Jump to content

పరిహాసపురం

అక్షాంశ రేఖాంశాలు: 34°08′N 74°38′E / 34.133°N 74.633°E / 34.133; 74.633
వికీపీడియా నుండి

34°08′00″N 74°38′00″E / 34.133333°N 74.633333°E / 34.133333; 74.633333

పరిహాసపూర్ (Parihaspore)
చారిత్రిక పట్టణం, పురావస్తు స్థలం
పరిహాసపూర్ (Parihaspore) is located in Jammu and Kashmir
పరిహాసపూర్ (Parihaspore)
పరిహాసపూర్ (Parihaspore)
Location in Jammu and Kashmir, India
పరిహాసపూర్ (Parihaspore) is located in India
పరిహాసపూర్ (Parihaspore)
పరిహాసపూర్ (Parihaspore)
పరిహాసపూర్ (Parihaspore) (India)
Coordinates: 34°08′N 74°38′E / 34.133°N 74.633°E / 34.133; 74.633{{#coordinates:}}: cannot have more than one primary tag per page
Country India
Stateజమ్ము & కాశ్మీర్
Districtబారాముల్లా
Tehsilపత్తన్
Establishedసుమారు సా.శ. 700 ప్రాంతం
Founded byలలితాదిత్య ముక్తాపీడుడు
Named forCity of Laughter
Time zoneUTC+5:30 (IST)

పరిహాసపురం లేదా పరిహాస్‌పూర్ లేదా పరాస్‌పూర్ (Paraspur) అనేది కాశ్మీర్ లోయలో శ్రీనగర్‌కు వాయవ్యంగా 22 కి.మీ. దూరంలో వున్న ఒక చిన్న చారిత్రిక పట్టణం.[1] జీలం (వితస్థ) నది సమీపంలో ఒక చదునైన పీఠభూమిపై ఈ పట్టణం నిర్మించబడింది.[1] ఈ పట్టణాన్ని సా.శ. 8 వ శతాబ్దంలో కాశ్మీరును పాలించిన సుప్రసిద్ధ రాజు ‘లలితాదిత్య ముక్తాపీడుడు’ నిర్మింఛి తన రాజధానిగా చేసుకొన్నాడు.

పేరు

[మార్చు]

ఈ చారిత్రిక పట్టణానికి ప్రస్తుత నామం పరాస్‌పూర్ (Paraspore).[2] ఇది సంస్కృత పదమైన 'పరిహాసపురం' నుంచి ఉత్పన్నమైనది. పరిహాసం అంటే నవ్వడం. పరిహాసపురం అంటే నవ్వుతున్న పట్టణం (City of Smiling) అని అర్ధం.

చరిత్ర

[మార్చు]
పరిహాసపూర్ బౌద్ధ స్థూపం

కాశ్మీరును పాలించిన కార్కోటక వంశానికి చెందిన సుప్రసిద్ధ రాజు లలితాదిత్య ముక్తాపీడుడు (సా.శ. 724 – 760) ఈ నూతన నగరాన్ని నిర్మించి, తన రాజధానిని శ్రీనగర్ నుంచి పరిహాసపురానికి మార్చాడు. ఈ నగర నిర్మాణాన్ని ప్రసిద్ధ కాశ్మీర కవి కల్హణుడు తన విఖ్యాత చారిత్రిక గ్రంథం ‘రాజ తరంగిణి’లో 4 వ కాండలో 194-204 లో పేర్కొన్నాడు. ఈ పట్టణం విశాలమైన చదునైన పీఠభూమిపైన, కాశ్మీరు లోయ దాని చుట్టుపట్ల గల పర్వతాల సుందర రూపం కనపడేవిధంగా నిర్మించబడింది. ఆ పీఠభూమి వితస్థ, సింధు నదుల వరద నీటిమట్టానికంటే ఎత్తున, ఆ నదుల జలాలు నగర పాదాలను అభిషేకించే స్థాయిలో పరిహాసపురం నిర్మితమైంది.[3] కల్హణుని ప్రకారం లలితాదిత్యుడు ఈ నగరంలో తన నివాస భవనాన్ని, నాలుగు ఆలయాలను నిర్మించాడు. వీటిలో ఒకటి ముక్తేశవ ఆలయం. ఈ ఆలయంలో విష్ణువు యొక్క ప్రతిమను తయారు చేసేందుకు చక్రవర్తి 84,000 తులాల బంగారాన్ని ఉపయోగించాడని, మరొక ఆలయంలో పరిహాస-కేశవ ప్రతిమ కోసం వెండిని ఉపయోగించాడని కల్హణుడు పేర్కొన్నాడు. ఈ నగరంలోనే నిర్మించిన బుద్ధుని రాగి విగ్రహం గురించి పేర్కొంటూ కల్హణుడు అది “ఆకాశమంత ఎత్తుకు చేరుకొంది” అని వర్ణించాడు. నూతన రాజధాని పరిహాసపురంలోని ప్రధాన ఆలయం, రాజు లలితాదిత్యుడు అనంతనాగ్‌లో నిర్మించిన ప్రసిద్ధ మార్తాండ దేవాలయం కన్నా పెద్దది.[4]

