ప్రాకృతిక వ్యవసాయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ప్రాకృతిక వ్యవసాయం (Organic Farming / సేంద్రీయ వ్యవసాయం) లో ప్రకృతిని మరియు ప్రకృతి వనరులని పాడుచేయకుండ వ్యవసాయం చేయబడుతుంది. ప్రాంతీయ వాతావరణాన్ని, వాటి పునరుత్పాదక వనరులని అనుసరించి భారత దేశంలో ఆచరించబడుతున్నా ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులున్నాయి. అవి మసనోబు ఫుకుఓకా (Masanobu Fukuoka / జపాన్), హ్యాన్ క్యుచో (కొరియా పద్ధతి, మరియు పాలేకర్ పద్ధతి. భారతదేశంలో పాలేకర్ పద్ధతి ముఖ్యమైనది. ఈ వ్యవసాయం రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చును.

ఆవిర్భావం[మార్చు]

భారతదేశంలో క్రీస్తు పూర్వంనుండీ బ్రిటీషు పాలన వరకూ వ్యవసాయం ప్రాకృతికంగానే జరిగిందని చెప్పవచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విదేశీ కంపెనీలు తమ కృత్రిమ ఎరువులు భారతదేశంలో విక్రయించడంతో రైతులు అత్యధిక దిగుబడులు వచ్చేస్తాయని భ్రమలో రసాయన వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగింది. అదే హరిత విప్లవం (Green Revolution). మూడు నాలుగు దశాబ్దాలపాటూ ప్రాకృతిక వ్యవసాయం మరుగున పడి రసాయన వ్యవసాయం విరాజిల్లింది

సుమారు 1970వ శకం నుండీ రసాయన పురుగుల మందుల ధరలు వందల రెట్లు పెరిగాయి. వీటితో రైతుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కాని వ్యవసాయం వల్ల వచ్చే రాబడి మాత్రం పెరగలేదు. వచ్చిన కొద్దిపాటి ఆదాయం కాస్తా పురుగుల మందులకు - కృత్రిమ ఎరువులకు ఖర్చు అయిపోతున్నది. రైతులు తమ పొలం పనులకు ట్రాక్టరు లేక ఎద్దులు, బండి కొనాలన్నా బ్యాంకులనుండి అప్పులు తీసుకోవలసివస్తున్నది. పురుగుల మందులు, రసాయన ఎరువులు వాడి పండిస్తున్న పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి, ఎన్నో మిత్ర పురుగులు, పక్షులు అంతరించిపోయాయి, భూమి సహజమైన సారాన్ని కోల్పోయి మందులు వాడితేగాని పంటలు పండని స్థితిలోకి వెళ్ళి నిస్సారమైపోయింది. ఆశించినమేరకు చేతికి పంట రాకపోవుటవలన, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ పిల్లలను వ్యవసాయం వైపు మళ్ళకుండా చదువులు చెప్పించి ఉద్యోగాలవైపు, వ్యాపారాల వైపు మళ్ళేలా చేయడం జరుగుచున్నది. అంతే కాకుండా వ్యవసాయ భూములను కూడా రియల్ ఎస్టేట్ చేయడం వలన దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు తగ్గిపోయి ఆహార ఉత్పత్తి కొరత ఏర్పడి కూరగాయలు-ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ భయంకరమైన కారణాలే రైతులు తిరిగి పూర్వపు సేంద్రీయ వ్యసాయంవైపు వెళ్ళేలా చేశాయి.

పాలేకర్ వ్యవసాయ పద్ధతి[మార్చు]

Subhash Palekar
Subhash Palekar
Subhash Palekar
జననం (1949-02-02)2 ఫిబ్రవరి 1949
Maharashtra, India
జాతీయత Indian
వృత్తి Agricultural scientist, farmer, author
ప్రసిద్ధులు Philosophy, Natural farming
పేరుతెచ్చినవి 'Holistic Spiritual Farming'

రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు అనేది పాలేకర్ పద్ధతి. పాలేకర్ వ్యవసాయ విధానంలో 4 చక్రాలుంటాయి. అవి బీజామృతం (Seed Dresser), జీవామృతం (Fertilizer), అచ్చాదన (Mulching), వాఫ్స (Water Management). ఈ వ్యవసాయానికి ప్రథమంగా ప్రతి 30 ఎకరాలకి ఒక దేశవాళీ గోవు అవవసరం. ఈ వ్యవసాయానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రీయ ఎరువులు, బీజామృతం వంటి విత్తన శుద్ధ రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకొవాలి.

