బోలియాన్
బోలియాన్ అంటే పంజాబీలో పాడుకునే ద్విపద గేయాలు. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజులు లాంటి శుభకార్యాలలో ఇలాంటి పాటలు పాడుతూ నృత్యం చేయడం పంజాబ్ లో చాలా కాలంగా వస్తున్న ఆచారం.[1] ఇవి ఒక తరం నుండి ఇంకో తరానికి కేవలం విని నేర్చుకోవడం ద్వారానే కొనసాగుతూ వస్తున్నాయి. సాధారణంగా వీటిని ఒక మహిళ పాడుతూ ఉంటే మిగతా వారు బృందగానం చేయడం పరిపాటి. ఆడవారి మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, పరిస్థితులను వివరించడానికి ఈ కవితాత్మక శైలి ఉపయోగపడుతుంది. ఈ సంస్కృతి ఇప్పుడు భాంగ్రా పాటలతో కలిసి కేవలం ఉత్తర భారతదేశంలోనే కాక భారతదేశమంతటా, ఉత్తర అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లాంటి విదేశాల్లో కూడా ప్రదర్శితమవుతోంది. ఆర్.డి.బర్మన్ లాంటి సంగీత దర్శకులు యూకే లోని హిప్-హాప్ సంగీతాన్ని సాంప్రదాయ పంజాబీ సంగీతాన్ని మేళవించి బాణీలు కట్టడంతో ఇవి విదేశీయులను సైతం ఆకర్షిస్తున్నాయి.
సాధారణంగా మహిళలే బోలియాన్ పాటలు పాడుతూ గిద్దా నృత్యం చేస్తుంటారు. కానీ మాల్వా ప్రాంతంలో మాత్రం మగవారు కూడా వీటిని గానం చేస్తారు. అంతే కాకుండా ఈ పాటలకు భాంగ్రా నృత్యం కూడా చేస్తుంటారు.
బోలియాన్ సాంప్రదాయం పంజాబీ వాసులకు తమ పూర్వీకుల నుండి సంక్రమించింది. పూర్వకాలంలో మహిళలు తమలోని భావాల్ని, ఆవేశాన్ని బయటికి చెప్పుకోవడానికి, కొన్ని సార్లు కేవలం సరదా కోసం పాడేవారు. ఇప్పుడు అది ఒక వారసత్వంగా మారింది. ఇందులో నృత్యం చేయడానికి గ్రామీణ యువతులు ముదురు రంగులతో కూడిన దుస్తులు ధరిస్తారు. పాట పాడే ప్రధాన యువతి నిండైన గొంతుతో పాడుతుంటే దానికి డోలక్, ఘటం, చేతులతో వాయిద్య సహకారం అందిస్తుంటారు. మిగతా గాయనుల బృందం ప్రధాన గాయని పాడిన దాన్ని తిరిగి వల్లిస్తారు. బోలియాన్ వారి అడుగులకు మంచి ఊపునిస్తుంది.
కుల్విందర్ ధిల్లాన్ అనే పంజాబీ గాయకుడు ఈ బోలియాన్ పాట ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఈ పాటలను కేవలం నేర్చుకుని శిక్షణ పొందిన వారు మాత్రమే కాకుండా పామర జనం కూడా కొత్తగా సృష్టిస్తుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ Oxford Sikhs. "Lyrics and Tunes of Giddha". oxfordsikhs.com. Oxford Sikhs. Archived from the original on 3 ఆగస్టు 2016. Retrieved 4 August 2016.