పైలట్ ప్రేమ్‌నాథ్
పైలట్ ప్రేమ్‌నాథ్ (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.సి.త్రిలోక్ చందర్ |
---|---|
నిర్మాణం | గుమ్మళ్ల లక్ష్మణరావు |
తారాగణం | శివాజీ గణేశన్, మాలిని, శ్రీదేవి |
నిర్మాణ సంస్థ | పూర్ణా |
భాష | తెలుగు |
పైలట్ ప్రేమ్‌నాథ్ 1980లో విడుదలైన డబ్బింగ్ సినిమా. అదే పేరు (பைலட் பிரேம்நாத்)తో విడుదలైన తమిళ సినిమాకు ఇది తెలుగు డబ్బింగ్. శ్రీలంక లోని చారిత్రక, ప్రకృతి దృశ్యాల మధ్య ఈ భారీ చిత్రం నిర్మించబడింది.
చిత్రకథ
[మార్చు]ప్రేమ్‌నాథ్ విమానచోదకునిగా పని చేస్తూ ఉంటాడు. ఓ అందాలరాశి అయిన మాలిని అనే ఆమెను అతడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి కొత్త సంసారం సాగుతూ వుంటుంది. వారికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మిస్తారు. ఇంతలో మాలిని స్టౌ ప్రమాదంలో ప్రేమ్‌నాథ్ కళ్లెదుటే ప్రాణాలు విడుస్తుంది. అనుక్షణం మాలిని ధ్యాసలోనే ఉన్నప్పటికీ ప్రేమ్‌నాథ్ బాధ్యతలను విస్మరించలేదు. పిల్లలను పెంచి పెద్ద చేస్తాడు. మంచి పైలట్‌గా, ధైర్యశాలిగా పేరు గడిస్తాడు. ఇలా ఉండగా మాలిని తన స్నేహితురాలికి వ్రాసిన ఉత్తరం పోస్టు చేయకపోవడంతో బయట పడుతుంది. తమ ముగ్గురు పిల్లల్లో ఒకరు ప్రేమ్‌నాథ్‌కు పుట్టిన వారు కాదని, ఈ విషయం అతనికి చెప్పకుండా తప్పు చేస్తున్నానేమో అనే సంశయం వెళ్లబుచ్చుతూ వ్రాసిన ఉత్తరం అది. ఆ ఉత్తరం చదివిన ప్రేమ్‌నాథ్‌కు తీరని వేదన కలుగుతుంది. ఓ సందర్భంలో పిల్లలు ముగ్గురికీ ఈ విషయం తెలిసిపోతుంది. ఆ కుటుంబానికి తాను చెందలేదంటే తాను చెందలేదని ఒకరికి ఒకరు పోటీపడి ఎవరికి వాళ్లు బయటికి పోవడానికి సిద్ధపడతారు. చివరకు ఒకరిపై ఒకరు అభిమానాన్ని చంపుకోలేక ముగ్గురూ కలిసే బయటకు వెళ్లిపోతామంటారు. నిజం బయట పడేవరకూ ఎవ్వరూ వెళ్ళవలసిన పనిలేదని తండ్రి వారిని వారిస్తాడు. ఆ రహస్యం తెలుసుకోవాలని ప్రేమ్‌నాథ్ చేసే ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ఆ లేఖలోని గూఢార్థం ఎలా బయటపడి వారి కుటుంబంలో పూర్వపు సుఖసంతోషాలు నెలకొంటాయో చిత్రం క్లైమాక్స్‌లో తెలుస్తుంది[1].
నటీనటులు
[మార్చు]- శివాజీ గణేశన్ - ప్రేమ్‌నాథ్
- మాలినీ ఫోలెన్స్కా - మాలిని, ప్రేమ్‌నాథ్ భార్య
- శ్రీదేవి - ప్రేమ్‌నాథ్ కూతురు
- తెంగై శ్రీనివాసన్ - కో పైలెట్
- మనోరమ - తెంగై శ్రీనివాసన్ భార్య
- విజయకుమార్
- జై గణేశ్
- జయచిత్ర
- సత్యప్రియ
విశేషాలు
[మార్చు]- ఇది ఇండో శ్రీలంకన్ జాయింట్ వెంచర్‌గా శ్రీలంక, భారతనిర్మాతలు ఉమ్మడిగా తమిళంలో నిర్మించారు.
- సినిమా షూటింగ్ మొత్తం శ్రీలంకలో జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మద్రాసులో జరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ పి.ఎస్. (1 July 1980). "చిత్ర సమీక్ష పైలట్ ప్రేమ్‌నాథ్". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంచిక 67 సంపుటి 91. Archived from the original on 24 సెప్టెంబరు 2020. Retrieved 27 January 2018.