బీజామృతం

కావాల్సిన పదార్ధాలు - బోరు/బావి/నది నీరు 20 లీటర్లు, నాటు ఆవు మూత్రం 5 లీటర్లు, నాటు ఆవు పేడ 5 కిలోలు (7 రోజులలోపు సేకరించినది), పొడి సున్నం 50 గ్రాములు, పాటిమట్టి/పొలం గట్టు మన్ను దోసెడు.

తయారీ: ఆవు పేడను ఒక పల్చటి గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టెలో 12 గంటలు ఉంచాలి. ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. రెండవ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో పిసికి ద్రవ సారాన్ని నీటి తొట్టెలో కలపాలి. పేడ నీళ్ళున్న తొట్టెలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కుడివైపునకు కలియ తిప్పాలి. 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకూ కుడివైపునకు కలియ తిప్పాలి. అన్నీ కలిపిన తర్వాత 12 గంటలపాటు ఉంచాలి.

ఈ బీజామృతాన్ని ఒక రాత్రి అలాగే ఉంచి మరునాడు ఉదయం నుంచి 48 గంటలలోపే వాడుకోవాలి. విత్తనాలకు బాగా పట్టించి, వాటిని నీడలో ఆరబెట్టుకొని నాటడానికి సిద్ధం చేసుకోవాలి.[1]

జీవామృతం

జీవామృతాన్ని సహజమైన ఎరువుగా చెప్పవచ్చు. ఇది ద్రవ రూపంలోను, ఘన రూపంలోను రైతులు నేరుగా తయారుచేసుకోవచ్చు.

ద్రవ రూపం: కావాల్సిన పదార్ధాలు - దేశీ ఆవు పేడ 10 కేజీలు (వారం లోపు సేకరించినది), దేశీ ఆవు మూత్రం 5 నుండి 10 లీటర్లు, బెల్లం / నల్ల బెల్లం / చెరుకు రసం 4 లీటర్లు, ద్విదళ పప్పుల పిండి (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) 2 కేజీలు, బావి/బోరు/నది నీరు 200 లీటర్లు, పాటి మన్ను / పొలంగట్టు మన్ను దోసెడు.

తయారీ: తొట్టెలో గానీ డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాల్నింటినీ కలిపి నీడలో 48 గంటలపాటూ ఉంచాలి. ప్రతి రోజు రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు త్రిప్పాలి. (ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత ఒక వారం రోజుల లోపే వాడేయాలి. అవసరమైతే ఎక్కువ మోతాదులో మరలా తయారుచేసుకోవాలి). పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలు. జీవామృతం వాడితే పొలానికి ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు.

ఘన రూపం: కావాల్సిన పదార్ధాలు - దేశీయ ఆవు పేడ 100 కేజీలు, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు, బెల్లం 2 కేజీలు లేదా చెరుకు రసం 4 లీటర్లు, పప్పు ధాన్యం (శనగ, మినుము, పెసర, ఉలవ) 2 కేజీలు, పొలం గట్టు మన్ను 1/2 కేజీ.

తయారీ: పై పదార్ధాలన్నింటినీ చేతితో బాగా కలిపి 10 రోజులు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బాగా చీకిన ఆవు పేడలో కలిపి 1 ఎకరం పొలంలో వెదజల్లి దున్నాలి. దీన్ని తయారు చేసిన 7 రోజులలోపే వాడుకోవాలి. పంటకాలం మధ్యలో కూడా ఎకరానికి 100 కేజీల ఘన జీవామృతం వేసి మొక్కలకు ఆహారం అందించాలి.

