బైబిల్ వ్యతిరేక పత్రికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని సారవంతం చేసుకోవడానికి మెత్తటి మట్టి కోసం నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో 13 పేపిరస్ (Papyrus) తో తయారుచేయబడిన పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. కోప్టిక్ (Coptic) అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి క్రీస్తు శకం 350 కి, క్రీస్తు శకం 400 సంవత్సరాల మధ్య వ్రాయబడినవని పరిశోధకుల ఊహ.ణే

ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంథానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తుకు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ మరణం అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరితో వివాహం అయ్యిందని, వివాహాన్ని పరిత్యజించి జీవితమంతా కన్యలుగా లేదా బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. ఇవి అన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుధ్దం. కనుక ఈ గ్రంథాలు చర్చివారిచే ఆమోదింపబడని (Rejected) క్రైస్తవ గ్రంథాలుగా మిగిలిపోయాయి.

కొడెక్స్ 1

[మార్చు]

అపోస్తలుడైన పౌలు ప్రార్థన: (Prayer of Apostle Paul) సుమారు 40 లైన్లలో వ్రాయబడిన ఈ ప్రార్థన రక్షకుడిని పిలుస్తున్నట్లుగా ప్రారంభించబడుతుంది. రెండవ భాగంలో పౌలు దేవుడిని "ఉన్న, పూర్వమందున్న నీవు" అని దేవుడిని పిలుస్తాడు. ఇందులో "ఆన్ని నామములకంటే పైనున్న నామము" అనేది ఫిలిప్పీయులు 2:9 నుండి గ్రహించబడింది. అపోస్తలుల ప్రత్యేక హక్కుని సూచిస్తున్నట్లుగా వేడుకొనేవాడు అధికారాన్ని అడుగడం ఉంటుంది. ఈ థీమ్ బ్రతిమలాడుకొనేవాడు దేవుని బహుమతులు అడిగినట్లుగా ఉండే 15 వ పంక్తికి చెందినట్లుగా ఉంటుంది.

యాకోబు రహస్య పత్రిక (Secret book of James) : ఏసుక్రీస్తు తన శిష్యులకు రహస్యంగా ఉపన్యాసం ఇచ్చినట్లుగా ఈ పుస్తకంలో వ్రాయబడి ఉంది. యాకోబు (James/Jacob) రహస్య పత్రిక ఏసుక్రీస్తు సోదరుడైన యాకోబు ఒక వ్యక్తికి వ్రాసినట్టుగా చూస్తాం. ఈ వ్యక్తి పేరు కాలక్రమేణా చెరిగిపోయింది. మోక్షం పొందడానికి దేవుని రాజ్యం గురించిన విజ్ఞానం కోసం ఆత్మ పరిపూర్ణంగా ఉంచుకోవటంలో ప్రాముఖ్యత గురించి ఏసు క్రీస్తు మాట్లాడుట ఉంటుంది. యాకోబు దైవబోధ కొరకై తన అపోస్తలలు (Apostles) ను పంపి తాను యెరూషలేము (Jerusalem) వెళ్ళతాడు. ఈ పత్రికలో పేతురు రెండవ స్థానం ఇవ్వబడ్డాడు.

నిజ సువార్త (Gospel of Truth) క్రీస్తు శకం 140 కి క్రీస్తు శకం 180 కి మధ్య వియత్నాం నాస్టిక్స్ చే వ్రాయబడింది. దీన్ని సువార్తగా కాక ఉపదేశంగా చెప్పవచ్చు. ఈ పుస్తకం ఏసు క్రీస్తు జననం, మరణం, పునరుద్దానం గురించి చెప్పదు. భౌతిక ప్రపంచం నుండి విముక్తి ప్రసాదించడానికి జ్ఞానాన్ని తెలియపరచడం ద్వారా ఏసుక్రీస్తు ఇచ్చిన రక్షణ సువార్త గురించి చెబుతుంది.

పునరుద్ధాన ప్రబంధం: క్రీస్తుశకం 179 నుండి 200 మధ్య వ్రాయబడిన పునరుద్దాన ప్రబంధం (Treatise on Resurrection) లో అనువాదకుడైన మాల్కమ్ ఎల్ పీల్ (Malcom PL) ప్రక్రారం మరణించిన వెంటనే ఆత్మీయ మంసంతో కూడిన ఆత్మీయ శరీరం పైకి వెళ్ళడం ద్వారా విశ్వాసికి ఆత్మీయ పునరుద్ధానం కలుగుతుందని వ్రాయబడియుంది. ఇది పూర్తి వ్యాహృతి సంబంధమైన సిద్ధాంతం.

త్రివిధ సిద్ధాంతం (Tripartite Tractate) ఏయోన్స్ (Aeons), కుమారుడు గురించి చెబుతుంది. ఇది మూడు భాగాలుగా విభజించబడిన ఈ పుస్తకం తండ్రి యొక్క నిశ్చయం, నరరూపియైన దైవశక్తి యొక్క ఇష్టత, మానవాళి సృష్టి, చెడు, మనిషి యొక్క పతనం, వివిధ తత్వాలు, మానవాళిని మూడు భాగాలు చేయడం, రక్షకుని కార్యాలు, రక్షించబడిన వారు పైకి పయనించడం వంటివి ఉంటాయి.

కోడెక్స్ 2

[మార్చు]

ఫిలిప్పు సువార్త: క్రీస్తు పరిశుద్ధ పురుషుడని, వివాహం చేసుకోలేదని క్రైస్తవులు నమ్ముతారు. కాని ఫిలిప్పు సువార్త (Gospel of Philip) లో ఉన్న 42 వ వచనంలో మరియ మగ్దలీనను ఏసుక్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకున్నట్లుగా వ్రాయబడింది. అందు వల్ల రోమ్ చర్చి వారు ఈ పుస్తకాన్ని నిషేధించారు. క్రైస్తవేతరులు ఏసుక్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నాడని దుష్ప్రచారం చేశారు. ఈ సువార్త ఆధారంగా తీసిన "డా విన్సీ కోడ్" అనే ఆంగ్ల సినిమాను కొన్ని క్రైస్తవ దేశాలలో నిషేధించడం జరిగింది.

