సింధు లోయ ప్రజలు నేత కళలో మాస్టర్స్. సింధు లోయ నాగరికత తరువాత ఈ ప్రాంతంలో స్థిరపడిన వేద ఆర్యులు, బౌద్ధులు కూడా రాట్నం ఉపయోగించారు. మార్కో పోలో (1288), టావెర్నియర్ (1660) వంటి విదేశీ ప్రయాణికులు ఉపఖండంలోని పత్తి బట్టల యొక్క గొప్పతనం గురించి వివరంగా రాశారు, రోమ్, జాంజిబార్, జావా, బాలి, భౌగోళికంగా విస్తృతంగా వేరు చేయబడిన వాణిజ్య కేంద్రాలకు మన వస్త్రాలు ఎగుమతి అయినట్లు బంగారం, వెండి బ్రోకేడ్లు, చక్కటి బొమ్మలు కలిగిన మస్లిన్లు, ముద్రణ, పెయింటింగ్ చేసిన బట్టలు, సున్నితమైన తివాచీలు, క్లిష్టమైన ఎంబ్రాయిడరీలు మరెన్నో రకాల వస్త్రాలు భారీ స్థాయిలో ఉత్పత్తి అయినట్టుగా ఆధారాలు లభిస్తున్నాయి.
భారతదేశంలో దాదాపు 150 చేనేత కేంద్రాలు ఉన్నాయని అంచనా. ఆంధ్రా, ఒడిస్సాల నుంచి నూలు ఇకత్, జామ్దని, బనారస్ పట్టు, జరీలు, కంచి /తమిళనాడు పట్టు, గుజరాత్ రాజస్థాన్ టై & డై, సూరత్ టాంచౌ, పంజాబ్ పుల్కారి, బెంగాల్ ఢకై, బాలుచరి సిల్క్, అస్సాం మూగా సిల్క్, మహేశ్వరీ జరీ, పటోల డిజైన్, చందేరి సిల్క్, పైథాని సిల్క్, కోటా పేపర్ సిల్క్, మధ్యప్రదేశ్/ ఆంధ్రప్రదేశ్/ ఉత్తరప్రదేశ్/ ఒడిస్సా/ బెంగాల్ టసర్ సిల్క్, ఖాదీ సిల్క్, మైసూరు సిల్క్, కాశ్మీర్ సిల్క్, ఎరి ముడి సిల్క్, కాశ్మీర్ పష్మినా, శాహ్తూష్ పల్చని ఉన్ని, ఈశాన్య రాష్ట్రాల గిరిజనజాతుల రకరకాల చిహ్నాల రంగుల వస్త్రాలు, బీహార్ మధుబని, మహారాష్ట్ర వర్లి డిజైన్లు, ఇంకా ఎన్నెన్నో వివిధ వర్ణాల సమ్మేళనమే భారతీయ చేనేత.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..
ఒకప్పుడు కాటన్ క్లాత్‌కి కేరాఫ్‌గా ఉన్న దుబ్బాక మూడేళ్లలో ఇక్కత్- లినెన్ చీరల తయారీకి కేంద్రంగా మారింది. 2017 నుంచి లినెన్ తయారీని మొదలుపెట్టారు. ఇప్పుడు నెలకు 15 ఇక్కత్- లినెన్ చీరలు, 150 మీటర్ల షర్టి గ్ క్లాత్‌ను తయారుచేస్తున్నారు. వాటిని ఇతర రాష్ట్రాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. లినెన్ చీర ధర మార్కెట్‌లో ఎనిమిది వేల నుంచి మొ దలవుతుంది. కానీ.. దుబ్బాకలో నేసిన చీరలను 5,500 రూపాయలకే అమ్ముతున్నారు. షర్టింగ్ క్లాత్‌ని మీటరుకు 800 నుంచి 1500 రూపాయల వరకు అమ్ముతున్నారు. తక్కువ లాభాలకు అమ్ముతూ మార్కెటింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లినెన్ షర్టింగ్‌లో 44లీ, 60లీ, 80లీ, 100లీ రకాలను నేస్తున్నారు. ప్లెయిన్, లైనింగ్ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. లినెన్ క్లాత్ నేసే కార్మికులకు కూలీ కూడా బాగానే గిట్టుబాటు అవుతోంది. ఒక్కో కార్మికుడు నెలకు 15వేల రూపాయలకు పైగానే సంపాదిస్తున్నాడు.
బ్లాక్-ప్రింట్స్ చేనేతలో ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతి ఘనమైనది. స్థానికంగా ఉండే చెట్లు, పువ్వుల నుంచి రంగుల సారం, బంకమన్ను నదులలోని ఇసుకనుంచి రసాయనాలు తయారు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే 15కి మించి చేనేత కేంద్రాలు ఉన్నాయి.
