Jump to content

పరాగసంపర్కము

వికీపీడియా నుండి
(పరాగ సంపర్కం నుండి దారిమార్పు చెందింది)
A bee collects nectar, while pollen collects on its body.

పుష్పించే మొక్కలలోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగసంపర్కం (Pollination) అంటారు.[1] ఫలదీకరణ జరగడానికి ముందు తప్పనిసరిగా పరాగసంపర్కం జరిగితీరాలి. వివృతబీజాలలో అండాలు వివృతంగా (open) ఉండటం వలన పరాగరేణువులు నేరుగా అండద్వారం మీద పడతాయి. ఇటువంటి పరాగసంపర్కాన్ని ప్రత్యక్ష పరాగసంపర్కం (Direct pollination) అంటారు. కానీ ఆవృతబీజాలలో అండాలు అండాశయం లోపల అంతర్గతంగా, సంవృతంగా (closed) ఉండటం వలన పరాగరేణువులు కీలాగ్రంపైన పడతాయి. ఇటువంటి పరాగసంపర్కాన్ని పరోక్ష పరాగసంపర్కం (Indirect pollination) అంటారు.

పరాగసంపర్కంలో రకాలు

[మార్చు]

ఆవృతబీజాలలోని పరాగసంపర్కాన్ని రెండు రకాలుగా విభజించవచ్చును. అవిఆత్మ పరాగసంపర్కం, పర పరాగసంపర్కం

ఆత్మ పరాగసంపర్కం

[మార్చు]
  • ఆత్మ పరాగసంపర్కం (Self pollination): ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం మీద పడడాన్ని ఆత్మ పరాగసంపర్కం లేదా ఆటోగమి అంటారు. ఇది ద్విలింగ పుష్పాలలో మాత్రమే జరగడానికి ఆస్కారముంటుంది.

ఆత్మ పరాగసంపర్కాన్ని ప్రోత్సహించే పద్ధతులు

[మార్చు]
  • ఏకకాల పక్వత :
  • పుష్పభాగాల చలనం :
  • భద్రతా యాంత్రికం :
  • సంవృత సంయోగం :

పర పరాగసంపర్కం

[మార్చు]
  • పర పరాగసంపర్కం (Cross pollination): ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పర పరాగసంపర్కం లేదా ఆలోగమి అంటారు. ఇది వివృతసంయోగ పుష్పాలలో జరుగుతుంది. పరాగకోశాలు, కీలాగ్రాలు పుష్పాల నుండి బయటకు పొడుచుకు వచ్చే సంవృతసంయోగ పుష్పాలలో కూడా ఇది కనిపిస్తుంది. దీనిలో రెండు రకాలు గుర్తించవచ్చును.
ఏకవృక్ష పర పరాగసంపర్కం
ఈ పర పరాగసంపర్కం ఒకే మొక్కపై నున్న రెండు పుష్పాల మధ్య జరుగుతుంది. అనగా ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే మొక్కపై నున్న వేరొక పుష్పం కీలాగ్రం మీద పడతాయి. దీనినే ఏకవృక్ష పర పరాగసంపర్కం లేదా గైటినోగమి అంటారు.
భిన్నవృక్ష పర పరాగసంపర్కం
ఒక మొక్క మీద ఉన్న పుష్పాలలోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్కపై నున్న కీలాగ్రం మీద పడటాన్ని భిన్నవృక్ష పర పరాగసంపర్కం లేదా క్సీనోగమి అంటారు.

పర పరాగసంపర్కం-అనుకూలతలు

[మార్చు]

వివిధ అనుకూలతలు పరపరాగ సంపర్కానికి దొహదం చేస్తాయి. అవి...