పూర్తి వ్యాసమును ఫిలిప్పు వ్రాసిన పత్రికలో చదవండి.

తోమా సువార్త: యేసు క్రీస్తు జీవిత చరిత్రను తెలిపే సంప్రదాయ సువార్తల వలె కాకుండా తోమా సువార్త (Gospel of Thomas) లో మాత్రం యేసుక్రీస్తుకు చెందిన సూక్తులు (Logions) 114 ఉంటాయి., ఒక్కొక్కసారి చిన్న మాటల్లోగాని లేదా ఉపమానాలు గాని ఉంటాయి. ఇందులో 65 వ సూక్తి [1]లో యజమాని కుమారుడు (ఉపమానంగా క్రీస్తు) మరణించినట్లుగా వ్రాయబడియుంది.

ఆర్కానుల తత్వం (The Hypostasis of the Archons ) పుస్తకం బైబిలు ఆదికాండం 1:6 ను వివరించేవిధంగా ఉంటుంది. ఇందులో ఆదాము ఆవ్వల కుమారులైన సెత్తు (Seth), ఏబెలు (Abel), కయీను (Cain), కుమార్తె అయిన నోరియా (Norea), యల్దాబోతు (Yaldaboath) రాజు, మానవ స్త్రీ రూపమైన సోఫియా (Sophia) వంటి పాత్రలున్నాయి. కొద్దిగా దేవతకు ప్రసంగీకుడికి మధ్య జరిగే దివ్యవార్త. ఇందులో ఆదాము నుండి ఆవ్వ సృష్టించబడి, ఆదాము ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం, మరల అవ్వ ఆదామును లేపడం వంటివి ఉంటాయి. ఆర్కానులు అనగా గ్రీకు భాషలో పరిపాలించేవారు అని అర్ధము. ఒక విధంగా చీఫ్ మెజిస్ట్రేట్ అని అర్ధము.

సృష్టి మూలాలు (On origins of the world) పత్రిక బైబిల్ ఆదికాండం (Genesis) కథను తిరిగి వ్రాసినట్టు ఉంటుంది. ఆదికాండంలో యెహోవా దేవుడు నిర్వర్తించే పాత్రను ఈ పత్రికలో యల్దాబోతు అను సృష్టికర్త నిర్వర్తిస్తాడు. ఏధేను తోట (Garden of Eden) లో మానవాళిని వెలుగువైపు మళ్ళించడానికి ఒక సర్పాన్ని సోఫియా దేవత పంపినట్లు ఉంటుంది.

ఆత్మ వ్యాఖ్యానము (The Exegesis on the Soul) ప్రకారం -- ఆత్మ స్త్రీస్వరూపాన్ని పోలియుంది. ఆమె తన తండ్రితో ఉన్నంతకాలం స్త్రీపురుష లక్షణాలున్న కన్య. ఆమె ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత ఆమె దొంగలచే పట్టబడి కన్యత్వాన్ని కోల్పోయింది. ఫలితంగా చిక్కిపోయిన పిల్లలకు జన్మనిచ్చింది. కాని ఆమె పశ్చాతప పడటం చూసిన తండ్రి ఆమె గర్భాన్ని మరల బయటనుండి లోపలికి పంపి ఆమెకు బాప్తిస్మమిచ్చి పరిశుద్ధపరచాడు. ఆ తర్వాత తండ్రి ఆమె వద్దకు ఆమె సోదరుడినే క్రీస్తు పెళ్ళి కుమారుడి రూపంలో పంపాడు. ఆమె తన గదిలో భర్తకోసం ఎదురుచుస్తుంది. కాని ఆమె పతనం తర్వాత గతాన్ని మరచిపోయినందున తన సోదరుడినే వివాహమాడినట్లు గుర్తించలేకపోయింది. క్రమేణా ఆత్మ సోదరభర్తను గుర్తించింది. ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనడానికి తన భర్తనుండి జీవాత్మ విత్తనాన్ని సాధిస్తుంది. తర్వాత ఆమె పునరుద్ధానం ద్వారా, అనగా అజ్ఞానం నుండి తన తండ్రి వద్దకు వెళ్తుంది.

తోమా పుస్తకం - ది కంటెండర్ : (The Book of Thomas the Contender) పునరుద్ధానుడైన ఏసుక్రీస్తుకు, కవల సోదరుడైన యూదా తోమాకు జరిగిన సంభాషణ తెలుపుతుంది. దీన్ని ఏసుక్రీస్తు ఆరోహణముందు మాథియాస్ (ఒక అపోస్తలుడు) జ్ఞాపకంగా వ్రాసినట్లుగా ఉంది. యేసు క్రీస్తు శక్తిపై నమ్మకం లేదా యజ్ఞాల ద్వారా కాకుండా యేసుక్రీస్తు యొక్క రహస్య విజ్ఞానం ద్వారా ఆత్మ పరిపూర్ణత పొందుట మేలు అని చెప్పడంలో ఈ ప్రతి నాస్టిక్ విధానం కలిగియుంటుంది. మంసాహారాన్ని విడిచిపెట్టి వివాహ బంధాన్ని జయించే సిద్ధాంతాన్ని చెప్పే ఇందులో ఏసుక్రీస్తు బోధనలు శరీరం గురించి కాకుండా ఆత్మీయ జ్ఞానోదయం గురించి ఉంటుంది.

కొడెక్స్ 3

[మార్చు]

ఐగుప్తుల సువార్త : ఈ సువార్తకు కనిపించని మహా ఆత్మ పుస్తకం (The Holy Book of the Great Invisible Spirit లేక Gospel of Egyptians) అని పేరు. ఐగుప్తుల సువార్తలో భూమి ఎలా ఉద్భవించింది, ప్రజల ఆత్మలను దుష్ట జైలు నుండి విడిపించుటకు సెత్తు ఎలా ఏసు క్రీస్తు అవతారమెత్తాడు వంటివి ఉంటాయి. ఇవేకాక హల్లుల క్రమం లేని విచిత్రమైన కీర్తనలు ఉన్నాయి.

