Jump to content

బాలురపై లైంగిక వేధింపులు

వికీపీడియా నుండి

బాలురపై లైంగిక వేధింపులు అనగా ఒక బాలుడిపై (లింగభేదం లేకుండా) అతనికన్నా పెద్దవయస్కులైన వారు అతని ద్వారా లైంగిక ప్రేరణని పొందటం/ పొందటానికి ప్రయత్నం చేయటం. మగపిల్లలపై లైంగిక వేధింపులు అనేక రూపాలలో జరుగవచ్చును.

  • నేరుగా లైంగిక ప్రేరణని కలిగించమని కోరటం
  • లైంగిక కార్యకలాపాలలో పాల్గొనమని ఒత్తిడి చేయటం
  • తమ కామవాంఛలని తీర్చుకొనటానికి మగపిల్లలని బెదిరించటం, అసభ్య అవయవ ప్రదర్శన చేయటం, వారిని లొంగదీసుకోవటం
  • మగపిల్లలతో శారీరక సంబంధాలని ఏర్పరచుకోవటం
  • నీలిచిత్రాలని తీయటానికి మగపిల్లలని ఉపయోగించుకోవటం

మగపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కడైనా, ఎవరిచేనైనా జరుగవచ్చును. పాఠశాల, ఇల్లు, బాల కార్మిక వ్యవస్థ ఉన్న దేశాలలో అయితే కార్యాలయాలు, ఇతర పనులు జరిగే ప్రదేశాలలో కూడా జరుగవచ్చును. ఈ విధమైన లైంగిక వేధింపులు ఇతర మానసిక రుగ్మతలకి దారితీయటంతో బాటుగా మగపిల్లలు శారీరకంగా/మానసికంగా ఆరోగ్యవంతమైన యువకులుగా ఎదగటానికి అడ్డుకట్ట వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై జరిగే లైంగిక వేధింపులు 19.7 శాతం కాగా, మగపిల్లలపై జరిగే వేధింపులు 7.9%. వీటిలో ఆడపిల్లలపై స్త్రీలు చేసే అత్యాచారాలు కేవలం 6% మాత్రమే కాగా, అదే స్త్రీలు మగపిల్లలపై జరిపే అత్యాచారాలు 14% నుండి 40% వరకూ ఉన్నాయి. అయితే ఈ గణాంకాలు వాస్తవంగా జరిగిన దాడులకంటే తక్కువగా నమోదు చేయబడుతున్నాయని ఒక వాదన. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలి, చేయటంతో పోలిస్తే చేయకుండా ఉండటమే నష్టదాయకమని చాలా మంది మగపిల్లలకి తెలియదు. 30వ పడిలో పడితే గానీ ఏ పురుషుడూ తను పిల్లవాడిగా ఉన్నప్పుడు తన పైన జరిగిన దాడి గురించి ఎవరికీ చెప్పలేకపోతాడన్నది మరొక వాదన. స్థూలంగా చెప్పాలంటే 16 సంవత్సరాల వయసు లోపు ఉన్న ప్రతి ఆరుగురి మగపిల్లలలో ఒక మగపిల్లవాడు పెద్దవారిచే లైంగిక వేధింపులకి గురి అవుతున్నాడు. సాధారణంగా ఈ వేధింపులకి గురిచేసేవారు బాధితులకి దగ్గరివారే అయ్యి ఉంటారు. బంధుమిత్రులు, తల్లిదండ్రుల స్థానే పిల్లల సంరక్షణ చేసేవారు లేక చాలా అరుదుగా ఆగంతకులు ఈ వేధింపులకి గురి చేస్తూ ఉంటారు.

జిం హాపర్ అనే మానసిక శాస్త్రవేత్త ఈ దాడులు ఏకంగా మగపిల్లల పుంసత్వంపై ప్రభావం చూపుతాయని వెల్లడించారు.

నిర్వచించటం లో ఉన్న కష్టాలు

[మార్చు]

మగపిల్లలపై లైంగిక వేధింపుల ని నిర్వచించటం కష్టతరమే. దేశకాలమాన పరిస్థితులని బట్టి దీని నిర్వచనం మారిపోతూ ఉంటుంది.

ఉదా:

  • ఎంత వయసులోపు వారిని మగపిల్లలు గా పరిగణించాలి?
  • వారిని లొంగదీసుకోవటానికి అవతలి వారు ఏం చేశారు?
    • కేవలం బెదిరించారా?
    • శారీరక బలాన్ని ప్రదర్శించారా?
  • వేధింపులకి గురైన సమయంలో బాధితుడు ఎలాంటి భావాలకి లోనయ్యాడు?
    • బాధాకరమైన భావాలకి లోనయ్యాడా?
    • ఏ బాధా లేకుండానే వేధింపులు జరుపబడ్డాయా? (ఏ బాధా లేనంత మాత్రాన, బాధితుడు ఆనందం పొందినంత మాత్రాన వేధింపు కాదు అని చెప్పటానికి లేదు)

-వంటి ప్రశ్నలతో నిర్వచన కష్టమౌతుంది.

