Jump to content

బుద్ధపాలితుడు

వికీపీడియా నుండి
(బుద్ధపాలిత నుండి దారిమార్పు చెందింది)

బుద్ధపాలితుడు క్రీ. శ. 6 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ భారతీయ బౌద్ధ తత్వవేత్త. గొప్ప వ్యాఖ్యాత. మాధ్యమికవాది. మాధ్యమిక బౌద్ధంలో ప్రాసంగిక సంప్రదాయ శాఖ వ్యవస్థాపకుడు.

బుద్ధపాలితుడు-ముఖ్యాంశాలు

[మార్చు]
  • క్రీ. శ. 470-540 మధ్య కాలానికి చెందిన బుద్ధపాలితుని జన్మస్థలం దంతపురి (ఆంధ్రప్రదేశ్)
  • ఇతను బౌద్ధంలో మాధ్యమిక శాఖకు చెందిన గొప్ప వ్యాఖ్యాత. తత్వవేత్త.
  • మూలమాధ్యమికకారిక మీద వ్యాఖ్యానాలు రచించిన ఎనిమిది మంది ఉద్దండ బౌద్ధ పండితులలో ఇతను ఒకడు.
  • ఇతను రచించిన వ్యాఖ్యలలో “మూలమాధ్యమికకారికావృత్తి” మాత్రమే నేడు లభిస్తుంది.
  • బౌద్ధ తర్కంలో ప్రాసంగిక అనే పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టినవాడు బుద్ధపాలితుడు. ఈ పద్ధతిలో ప్రతిపాదకుడు కేవలం ప్రత్యర్థి వాదనలను తార్కికంగా తిరస్కరించడం పైనే దృష్టి పెడతాడు తప్ప తాను పూనుకొని ఏ విధమైన స్వంత తార్కిక వాదనను ప్రవేశపెట్టడు.
  • మాధ్యమిక శాఖా పండితులలో విస్తృత చర్చను రేకెత్తించిన ఇతని ప్రాసంగిక పద్ధతి, చివరకు మాధ్యమిక శాఖలో చీలికకు (ప్రాసంగిక, స్వాతంత్ర్యిక సంప్రదాయాలుగా) దారి తీసింది.
  • బుద్ధపాలితుడు మాధ్యమిక బౌద్ధంలో “ప్రాసంగిక” సంప్రదాయానికి వ్యవస్థాపకుడు. తరువాతి కాలంలో చంద్రకీర్తి (క్రీ. శ. 7 వ శతాబ్దం) వంటి బౌద్ధ పండితులు ఇతనిని ప్రబలంగా సమర్ధించారు
  • ఇతని ప్రాసంగిక పద్ధతిని విమర్శించిన భావవివేకుడు, మాధ్యమిక శాఖలో “స్వాతంత్రిక” అనే సంప్రదాయానికి స్థాపకుడయ్యాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

బుద్ధపాలితుడు క్రీ. శ. 470-540 మధ్యకాలంలో జీవించినవానిగా భావిస్తున్నారు.[1] టిబెటియన్ చరిత్రకారుడు తారానాధుని ప్రకారం బుద్ధపాలితుడు దక్షిణ భారతదేశంలోని 'హంసక్రీడ'లో జన్మించాడు.[1] అయితే నలనాక్ష దత్తు (Nalanaksha Dutt) ఇతని జన్మస్థలం దంతపురి అని పేర్కొనడం జరిగింది. కన్నింగ్ హోమ్ ఈ దంతపురిని కళింగపట్టణంగా భావించాడు. నేడు దంతపురిని దంతవరపుకోట (శ్రీకాకుళం జిల్లా) గా గుర్తించారు. బౌద్ధం పట్ల ఆకర్షితుడైన బుద్ధపాలితుడు చిన్న వయస్సులోనే సన్యాసాశ్రమం స్వీకరించాడు. బౌద్ధ ధర్మబోధనలో ఎక్కువ ఆసక్తి కనపరుస్తూ వచ్చాడు. నలందా విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడ నాగమిత్రకు శిష్యుడైన ఆచార్య 'సంఘరక్షిత' వద్ద శిష్యరికం చేసాడు.[1] నాగార్జునుని మూల గ్రంథాలపై, బోధనలపై లోతైన అధ్యయనం చేసిన బుద్ధపాలితుడు బౌద్ధధర్మంలో అపారమైన జ్ఞానాన్ని, ధార్మిక గ్రంథాలలో ఉత్కృష్ట పాండిత్యాన్ని గడించాడు. తరువాత దక్షిణ భారతదేశంలోని దంతపురి విహారంలో నివసిస్తూ బౌద్ధ ధర్మోపన్యాసాలను చేసాడు. ఆచార్య నాగార్జున, ఆర్యదేవుల కృతుల మీద పలు వ్యాఖ్యానాలను రచించాడు.[1]