ఏసుక్రీస్తు సోఫియా (Sophia of Jesus Christ) పునరుధానుడైన ఏసుక్రీస్తు తన శిష్యులు, మేరీ మగ్ధలీనతో మాట్లాడిన సన్నివేశాన్ని తెలుపుతుంది. సోఫియా అనగా జ్ఞానమునకు దేవత.

ఆశీర్వదింపబడిన యుగ్నోస్తోసు (Eugnostos the Blessed) ప్రతిలో ఎటువంటి క్రైస్తవ థీమ్స్ లేవు. సాదాగా గోప్యమైన సృష్టి శాస్త్రాన్ని చెబుతుంది. ఏసుక్రీస్తు సోఫియా ప్రతిని పోలియున్న ఈ ప్రతి క్రైస్తవులకు ఒక ఉత్తరమని చాలా మంది భావించారు. దేవునికి పుట్టుక లేదు, పుట్టక ఉన్న ప్రతివాడును మరణించును; ఆది వున్న ప్రతివాడును అంతముండును కనుక దేవుడు ఆదిలేని వాడై జన్మినివ్వబడలేదు; పేరు ఉన్న ప్రతివాడును మరో సృష్టియగును కనుక, దేవుడు పేరు లేని వాడై యుండెను; ఆయన నామకరణము చేయుటకు వీలుకానివాడు; ఆయనను విశ్వానికి తండ్రి యని అనబడును; ఆయనకు మనుష్య రూపము లేదు ... అని ఈ ప్రతి మొదలవుతుంది.

రక్షకుని సంభాషణ (The Dialogue of the Savior) పుస్తకంలో ఏసుక్రీస్తుకు, మత్తయికు, మగ్ధలేని మరియకు, మరియూ యూదాకు మధ్య - పరిపూర్ణ జ్ఞానం ద్వారా రక్షణ పొందడం గురించిన సంభాషణ ఉంటుంది. ఆత్మకు భౌతిక శరీరం, బాహ్య ప్రపంచం అనేవి చెరశాల వలే ఉంటాయని, అవి స్త్రీల క్రియలను విసర్జించే కష్టతరమైన మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే స్పష్టమవుతాయని ఏసుక్రీస్తు చెప్పినట్లు వ్రాయబడింది. మగ్ధలేని మరియ క్రీస్తు బోధనలను సంపూర్ణంగా అర్ధం చేసుకున్న మహిళగా చెప్పబడింది. స్త్రీల క్రియ అనగా సంభోగం, సంతానాన్ని ఉత్పత్తి చేయడం వంటి పరిత్యజించుట ద్వారా పుట్టుక-చావుల చక్రం నుండి తప్పించుకొని నిత్యజీవంలోకి ప్రవేశించవచ్చని అర్ధం ఇచ్చుచున్నది.

కొడెక్స్ 4

[మార్చు]

ఐగుప్తుల సువార్త (Gospel of Egyptians) : ఈ పత్రికలో యోహాను పత్రిక వలె ఆటొజెనెస్ (రక్షకుని మారు పేరు), ఇతర నాలుగు కాంతులైన హార్మోజెల్ (ఒక లోకం), ఒరాయేలు (క్రీస్తు, సెత్ ఉండే లోకం), డావిత్ (సెత్ కుమారుల లోకం), ఎలెలెత్ (కుమారుల అత్మలుండే లోకం) గురించి వ్రాయబడింది. ఆడమాసు యొక్క కుమారుడు సెత్తు తన విత్తనాన్ని డేవితెలో విత్తుతాడు. సెత్ సంతానం శక్తులు, దేవతలచే హింసించబడినప్పటికీ విస్తరించింది. ఆఖరిలో ఏసుక్రీస్తుకు శిలువ వేసి తద్వారా పదమూడు ఏయాన్స్ ను మేకులచే సిలువవేస్తాడు. ఇందులో సెత్ తనకు చెందినవారికి జ్ఞానాన్ని రక్షించే రక్షకునిలా కనిపిస్తాడు. అతనే క్రీస్తులా భావించబడ్డాడు.

కోడెక్స్ 5

[మార్చు]

పౌలు ప్రకటన (Apocalypse of Paul) చూడడానికి పేతులు ప్రకటన (Apocalypse of Peter) ను వస్తరించినట్లుగా ఉంటుంది. పరలోకాన్ని తెలుపడం, తర్వాత నరకాన్ని తెలుపడం వంటివే కాకుండా మనుష్య పాపాలకు వ్యతిరేకంగా దేవుడికి మొరపెట్టుకోవడం తెలిపే ప్రస్తావన ఉంటుంది. దుష్ణుల మరణాన్ని, మంచివాళ్ళ పై తీర్పును కళ్ళారా చూడడానికి పేతురు నరకంలో పరలోకాన్ని, నరకాన్ని దర్శించే సన్నివేశం ఉంటుంది. ఇందులో "గర్వం సర్వనాశనానికి మూలం", పరలోకం పాలు తేనె ప్రవహించు దేశం", "దుర్మార్గుల కొరకు నరకానికి అగ్ని, మంచు నదులుంటాయి", "ఈ ప్రకటన పేతురు ప్రకటను విశదీకరిస్తుంది", టెమెలుఛస్ తో సహా నరకలోకపు చీకటి దేవదూతలతో సహా కొన్ని దేవదూతలు చెడ్డవి" అనే నీతి వాక్యాలుంటాయి.

