భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోళీయ నిఒర్దేశాంకాలను వాడే భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థ.

భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థ అనేది ఖగోళ వస్తువుల స్థానాలను తెలిపేందుకు విస్తృతంగా ఉపయోగించే ఖగోళ నిర్దేశాంక వ్యవస్థ. దీన్ని గోళాకార లేదా దీర్ఘచతురస్రాకార నిర్దేశాంకాలలో చూపించవచ్చు. ఈ రెంటినీ భూమి కేంద్రం గానే నిర్వచిస్తారు. భూమి భూమధ్యరేఖను ఖగోళ గోళంపై పొడిగించడం ద్వారా (ఖగోళ మధ్యరేఖను ఏర్పరుస్తుంది) ప్రాథమిక తలాన్ని, వసంత విషువత్తు వైపుగా ప్రాథమిక దిశనూ నిర్వచిస్తారు. కుడిచేతి దిశను అనుసరిస్తారు. [1] [2]

మూలం భూమి కేంద్రం వద్ద ఉంటుంది అంటే దాని అర్థం ఈ నిర్దేశాంకాలు భూకేంద్రంగా ఉంటాయి అని. అంటే, భూమి పారదర్శకంగా ఉంది అనుకుంటే, అలాంటి భూమి కేంద్రం నుండి చూసినట్లు అన్నమాట. [3] ప్రాథమిక తలం, ప్రాథమిక దిశ అంటే ఈ వ్యవస్థ భూమి భూమధ్యరేఖతో ధ్రువంతో సమలేఖనంగా ఉంటుంది గానీ, భూమితో పాటు తిరగదు; నేపథ్యంలో ఉన్న నక్షత్రాలతో పోలిస్తే స్థిరంగా ఉంటుంది. కుడిచేతి దిశను అనుసరించడం అంటే నిర్దేశాంకాలు ప్రాథమిక తలం నుండి ఉత్తరం దిశ లోను, ప్రాథమిక తలం చుట్టూ తూర్పు దిశ లోనూ పెరుగుతూ పోతాయి.

ప్రాథమిక దిశ[మార్చు]

రిఫరెన్స్ ఫ్రేమ్ ఓరియెంటేషను గురించిన ఈ వివరణ కొంతవరకు సరళీకృతం చేయబడింది; ఓరియెంటేషను స్థిరంగా ఏమీ లేదు. భూమి భ్రమణాక్షపు ప్రిసెషన్ కారణంగా, కోఆర్డినేట్ వ్యవస్థ నెమ్మదిగా, నిరంతరాయంగా పశ్చిమానికి, జ్యోతిశ్చక్రపు ధ్రువాల చుట్టూ తిరుగుతుంది, ఇది సుమారు 26,000 సంవత్సరాలలో ఒక ఆవర్తనాన్ని పూర్తి చేస్తుంది. దీనితో పాటు జ్యోతిశ్చక్రపు కొద్దిపాటి చలనం, భూమి భ్రమణాక్షపు డోలనం (దీన్ని న్యూటేషన్ అంటారు) కూడా కలిసి ఉన్నాయి. [4]

గోళీయ నిర్దేశాంకాలు[మార్చు]

ఖగోళ శాస్త్రంలో ఉపయోగం[మార్చు]

ఒక నక్షత్రపు గోళీయ నిర్దేశాంకాలు రైట్ ఎసెన్షన్, డిక్లనేషన్ అనే జంట విలువలతో చూపిస్తారు. ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉన్నదో దాన్ని చూపించదు. బాగా సుదూరాన ఉన్న వస్తువుల దిశ అన్ని చోట్ల ఉన్న పరిశీలకులందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఈ దిశను అందరికీ ఒకే నిర్దేశాంకాలతో పేర్కొనడం సౌకర్యంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, క్షితిజ సమాంతర నిర్దేశాంక వ్యవస్థలో భూమి ఉపరితలంపై వివిధ పరిశీలకులు ఉన్న స్థానాలను బట్టి ఒక నక్షత్రపు స్థానం భిన్నంగా ఉంటుంది. పైగా ఇది భూ భ్రమణం కారణంగా నిరంతరం మారుతూ ఉంటుంది.

ఈక్వటోరియల్ మౌంట్‌లు, సెట్టింగ్ సర్కిల్‌లతో కూడిన టెలిస్కోప్‌లు ఖగోళ వస్తువులను చూడడానికి భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థను ఉపయోగిస్తాయి. స్టార్ చార్ట్ లేదా ఎఫిమెరిస్‌తో కలిపి సర్కిల్‌లను సెట్ చేయడం వలన టెలిస్కోప్‌ను ఖగోళ గోళంలో తెలిసిన వస్తువులపై సులభంగా ఫోకస్ చెయ్యవచ్చు.

డిక్లనేషన్[మార్చు]

డిక్లనేషన్ ఖగోళ వస్తువు కోణీయ దూరాన్ని, ఖగోళ మధ్యరేఖకు లంబంగా, ఉత్తరం వైపు పాజిటివు గాను, దక్షిణం వైపు నెగటివు గానూ కొలుస్తుంది. దీనికి చిహ్నం δ, ("డెల్టా", సంక్షిప్తంగా ఇంగ్లీషులో DEC). ఉదాహరణకు, ఉత్తర ఖగోళ ధ్రువం డిక్లనేషన్ +90° ఉంటుంది. దక్షిణ ఖగోళ ధ్రువం డిక్లనేషన్ -90°. డిక్లనేషన్‌కు మూలం ఖగోళ మధ్యరేఖ, ఇది ఖగోళ గోళంపై భూమి భూమధ్యరేఖ యొక్క పొడిగింత. డిక్లనేషన్, భౌగోళిక నిర్దేశాంకాల్లో అక్షాంశానికి సమానమైనది. [5] [6] [7]

