బెలూం గుహలు

బెలూం గుహలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోనినంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు.[1] ఇప్పుడు కనుమరుగైన చిత్రావతి నది వల్ల నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వల్ల కొన్ని వేల సంవత్సరాల కాలంలో సహజంగా ఏర్పడిన గుహలు ఇవి. ఇవి ఎర్రమల ప్రాంతంలోని సున్నపురాతి నిల్వలలో ఏర్పడిన గుహల సముదాయంలో భాగం. ఈ సముదాయంలోని మరి కొన్ని గుహలు బిళ్ళ సురగం, సన్యాసుల, యాగంటి, యెర్రజరి, ముచ్చట్ల చింతమాను గుహలు.[2]
ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్ఫటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత. ముఖద్వారం కంటే 46 మీ. లోతున ఉండే పాతాళగంగ ఈ గుహల్లోకెల్లా లోతైన ప్రదేశం.[3] ఈ గుహల మొత్తం పొడవు 3,229 మీ.
చరిత్ర
[మార్చు]
బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.సా.శ..పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884 లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు.[1] తరువాత దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన జరగలేదు. 1982లో డేనియల్ గెబావర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి, పరిశీలించింది. బెలూం గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయటి ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి రామస్వామిరెడ్డి, చలపతిరెడ్డి, మద్దులేటి అనే ముగ్గురు స్థానికులు సహకరించారు. 1988లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రక్షిత స్థలంగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి నుంచి బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు.[4].అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు.
గుహల అభివృద్ధి, విశేషాలు
[మార్చు]సహజత్వానికి లోపం రాకుండా బెలూం గుహల అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి, భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటుచేశారు . గుహల్లోపల ఫౌంటెన్, కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. 2002లో బెంగళూరులో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్ ఫెయిర్లో బెలూం గుహలు అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా నిలిచాయి.[5] గుహల అభివృద్ధికి గానూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు 2003లో భారత ప్రభుత్వం నుంచి నేషనల్ టూరిజం పురస్కారం లభించింది.
బెలూం గ్రామ సమీపంలో గల చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలకు దిగుడు బావి వంటి మూడు దారులు ఉన్నాయి. మధ్యలో ఉన్న దారి గుహల్లోకి ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతోంది. ఈ గుహల్లోకి వెళ్లేదారి బిలంలా ఉంటుంది. దాంతో వీటిని బిలం గుహలుగా పిలిచేవారని, అదే పేరు కాలక్రమంలో బెలూం గుహలుగా మారిందని భావిస్తున్నారు. బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను 'స్టాలక్ టైట్' లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను 'స్టాలగ్ మైట్' లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంలో ముంచుతుంది.
చారిత్రక ప్రాముఖ్యత
[మార్చు]ఈ గుహల్లో ప్రచీన కాలంలో జైన, బౌద్ధ భిక్షువులు నివసించేవారనడానికి ఆధారాలున్నాయి. ఇక్కడ లభ్యమైన బౌద్ధమత అవశేషాలను అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారు. బౌద్ధశకానికి పూర్వం నాటి పాత్రలు కూడా లభించగా అవి సా.పూ.4500 నాటివని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) గుర్తించింది.
జీవశాస్త్ర విశేషాలు
[మార్చు]అంధ్రాకాయిడ్స్ వర్గానికి చెందిన ఒక కొత్త ఆంత్రపాడ్ను పాతాళగంగ చేంబర్లో గుర్తించారు. కంటికి కనపడని ఈ చిన్న జీవికి అంధ్రాకాయిడ్స్ గెబావరి అనే పేరు పెట్టారు.[6]
గుహల్లోని ముఖ్య భాగాలు
[మార్చు]- సింహద్వారం - శిలాస్ఫటికాలతో సహజంగా ఏర్పడిన సింహం తల ఆకారంలోని తోరణం
- కోటిలింగాల గది - ఇక్కడ వేల కొద్దీ శిలాస్ఫటికాలు శివలింగాల ఆకృతిలో ఏర్పడి చూపరులను అబ్బురపరుస్తాయి. గుహ పైకప్పు నుంచీ, కింద నుంచీ పరిగిన శిలాస్ఫటికాలు కలుసుకుని ఏర్పడి స్తంభం ఒకటి ఇక్కడ ఉంది.