యాకోబు మొదటి ప్రకటన (First Apocalypse of James ) పత్రిక యేసుకు అతని సోదరుడైన యాకోబు (జస్ట్) కు మధ్య జరిగిన సంభాషణ గురించి వ్రాయబడింది. ఇందులోని మొదటి భాగంలో అర్ధంకాని శిలువయాగం గురించి, రెండవ భాగంలో మరణం తర్వాత డెమ్ ఐ అర్జ (Demiurge) శక్తులచే అడ్డగింపకుండా స్వర్గంలో 72 ఆకాశాల్లో ఎత్తైన ఆకాశానికి చేరడానికి యాకోబుకు ఏసుక్రీస్తు సాంకేతిక పదాలను చెప్పినట్లుగా వ్రాయబడింది.

యాకోబు రెండవ ప్రకటన (Second Apocalypse of James ) పుస్తకానికి నాస్టిక్ లక్షణం ఉన్నప్పటికీ ఇందులో క్రైస్తవ యూదుల థీమ్స్ ఉన్నాయి. ఇది యాకోబు మొదటి ప్రకటన కంటే ముందు కాలంలో వ్రాసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఇందులో యాకోబు తండ్రి యోసేపు బదులు ధూడాస్ గా వ్రాయబడింది. థూడాస్ భార్య మేరీగా చెప్పబడింది. యాకోబు, ఏసుక్రీస్తు రక్తసంబంధీకులు కారని వ్రాయబడింది. ఫిలిప్పు సువార్తలో ఏసుక్రీస్తు మరియను ముద్దు పెట్టుకున్నట్లుగా ఇందులో ఏసుక్రీస్తు యాకోబును ముద్దు పెట్టుకున్నట్లుగా వ్రాయబడింది. , ఏసు నా పెదాలను ముద్దాడాడు. నన్ను పట్టుకొని "నా ప్రియుడా! ఇదిగో, నేను నీకు పరలోకము గాని దేవతలు గాని తెలియజెప్పని విషయాలు చెబుతాను. ఇదిగో, నేను నీకు సమస్తాన్ని చెబుతాను, నా ప్రియుడా. ఇదిగో నేను నీకు దాచబడియున్నది చెబుతాను. కాని ఇప్పుడు, నీ చెయి చాపుము. ఇప్పుడు నన్ను పట్టుకొనుము అని ఏసుక్రీస్తు యాకోబుతో చెప్పినట్లున్నది.

అదాము ప్రకటన (Apocalypse of Adam) అనగా 700 సంవత్సరాల వృద్ధుడైన ఆదాము తన కుమారుడైన సెత్తుకు బోధించిన ప్రవచనాలు. ఈ పుస్తకంలో ఆదాము తన భార్యయైన ఆవ్వనుండి నిత్యదేవుని అక్షర జ్ఞానాన్ని నేర్చుకున్న విధానం, సృష్టికర్తకంటే శక్తిమంతులుగా ఉన్నట్లు, ఉప సృష్టికర్త ఆదాము అవ్వలను వేరు చేయడంతో వారు జ్ఞానాన్ని కోల్పోయినట్టు వ్రాయబడింది. ముగ్గురు అపరిచితులు (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కావచ్చును) సెత్తు జన్మకు ఎలా కారణమయ్యారు, అద్భుత జ్ఞానం మళ్ళీ సాధించుకున్న విధానం ఆదాము తన కుమారుడైన సెత్తుకు చెబుతాడు. ఉప సృష్టికర్త మహా జలప్రళయ ప్రవచనం (great Deluge) తో సహా మానవాళిని నాశనం చేయడానికి ప్రయత్నం, అగ్నితో నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడని, అప్పుడు ఆఖరిలో ప్రకాశవంతుడు వస్తాడని, వచ్చిన పిమ్మట పదమూడు సామ్రాజ్యాలు పదమూడు రకాలుగా ప్రకాశవంతుని గురించి కథలు గురించి వాగ్వివాదమడుతారని, కాని రాజు లేని తరమే నిజాన్ని విప్పుతుంది అని సెత్తుతో తండ్రియైన ఆదాము ప్రవచిస్తాడు.

కోడెక్స్ 6

[మార్చు]

పేతురు, అపోస్తలుల కార్యాలు (The Acts of Peter and the Twelve Apostles) పుస్తకంలో బైబిల్ మత్తయి సువార్త 13: 45 - 46 లో ఉన్న ముత్యం ఉపమానం వంటి కథ ఉంటుంది. సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన పేతురు, అపోస్తలులు సముద్రగట్టు వద్ద ముత్యాలు అమ్ముకునే లితార్గొయల్ (Lithargoel) అవే వ్యక్తిని కలుస్తారు. ధనవంతులచే వెలివేయబడిన ఆ వ్యక్తి వద్దకు పేదలు గుంపులుగా వచ్చి ముత్యము అతని పట్టణమైన తొమ్మిది ద్వారాలలో దాచబడిందని తెలుసుకుంటారు. దాన్ని కనుగొనాలనుకొనేవారు తొమ్మిది ద్వారాలకు కష్టమైన కాలినడకన ప్రయాణానికి సిద్ధమవుతారు. ఆఖరిలో లితార్గొయల్ అపోస్తలులకు యేసుగా ప్రత్యక్షపరచుకుంటాడు.

మెరుపు, చక్కనైన ఆలోచన (Thunder – The perfect Mind) : ఇది ఏకపాత్రాభినంలో సాగే ఒక కావ్యం. ఈ కావ్యంలో రక్షకుడు (లేక రక్షకురాలు) స్త్రీలింగపు దైవత్వం గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కనిపిస్తుంది. "నేను భార్యను, కన్యను; నేను తల్లిని, కూతురిని; నేను గొప్పగా వివాహం చేసుకొన్న దానను కాని నేను భర్తను ఎంచుకోలేదు ; నేను వధువుని మరియూ వరుడుని; నేను అర్దంకాని మౌనాన్ని, ఎప్పుడూ ఉండే ఆలోచనని; నేను శబ్దం పలురకాలుగా ఉండే మాటను, పలురకాలుగా కనిపించే పదమును; ఎందుకనగా నేను విజ్ఞానమును, అజ్ఞానమును; నేను సిగ్గును, ధైర్యమును; నేను సిగ్గరికత్తె, సిగ్గు పడుదానను; నేను బలమును భయమును; నేను యుద్ధమును శాంతియును; కాని నేను ప్రేమగలిగినదానను క్రూరమైనదానను; కాని నేను అన్ని భయాల్లోను, బలంలోను ఉన్నదానను; ..." ఇలా రెండు విధాలుగా వ్రాయబడివుంది.