రచనలు

[మార్చు]

బుద్ధపాలితుడు నాగార్జున, ఆర్యదేవ కృతులపై అనేక వ్యాఖ్యలు రచించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 'మూలమాధ్యమిక కారిక' మీద వ్యాఖ్యలు రచించిన ఎనిమిది మంది ఉద్దండులలో (నాగార్జునుడు, బుద్ధపాలిత, భావవివేక, చంద్రకీర్తి, దేవశర్మ, గుణశ్రీ, గుణమతి, స్థిరమతి- మొత్తం ఎనిమిది మంది) బుద్ధపాలితుడు ఒకడని సంప్రదాయం పేర్కొంటున్నది. అయితే మాధ్యమిక గ్రంథాలపై ఇతను రాసిన పలు వ్యాఖ్యానాలలో కేవలం "మూలమాధ్యమిక కారికావృత్తి" అనే వ్యాఖ్య మాత్రమే నేడు లభ్యమవుతున్నది.

మూలమాధ్యమిక కారికావృత్తి

[మార్చు]

బుద్ధపాలితుని వ్యాఖ్యలలో ఇదొక్కటే లభిస్తుంది. టిబెటియన్ అనువాదరూపంలో లభిస్తున్న ఈ గ్రంథం యొక్క మూల సంస్కృత ప్రతి ఇటీవలనే దొరికింది. నాగార్జునుని గ్రంథంలో వున్న విధంగానే, దీనిలో కూడా మొత్తం 27 ప్రకరణలు (chapters) ఉన్నాయి. చివరి 5 ప్రకరణలు మాత్రం అకుతోభయ (Akutobhaya) లోనివి. ఈ అకుతోభయ అనే గ్రంథం నాగార్జునుని 'మూలమాధ్యమికకారిక'కు రాయబడిన మరొక వ్యాఖ్య. ఒకప్పుడు దీనిని నాగర్జునునికే ఆపాదించబడినప్పటికి ప్రస్తుతం దీని రచయిత ఎవరనేది స్పష్టంగా తెలియదు. బుద్దపాలితుడు తన గ్రంథంలో ఆర్యదేవుని చతుశ్శతకం, రాహులభద్రుని ప్రజ్ఞాపారామిత శాస్త్రాలను ఉటంకించడమే కాకుండా తన కాలం నాటి తార్కిక సంప్రదాయాలకు భిన్నమైన “ప్రాసంగిక” పద్ధతిని రూపొందించాడు.

ప్రాసంగిక సంప్రదాయం

[మార్చు]

మహాయాన బౌద్ధం రెండు శాఖలుగా చీలి పోయింది. అవి 1. మాధ్యమిక శాఖ 2. యోగాచార శాఖ. ఈ చీలిక ఆచార్య నాగార్జునితో క్రీ. శ. రెండవ శతాబ్దంలో ఆరంభమైంది. మహాయాన బౌద్ధంలో మాధ్యమిక శాఖ అత్యంత ప్రధానమైనది. క్రీ. శ. 6 వ శతాబ్దం ఆరంభానికి ఈ మాధ్యమిక శాఖ ప్రాసంగిక, స్వాతంత్ర్యిక అనే రెండు సంప్రదాయాలుగా చీలిపోయింది. వీటిలో మొదటిదైన ప్రాసంగిక (Prasangika) సంప్రదాయానికి వ్యవస్థాపకుడు బుద్ధపాలితుడు[2] కాగా రెండవది అయిన స్వాతంత్ర్యిక (Svatantrika) మాధ్యమిక బౌద్ధ్ధ సంప్రదాయానికి వ్యవస్థాపకుడు భావవివేకుడు.[3]