రైట్ ఎసెన్షన్[మార్చు]

భూమి ఉత్తర ధ్రువంపై నుండి చూసినపుడు, ఒక నక్షత్రపు    స్థానిక అవర్ యాంగిల్ (LHA). (న్యూయార్క్ సమీపంలో ఉన్న     పరిశీలకునికి కనబడే విధం). నక్షత్రాలు కూడా చిత్రీకరించబడ్డాయి   రైట్ ఎసెన్షన్    గ్రీన్విచ్ అవర్ యాంగిల్ (GHA), ది   స్థానిక సగటు సైడ్రియల్ సమయం (LMST),    గ్రీన్‌విచ్ అంటే సైడ్‌రియల్ టైమ్ (GMST). చిహ్నం ʏ వసంత విషువత్తు దిశను గుర్తిస్తుంది.

రైట్ ఎసెన్షన్ ఒక వస్తువు యొక్క కోణీయ దూరాన్ని తూర్పు దిశలో ఖగోళ భూమధ్యరేఖ వెంట వసంత విషువత్తు నుండి అవర్ సర్కిల్ వరకు కొలుస్తుంది. గ్రహణం ఖగోళ భూమధ్యరేఖను కలిసే రెండు బిందువులలో వసంత విషువత్తు బిందువు ఒకటి. రైట్ ఎసెన్షన్ చిహ్నం α, (లోయర్ కేస్ "ఆల్ఫా", సంక్షిప్త RA). దీన్ని సాధారణంగా డిగ్రీలకు బదులుగా సైడిరియల్ గంటలు, నిమిషాలు, సెకన్లలో కొలుస్తారు. ఇది భూమి తిరుగుతూండగా మెరిడియన్ అంతటా వస్తువులు గడిచే సమయాన్ని నిర్ణయించడం ద్వారా తెలుసుతుంది. ఒక గంట రైట్ ఎసెన్షన్‌లో 360°/24h = 15° ఉన్నాయి. మొత్తం ఖగోళ భూమధ్యరేఖ చుట్టూ 24h రైట్ ఎసెన్షన్‌లు ఉన్నాయి. [8]

రైట్ ఎసెన్షన్, డిక్లనేషన్ లను కలిపి ఉపయోగించినప్పుడు సాధారణంగా RA/Dec అని సంక్షిప్తంగా వాడతారు

అవర్ యాంగిల్[మార్చు]

రైట్ ఎసెన్షన్‌కు ప్రత్యామ్నాయంగా, అవర్ యాంగిల్ (సంక్షిప్తంగా HA లేదా LHA, స్థానిక అవర్ యాంగిల్ ) వాడతారు. పరిశీలకుడి మెరిడియన్ నుండి వస్తువు గుండా వెళుతున్న అవర్ సర్కిల్ వరకు ఖగోళ మధ్యరేఖ వెంబడి పశ్చిమ దిశగా ఎంత కోణీయ దూరంలో ఉందో కొలుస్తుంది. ఇది ఎడమ చేతి దిశ వ్యవస్థ. రైట్ ఎసెన్షన్ లాగా కాకుండా అవర్ యాంగిల్, భూ భ్రమణంతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఒక వస్తువు నడినెత్తిన ఉన్న మెరిడియన్ వద్ద ఉన్నప్పటి నుండి జరిగిన సమయాన్ని కొలిచే సాధనంగా పరిగణిస్తారు.

పరిశీలకుడి మెరిడియన్‌పై అత్యున్నత బిందువు ఉన్న నక్షత్రపు అవర్ యాంగిల్ సున్నా (0 h) అవుతుంది. ఒక సైడ్‌రియల్ గంట (సుమారు 0.9973 సౌర గంటలు ) తర్వాత, భూ భ్రమణం కారణంగా ఆ నక్షత్రం ఆ మెరిడియన్‌ నుండి పశ్చిమానికి జరుగుతుంది. అప్పుడు దాని అవర్ యాంగిల్ 1h ఉంటుంది. టోపోసెంట్రిక్ దృగ్విషయాన్ని గణిస్తున్నప్పుడు, రైట్ ఎసెన్షన్‌ను మధ్యంతర దశగా అవర్ యాంగిల్లోకి మార్చుకోవచ్చు. [9] [10]

మూలాలు[మార్చు]

  1. Nautical Almanac Office, U.S. Naval Observatory; H.M. Nautical Almanac Office; Royal Greenwich Observatory (1961). Explanatory Supplement to the Astronomical Ephemeris and the American Ephemeris and Nautical Almanac. H.M. Stationery Office, London (reprint 1974). pp. 24, 26.
  2. Vallado (2001). Fundamentals of Astrodynamics and Applications. Microcosm Press, El Segundo, CA.
  3. U.S. Naval Observatory Nautical Almanac Office; U.K. Hydrographic Office; H.M. Nautical Almanac Office (2008). The Astronomical Almanac for the Year 2010. U.S. Govt. Printing Office. p. M2, "apparent place". ISBN 978-0-7077-4082-9.
  4. Explanatory Supplement (1961), pp. 20, 28
  5. Peter Duffett-Smith (1988). Practical Astronomy with Your Calculator, third edition. Cambridge University Press. pp. 28–29. ISBN 0-521-35699-7.
  6. Meir H. Degani. Astronomy Made Simple. Doubleday & Company, Inc. ISBN 0-385-08854-X.
  7. Astronomical Almanac 2010, p. M4
  8. Astronomical Almanac 2010, p. M14
  9. Astronomical Almanac 2010, p. M8
  10. Vallado (2001), p. 154