అధికారిక ఉపదేశము (Authoritative Teaching) లో ఆత్మ యొక్క జీవితం, దాని మూలం, స్థితి, శ్రమ, గమ్యం, నిత్య మోక్షము గురించి ఉపమానాలు ఉంటాయి. ఇది క్రీస్తు శకం 150 - 255 మధ్య వ్రాయబడింది.

మన మహా శక్తి తలంపు ( The concept of our great power ) అనే ప్రతిక రక్షణ యొక్క చరిత్ర, 'మన గొప్ప శక్తి' అనే సృష్టికర్త గురించి చెబుతుంది. ఇందులో "ఎవరికైతే గొప్ప శక్తి ఎరుగునో, వారు జయించరానివారై యుందురు, వానిని అగ్ని కాల్చివేయదు" అని వ్రాయబడి ఉంది.

తాపసి గోష్ఠి (The Discourse on the Eighth and Ninth ) : ఈ పత్రిక ఒక తాపసి తన కుమారుడికి ఇచ్చే ఉపదేశము. హెర్మెస్ ట్రైస్మెజిస్టస్ ( Hermes Trismegistus) మొదటి ఏడు గ్రహాలను పొందిన కుమారుడికి స్థిర నక్షత్రాలుండే 8 వ ఆకాశం యొక్క రహస్యాలు చెప్పి ఆ తర్వాత 9 వ లోకమైన దేవలోకం గురించి చెబుతాడు. కుమారుడు మొదటగా తన జ్ఞానంతో తెలుసుకొని తనను తాను పరిశుద్ధ పరచుకుంటాడు. హెర్మెస్ ఆ తర్వాత కుమారుడిని 'చెప్పిన బోధనను హీరోగ్లైఫిక్ అనే ఈజిప్టు లిపిలో వ్రాయమని ఆజ్ఞాపిస్తాడు.

కృతజ్ఞతా ప్రార్థన (Prayer of Thanksgiving ) లో ఎవరో ఒక వ్యక్తి దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. అందులో ఆఖరి పంక్తిలో "మిమ్మల్ని పొందిన మనిషి యొక్క కృతజ్ఞత ఒక్కటే: మాకు మీరు తెలుసు. చిన్మయ కాంతియైన మీరు మాకు తెలిసియున్నారు, జీవానికి జీవమా, మిమ్మల్ని మేము ఎరుగుదుము. ప్రతి ప్రాణి యొక్క గర్భమా, మీరు మాకు తెలిసియున్నారు. కన్న తండ్రి యొక్క శాశ్వతమైన సంస్కారమా, అందుకు మీయొక్క దేవతను మేము సేవించియున్నాము. మేము అడిగేది ఒక విన్నపం: మేము జ్ఞానంలో నిలిచియుందుము. మేము కోరే ఒక రక్షణ: ఈ రకమైన జీవితంలో మేము తొట్రిల్లము." వారు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఒకరినొకరు కౌగలించుకొని రక్తములేని పరిశుద్ధ ఆహారం తీసుకోవాడానికి వెళ్ళారు.

ఎస్కిలిపియస్ చట్టాలు 21 - 29 (Laws of Asclepius 21-29) : ఎస్కిలిపియస్ అనగా గ్రీకు పురాణంలో ఆయుర్వేదానికి దేవుడు. ఇతడు వ్రాసిన చట్టాలలో 21 నుండి 29 వచనాలు ఇలా ఉన్నాయి. "వారిలో రహస్యానికి సంబంధించిన జ్ఞానము లేకపోవుట వలన దుష్టత్వము కలిగియున్నారు. రహస్యానికి చెందిన జ్ఞానము నిజముగా భౌతికమైన కోరికలనుండి విడుదల చేస్తుంది. కనుక నేర్చుకోవడం అనేది విజ్ఞానానికి చెందినది. అజ్ఞానము ఉంటే మనిషి ఆత్మలో నేర్చుకోవడం అనేది ఉండదు, అప్పుడు ఆత్మలో నయంకాని కోరికలు పుడతాయి. అధనంగా వారిలోకి దెయ్యములు మానని పుండు రూపంలో వస్తాయి. ఆ పుండు అదేపనిగా ఆత్మ వైపు అరవగా, తద్వారా ఆత్మ చెడు పురుగులను ఉత్పత్తి చేస్తుంది. కాని దేవుడు మనుష్యులకు విజ్ఞానమును బోధను ఇచ్చాడు కనుక ఈ విషయాలకు కారణం కాదు. మొదటినుండి చెప్పిన ఈ విషయాలకు సంబందించి, కోరికలకు, చెడులకు దూరంగా ఉండేలా మనుష్యులను దేవుడు పఠిష్టపరిచాడు. మనిషి మృత్యత్వాన్ని అమరత్వంలోనికి ప్రవేశపెట్టాడు; నేను చెప్పినట్లుగా మనిషి మంచిగా మారాడు. ఎందుకనగా దేవుడు అతనికి అమరత్వం, మృత్యత్వం అను రెండు లక్షణాలు ఇచ్చాడు"

కొడెక్స్ 7

[మార్చు]

షెమ్ భాష్యము (Paraphrase of Shem) : ఈ పత్రికలో నోవాహు పెద్ద కుమారుడైన షెమ్ (Shem) యొక్క పైకి పయనం, భూమ్మీదికి దిగిరావడం వంటివి ఉంటాయి. ఇంతేకాకుండా జలప్రళయం, మృత సముద్రం ఒడ్డున ఉన్న సొదొము నగర వినాశనం, బాప్తిస్మము, రక్షకుని పునరుద్దానం వంటివి కూడా ఉన్నాయి.