మరో ఘన రూపం: కావాల్సిన పదార్ధాలు - 200 కేజీల బాగా చీకిన ఆవు పేడ, తయారుచేసుకున్న 20 లీటర్ల జీవామృతం.

ముందుగా పేడ ఎరువును పలుచగా పరచాలి. తర్వాత జీవామృతాన్ని పరచిన ఎరువుపై చల్లాలి. దీనిని బాగా కలియబెట్టి ఒక కుప్పలా చేసి దానిపై గోనె పట్ట కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీనిని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఘన జీవామృతం 6 నెలల వరకూ నిల్వవుంటుంది.

నీమాస్త్రం

నీమాస్త్రం అనగా వేప (Neem) ప్రధాన ఔషధంగా కలిగిన రసాయనం.

కావాల్సిన పదార్ధాలు - 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు, 1 కేజీ నాటు ఆవు పేడ, 5 లీటర్ల నాటు ఆవు మూత్రం, 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు.

తయారీ: ఈ పదార్ధాలన్నింటినీ ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి బాగా కలియ త్రిప్పాలి. తర్వాత 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పివుంచాలి. రోజుకు రెండుసార్లు చొప్పున ఉదయం, సాయంత్రం 2 నిముషాలపాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోసుకోవాలి. ఇదే నీమాస్త్రం. ఇలా తయారైన నీమాస్త్రాన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలుపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారి చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల, ఇతర చిన్న చిన్న పురుగుల నివారణకు ఉపయోగపడే ఈ ద్రావణాన్ని తయారుచేసుకొన్న వారం రోజులలోపు వాడేసుకోవాలి.

అగ్ని అస్త్రం

కావాల్సిన పదార్ధాలు - నాటు ఆవు మూత్రం 20 లీటర్లు, దంచిన మిరపకాయలు 500 గ్రాములు, దంచిన పొగాకు (Tobacco) 1 కిలో, దంచిన వెల్లుల్లి (Garlic) పేస్టు.

తయారీ: పై పదార్ధాలన్నింటినీ బానలో వేసి బాగా మరగ కాయాలి. 5 సార్లు పొంగు వచ్చే వరకూ మరగబెట్టి చల్లార్చాలి. 48 గంటలు పులియబెట్టిన తర్వాత పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే అగ్ని అస్త్రం. ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల అగ్ని అస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు ఉపయోగపడే అగ్ని అస్త్రం 3 నెలలపాటు నిల్వవుంటుంది.

బ్రహ్మాస్త్రం

కావాల్సిన పదార్ధాలు - 2 కిలోల మెత్తగా నూరిన వేపాకు ముద్ద, 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 2 కిలోల పల్లేరు (Tribulus Terrestris) / మారేడు (Aegle Marmelos) ఆకుల ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకుల ముద్ద, 20 లీటర్ల నాటు ఆవు మూత్రం.

తయారీ: ముందుగా వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి సిద్ధం చేసుకోవాలి. నూరిన ఆకు ముద్దను 20 లీటర్ల ఆవు మూత్రంలో బాగా ఉడికించాలి. 4 పొంగు వచ్చే వరకూ కాచి 24 గంటలపాటు చల్లారనివ్వాలి. తర్వాత ఆ ద్రవాన్ని పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే బ్రహ్మాస్త్రం. దీన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో 6 నెలల వరకూ నిల్వచేసుకోవచ్చు.

ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పంటకు పిచికారీ చేసుకోవచ్చు.

ఇతర కీటక నాశన కషాయాలు:

దశపర్ణి కశాయం:

కావాల్సినవి - 200 లీటర్ల నీరు, దేశీ ఆవు పేడ 2 కేజీలు, దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు, పసుపు పొడి 200 గ్రాములు, శొంఠి పొడి 200 గ్రాములు లేదా 500 గ్రాముల అల్లం పేస్టు, పొగాకు 1 కేజీ, పచ్చిమిర్చి పేస్టు / కారం పొడి 1 కేజీ, వెల్లుల్లి పేస్టు 1 కేజీ, బంతి పువ్వులు - ఆకులు - కాండం 2 కేజీలు.