అయితే కొన్ని సందర్భాలలో ఏ కష్టం లేకుండానే మగపిల్లలపై లైంగిక వేధింపులు జరిగాయన్నది సుస్పష్టమవుతుంది. ఊదా: ఒక ఇరవై ఏళ్ళ యువతి పదేళ్ళ బాలుడితో ఎటువంటి బెదిరింపులకి, శారీరక బలప్రదర్శనకి పాల్పడకుండానే సంభోగం చేస్తే అది కచ్చితంగా లైంగిక వేధింపే. ప్రతి వేధింపులోనూ బెదిరింపులు, శారీరక బలప్రదర్శన జరిగి తీరాలని లేదు.

వేధింపులు ఎవరిచేత/ఎంత కాలం జరిగాయి అన్న వాటిపై కూడా దీని నిర్వచనం ఆధారపడి ఉంటుంది.

వేధింపులు జరిగిన సమయానికి పిల్లవాడి వయసు ఎంత? వేధించిన వారు బాధితులకి ఎంత సమీపులు అన్న వాటిని బట్టి అసలు బాధితుడు ఈ వేధింపులని జ్ఞాపకం పెట్టుకొనగలడా? అన్నవి మరి కొన్ని ప్రశ్నలు. మరీ చిన్న వయసు అయినా మరీ సమీపులు అయినా నిజమైన ప్రేమాభిమానాలకి వేధింపులకి మధ్య ఉన్న సన్నని గీతని గుర్తించటం కూడా మగపిల్లలకి కష్టతరమే అవుతుంది.

విధానాలు

[మార్చు]

లైంగిక వేధింపులు జరిగే విధానాలు.

  • లైంగికపరమైన వ్యాఖ్యలు చేయటం
  • బాలుడికి మర్మావయవాలని ప్రదర్శించటం, బాలుడిని మర్మాయవాలని ప్రదర్శించమని కోరటం
  • బాలుడి మర్మావయవాలని తాకటం, తమ మర్మావయవాలని తాకమని బాలుడిని కోరటం
  • బాలుడి ముందే తాము హస్తప్రయోగం చేయటం
  • వ్యభిచారాన్ని అశ్లీలాలని బాలుడికి ప్రదర్శించటం
  • ఏ విధమైన సంభోగాన్నైనా (యోని ద్వారా, మలద్వారం ద్వారా లేదా వక్షోజాల సంభోగం) బాలుడితో బలవంతంగా చేయించుకోవటం
  • బాలుడి మలద్వారంలో ఏదైనా వస్తువుని లేదా వ్రేలిని చొప్పించటం
  • జంతువులపై బాలుడు సంభోగించేలా ప్రయత్నం చేయటం

దుష్ఫలితాలు

[మార్చు]

వేధింపులకి గురిచేసేవారు స్త్రీలైనా పురుషులైనా, వాటి వలన మగపిల్లలలో కలిగే భావోద్రేక దుష్ఫలితాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. వేధింపులకి గురి చేసేవారు కుటుంబీకులే అయితే వాటి ఫలితాలు మరింత తీవ్రంగా ఉంటాయి. వేధింపులకి గురి చేసే వారి వయసు, సామీప్యాల వలన వారిని వారించలేకపోవటం, జరుగుతోన్న దారుణాన్ని అంగీకరించలేకపోవటం వంటి అనేకానేక పరస్పర విరుద్ధ భావనలతో మగపిల్లవాడి మనసు అతలాకుతలమవ్వటంతో అతనిలో భావోద్రేక/మానసిక వైకల్యాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. పైగా-

  • మగవారి/మగపిల్లల పై దాడులు జరగవు
  • సంభోగానికి మగవారు నిత్యం సంసిద్ధులై ఉంటారు. (నేను అప్పుడు సంసిద్ధుడిగా లేను కాబట్టి, నేను మగవాడిని కానేమో?)
  • దాడి చేసేవాడే మగవాడు. దాడి చేయబడేది స్త్రీ పైనే

-వంటి ప్రచారంలో ఉన్న నానుడులు మగపిల్లలని మరింత సందిగ్ధావస్థలోకి నెట్టి వేస్తాయి.

అయితే స్వలింగ సంపర్కులైన పురుషులే మగపిల్లలపై దాడి చేస్తారని, పురుషులచే దాడికి గురి అయిన మగపిల్లలు కచ్చితంగా స్వలింగ సంపర్కులే అవుతారన్న వాదానికి మాత్రం ఋజువులు లేవు. అలాగే ఎటువంటి వారిచే దాడికి గురి అయినా, మగపిల్లవాడు మరల మరొక మగపిల్లవాడిపై దాడి జరుపుతాడు అనే వాదానికి కూడా కావలసినన్ని ఆధారాలు లేవు.