చేనేతలో రకాలు
[మార్చు]కలంకారీ చేనేతలో రెండు రకాలు- మచిలీపట్నం, పెడనలలో బ్లాక్ ప్రింట్స్; శ్రీకాళహస్తిలో హ్యాండ్.ప్రింట్స్- చేత్తో గీసే డిజైన్లు (కాళహస్తి పుణ్యక్షేత్రం కారణంగా ఆదినుంచీ ఇక్కడ దేవతా మూర్తులు- శివుడు, పార్వతి, వినాయకుడు, లక్ష్మి మొదలైనవి, అక్కడి స్థల పురాణాలతో వస్త్ర చిత్రీకరణ ఉంటుంది. ఎంతోమంది కాళహస్తి చేనేత కళాకారులు వారి హ్యాండ్.ప్రింట్స్ కళానైపుణ్యతకి జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.
మరికొన్ని రకాలు
[మార్చు]పోచంపల్లి ఇక్కత్ ఉప్పాడ జామ్దాని జరీ చీరలు వేంకటగిరి జరీ చీరలు నారాయణపేట చీరలు గద్వాల- కాటన్, పట్టు మంగళగిరి- కాటన్, రెండు వైపులా అంచులు మాధవరం జరీ ధర్మవరం కాటన్/పట్టు గుంటూరు వస్త్రాలు ఎమ్మిగనూర్ పొందూరు ఖద్దర్ వేంకటగిరి నేతవస్త్రాలు ఇలా అనేక ప్రాంతాల్లో చేనేత ద్వారా అనేక రకాల వస్త్రాల ఉత్పత్తి జరుగుతున్నది.
నేతకారుల అభివృద్దిలో కొన్ని సంస్థలు
[మార్చు]జాతిపితగాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రాట్నం మన స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించింది. స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో ఎక్కువ మందికి జీవనోపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. దేశంలో కోటి 30 లక్షల మంది ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి కలిగిఉన్నారని ఒక అంచనా. పరోక్షంగా మరో 10 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు.
దేశంలో తయారవుతున్న వస్త్రాల్లో చేనేత వాటా 23 శాతం కలిగి ఉంది. 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్‌లో మొట్టమొదటగా స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, స్వదేశీ వస్ర్తాలనే వాడాలని నాయకులు పిలుపునిచ్చారు. అందువల్ల ఏటా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా పాటించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత రంగంలో జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి సాధించడానికి 1983లో భారత ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ను నెలకొల్పింది. చేనేతరంగ ప్రయోజనాల కోసం, అన్ని రకాల నూలును కొనడం, నిల్వచేయడం, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను ఈ కార్పొరేషన్ చేపడుతుంది. చేనేత రంగానికి అవసరమైన రంగులు, రసాయనాలు, ముడిపదార్థాలను సబ్సిడీ ధరలపై అందించడం, చేనేత రంగంలో సాంకేతికతను పెంచండం ఈ కార్పొరేషన్ ప్రధాన లక్ష్యాలు.
చేనేత అభివృద్ధికి ప్రభుత్వంకొన్ని సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అలాంటి కొన్ని సంస్థలు కొన్ని
- జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (National Handloom Development Corporation – NHDC) - ఇది అన్ని చేనేత కేంద్రాలు, సంస్థలు, సహకార సంస్థల అభివృద్ధికి ఈ కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చేనేత సహకార సంస్థలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల ద్వారా చేనేత కేంద్రాలకు సహాయం లభిస్తోంది. చేనేత కార్మికులకి ఆరోగ్య బీమా పధకాలు కూడా కల్పిస్తుంది.
- దీనదయాళ్ చేనేత ప్రోత్సాహన్ యోజన - ఇది చేనేత ఉత్పత్తుల అభివృద్ధి, రుణ సదుపాయం, చేనేత కళాకారుల శిక్షణ, సామగ్రి పరికరాల సదుపాయం, మార్కెటింగ్ వ్యవస్థ, పెట్టుబడులు, ప్రచారం, రవాణా సదుపాయo మొదలైనవన్నీ కల్పించే కార్యక్రమం.
- జాతీయ వస్త్ర డిజైన్ కేంద్రం (National Center for Textile Design- NCTD): ఢిల్లీ ప్రగతి మైదాన్లో 2001 `చేనేత పెవిలియన్’ స్థాపించబడింది, సంప్రదాయ, నూతన డిజైన్ల రూపకల్పన దీని ప్రధాన ఉద్దేశం. అలాగే గ్రామీణ చేనేత కళాకారులకి ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మార్గం కల్పిస్తుంది.
- చేనేత ఎగుమతులు వృద్ధి చేసేందుకు స్థాపించిన చేనేత ఎగుమతి అభివృద్ధి సంస్థ ( Handloom Export Promotion Council) దేశదేశాల మార్కెటింగ్, వ్యాపార సమాచారం భారతీయ ఉత్పత్తుల గురించి ప్రచారం, చేనేత ఎగుమతిదార్లకు సలహాలు, సేవలు అందించడం, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలతో సంప్రదింపులు, ఒప్పందాలు చేయడం, ఎగుమతి సంస్థలకు, చేనేత కార్మికులకు సందర్భానుసారం సలహాలు ఇచ్చి తోడ్పాటును అందిస్తోంది.