గొప్పవాడైన సెత్ రెండవ ప్రబంధం (Second Treatise of the Great Seth ) అనేది నాగ్ హమ్మడికి చెందిన ఏడవ రాతప్రతిలో లభ్యమైన పుస్తకం. ఇది మూడవ శతాబ్దానికి చెందినది. దీన్ని వ్రాసిన రచయిత పేరు లభించలేదు. పుస్తక టైటిల్లో పేర్కొనబడిన సెత్ అనే వ్యక్తి పేరు ప్రబందం ఎక్కడా లేకపోవడం గమనార్హం. కొన్ని వ్రాతల ప్రకారం సెత్ అనేవాడు ఆదాము అవ్వల మూడవ కుమారుడని అనుకోవచ్చును. క్రీస్తు శిలువ వేయబడలేదని నమ్మనవారిలో ఈ పుస్తక రచయిత ఒకడు కావచ్చును. సిలువను మోసింది సీమోను అని ఏసుక్రీస్తు కాదని ఈ పుస్తకంలో వ్రాయబడింది.

పేతురు వ్రాసిన నాస్టిక్ ఎపోకలిప్స్ (Gnostic Apocalypse of Peter) క్రీస్తు శకం 100 - 200 లో వ్రాయబడింది. ఏసుక్రీస్తు శిలువ మరణాన్ని అతిశయంగా చెప్పబడినది, పరిశుద్ధులౌతామని భావించి చనిపోయిన మనిషి వైవు తిరిగే ప్రజలను చూచి ఏసుక్రీస్తు నవ్వడం, వారిని హెచ్చరించడం వంటివి ఉన్నాయి.

సిలాసు బోధనలు (Teachings of Silvanus ) : సిలాసు (Silas/Silvanus) అనగా బైబిల్ లో పౌలు సహచరుడు. ఈ పుస్తకం వ్రాసిన రచయత వివరాలు లేవు. కాని ఇందులో ఏసుక్రీస్తు జ్ఞానోదయం ద్వారా మోక్షం పొందవచ్చని ఇలా చెబుతాడు: "మీ యొక్క మార్గదర్శకుడిని, గురువుని తీసుకురమ్ము. బుద్ది మార్గదర్శకం, కాని కారణము గురువు. వారు మిమ్మును వినాశనం, ప్రమాదము నుండి రక్షించును ... మీ బుద్ధిని జ్ఞానోదయం చేసుకొనుము ... మీలోని దీపాన్ని వెలిగించుకొనుము."

సెత్ యొక్క మూడు ఫలకలు (Three Steles of Seth ) అనే ఈ పత్రిక సమరయుల నాయకుడైన నతానియేలు (దొసితియోస్ / Dositheos) కు శ్లోకాల రూపంలో ఇచ్చిన ప్రకటనలు. ఇవి మూడు ఫలకాలుగా విభజించబడినవి. మొదటి ఫలకంలో సెత్ తన తండ్రియైన గెరదమాసు (Geradamas) తో కలిసి తమ సృష్టికర్తలను స్తుతించినట్లు, రెండవ ఫలకంలో దేవుని మొదటి స్త్రీ అవతారమైన బార్బెలో (Barbelo ) ని సెత్, గెరదమాను స్తుతించినట్లు, మూడవ ఫలకంలో సెత్ వంశస్తులందరి స్వరం వినిపిస్తున్నట్లు వ్రాయబడింది.

కొడెక్స్ 8

[మార్చు]

జోస్ట్రియానోస్ (Zostrianos) : ఈ పత్రికలో జొస్ట్రియానోస్ అనే ఇరానియన్ ప్రవక్త తాను స్వప్నదర్శనంలో అందుకొన్న నాస్టికుల మహాదేవుడు చెప్పిన విషయాలను విశదీకరిస్తాడు. ఇది సెతానియన్ (ఆదాము కుమారుడైన సెత్ యేసుక్రీస్తులా అవతారమెత్తాడని నమ్మే సిద్ధాంతం) లక్షణాలున్న పత్రిక. ఇందులో "వెర్రితనము నుండి, స్త్రీతత్వము నుండి పారిపోయి పురుషతత్వమునకు చెందిన రక్షణను పొందుము. మీరు శ్రమపడుటకు రాలేదు కాని మీ బాధలనుండి తప్పించుకొనుటకే వచ్చితిరి. విడుదలకండి, మీ ఆత్మరక్షింపబడేలా మిమ్మును మీరు విడిపించుకోండి" అని జోస్ట్రియానోస్ చెప్పినట్లుగా ఉంది.

పేతురుకు వ్రాసిన ఫిలిప్పు లేఖ (The Letter of Peter to Philip) : ఇందులో ఫిలిప్పు పేతురును ఇతన అపోస్తలులతో సహా ఆహ్వానిస్తాడు. ఈ పత్రిక ఆఖలో పేతులు తన సహచరులను సువార్త ప్రకటింపబడుటకు పంపుతాడు. ఈ పుస్తక రెండవ భాగంలో ఫిలిప్పు అంగీకరించి ఒలీవ కొండపై ఇతర అపోస్తలులతో సమావేశమైనట్లు ఉంది. దీని తర్వాత అపోస్తలులు వేసే ప్రశ్నలకు క్రీస్తు సమాధానాలిస్తున్నట్లుగా ఉంటుంది. ఏయాన్స్ (aeons) లోన్న లోపము, వారి అవతారాలు, వారు ఎలా భూలోకంలోకి త్రోసివేయబడ్డారు, వారు ఎలా తిరిరి వారి లొకానికి వెళ్ళాలి మొదలైన విషయాలు సహచరులు తెలుసుకోవాలనుకుంటారు. యోహాను పత్రికలో ఉన్న కథను సంక్షిప్తంగా క్రీస్తు చెబుతాడు. సువార్తను ప్రకటించడానికి శ్రమపడైనా సరే ఆర్కానుల (archons) తో పోరాడాలని చెబుతాడు.