- పాతాళగంగ - ఇది నిత్యం ప్రవహిస్తూ భూగర్భంలోకి వెళ్ళిపోయే చిన్న ఏరు. ఇది ఆగ్నేయం నుంచి వాయువ్య దిశకు ప్రవహిస్తుంది. గుహలకు 2 కి.మీ దూరంలో ఉన్న బెలూం ఊరులోని ఒక బావి వద్దకు ఈ పాతాళగంగ ప్రవహిస్తుంది అని నమ్మిక.
- సప్తస్వరాల గుహ - ఇక్కడి శిలాస్ఫటికాలని కర్రతో కాన్నీ వేళ్ళతో కానీ మీటినప్పుడు సంగీతం లాగా వినిపిస్తుంది. దీన్ని 2006లో పర్యటకులకు అందుబాటులోకి తెచ్చారు.[7]
- ధ్యానమందిరము - ఇది ప్రవేశద్వారం దగార్లో ఉంటుంది. ఇక్కడి ఒక ఆసక్తిదాయక అంశం తలగడతో పాటు ఉన్న మంచం ఆకారం. ఇక్కడ ప్రాచీన కాలంలో ఋషులు ఉండేవారని స్థానిక కథనం. ఈ ధ్యానమందిరాన్ని బౌద్ధ భిక్షువులు ఉపయోగించేవారు. అప్పటి అవశేషాలు ఎన్నో ఇక్కడ లభ్యం కాగా అవి ఇప్పుడు అనంతపురంలోని మ్యూజియంలో ఉన్నాయి.
- వేయిపడగలు - ఇక్కడి శిలాస్ఫటికాల కూర్పు నాగుపాము పడగను తలపిస్తుంది. పైకప్పు నుంచి వేలాడే శిలాస్ఫటికాలు వేల నాగుపాములు పడగలు విప్పాయా అన్నటు ఉంటాయి.
- మర్రిచెట్టు గది - ఈ ప్రదేశం ఒక పెద్ద స్తంభంతో, పైనుంచి వేలాడే శిలాఫటికాలతో ఉండి, ఊడల మర్రిని తలపిస్తుంది.
- మండపం - గుహల్లోని ఈ ప్రదేశం విశాలంగా, పక్కన శిలాస్ఫటికాలతో ఉంది ఒక మండపాన్ని తలపిస్తుంది.
ప్రయాణం
[మార్చు]బెలూం గుహలు కర్నూలు కు 109 కిలోమీటర్లు, హైదరాబాద్ కు 336 కిలోమీటర్లు, బెంగుళూరు కి కూడా 292 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నంద్యాలకు 67 కిలోమీటర్లు, తాడిపత్రికి 32 కిలోమీటర్లు, జమ్మలమడుగుకు 47 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బెలూం గుహలు చేరుకోవాలి అంటే కర్నూలు, నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు మీదుగా రోడ్డుమార్గం ద్వారా వెళ్లవచ్చు. రైలు ప్రయాణం ద్వారా అయితే తాడిపత్రి రైల్వే స్టేసన్ లో దిగి , అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. బెలూం గుహలు సందర్శించాక సమీపంలోని యాగంటి, బుగ్గ క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు.
సమీప ప్రాంతాలు
[మార్చు]బెలుం గుహల సమీపంలో కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహ స్వామి గుడి అనే సందర్శక ప్రదేశం ఉంది. ఇది చుట్టూ మెట్లతో నిర్మించిన పాలరాతి కట్టడం.
బెలూం గుహల అందాలు
[మార్చు]- బెలూం గుహల్లోని లోపలి దృశ్యాలు
-
బుద్ధుని విగ్రహం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "చూడాల్సిన బెలూం గుహలు | Prajasakti::Telugu Daily". web.archive.org. 2019-11-02. Archived from the original on 2019-11-02. Retrieved 2019-11-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Real location of the bloody feud in 'Rakta Charitra'". OnManorama. Retrieved 2018-08-31.
- ↑ "Underground adventure in Belum caves". Deccan Herald. 27 January 2008. Archived from the original on 2 June 2008.
- ↑ "Belum or Belgam Caves". web.archive.org. 2019-10-25. Archived from the original on 2019-10-25. Retrieved 2019-11-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Belum caves bag prestigious award". The Times of India. 18 January 2003.
- ↑ [1] new species
- ↑ Educationworldonline.net