లలితాదిత్య మరణం తర్వాత పరిహసపురం కాశ్మీర రాజధానిగా దాని స్థానాన్ని కోల్పోయింది. అతని కుమారుడు రాజ నివాసాన్ని వేరొకచోటికి తరలించాడు. కార్కోటక వంశ రాజుల అనంతరం కాశ్మీర్‌ని ఉత్పల వంశరాజులు పాలించారు. వీరి కాలంలో పరిహాసపుర వైభవం క్షీణించడం ప్రారంభమైంది. గతంలో పరిహాసపురం జీలం, సింధు నదీ కాలువ సంగమానికి చేరువలో వుండేది. అయితే కాశ్మీర రాజు అవంతివర్మ (సా.శ. 855–883) పరిపాలనా కాలంలో వ్యవసాయ అభివృద్ధి కోసం జీలం నదికి వరద కట్టల నిర్మాణాలు జరిగాయి. ఇతని మంత్రి ప్రఖ్యాత 'సుయ్యూ' (Suyya) పండితుడు నదీ మార్గపు మళ్లింపు కోసం చేపట్టిన అధ్బుత సాంకేతిక నిర్మాణం వల్ల, పరిహాసపుర నగరం తన నదీ సామీప్యతను కోల్పోయింది. నదీ మార్గంలో వచ్చిన అసహజమైన మార్పు వల్ల ఈ నగర వృద్ధి చాలా మందగించి, క్రమేణా తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది.

అవంతివర్మ కొడుకు శంకరవర్మ తన రాజధానిని శంకరపురానికి మార్చిన సందర్భంలో పరిహాసపురానికి నిజమైన వినాశనం సంభవించింది. కల్హణుని ప్రకారం రాజు శంకరవర్మ తన నూతన నగరం శంకరపురాన్ని (పత్తన్) నిర్మించడానికి కావలిసిన వస్తువుల కోసం ఒక కంటకుడిలా ప్రవర్తించి, పరిహాసపురం లోని దేవాలయాలు, రాజభవనాలలో కనబడిన మంచి వస్తువులన్నింటిని వూడబెరకి దోపిడీ చేయడంతో పరిహాసపురానికి వినాశనం ప్రారంభమైంది. ఇటువంటి దోపిడీ తదనంతరం కూడా పరిహాసపురం మనుగడ సాగించిందని కల్హణుడు పేర్కొన్నాడు.

అనంతరం లోహర వంశానికి చెందిన కాశ్మీర రాజు హర్షుడు (సా.శ. 1089 – 1101) కు, ఉచ్ఛలుడు (Uccala) నాయకత్వంలో తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ఉచ్ఛలుడు పరిహాసపురంలో ఆశ్రయం పొందాడు. పరిహాసపురంలో ఒకానొక భవనంలో తన శత్రువు ఉచ్ఛలుడు దాగినట్లు విశ్వసించిన హర్షుడు అక్కడి భవనాలను తగులబెట్టించాడు. దేవాలయాలలోని లోహ విగ్రహాలను సైతం ముక్కలు చేసి కరిగించాడు. రాజ తరంగిణిలో ఈ వినాశనాన్ని కల్హణుడు వివరిస్తూ, "ఈ విష్ణువు యొక్క విగ్రహం విరిగిపోయిన తరువాత, స్వర్గం, భూమి దుమ్ముతో కప్పబడి, పావురపు ఈకల వలె బూడిదమయంగా కనిపించాయి.", "నెలన్నర రోజుల పాటు అక్కడ పగటిపూట సైతం చిమ్మ చీకటి ఆవరించింది."

సా.శ. 14 వ శతాబ్దంలో షామీర్ వంశానికి చెందిన కాశ్మీర్ పరిపాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ ( సికిందర్ బుత్షికాన్) ఇక్కడి ఆలయాలను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఈ నగరానికి చివరగా కోలుకోలేని దెబ్బ తగిలింది.[5][6]