  • ఏకలింగత్వం : కొన్ని జాతుల మొక్కలలో పుష్పాలు కేసరావళి, అండకోశంలలో ఏదో ఒకదాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఈ ఏకలింగత్వం సంపర్కానికి మరో భిన్న ఆవశ్యకంగాన్ని కలిగిన పుష్పంపై ఆధారపడటం తప్పనిసరి.
  • భిన్నకాల పక్వత : పుష్పాలు కేసరావళి, అండకోశం రెండు కలిగి ఉండినప్పటికి, అవి రెండు వేరువేరు కాలాలలో పక్వానికి రావడమే భిన్నకాల పక్వత. ఇది ఆత్మపరాగసంపర్కాన్ని నిరోధించి పరపరాగ సంపర్కానికి మేలు చేస్తుంది. ఇది రెండు రకాలు.
పుంభాగ ప్రథమోత్పత్తి: అండకోశం కంటే ముందు కేసరావళి పక్వానికి రావడం. ఉదా: శాక్సిఫ్రాగ
స్త్రీభాగ ప్రథమోత్పత్తి: కేసరావళి కంటే ముందు అండకోశం పక్వానికి రావడం. ఉదా: సొలానమ్‌
  • హెర్కోగమి : ఒక పుష్పంలో కేసరావళి, అండకోశం ఒకేసారి పక్వానికి వచ్చినా అవి వేరు వేరు ఎత్తులలో అమరి ఉండటం వలన లేదా భిన్నమైన దిశలలో తిరిగి ఉండటం వలన ఆత్మపరాగ సంపర్కం నిరోధించబడి, పర పరాగసంపర్కానికి కారణమవుతుంది. ఉదా: హైబిస్కస్ (మందార)లో ఎత్తులో భిన్నత్వం, గ్లోరియోసలో దిశలో భిన్నత్వం.
  • భిన్నకీలత : కేసరావళి, కీలం వాటి ఎత్తులో పరస్పర భిన్నత్వాన్ని చూపటాన్ని భిన్నకీలత అంటారు. ఇది రెండు రకాలు.

అ)ద్విభిన్నకీలత: ఈ పువ్వులలో పొట్టికేసరాలు, పొడువు కీలాలు లేదా పొడువు కేసరాలు, పొట్టి కీలాలు ఉంటాయి. ఉదా: ప్రిము ఆ)త్రిభిన్నకీలత: పొడువుగా, పొట్టిగా, మధ్యస్థంగా మూడు రకాల ఎత్తులలో కీలాలు అమరి ఉంటాయి. ఉదా: ఆక్సాలిస్

  • ఆత్మ వంధ్యత్వం : ద్విలింగ పుష్పాలలో కేసరావళి నుండి ఉత్పత్తి అయిన పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంపైన పడినా అవి అంకురించవు. దీనినే ఆత్మవంధ్యత్వం అని అంటారు. ఉదా: పాసిఫ్లొరా
  • పుప్పొడి పూర్వశక్మత :కీలాగ్రంపైన ఆత్మపరాగరేణువుల కంటే పరపరాగరేణువులు ఎక్కువ శక్తివంతంగా, వేగంగా మొలకెత్తి ఫలదీకరణను పూర్తి చేస్తాయి. దీనిని పరాగరేణువుల పూర్వశక్మత అంటారు. ఉదా: లెగుమినేసి జాతులు
  • సూక్ష్మగ్రాహ్య కీలాగ్రాలు :

పర పరాగసంపర్కం-సహకారులు

[మార్చు]

పర పరాగసంపర్కం జరగటంలో పుష్పంలోని అంతర్గత సౌలభ్యాలతో పాటు, బాహ్యకారకాలు ప్రభావితం చేస్తాయి. తమ సహకారాన్ని అందిస్తాయి. గాలి, నీరు, జంతువులు ఈ పాత్రను పోషిస్తాయి.[2] సహకారాల రీత్యా పరాగసంపర్కాన్ని కింది విధంగా విభజిస్తారు.

వాయు సహకార పరాగసంపర్కం
[మార్చు]

గాలి సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని వాయు సహకార పరాగసంపర్కం అంటారు. ఈ సంపర్కాన్ని జరిపే పుష్పాలు కొన్ని ప్రత్యేకమైన అనుకూలనాలు కలిగి ఉంటాయి.[3] పుష్పాలు చాలా వరకు ఏకలింగ పుష్పాలు. కాటికిన్ రూప పుష్పవిన్యాసాన్ని కలిగి ఉంటాయి. పుష్పవిన్యాసాలలో పురుష పుష్పాలు ఎక్కువగాను, స్త్రీ పుష్పాలు తక్కువగాను ఉంటాయి. పుష్పాలు గాలి వటానికి వేలాడుతూ ఉంటాయి. పరాగరేణువులు నునుపైన గోడలతో, పొడిగా, తేలికగా ఉండి, గాలిలో ఎక్కువ దూరం తేలిపోయేలా ఉంటాయి. గాలి ద్వారా వచ్చే పరాగరేణువులను స్వీకరించడానికి వీలుగా కీలాగ్రాలు బహిర్గతమై, శాఖయుతంగా, కుంచె లేదా ఈక వలె ఉంటాయు. ఉదా: క్వీర్కన్, ట్రిటికమ్

జల సహకార పరాగసంపర్కం
[మార్చు]

నీటిలో మునిగి ఉండే మొక్కలలో (ఉదా: సిరటోఫిల్లం) మాత్రమే నిజమైన జల సహకార పరాగసంపర్కం జరుగుతుంది. ఈ సంపర్కం జరిపే పువ్వులలోని పరాగరేణువులు పొడువుగా నాళికల వలే ఉంటాయి.[4] వీటికి బాహ్య కవచం ఉండదు.అరుదుగా కొన్ని మొక్కలలో నీటి ఉపరితలాన కూడా పరాగసంపర్కం జరుగుతుంది. ఉదా: రప్పియ