వీటిని ముందుగా ఒక డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ దిగువ పేర్కొన్న పది ఆకులను కలుపుకోవాలి.

వేపాకు 3 కేజీలు, గానుగ (Indian Beech) ఆకులు 2 కేజీలు, ఉమ్మెత్త ఆకులు 2 కేజీలు, జిల్లేడు ఆకులు 2 కేజీలు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, మునగ ఆకులు 2 కేజీలు, ఆముదం ఆకులు 2 కేజీలు, బేలిఆకు/లేంతెనా (Lantana) 2 కేజీలు, తులసి/అడవి తులసి 1/2 కేజీ, వావిలి (Vitex Negundo) ఆకులు 2 కేజీలు.

పైన పేర్కొన్న వాటన్నింటినీ డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. డ్రమ్ములో వేసిన పదార్ధాలను రోజుకు 3 సార్లు కుడిచేతివైపునకు మూడు నిముషాలపాటు త్రిప్పాలి. ఇలా 40 రోజులపాటు ప్రతిరోజు 3 నిముషాలు త్రిప్పాలి. ఇదే దశపర్ణి కషాయం. ఈ కషాయాన్ని 41వ రోజున పల్చటి కాటన్ గుడ్డతో వడబోసుకోవాలి. ఈ కషాయాన్ని 6 నెలలవరకూ వాడుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 6 నుండి 10 లీటర్ల కషాయాన్ని కలిపి వాడుకోవాలి. ఈ మోదాదు ఒక ఎకరానికి సరిపోతుంది. దశపర్ణి కషాయం వరిలో రసం పీల్చే పురుగులను, మామిడిలో బూడిద తెగులును నివారిస్తుంది.

శీలీంధ్ర/ఫంగస్ (Fungus) నాశనులు:

  • 100 లీటర్ల నీటిలో 6 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి ఒక ఎకరం పంటపై పిచికారి చేస్తే పంటను ఫంగస్ బెడదనుండి కాపాడుకోవచ్చు. దీన్ని గోబాణం అని అందురు.
  • 200 గ్రాముల శోంఠి పొడిని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక లీటరు మిగిలేవరకూ మరగబెట్టాలి. వేరే పాత్రలో 5 లీటర్ల దేశీ ఆవుపాలు/గేదె పాలను తీసుకొని 2 లీటర్ల పాలు మిగిలేవరకు మరగకాయాలి. ఈ పాలలో పై మీగడను తీసివేయాలి. తర్వాత 200 లీటర్ల నీటిలో ముందుగా పాలను కలిపి, తర్వాత శొంఠి కషాయాన్ని కలిపి 3 నుండి 5 నిముషాలు కుడివైపునకు కలియ త్రిప్పాలి. ఇలా తయారైన శొంఠి అస్త్రాన్ని 48 గంటలలోపు ఒక ఎకరం పంటపై పిచికారీ చేయాలి.
  • 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరం పంటపై చల్లుకుంటే కీటకాలను నిరోధించవచ్చు.
  • బాగా ఎండిన 5 కేజీల దేశీ ఆవు పేడను పొడి చేసి గుడ్డలో మూటకట్టి 200 లీటర్ల నీటిలో వేలాడగట్టి ఉంచాలి. 48 గంటల తర్వాత పేడ మూటను బాగా పిండాలి. సారం అంతా నీటిలో దిగుతుంది. ఆ నీటిని వడబోసి 1 ఎకరం పంటపై చల్లుకోవాలి.

పంటల నాణ్యత పెంచే ద్రావణం:

నువ్వులు 100 గ్రాములు, పెసలు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు, ఉలవలు 100 గ్రాములు, బొబ్బర్లు (అలసందలు) 100 గ్రాములు, శెనగలు 100 గ్రాములు, గోధుమలు 100 గ్రాములు.

