పాములపర్తి సదాశివరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాములపర్తి సదాశివరావు
పాములపర్తి సదాశివరావు
జననంపాములపర్తి సదాశివరావు
(1921-07-17)1921 జూలై 17
India వరంగల్లు పట్టణం తెలంగాణ రాష్ట్రం
మరణం1996 ఆగస్టు 26
మరణ కారణంకేన్సర్
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు,
మతంహిందూ
తండ్రిహనుమంతరావు
తల్లిదుర్గాబాయి

పాములపర్తి సదాశివరావు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉత్తమ రచయిత, జర్నలిస్టు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1921, 17 జూలైన వరంగల్లులో హనుమంతరావు, దుర్గాబాయి దంపతులకు జన్మించాడు.[1] హనుమకొండలోని కాలేజియేట్ ఉన్నత పాఠశాలలో ఇతని విద్యాభ్యాసం నడిచింది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. భారత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఇతనికి సోదరుడి వరుస, బాల్యమిత్రుడు. వీరి స్నేహం వికసించి కాకతీయ పత్రిక ప్రారంభించడానికి కారణమైంది. 1948లో ఈ కాకతీయ పత్రిక ప్రారంభమైంది. పాములపర్తి సదాశివరావు ఈ వారపత్రికకు సంపాదకుడు కాగా పి.వి.నరసింహారావు ఈ పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఈ పత్రికలో జయ-విజయ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. అవి పాఠకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇద్దరూ అనేక కలంపేర్లతో ఈ పత్రికలో చాలా రచనలు చేశారు. సందేశమ్‌ పత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు 1945లో కాకతీయ కళాసమితిని స్థాపించాడు. ఈ సంస్థ కళలు, సాహిత్యం, నాటకాలు, శాస్త్రీయ సంగీతం మొదలైన వాటిని ప్రోత్సహించింది. ప్రతియేటా ఈ సంస్థ తరఫున మూడు రోజులు త్యాగరాజ మహోత్సవాలను నిర్వహించేవాడు. ఇతడు కాకతీయ పత్రికతో పాటుగా విశ్వజ్యోతి, ధర్మభూమి మొదలైన పత్రికలలో విస్తృతంగా రచనలు చేశాడు. మార్క్సిజం మొదలుకొని ప్రపంచ చరిత్ర, భారతీయ తత్త్వము, హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం, నాటకరంగం ఇలా అన్ని విషయాలపైనా ఇతడు వ్యాసాలు వ్రాశాడు. 1982లో వరంగల్లులో జరిగిన పోతన పంచశతాబ్ది ఉత్సవాలకు ఇతడు ప్రేరేపకుడు. పోతన విజ్ఞానపీఠం స్థాపనకు ఇతడు కారకుడు. 1988లో కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన విద్యారణ్య విద్వద్గోష్టిలో చురుకుగా పాల్గొని విద్యారణ్యుని తత్వంపై పత్రసమర్పణ చేశాడు.

ఇతని రచనలు కొన్ని:

  1. చరిత్ర, సంస్కృతి, కళ
  2. తత్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు
  3. భారతీయ సాహిత్య పరిశీలన
  4. అభ్యుదయ గీతాలు
  5. గదర్‌ విప్లవం
  6. జ్ఞాన సిద్ధాంతం (అనువాదం)

ఇతడు రచయితగా ఉంటూనే వివిధరంగాల ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రని పోషించాడు. రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు. ఆజాంజాహి కార్మికుల ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఇతడు 76 సంవత్సరాలు జీవించి కేన్సర్ వ్యాధితో 1996, ఆగస్టు 26వ తేదీ మరణించాడు. ఇతని జ్ఞాపకార్థం కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతియేటా ఇతని పేరిట ఒక ప్రముఖవ్యక్తిచే స్మారకోపన్యాసం ఇప్పిస్తున్నది.

మూలాలు

[మార్చు]
  1. కె., సీతారామారావు. "Biographical sketch of Late SRI PAMULAPARTHI SADASIVA RAO". కాకతీయ పత్రిక. Archived from the original on 17 డిసెంబరు 2014. Retrieved 31 January 2015.