కొడెక్స్ 9

[మార్చు]

మెల్కెజెదెక్ (Melchizedek) : మెల్కెజెదెక్ బైబిల్ పాతనిబంధనలో ఆదికాండం 14:18-20, కీర్తనలు 110, హెబ్రీయులు 7:1-3 లో పేర్కొనబడ్డ ఒక రాజు. ఈ పుస్తకంలో మెల్చిజ్డెక్ ను తండ్రిగా, ఆత్మరూపంలో మెల్చిజ్డెక్ బాప్తిస్మం సమయంలో ఏసుక్రీస్తుని అభిషేకించినట్లుగా, ఏసుక్రీస్తును అతని కుమారుడిగా వ్రాయబడింది.

నోరియా ఆలోచన (Thought of Norea) : నాలుగు పంక్తులున్న ఈ పత్రికలో సెత్ యొక్క భార్య - చెల్లెలు అయిన నోరియా దేవుడికి పాట రూపంలో మొరపెట్టుకున్నట్లుగా ఉంటుంది. ఆడమాసును సృష్టికర్తగా పేర్కొనబడింది. ఎన్నోయా అనగా తండ్రి యొక్క ఆలోచన. నాస్టిసిజమ్ ప్రకారం తండ్రి, తల్లి, కుమారుడు అనే త్రిత్వమున్నది. నాస్టిక్ ట్రినిటీ యొక్క తల్లికి మరో పేరు ఎన్నోయా (లేక బార్బెలోస్). ఈ ఎన్నోయా పేరు ప్రస్తావించబడింది.

నిజ సాక్ష్యం (Testimony of Truth) ఘనపరచవలసిన బలిదానం గురించి వర్ణించదు., పైపెచ్చు సర్పం తరపున ఏధేను వనం కథను తెలుపుతుంది. ఇందులో సర్పం దైవజ్ఞాన దూతగా కనిపిస్తుంది. ఆదాము ఆవ్వలను జ్ఞానము సంపాదించుకోకూడదు అనే ఈర్ష్యతో ఉన్న దేవుడిని ప్రక్కన పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకోమని ఒప్పిస్తుంది.

కొడెక్స్ 10

[మార్చు]

మర్సానెస్ (Marsanes) : ఈ పత్రికలో మర్సానెస్ అను ప్రవక్త అసలైన దేవుని పుట్టుకొచ్చే నిగూఢమైన అవతారాలు వరుసగా విశదీకరిస్తాడు. దీనిని బట్టి సెతానియన్లు ఏకతావాదాన్ని అభివృద్ధిచేసుకున్నారని తెలుస్తోంది. ఇందులో మరణం తర్వాత ఆత్మీయ ప్రయాణం గురించి ప్రస్తావించబడింది. ఇది యూదుల, క్రైస్తవ సంస్కృతుల జాడ కన్పించదు.

కొడెక్స్ 11

[మార్చు]

వాలంటినస్ వ్యాఖ్యానము (Valentinian Exposition) : వాలంటినస్ రోమ్ నగరపు నాస్టిక్ తత్వవేత్త. ఇతడి భావ ప్రకటన భిన్నమైనది. వాలంటినస్ వ్యాఖ్యానము దైవశక్తుల మూలాలు, సోఫియా పతనం, ప్రపంచపు సృష్టి, వీటితో పాటూ బాప్తిస్మము, కమ్యూనియన్ ఇచ్చేవారి వేడుకలు గురించి చెబుతుంది. వాలంటినస్ అనుచరుల మధ్య తత్వసంబంధ సంభాషణలు కూడా ఉంటాయి. అయితే సోఫియా శ్రమలు వంటి ఇతరుల అభిప్రాయాలకు తావివ్వక అదేపనిగా వాలంటినస్ కల్పిత కథలను చెప్పాడని చర్చి ఫాదర్ల వాదన.

అల్లోజెనెస్ (Allogenes) : ఈ పత్రికలో వరుసగా దర్శన శక్తులు పొందిన అల్లోజెనెస్ అనే యోగి భయాన్ని, అజ్ఞానాన్ని ఎలా జయించి ఎలా దేవుడి రాజ్యం చేరవచ్చునో చెబుతాడు.

హిప్సిఫ్రోన్ (Hypsiphrone) : ఇందులో హిప్సిఫ్రోన్ అనే ఉన్నత జ్ఞానం కలిగిన కన్య జ్ఞానాన్ని రక్షించుటకు భూలోకానికి వస్తుంది. ఇది స్త్రీమూర్తి రూపంలో చెప్పే భయానకమైన భావ ప్రకటన . ఎప్పుడూ చూడలేని, ఊహంచలేని విధంగా హైప్సిఫోన్ ఆమె రక్తపు మడుగులోనే మరణం మరియూ వినాశనం గురించి పాటలు పాడుతూ స్నానం చేస్తున్నట్లు వ్రాయబడింది. ఆమె తన సోదరులకు తన కన్యత్వపు ప్రదేశం నుండి ప్రపంచంలోకి ప్రయాణించడం గురించి ప్రకటన రూపంలో చెబుతుంది. ఆ తర్వాత ఫైనాప్స్ అనే వ్యక్తితో సంభాషణ సాగిస్తుంది.

