బాలభటులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
స్కౌట్స్ పతకం.

బాల బాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రారంభించబడిన ఉద్యమం బాలభట ఉద్యమం (Scouts and Guides Movement). ఈ ఉద్యమంలో బాలుర బృందాలను "స్కౌట్స్" మరియు బాలికల బృందాలను "గైడ్స్" అని అంటారు.

ఈ ఉద్యమాన్ని సర్ రాబర్ట్ బెడన్ పవల్ 1907 సంవత్సరం దక్షిణాఫ్రికా లో జరిగిన బోయర్ యుద్ధాలలో గాయపడిన వారికి సేవచేయడానికి ప్రారంభించాడు. అయితే పిల్లలలోని సహనం, స్నేహశీలత, ఉత్సాహం, పట్టుదలలను చూచిన పవల్ ఈ ఉద్యమాన్ని యుద్ధాల తర్వాత కూడా కొనసాగించాడు.

ఉద్యమంలో చేరిన పిల్లలకు సేవా పద్ధతులను అనుసరించి శిక్షణ (Training) ఇస్తారు. వీరికి ఈతకొట్టడం, వంతెనలు, రోడ్ల నిర్మాణం, ప్రథమ చికిత్స పద్ధతులను నేర్పుతారు. ఆయుధాలు లేకుండా వీరు కేవలం ఒక కర్రను మాత్రమే ధరిస్తారు. వీరికి సైనికుల వలె ప్రత్యేక దుస్తులు మెడలో ఒక స్కార్ఫ్ ఉంటుంది. ఈ ఉద్యమంలో చేరినవారు దళాలుగా ఏర్పడతారు. ప్రతి దళానికి ఒక పతాకం, వాయిద్యాలు ఉంటాయి. "సదా సమాజసేవలో ఉంటాం" అనే నినాదం ఈ పతాకం పై రాసి ఉంటుంది. ప్రతి జట్టు ఒక నాయకుడి ఆధీనంలో ఉంటుంది.

ఈ ఉద్యమంలో విద్యార్ధులందరూ స్వచ్ఛందంగా చేరాలి. సత్యం పలకడం, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగగ్రస్తులకు సేవచేయడం, పోలీసు వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సాయపడటం ద్వారా బాలభటులు సమాజసేవ చేయవచ్చును.

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్[మార్చు]

మొట్టమొదటి స్కాటిష్ స్కౌట్ సమూహం సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) లో 1908 లో ప్రారంభమైనది. ఇది 1910 లోనే ఆగిపోయినది. నిర్ధారించబడిన లెక్కల ప్రకారం భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ స్కౌట్ సమూహం 1909 లో బెంగుళూరు, కిర్కీ మరియు జబల్ పూర్ లో ప్రారంభమైనవి. కొత్తగా 1911 లో సిమ్లా, కలకత్తా, అలహాబాద్, పూణె, సైద్ పూర్ మరియు మద్రాసు స్కౌట్ కేంద్రాలు మొదలై ఇవి తొమ్మిదికి పెరిగింది.

గర్ల్ గైడ్ ఉద్యమం భారతదేశంలో జబల్ పూర్ లో 1911 లో మొదలైనది. ఇది త్వరత్వరగా అభివృద్ధి చెంది 1915 కల్లా 1200 మంది పిల్లలతో సుమారు 50 కేంద్రాలు తెరిచారు. బ్రిటిష్ బాలికలకే పరిమితమైన అఖిల భారత గర్ల్ గైడ్స్ సంఘం 1916 లో మొదలైంది.

భారత స్వాతంత్ర్యం అనంతరం జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా కలాం అజాద్, మంగళ్ దాస్ పక్వాసా, డాక్టర్ హెచ్.ఎన్.కుంజ్రు, రామ్ వాజ్ పేయిల్ మరియు జస్టిస్ వివియన్ బోస్ మొదలైన కృషి ఫలితంగా స్కౌట్స్ మరియు గైడ్స్ ఉద్యమాల్ని రెండింటిని నవంబరు 7, 1950 నాడు ఒకటిగా చేసి భారత్ స్కౌట్స్ అంద్ గైడ్స్ గా నామకరణం చేశారు. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ లో ఉన్నది.

మూలాలు[మార్చు]

  • వ్యాస మంజూష, డా.డి.సాంబముర్తి, నీల్ కమల్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2007. ISBN 8186804021

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బాలభటులు&oldid=1196463" నుండి వెలికితీశారు