జంతు సహకార పరాగసంపర్కం
[మార్చు]

జంతువుల సహకారంతో చాలా మొక్కలు పరాగసంపర్కాన్ని నిర్వహిస్తాయి. సహకార జీవిని బట్టి ఇది నాలుగు రకాలు. అవి. 1. అర్నిథోఫైలి, 2. కిరోప్టెరిఫైలి, 3. మెలకోఫైలి, 4. ఎంటమోఫైలి.

అర్నిథోఫైలి
[మార్చు]

పక్షుల సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని అర్నిథోఫైలి అంటారు. ఈ సంపర్కాన్ని జరిపే మొక్కలలో పుష్పాలు పెద్దవిగా ఉంటాయి. వాసన ఉండవు. హమ్మింగ్ బర్డ్స్, హనిథ్రిషెస్ వంటి చిన్నవైన పక్షిజాతులు ఈ సంపర్కం జరగడానికి మొక్కలకు తోడ్పడుతాయి. ఉదా: బిగ్నోనియా

కిరోప్టెరిఫైలి
[మార్చు]

గబ్బిలాల సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని కిరోప్టెరిఫైలి అంటారు. ఈ సంపర్కాన్ని జరిపే మొక్కలలో పుష్పాలు రాత్రి పూట వికసిస్తాయి. ఎక్కువ వాసన, సమృద్దిగా స్రవించే మకరందం గబ్బిలాలను ఆకర్షిస్తాయి. ఉదా: బాహీనియా, మెగలాండ.

మెలకోఫైలి
[మార్చు]

నత్తల సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని మెలకోఫైలి అంటారు. ఉదా: లెమ్నా, ఎరాయిడే

ఎంటమోఫైలి
[మార్చు]

కీటకాల సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని ఎంటమోఫైలి అంటారు. ఈ సంపర్కాన్ని జరిపే మొక్కలలో పుష్పాలు ఆకర్షణీయమైన ఆకర్షక పత్రాలు, పుష్పపుచ్చాలు, కేసరాలు, సువాసనను కలిగి ఉంటాయి. ఆహారంగా పుప్పొడిని అందిస్తాయి. ఉదా: లెమ్నా, ఎరాయిడే

పర పరాగసంపర్కం వల్ల ఉపయోగాలు

[మార్చు]

చార్లెస్ డార్విన్ పరిశోధనల వలన ఆత్మ పరాగసంపర్కం కంటే పర పరాగసంపర్కం వలన అనేక లాభాలున్నాయని తెలిసింది.

  1. పర పరాగసంపర్కం వలన ఏర్పడే విత్తనాల సంఖ్య అధికంగా ఉంటుంది.
  2. విత్తనాలు బరువుగా, పెద్దవిగా ఉండి, త్వరగా వృద్ధి చెందుతాయి. మొక్కలు ఎక్కువ దిగుబడినిస్తాయి.
  3. ఈ మొక్కలు భూమిపై తక్కువ విస్తీర్ణాన్ని ఆవరించి, ఎక్కువ పుష్పాలను తక్కువ కాలంలో ఉత్పత్తి చేస్తాయి.
  4. ఈ మొక్కలలో జన్యు వైవిధ్యాలు అధికంగా ఉండటం వలన పునస్సంయోజకాలు (recombinants) ఏర్పడి, మనుగడ కోసం పోరాటంలో అవి ఎక్కువ సార్ధకతను చూపిస్తాయి.
  5. ఈ మొక్కలకు వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుంది.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Barrows EM (2011). Animal Behavior Desk Reference. A Dictionary of Animal Behavior, Ecology, and Evolution (Third ed.). Boca Raton, FL.: CRC Press LCC. p. 794.
  2. Ackerman JD (2000-03-01). "Abiotic pollen and pollination: Ecological, functional, and evolutionary perspectives". Plant Systematics and Evolution. 222 (1–4): 167–185. doi:10.1007/BF00984101.
  3. Friedman J, Barrett SC (June 2009). "Wind of change: new insights on the ecology and evolution of pollination and mating in wind-pollinated plants". Annals of Botany. 103 (9): 1515–27. doi:10.1093/aob/mcp035. PMC 2701749. PMID 19218583.
  4. Cox, Paul Alan (1988). "Hydrophilous Pollination". Annual Review of Ecology and Systematics. 19: 261–279. doi:10.1146/annurev.es.19.110188.001401. JSTOR 2097155.