పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి

పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి నెల్లూరు పట్టణంలో ప్రజావైద్యునిగా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన వ్యక్తి. ప్రముఖ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య తమ్ముడు. నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు, కావలి పట్టణానికి చెందిన విశ్వోదయ కళాశాలల సహ వ్యవస్థాపకుడు. జనబాహుళ్యంలో డాక్టర్ రాం అన్న పేరుతో సుప్రసిద్ధుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రామచంద్రారెడ్డి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో 1915 జనవరి 21 న జన్మించాడు. ఆయన భూస్వామ్య కుటుంబానికి చెందినవాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మలకు ఆఖరి సంతానంగా జన్మించాడు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్యకు రామచంద్రారెడ్డి తమ్ముడు.

వైద్యరంగం

[మార్చు]

1935-40 మధ్యకాలంలో రామచంద్రారెడ్డి మద్రాసులో వైద్యవిద్యను అభ్యసించారు. 1940లోనే ఆయన నెల్లూరు పట్టణంలో రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలను ప్రారంభించి నడిపారు. ప్రజావైద్యశాల ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ నెల్లూరు ప్రాంతంలో ప్రాచుర్యం పొందారు. సాంఘిక వ్యవస్థ, ప్రజల ఆర్ధిక జీవన విధానం సమూలంగా మారితే గానీ, తిండి తిప్పల్లో ఒక మార్పు రానిదే ఆరోగ్యం, శుభ్రత చేకూరవు అంటూండే రామచంద్రారెడ్డి ఆ క్రమంలో సమసమాజ స్థాపన కోసమూ తనవంతు కృషిచేశారు. కమ్యూనిస్టు పార్టీలోని కార్యకర్తలందరికీ కొంత వరకు వైద్యం తెలిసి ఉండాలన్న ఒక పథకం డా.రాం సిద్ధం చేశాడు. గ్రామాలకు వెళ్ళి, బీదల మురికి వాడలకు వెళ్ళి పనిచేసే కమ్యూనిస్ట్ కార్యకర్తలకు కొంత ప్రథమ చికిత్స, చిట్కావైద్యం, ఇంజెక్షను చేసే నైపుణ్యం ఉండాలని ఆయన అభిప్రాయం.

పేదరికం రోగాన్ని తీసుకువస్తుందని, ఆ పేదరికాన్ని, దానికి కారణమైన వ్యవస్థల్నీ సమూలంగా నాశనం చేయడానికి సమయం పట్టవచ్చు. దానికోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది, ఎన్నో పోరాటాలు జరగాలి. అంతవరకూ రోగాలు ఆగుతాయా? రోగుల ప్రాణాలు నిలిచివుంటాయా? పేదరికాన్ని ధ్వంసం చేయడం దీర్ఘకాలిక ప్రణాళిక. దానికి అనుబంధంగా కమ్యూనిస్టు కార్యకర్తలు సత్వర ప్రణాళికగా కొంత వైద్యం నేర్చుకుని బీదల్ని కాపాడాలి అనేవారు డాక్టర్ రాం.[1] ఆయన ఈ పథకం రూపకల్పన చేసి నిర్వహించడంలో అపారమైన కృషిచేశారు. ఆ పథకం ద్వారా ఎందరో బేర్ ఫూట్ డాక్టర్లను తయారుచేశారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి ఆసుపత్రి ఆయన కన్న ఒక కలను నిజం చేస్తూ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో శిక్షణనిచ్చే వైద్యసంస్థగా రూపొందింది.

వైద్యుని వద్దకు రోగి కాక రోగి దగ్గరకే వైద్యుడు వెళ్ళాలనేది రామచంద్రారెడ్డి సిద్ధాంతం. దాన్ని అనుసరిస్తూ పీపుల్స్ పాలీక్లినిక్, సంచార వైద్యశాల, మాస్ ఎక్స్-రే వంటివి నడిపించారు. కేవలం వైద్యుడైతే సరిపోదని నిపుణుడు కావాలని, అంతే కాక ఆ నైపుణ్యాన్ని అట్టడుగు ప్రజల వరకూ ఉపయోగించాలని అనేవారు.

కమ్యూనిస్టు ఉద్యమం

[మార్చు]

బీడీ కార్మికుల సమ్మె, రిక్షాకార్మికుల సమస్యల గురించి ఉద్యమాలలో స్వయంగా పాల్గొన్నారు.

మూలాలు

[మార్చు]
  1. ప్రొఫెసర్ కె.శేషాద్రి వ్యాసం:డాక్టర్ రాం సావనీర్