కొడెక్స్ 12

[మార్చు]

సెక్స్టస్ సామెతలు (Sentences of Sextus) : గ్రీకు తత్వవేత్త, పైథాగొరస్ అనుచరుడు అయిన సెక్స్టస్ చెప్పిన 104 సామెతలు క్రైస్తవులు కూడా ఆదరించారు. ఇవి ఫిలిప్పు సువార్త, తోమా సువార్తను పోలివుంటాయి. మచ్చుకకు కొన్ని: దైవాన్ని స్మరించుకుంటే ఆత్మ వెలుగుతుంది; అవసరమైనదానిని అవసరమవుతుంది గనుక తీసుకో; జనసమూహాన్ని సంతోషపరచానికి తొందరపడకు; దుష్టుడు నీ నుండి దోచుకెళ్ళే విలువైనదాన్ని నమ్మకు; అబద్ధాన్ని విషంలా వాడుము; నిజమువలే ఎదీ కూడా జ్ఞానము ముందు విశేషమైనది కాదు; నీవు నీ శత్రువులకు మంచి చేయగలవని కోరుకొనుము; తెలివైనవాడు దేవుడి ప్రతిబింబము

కొడెక్స్ 13

[మార్చు]

మూడు రూపాలున్న మొదటి ఆలోచన (Trimorphic protennoia ) : ఈ పుస్తకంలో ప్రొటిన్నోయా అను రక్షకురాలు తల్లి, తండ్రి, కుమారుడు అను మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. పతనమైపోయిన మానవులను రక్షించుటకు ఆమె మూడు సార్లు స్వర్గం నుండి చీకటిలోనికి వచ్చినట్లు వ్రాయబడింది. "నేనే ఉభయలింగాలను. నేను తల్లిని, తండ్రిని" అని ఆమె చెబుతుంది.

ఇతర సాహిత్యం

[మార్చు]

ఈజిప్టు రాజధాని అయిన కైరోలో1896 జనవరిన అఖిమ్ అను ప్రదేశంలో 5 వ శతాబ్దానికి చెందిన చేతి వ్రాతలు కూడిన పుస్తక బైండిగు బయల్పడింది. Papyrus Berolinensis 8502 అని కూడా పిలువబడే ఈ బైండింగులో మేరీ సువార్త, యోహాను రహస్య ప్రకటన, ఏసుక్రీస్తు సోఫియా, పేతురు కార్యాలుకి చెందిన పరిచయం ఉంది. ఈ బైండింగు తర్వాత బెర్లిన్ లో అక్కడ రాయల్ ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారికి పంపబడింది. వాటి వివరములు:

మగ్ధలేని మరియ సువార్త (Gospel of Mary) ఇది అసంపూర్ణ సువార్త. ఇందులో క్ర్రీస్తు శిష్యురాలైన మరియ మగ్ధలేని ప్రత్యేక ప్రవచన వరం ఉన్న స్త్ర్రీ. మరియ ఛాందసత్వానికి వ్యతిరేకంగా విశేషమైన రహస్య ప్రకటనకు ప్రమాణంగా నిలుస్తుంది. మరియ తన స్వజ్ఞాన స్థితి యొక్క గొప్పదనాన్ని వివరిస్తుంది. ఇందులో మగ్ధలేని మరియ ఇతర అపోస్తలులతో క్రీస్తు నుండి తాను పొందిన ప్రకటనలగురించి చెబుతుంది. అయితే ఈ సువార్త క్రీస్తు బోధనలను గాని, పరిచర్య గురించి వివరించదు. ఒక స్త్రీ వ్రాసిన క్రైస్తవ పుస్తకం ఇదొక్కటే.

యోహాను రహస్య పత్రిక ( The Apocryphon of John) : ఈ పత్రిక అపోస్తలుడైన యోహానుకు ఏసుక్రీస్తు రహస్య జ్ఞానాన్ని బోధిస్తున్నట్లుగా ఉంటుంది. జ్ఞానాన్ని బోధించిన తర్వాత ఏసుక్రీస్తు తిరిగి తాను వచ్చిన చోటికే వెళ్ళినట్లుగా రచయిత వ్రాశాడు. ఈ పత్రిక యోహాను క్రీస్తుని ప్రశ్నలు అడిగినట్లుగా, తరువారు ఏసుక్రీస్తు పరలోకానికి పయనమైనట్లుగా ఉంటుంది. ఈ ప్రారంభం 2, 3, 4 కొడెక్స్ లలో ఉంటుంది. రెండు వెర్షన్లు చిన్నగా ఉండగా మరో రెండు వెర్షన్లు పెద్దగా ఉన్నాయి. చిన్న వెర్షన్లు నాగ హమ్మడి లైబ్రరీ 3, బెర్లిన్ కొడెక్స్ లో లభ్యమవుతాయి. పెద్ద వెర్షన్లు నాగహమ్మడి లైబ్రరీ 2, 4 లో లభ్యమవుతాయి. అన్ని వెర్షన్లు కొద్ది తేడాలతో ఒకే కథ కలిగివున్నాయి. బెర్లిన్ కొడెక్స్ లో ఆదాముకు చెందిన విభాగాలు లేవు, పైపెచ్చు ఆవ్వ యొక్క కవల జో గురించి లేదు.

పేతురు కార్యం ( Act of Peter) : ఈ చిన్న కథలో పేతురు యొక్క 10 సంవత్సరాల వయసు గల కుమార్తె పక్షవాత బాధితురాలు. టొలెమీ అనే ధనికుడు పేతురు యొక్క అందమైన కుమార్తెని తన తల్లితో స్నానము చేస్తుండగా చూసి ఆమెను మోహిస్తాడు. ఇక్కడ కొంతభాగం వ్రాత పోయింది. ఆమె టొలెమీ నుండి తప్పించుకుని దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. టొలెమీకి దేవుడు దర్శనంలో ఆ బాలికను చెరచకూడదు అని, ఆమెను సోదరిలా భావించాలని చెబుతాడు. అందుకు టొలెమీ పేతురు యొక్క కుమార్తెకి కొంత భూమిని ఇస్తాడు. ఆమె వలన టొలెమీ దేవుడిచే రక్షించబడతాడు. పేతురు ఆ భూమిని, ధనాన్ని పేదలకు పంచిబెట్టడంలో కథ సమాప్తి అవుతుంది.

ఈ వ్యాసము విస్తరణలో ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-02-21. Retrieved 2012-11-21.

లంకెలు

[మార్చు]