Jump to content

బాదామి సర్వోత్తం

వికీపీడియా నుండి
బాదామి సర్వోత్తం
జననంబాదామి సర్వోత్తం
1910
బెంగుళూరులోని చెన్నపట్టణం.
మరణం2005
ఇతర పేర్లుసర్వోత్తం
వృత్తిభారతీయ సినిమా దర్శకుడు.
మతంహిందూ

బాదామి సర్వోత్తం (1910 - 2005) తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. ఈయన హిందీ, తెలుగు, తమిళ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[1] సర్వోత్తం బెంగుళూరులోని చెన్నపట్టణంలో జన్మించాడు. ఈయన తండ్రి మైసూరులో రెవెన్యూ అధికారి. బెంగుళూరులోని ఒక అమెరికా కంపెనీకి కార్ల అమ్మకందారుగా జీవితాన్ని ప్రారంభించిన సర్వోత్తం 1930లో బొంబాయి చేరాడు. బొంబాయిలోని సాగర్ మూవీ టోన్ కంపెనీలో పనిచేస్తూ వారు నిర్మించిన ఆనేక చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళ సినిమాలలో తొలి టాకీ చిత్రాలకు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహిస్తే, రెండు భాషల్లోనూ మలి చిత్రాలకు బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించడం విశేషం. 1948 జూలై నుండి 1952 వరకు ఫిల్మ్ డివిజన్లో న్యూస్ రీళ్ళ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ అనేక న్యూస్ రీళ్ళ ను నిర్మించాడు.[2]

సినీరంగ ప్రవేశం

[మార్చు]

19 యేళ్ల వయసులో బొంబాయి ఆటోమొబైల్ ఇంజనీరింగు చదవటానికి వెళ్ళిన సర్వోత్తం అనుకోకుండా తొలి టాకీ చిత్రం ఆలమ్ ఆరాలో పనిచేశాడు. బొంబాయిలో ఆర్దేషిర్ ఇరానీ కుటుంబంలో ఒక పెళ్ళికి వెళ్ళిన సర్వోత్తం అక్కడ ఇరానీని కలిసాడు. అదే సమయంలో ఆలంఅరా సినిమా రికార్డు చేయటానికి రికార్డింగు సామగ్రి అంతా విదేశాల నుండి వచ్చింది. ఇరానీ సినిమా రికార్డింగులో సహాయం చెయ్యమని సర్వోత్తాన్ని కోరాడు. అలా సర్వోత్తం సినీరంగంలో ప్రవేశించాడు. 1931లో అనుకోకుండా సినిమా తీసే అవకాశం వచ్చింది. 1931లో హరిశ్చంద్ర అనే తమిళ సినిమా తీస్తున్న నిర్మాత, జర్మనీలో శిక్షణ పొందిన దర్శకుడు మధ్యలోనే పని మానేయ్యటంతో, ఆ సెట్లో ఏకైక దక్షిణాది వ్యక్తి అయిన సర్వోత్తాన్ని సహాయం చేయమని అడిగాడు. 20 యేళ్ల వయసులో సర్వోత్తం ఆ సినిమాను పూర్తిచేయటానికి ధైర్యంగా అంగీకరించాడు. అలా కొద్దికాలంలోనే పేరు తెచ్చుకున్న సర్వోత్తానికి ఆ వెంటనే మూడు సినిమాలు తీసేందుకు అవకాశం వచ్చింది. గలవఋషి (తమిళం), పాదుకా పట్టాభిషేకం, శకుంతల (తెలుగు). మూడు సినిమాలు విజయవంతం కావడంతో దర్శకునిగా స్థిరపడ్డాడు. 1931 నుండి 1947 వరకు ఈయన సాగర్ మూవీటోన్ పతాకంపై ముప్పై సినిమాలు తీశాడు. చాలా హిందీ సినిమాలు తీసినా ఈయనకు హిందీ రాదు. ఈయన దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం చంద్రహాస (1933) మంచి పేరు తెచ్చింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Sarvottam Badami". IMDb (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-29.
  2. Documentary films and national awakening By Jag Mohan, India. Ministry of Information and Broadcasting. Publications Division పేజీ.23 [1]
  3. Reflections: Experiences of a Bureaucrat's Wife By Gita Vittal