దేశంలో చేనేత రంగాన్ని కాపాడి, అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధి, చేనేత చేనేత కార్మికుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా ఈ క్రింది పథకాలను అమలు చేస్తోంది: -
1. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్.హెచ్.డి.పి)
2. సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం (సి.హెచ్.సి.డి.ఎస్)
3. చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం (హెచ్.డబ్ల్యు.సి.డబ్ల్యు.ఎస్)
4. నూలు సరఫరా పథకం (వై.యస్.ఎస్)
ఈ పథకాల కింద, ముడి పదార్థాలు, మగ్గాలు, ఉపకరణాల కొనుగోలు, డిజైన్ ఆవిష్కరణ, ఉత్పత్తుల ప్రొడక్ట్ వైవిధ్యీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మొదలైన కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది.
1. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డిపి)
i. బ్లాకు స్థాయి క్లస్టర్:
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్.హెచ్.డి.పి) యొక్క భాగాలలో ఒకటిగా 2015-16 లో ప్రవేశపెట్టబడింది. నైపుణ్యాభివృద్ధి, హాత్ కార్గ సంవర్ధన్ సహాయత, ఉత్పత్తి అభివృద్ధి, వర్క్‌షెడ్ నిర్మాణం, ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం, డిజైన్ అభివృద్ధి, సాధారణ సౌకర్యాల కేంద్రం (సి.ఎఫ్.సి) ఏర్పాటు మొదలైన వివిధ కార్యక్రమాల కోసం బి.ఎల్.సి.కి 2.00 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వీటితోపాటు, జిల్లా స్థాయిలో ఒక "డై హౌస్" ఏర్పాటుకు 50.00 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది.
నేత కారుల సమస్యలు
[మార్చు]ముడిసరుకు ధరలు పెరుగుదల - కాటన్/నూలు, సిల్క్, జనప ధరలు పెరగడం; ఎరువులు పురుగు మందులు, రసాయనాల ధరలు పెరగడం వల్ల కాటన్ ధరలు కూడా పెరిగాయి.
మౌలిక సదుపాయాల కల్పన - పెట్టుబడులు లేకపోవడం; ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమ కనీసావసరాలైన స్థలం, నీళ్ళు, విద్యుత్తు కూడా అందుబాటులో ఉండవు.
మార్కెట్ల వ్యవస్థ సదుపాయాలు లేకపోవడం. • చేనేత పరిశ్రమ ఉత్పత్తులకు `పేటెంట్’ లేకపోవడం వల్ల రక్షణ లేదు, అన్ని సంప్రదాయ డిజైన్లు అనుకరించి నకళ్ళు చేస్తున్నారు.
బట్టల మిల్లులు, ఫాక్టరీలు, పవర్లూముల నుంచి చేనేత పరిశ్రమ ఆన్యాయమైన పోటీ ఎదుర్కుంటోంది, చేనేత డిజైన్లు నకలు/ కాపీ చేసి, పవర్లూమ్లులు అవే చేనేత అని చెప్పుకుని చెలామణి అయిపోతున్నాయి. పైగా ఫ్యాక్టరీలకి, పవర్లూములకి ప్రభుత్వ సబ్సిడీలు కూడా దొరుకుతాయి
ఇది నూతన యుగం, రంగులు డిజైన్లు క్షణక్షణం మారుతుంటాయి. కొత్త డిజైన్ల కొరత పరిశ్రమను దెబ్బతీస్తోంది. ఇది చేనేత కళాకారులు చేయలేక కాదు, డబ్బు పెట్టేవాళ్ళు `రిస్క్’ లేకుండా వ్యాపారం చేయాలనుకోవడం కారణం.
మూలాలు
[మార్చు]- ↑ "నేతగాడు". kahaniya.com. 15 June 2021. Retrieved 30 March 2022.
- ↑ "చేనేత రంగంపై పిడుగు". navatelangana.com. Retrieved 30 March 2022.
- ↑ "జాతీయ చేనేత దినోత్సవం". sakshi.com. Retrieved 30 March 2022.
బయటి లింకులు
[మార్చు]- https://books.google.co.in/books?id=shN5_-W1RzcC&redir_esc=y
- https://archive.org/details/cu31924032649828
- భారతీయ చేనేతలో - https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-448809[permanent dead link]
- చేనేత జౌళి మంత్రిత్వ శాఖ -చేనేత అభివ్ర్ద్ది = https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1655842
- భారతీయ చేనేత – మన అమూల్య సాంస్కృతిక వారసత్వం- https://vsktelangana.org/7th-august-national-handlooms-day