కొన్ని దుష్ఫలితాలు:

  • దురలవాట్లకి బానిసలు కావటం (జరిగినది పదే పదే గుర్తు రావటం, దానిని మరచిపోవటాని కోసం. ప్రత్యేకించి భారతదేశంలో దురలవాట్ల బారిన పడే అవకాశం స్త్రీల కంటే పురుషులకే ఎక్కువ ఉండటం.)
  • పనికి దాసులు కావటం
  • వ్యాయామానికి దాసులు కావటం
  • ఆందోళన
  • నిస్సహాయత
  • ఒంతరితనం
  • అణచివేతకి గురి అయినట్లు భావన
  • వేర్పడటం
  • పగ, క్రోధం
  • మానవసంబంధాలని దెబ్బతీసుకోవటం
  • సత్సంబంధాలని కూడా అపార్థం చేసుకోవటం
  • స్వాభిమానం తగ్గిపోవటం
  • లైంగిక అసమర్థత
  • నిద్రాభంగం
  • ఆత్మహత్య ఆలోచనలు, ప్రవర్తన
  • సందిగ్ధత (వేధింపులకి గురి అయిన సమయంలో అంగస్తంభన, స్ఖలనాల గురించి ప్రస్తావిస్తూ వేధింపులకి గురి చేసినవారు, నీకు అవి జరిగాయంటే, నీకు కూడా అది ఇష్టమనేగా అర్థం? అని ప్రశ్నించటం వలన)
  • తమ పుంసత్వాన్ని తమకి తాము నిరూపించుకొనేందుకు ఎక్కువ మంది స్త్రీలని లైంగిక భాగస్వాములుగా చేసుకోవటం. ఇతరులని లైంగిక బాధితులని చేయటం. ప్రమాదాలకి దారితీసే హింసాత్మక లైంగిక సంబంధాలని ఏర్పరచుకోవటం
  • తమ లైంగికత తమకే ప్రశ్నార్థకం కావటం
  • తాము పరిపూర్ణ పురుషులు కాము అనే భావన రావటం
  • పుంసత్వంపై అధికారం, నియంత్రణ, విశ్వాసాలని కోల్పోవటం (వేధింపులకి గురి అయిన సమయంలో తమకి ఏ మాత్రం నియంత్రణ లేని హార్మోనుల వలన అంగస్తంభన, స్ఖలనం జరగటం వలన, ఇవి కేవలం హార్మోనుల మూలాన జరిగినది తప్పితే, అందులో తన ప్రమేయం ఏమీ లేదని గుర్తించలేని స్థితి/దశలలో మగపిల్లలు ఉండటం మూలాన)
  • తాము స్వలింగ సంపర్కులుగా మారిపోతామేమో అనే భావన రావటం
  • సాధారణ సంభోగం పై ఏవగింపు (తమలో అవే బాధాకరమైన భావనలు మరల రగులుతాయేమోనని భయం)
  • స్వలింగ సంపర్కులపై విపరీతమైన భయాందోళనలను, అసహ్యాన్ని పెంచుకోవటం

ప్రసార మాధ్యమాల పాత్ర

[మార్చు]

ఆడపిల్లలపై లైంగిక వేధింపులకి స్పందించినంతగా ప్రసార మాధ్యమాలు మగపిల్లల విషయమై స్పందించకపోవటం, దీనితో కుటుంబీకులలోనూ మగపిల్లలలోనూ దీనిపై తగినంత అవగాహన లేకపోవటం సమస్యని మరింత జటిలం చేస్తాయి.

నష్ట నివారణ

[మార్చు]
  • లైంగిక వేధింపులకి గురి అయిన బాలురకు తల్లిదండ్రుల/కుటుంబం నుండి ప్రేమాభినాలు ఎక్కువగా అవసరం కావచ్చు
  • తల్లిదండ్రులు బాలురకు ఇటువంటి దాడుల బారి పడినది తామొక్కరే కాదు అన్న విషయం సుస్పష్టం చేయాలి. ఈ ప్రపంచంలో ఇది సాధారణమే అనే విషయం తెలపాలి
  • ఈ దుర్ఘటన వలన బాలురకి జరిగిన/జరగబోయే నష్టమేమీ లేదు అని భరోసా ఇవ్వాలి
  • జరిగిన దాడిని బాలుడు (ఎటువంటి దుర్వసనాల/మానసికోద్రేకాల బారిన పడకుండా) మరచిపోవటానికి తల్లిదండ్రులు కృషి చేయాలి
  • వేధింపులకి గురిచేసినవారి పట్ల జాగ్రత్త వహించటం మంచిది. మరలమరల అటువంటి వారి బారిన బాలురు పడకుండా జాగ్రత్త వహించాలి
  • సరైన వయసులో లైంగిక విద్య గురించి బాలురు తెలుసుకొనటానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో దోహదపడాలి. సాధారణ సంభోగం ఆనందదాయకమని, అందులో ఎటువంటి వికార భావాలకు తావు లేదని వారు తెలుసుకొనేలా చేయాలి.

మూలాలు

[మార్చు]
  1. https://web.archive.org/web/20150727192616/http://www.jimhopper.com/male%2Dab/
  2. https://www.psychologytoday.com/blog/psychoanalysis-30/201101/talking-about-sexually-abused-boys-and-the-men-they-become
  3. https://web.archive.org/web/20150517004050/http://laurelhouse.org.au/?page_id=20
  4. https://1in6.org/