ప్రాసంగిక సంప్రదాయాన్ని అనుసరించే వారు వాదంలో తాము ఏ రకమైన ప్రతిజ్ఞా వాక్యం (proposition) ప్రవేశపెట్టకుండానే, ఎదుటి వారి ప్రతిపాదనను అసంబద్ధమని రుజువు చేస్తారు. అంటే ప్రాసంగిక సంప్రదాయంలో ప్రత్యర్థి ప్రతిపాదనను అసంబద్దమని తేల్చివేయడం పైనే దృష్టి పెడతారు. ఈ రకమైన తార్కిక ప్రక్రియను 'అసంబద్ద సూక్ష్మీకరణం’ (Reductio ad absurdum) గా పేర్కొనవచ్చు. ఇది వాదనలో పరోక్ష పద్దతి. దీనిని మరో విధంగా కూడా చెప్పవచ్చు. వాదనలో తాము నిరూపించాల్సిన అసలు విషయానికి సరిగ్గా ఒక వ్యతిరిక్తమైన (opposite) భావాన్ని ముందుగా మనసులో ఊహించుకొని, వాదనలో ఆ ‘వ్యతిరేక భావం’ ఒక తప్పుడు ముగింపు (False conclusion) కు దారి తీస్తుందని తేల్చివేయడం ద్వారా అసలు విషయమే సరైనదని నిరూపించడం అన్నమాట. బౌద్ధ తర్కంలో ప్రాసంగిక పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టినవాడు బుద్ధపాలితుడు. బుద్ధపాలితుని ప్రాసంగిక పద్ధతిని ఇతని సమకాలికుడైన భావవివేకుడు (క్రీ. శ. 500-578) విభేదించాడు. అయితే తరువాతి కాలంలో చంద్రకీర్తి బుద్ధపాలితుని ప్రాసంగిక పద్ధతిని గట్టిగా సమర్ధించాడు.

బుద్ధపాలితుని తాత్వికత-చర్చ

[మార్చు]

సత్యం రెండు రకాలు. మొదటిది వ్యావహారిక సత్యం (సంవృతి సత్యం). రెండవది పారమార్ధిక సత్యం (పరమ సత్యం). వీటిలో అవిద్య వలన కలిగే వ్యావహారిక సత్యం సాపేక్షమైనది (relative). అంటే కారణాన్ని అపేక్షిస్తుంది. ప్రజ్ఞ వలన కలిగే పారమార్ధిక సత్యం నిరాపేక్షమైనది (absolute). అంటే స్వాభావికమైనది. స్వతఃసిద్ధమైనది. సంవృతి లేదా వ్యావహారిక దృష్టిలోనే ఈ జగత్తు ఉంది. పారమార్ధిక దృష్టిలో లేదు. ఈ పారమార్ధిక సత్యం అనుభవగ్రాహ్యం కాదని, వ్యవహారిక సత్యాన్ని ఎడతెగని విధంగా తిప్పికొట్టడం ద్వారానే, పారమార్ధిక సత్యాన్ని రూఢి పరచగలమని బుద్ధపాలితుడు భావించాడు. అంటే పరమ సత్యాన్ని రుజువు చేయడానికి, సంవృతి సత్యాన్ని అసంబద్ధమైనదిగా రుజువు చేయటం ఇతని తాత్విక పద్ధతి. దీనికోసం పట్టువదలని గతి తార్కిక పద్ధతిని అవలంబించడమే మాధ్యమిక సారాంశమని ఇతని ఉద్దేశం.