ప్రస్తుత శిధిలాలు

[మార్చు]
పరిహాసపురం

ఒకప్పుడు వైభవోపితమైన ఈ చారిత్రిక నగరం నేడు శిథిలావస్థలో దీనంగా ఉంది. ఇక్కడి శిథిలాలు కొన్ని పెద్ద బండరాళ్ళ రూపంలోను, మరికొన్ని చెక్కబడిన ఆకృతులతోను ఉన్నాయి. ఈ పాత శిథిల నగరంలో అసలైన ఆకృతులు ఉండాల్సిన ప్రదేశాలలో ప్రస్తుతం ఇటుకలతో చెక్కబడిన ఆకృతులు పూరించబడి ఉన్నాయి. స్థానికులు ఈ ప్రదేశాన్ని “కాని షహర్” (Kani Shahar లేదా City of Stones) గా పిలుస్తారు.[7] ఇక్కడ లభించిన కళాకృతులలో ఆశీన, నిలుచున్న భంగిమలో వున్న కొన్ని అత్యుత్తమ శిల్పాలు శ్రీనగర్ మ్యూజియానికి తరలించబడ్డాయి.[1]

ప్రసిద్ధ ఆర్కియాలజిస్ట్ “మార్క్ ఆరల్ స్టెయిన్” (Sir Marc Aurel Stein) 1892 లో పరిహాసపుర్‌ని తొలిసారిగా సందర్శింఛి ఇక్కడి శిథిలాలను బయటి ప్రపంచానికి వెల్లడించాడు. ఆ సమయంలో తాను కనుగొన్న శిథిలాలను ఆధారంగా చేసుకొని ఆయా నిర్మాణాలను ఉండవలసిన స్థానంలో ఉంచాడు. ఇక్కడి ఆలయ మూర్తి విష్ణువు అవతార రూపమైన గోవర్దన (Goavardana) పేరుమీదగానే ఇక్కడి సమీప గ్రామానికి గుర్దాన్ (Gurdan) అనే పేరు వచ్చివుండవచ్చని ఊహించాడు. 1892 లో ఈ ప్రాంతాన్ని రెండవసారి సందర్శించిన స్టెయిన్, తాను తొలిసారి వచ్చినపుడు చూసిన అనేక శిలలు పోయాయని గుర్తించాడు. ఆ నాటి కాశ్మీర్ మహారాజు జీలం నది తీరంలో ఒక రహదారిని నిర్మించే ప్రయత్నంలో, పరిహాసపూర్ చారిత్రక శిథిలాలను రహదారి తయారీలో ముడి సరుకులుగా (road material) వినియోగించాడు. దానితో సహాయం కోసం స్టెయిన్ అప్పటి బ్రిటిష్ రెసిడెంట్‌ను సంప్రదించాడు. పరిహాసపూర్ చారిత్రక ఆలయ శిథిలాల పవిత్రతను కాపాడటం కోసం, అవి నాశనం కావడాన్ని నివారించడం కోసం స్టెయిన్ డోగ్రా రాజుకు నచ్చచెప్పి ఒప్పించగలిగాడు.

పరిహాసపూర్ లో లభ్యమైన పురావస్తు శిథిలాలలో హిందూ ఆలయ నిర్మాణాలే కాక బౌద్ధ నిర్మాణాలు కూడా ఉన్నాయి. బౌద్ధ నిర్మాణాలలో ఒక స్థూపం, ఒక ఆరామం, ఒక చైత్యం వెలికితీయబడ్డాయి.ఇక్కడ లభ్యమైన స్థూపం చణకుణ స్థూపంగా, ఆరామం లలితాదిత్యుని రాజ-విహారంగా గుర్తించబడ్డాయి. చైత్యాలయం పెద్ద పెద్ద లైమ్‌స్టోన్ దిమ్మలతో నిర్మించబడింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Kak, Ram Chanfra (1933). "Ancient Monuments of Kashmir" (PDF). Indian Art and Letters (reprint 2002 ed.). London: Royal India Society. Archived from the original (PDF) on 28 ఆగస్టు 2015. Retrieved 7 జూలై 2017.
  2. 2.0 2.1 Sonia Jasrotia, Department of Buddhist Studies, University of Jammu. "New Discovered Buddhist Heritage of Baramulla District (Kashmir)". SAARC Cultural Center Sri Lanka. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 7 July 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  3. Publication Division. Great Men and Women of India (Telugu) (2006 Feb ed.). New Delhi: Director, Publication Division, Govt of India. p. 16. ISBN 81-230-1365-5.
  4. Stein, Mark Aurel (1879). Kalhana's Rajtarangini: A chronicle of the kings of Kaśmīr (reprint 1979 ed.). Delhi: Motilal Banarsidass. online version of Kalhana's Rajatarangini in English
  5. Peer Hassan Khoihami Tarikh-i-Kashmir Srinagar, 1960
  6. Cunningham A. Ancient Geography Of India Delhi-1969
  7. Kashur Encyclopedia (کا۶شر انسیکلو پیڈ یا) Volume One. Srinagar: Jammu And Kashmir Academy Of Art Culture And Languages. 1986. pp. 98–101.