వీటన్నంటినీ మొలకలు వచ్చేలా తడిగుడ్డలో కట్టుకోవాలి. మొలకలు వచ్చిన తర్వాత తీసి రోటి పచ్చడిలా రుబ్బుకోవాలి. 200 లీటర్ల నీళ్ళు, 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం కలిపిన డ్రమ్ములో ఈ పచ్చడిని వేసి 24 గంటలపాటు నీడలో ఉంచి మూడుపూటలా 3 నిముషాలపాటు కుడివైపునకు తిప్పాలి. తర్వాత గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే పంటల నాణ్యత పెంచే ద్రావణం. పంటను కోసే 2 లేదా 3 వారాల ముందుగా ఈ ద్రావణాన్ని 1 ఎకరం పంటపై పిచికారీ చేస్తే గింజల్లో తాలు ఉండదు. ధాన్యం నిగనిగలాడుతూ ఎక్కువ బరువు తూగుతుంది. మామిడి కాయలు కోతకు వారం ముందు ఈ ద్రావణాన్ని కాయలపై పిచికారీ చేస్తే కాయలు నిగనిగలాడుతూవుండి ఎక్కువ కాలం నిల్వవుంటాయి.

అచ్చాదన (Mulching)

పొలంలో మట్టిని ఎండనుండి, వాననీటి కోత నుండి, గాలినుండి రక్షించుకోవాలి. దీన్నే అచ్చాదన కల్పించడం అని, మల్చింగ్ చేయడం అని అంటారు. అచ్చాదన వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతుంది, భూమి సారవంతమవుతుంది. పదేపదే నీరు పెట్టవలసిన అవసరం కూడా వుండదు. కుళ్ళి నేలలో కలిసిపోయే గడ్డి, ఆకులు వంటి ఏ వ్యర్ధ పదార్ధంతోనైనా అచ్చాదన చేసుకోవచ్చు. భూమికి అచ్చాదన మూడు రకాలుగా కల్పించవచ్చు.

1. మట్టిని రెండు అంగుళాల లోతున గొర్రుతో దున్నాలి. దీనిని మట్టితో అచ్చాదన అంటారు. 2. ఎండు గట్టి, కంది కట్టెలు, చెరకు పిప్పి, చెరకు ఆకు, రెమ్మలు, రాలిన ఆకులు - వీటితో నేలను అచ్చాదన చేయవచ్చు. పంటకోత తర్వాత వీటిని కాల్చడం సరికాదు. 3. నేలపై తక్కువ ఎత్తులో వ్యాపించే పంటలు వత్తుగా వేసుకోవడం లేదా వివిధ రకాల మొక్కలను వాటంతటవే పెరగనివ్వడం ద్వారా నేలకు అచ్చాదన కలిగించవచ్చు. దీన్నే సజీవ అచ్చాదన అంటారు.

వాఫ్స (Water Management)

వాఫ్స అనగా నీరు పెట్టే విధానం, సూక్ష్మ వాతావరణం కల్పించడం. పొలం భూమిలో మట్టికణాల మధ్య 50% నీటి ఆవివి, 50% గాలి ఉండేలా చేయడమే వాఫ్స ఉద్దేశం. పంట మొక్కలకు కావాల్సింది నీరు కాదు, నీటి ఆవిరి. మొక్క అవసరాన్ని గుర్తెరిగి సాగునీటిని అందిస్తేనే భూమిలో వాఫ్స ఏర్పడుతుంది. వాఫ్స క్రియ నిరంతరం జరుగుతూవుంటుంది. మద్యాహ్నవేళలో చెట్టు/పంట మొక్క నీడ పడే చోటులో వరకూ వేళ్లు విస్తరించివుంటాయి. ఆ పరిధికి వెలుపలికి నీరందిస్తే వాఫ్స ఏర్పడి నీరు సద్వినియోగమవుతుంది.

ప్రస్తుత స్థితి, భవిష్యత్తు[మార్చు]

'ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమే గాని సంపాదన ఉండదు, ఆస్తులు సంపాదించలేము, చదువుకి - సంపాదనకి సంబంధం లేదు, సంపాదనకి కావాల్సింది తెలివితేటలే గాని చదువు కాదు, నగరాల్లో ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదని, వాహనాలు మరియూ ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్యం ఉండదని తెలుసుకొని ఇటీవల చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పట్టుదలతో సేంద్రీయ వ్యవసాయంలోకి అడుగు పెడుతున్నారు. నగరాలకు చేరువలో లేదా స్వగ్రామాల్లో భూములను కొని లేదా కవులకు (లీజుకు) తీసుకొని సేంద్రీయ కూరగాయల పంటలు పండిస్తూ నగరాల్లోకి ఎగుమతి చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు.