బుద్ధపాలితుడు తనకాలం నాటికి బౌద్ధ తార్కిక సంప్రదాయంలో కొనసాగుతున్న 'ఒక స్వతంత్ర అనుమానం ప్రవేశపెట్టడం' వంటి కొన్ని భావనలను స్వీకరించలేదు. ప్రత్యర్థుల వాదాన్ని దీటుగా ఎదుర్కోవడానికి స్వతంత్ర అనుమానం (autonomous inferences) లను ఉపయోగించనవసరం లేదని భావించాడు. దానికి బదులుగా ప్రత్యర్థి వాదన మీదనే ఆధారపడిన ‘ప్రాసంగ’ (అసంబద్ద ఫలితం- absurd consequence) పద్ధతి సరిపోతుందని భావించాడు. దీనికోసం బుద్ధపాలితుడు తన “మూలమాధ్యమికకారికావృత్తి’లో “ ప్రాసంగిక “ అనే కొత్త పద్ధతిని రూపొందించాడు. దీనిని మాధ్యమిక శాఖా చరిత్రలో విస్తృత చర్చను రేకేత్తించిన అంశంగా పేర్కొంటారు.

ప్రాసంగిక పద్ధతిని అతని సమకాలికుడైన భావవివేకుడు నిశితంగా ఖండించాడు. బుద్ధపాలితునితో తాత్వికంగా విభేదిస్తూ కేవలం ప్రత్యర్థి వాదనలమీదనే ఆధారపడటం కాకుండా స్వతంత్రంగా కూడా అనుమానాలు (inferences) ప్రస్తావించవలసిందేనని నొక్కి వక్కాణించాడు.[1] అంటే భావవివేకుని ప్రకారం ప్రత్యర్థి వాదనలను తార్కికంగా తిరస్కరించిన తరువాత వాటి స్థానంలో స్వంత తార్కిక వాదనలను (అనగా స్వతంత్ర అనుమానాలను) ప్రవేశ పెట్టాల్సివుంటుంది.

తరువాతి కాలంలోని ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త చంద్రకీర్తి (క్రీ. శ. 600-650) తన ప్రసన్నపద గ్రంథంలో బుద్ధపాలితుని ప్రాసంగికతత్వాన్ని సమర్ధిస్తూ, భావవివేకుని తీవ్రంగా విమర్శించడం జరిగింది. చంద్రకీర్తి ప్రకారం ఒక వాదనలో స్వతంత్ర అనుమానాలు ప్రవేశపెడుతున్నప్పుడు ఆ వాదనలో చర్చించే విషయం యొక్క స్వాభావిక అస్తిత్వాన్ని అంగీకరించడానికి ప్రతిపాదకుడు (proponent), ప్రత్యర్థి (opponent) వుండాల్సినవసరం ఏర్పడుతుంది. మౌలికంగా ఇది మాధ్యమిక దృక్కోణానికి అననుకూలం. ఎందుకంటే స్వాభావికమైన, స్వతఃసిద్ధమైన ప్రకృతికి సంబంధించిన దృగ్విషయాలన్నీ శూన్యంగా వుంటాయనే మాధ్యమిక మూల సూత్రానికి ఇది విరుద్దంగా ఉంది. కాబట్టే చంద్రకీర్తి భావవివేకుని స్వాతంత్ర్యిక (svatantrika) పద్ధతిని తీవ్రంగా ఖండించాడు. అందుకే టిబెటిన్ సంప్రదాయం చంద్రకీర్తిని బుద్ధపాలితుని పునర్భవంగా (reincarnation) పరిగణిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

భావవివేకుడు

రిఫరెన్సులు

[మార్చు]
  • Encyclopædia Britannica: Buddhapalita biography
  • "Mulamadhyamaka-Vrtti-Buddhapalita Translation Project". .buddhapalitavrtti.com. Archived from the original on 17 నవంబరు 2017. Retrieved 6 October 2017.
  • Phyllis G. Jestice. Holy People of the World: A Cross-cultural Encyclopedia. ABC-CLIO, 145. o (2004). ISBN 9781576073551
  • Robert E. Buswell Jr., Donald S. Lopez Jr. (2014). The Princeton Dictionary of Buddhism (Princeton University Press, New Jersey ed.). ISBN 9781400848058.
  • Williams, Paul (1989) Mahayana Buddhism. The doctrinal foundations. Cap.III, Londres: Routledge. ISBN 0-415-02537-0.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Mulamadhyamaka Vrtti Buddhapalita Translation Project.
  2. "Buddhapalita". www.britannica.com. Encyclopedia Britannica. Retrieved 6 October 2017.
  3. "Bhavaviveka". www.britannica.com. Encyclopedia Britannica. Retrieved 6 October 2017.