వ్యవసాయం చేస్తే అమ్మాయిని ఇవ్వం అని అలోచించే ఆడపిల్ల తల్లిదండ్రులు, పట్నంలో చిన్నా చితకా ఉద్యోగమైనా పర్వాలేదు, వ్యవసాయం వద్దని వారించే అబ్బాయిల తల్లిదండ్రులు, తమ ఆలోచనలను మార్చుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మా అబ్బాయి రైతు, మా అమ్మాయి భూమి పుత్రిక అని ప్రతి తల్లితండ్రీ గర్వంగా చెప్పుకొనే సమయాలు మునుముందు రానున్నాయి. అయితే ప్రాకృతిక వ్యవసాయం చేసేవారిలో చిన్నకారు రైతులు కూడా ఉన్నారు. అటువంటి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తే భారతదేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది.

ఈ వ్యవసాయంలోకి ఎలా మారాలి?[మార్చు]

సేంద్రీయ వ్యవసాయం పెట్టుబడి లేని వ్యవసాయం. చాలా మంది "సేంద్రీయ వ్యవసాయం అందరూ చేయలేరు. అది చాలా కష్టంతో కూడినది. మన వల్ల కాదు. రసాయన వ్యవసాయంలోనే సరైన ఆదాయాలు రావడంలేదు, ఇక సేంద్రీయ వ్యవసాయంలో ఆదాయాలు వస్తాయా?" అని అంటుంటారు. కాని మనసు వుంటే మార్గం ఉంటుంది. కృషి వుంటే ఏదైనా ఫలిస్తుంది. అయితే సేంద్రీయ వ్యవసాయం ఒక్కసారిగా మొదలుపెట్టరాదు. 3, 4 సంవత్సరాలపాటూ రసాయనాల వాడకం తగ్గిస్తూ జీవామృతం వాడకం పెంచుతూ వుండాలి. భూమిలో రసాయన ఎరువులు, కలుపు మందుల అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోవాలంటే సుమారు 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. తొలుత మూడు, నాలుగు సంవత్సరాలు దిగుబడులు, ఆదాయాలు ఆశించిన రీతిలో రాకపోవచ్చును. తర్వాత సంవత్సరములనుండి తీసుకున్న శ్రద్ధను బట్టి అధిక దిగుబడులు, అధిక లాభాలు వస్తాయి.

విమర్శలు, వ్యతిరేకత[మార్చు]

ప్రాకృతిక వ్యవసాయంలో రైతులు విక్రయ కేంద్రాల నుండి శంకర విత్తనాలు, రసాయనిక లేదా సేంద్రియ ఎరువులు కొనడం వుండదు. ఉత్పత్తి, ఖర్చు తగ్గినప్పటికి నికర లాభం వస్తుందని ప్రాకృతిక వ్యవసాయం ఆచరిస్తున్నామని రైతులు చెప్పినప్పటికి కృషి విఙ్ఞాన కేంద్రాల, విత్తనాల విక్రయ కేంద్రాల, రసాయనిక కేంద్రాల వ్యతిరేక ప్రకటనల వల్ల ప్రాకృతిక వ్యవసాయం రైతులకు చేరలేకపోతుంది. దేశంలోని రైతులందరూ ప్రాకృతిక వ్యవసాయం చేయడం వల్ల కృత్రిమ ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు తయారు చేస్తున్న కంపెనీలు క్రమంగా మూత పడిపోతాయని, తయారుచేసుకున్న సేంద్రీయ ఎరువులు, క్రిమి సంహారకాలు ఆర్థికంగా రైతుని ఇంకా కృంగజేస్తాయని శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఇతర విషయాలు[మార్చు]

  • మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు ఉంటే పంటలు అధ్బుతంగా పండుతాయి.
  • వానపాములు రోజుకు 150 జతల ఎడ్లు చేసినంత పని చేస్తాయి. ఇవి భూమికి బొరియలు చేస్తూ నేలను గుల్లబరచడమే కాకుండా 15 అడుగుల లోతు మట్టిలో నుంచి పోషకాలను మొక్కల వేళ్ళకు అందిస్తాయి. వానపాముల ద్వారా ఎకరానికి ఏటా 90 కిలోల నత్రజని సహజంగానే అందుతుంది.[2]
  • అచ్చాదనం (మల్చింగ్) లో చెట్లనుండి రాలిన ఆకులు, పువ్వులు మట్టిలో కలిసేలా చూడాలి.
  • పంట కోత కాలం తర్వాత ఆకులను, మొక్కలను కాల్చకూడదు. వాటిని అచ్చాదనకు ఉపయోగించవచ్చు.
  • ఒక్క దేశీయ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగు చేయవచ్చు.
  • దేశీయ ఆవు పేడలో కోట్ల మిత్ర సూక్ష్మ జీవులు ఉంటాయని పాలేకర్ రుజువు చేశారు.
  • ఆవు పేడ వాడే అన్ని మిశ్రమాల్లోను 7 రోజుల లోపు పేడనే వేయాలి.
  • ఏదో ఒకే రకం పంట వేయకూడదు. అనేక రకాల పంటలు, ఏళ్ళ తరబడి పెరిగే చెట్లను కలిపి పెంచాలి.
  • రైతు వేసే ప్రధాన పంటలతోపాటు ఒకటి, రెండు అంతరపంటలు కూడా వేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చు.
  • కలుపు మొక్కలను అచ్చాదన కోసమే ఉపయోగించాలి. కనుక కలుపు మందులు వాడరాదు.
  • పురుగు మందులు వాడరాదు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి అవసరాన్ని బట్టి ఏదో ఒక కీటకనాశని వాడితే సరి.
  • ఏ పంట అయినా మొక్కకు మొక్కకు మధ్య సరిపోయే దూరం ఉండాలి.
  • సేంద్రీయ వ్యవసాయంలో కూలీల ఖర్చు తప్ప రసాయన మందుల ఖర్చు ఉండదు.
  • సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టిన 2, 3 సంవత్సరాల వరకూ ఎటువంటి ఆదాయాలు కనిపించవు. స్వల్ప ఆదాయం మాత్రం కనిపిస్తుంది. 4వ/ 5వ సంవత్సరాల నుండి అధిక లాభాలు కనిపిస్తాయి.
  • ప్రాకృతిక వ్యవసాయంలో పెట్టుబడి వుండదు కావున రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోతాయి.
  • సేంద్రీయ వ్యవసాయం వలన ఆరోగ్యకరమైన, విషరహితమైన, నాణ్యమైన పంటలు చేతికి అందుతాయి.
  • రసాయన పద్ధతిలో పండించే పంటలకంటే పాలేకర్ పద్ధతిలో పండించే పంటలకు ఎక్కువ మద్దత్తు ధర లభిస్తుంది.
  • సేంద్రీయ వ్యవసాయంలో నీటి ఖర్చు, కరెంటు ఖర్చు తగ్గుతుంది.
  • సేంద్రీయ వ్యవసాయానికి రైతులు బ్యాంకులనుండి అప్పులు చేయక్కర్లేదు, ప్రభుత్వము రైతులకు రుణమాఫీలు చేయక్కర్లేదు.
  • సేంద్రీయ వ్యవసాయం వలన వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది.

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయం[1]
  • ఫుకుఓకా వ్యసాయ పద్ధతి [2]
  • చొ ప్రకృతి వ్యసాయ పద్ధతి[3]

ఇతర లంకెలు[మార్చు]

  • ప్రకృతి వ్యవసాయం - పాలేకర్ విధానం, సంకలనం: త్రినాధ్ సి.హెచ్, Vachakam Publications
  • వాచకం, వార్తా పక్ష పత్రిక, ఫిబ్రవరి 1-15, 2015