Jump to content

రైట్ ఎసెన్షన్

వికీపీడియా నుండి
ఖగోళ గోళం లోపలి భాగంలో రైట్ ఎసెన్షన్, డిక్లనేషన్ లు కనిపించే విధం. ఈ వ్యవస్థ ప్రాధమిక దిశ మార్చి విషువత్తు (ఖగోళ మధ్యరేఖపై (నీలం) జ్యోతిశ్చక్రపు (ఎరుపు) ఆరోహణ నోడ్). రైట్ ఎసెన్షన్‌ను ప్రాథమిక దిశ నుండి ఖగోళ మధ్యరేఖ వెంబడి 24h వరకు తూర్పు దిశగా కొలుస్తారు.

రైట్ ఎసెన్షన్ అనేది ఖగోళ వస్తువు ఖగోళంలో ఉన్న స్థానాన్ని తెలిపేందుకు వాడే భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థలో ఒక అంగం. భూమి నిర్దేశాంక వ్యవస్థలో ఉండే రేఖాంశానికి సమానమైనది, రైట్ ఎసెన్షన్. ఖగోళంలో ఒక బిందువు యొక్క రైట్ ఎసెన్షన్ (సంక్షిప్తంగా RA ; చిహ్నం α ) అంటే వసంత విషువత్తు వద్ద (మార్చి 21 నాడు) సూర్యుని నుండి ఖగోళ మధ్యరేఖ వెంబడి తూర్పు దిశగా ఆ బిందువు ఉన్న కోణీయ దూరం. [1] రైట్ ఎసెన్షన్, డిక్లనేషన్ రెంటినీ కలిపి ఖగోళ నిర్దేశాంకాలు అంటారు. ఇవి భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థలో ఖగోళంలో ఉన్న బిందువు స్థానాన్ని నిర్దేశిస్తాయి.

వివరణ

[మార్చు]
ఖగోళ గోళం వెలుపల నుండి చూస్తే రైట్ ఎసెన్షన్ (నీలం), డిక్లనేషన్ (ఆకుపచ్చ) కనిపించే విధం
వివిధ గంటల కోణాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. చిహ్నం ♈︎ మార్చి విషువత్తు దిశను సూచిస్తుంది.సంవత్సరంలో ఈ రోజును మార్చి విషువత్తుగా భావించండి: సూర్యుడు బూడిద రంగు బాణం వైపు ఉంటాడు, ఆకుపచ్చ బాణంతో గుర్తు పెట్టబడిన నక్షత్రం తూర్పున ఓచోట అర్ధరాత్రి వేళకి ఉదయిస్తున్నట్లు కనిపిస్తుంది ("పై" నుండి గీసిన భూమి అపసవ్య దిశలో తిరుగుతోంది). పరిశీలకుడు ఆకుపచ్చ బాణాన్ని చేరుకునేటప్పటికి, తెల్లవారు వేళ వచ్చే వెలుతురులో నక్షత్రం మునిగిపోయి కనబడకుండా పోతుంది. దాదాపు ఆరు గంటల తరువాత ఆ నక్షత్రం పశ్చిమ దిక్చక్రంపై అస్తమిస్తుంది. ఈ నక్షత్రపు రైట్ ఎసెన్షన్ (RA) దాదాపు 18h. 18h అంటే మార్చిలో ఇది తెల్లవారు ఝాములో కనిపిస్తుంది. RA 12h అయితే, ఆ నక్షత్రం మార్చిలో పూర్తిగా రాత్రంతా కనిపిస్తుంది. RA 6h అయితే, ఆ నక్షత్రం మార్చిలో సాయంసంధ్యా సమయం నుండి కొన్ని గంటల పాటు కనిపిస్తుంది.

రైట్ ఎసెన్షన్ అనేది భౌగోళిక నిర్దేశాంకాల్లోని రేఖాంశానికి సమానం ఖగోళ నిర్దేశాంకం. రైట్ ఎసెన్షన్, రేఖాంశం రెండూ భూమధ్యరేఖపై ప్రాథమిక దిశ (సున్నా బిందువు) నుండి కోణాన్ని కొలుస్తాయి. రైట్ ఎసెన్షన్, మార్చి విషువత్తు వద్ద, అంటే మేషపు మొదటి బిందువు వద్ద సూర్యుడు ఉన్నప్పటి నుండి కొలుస్తారు. మేషపు మొదటి బిందువు అంటే ఖగోళ గోళంలో సూర్యుడు మార్చి విషువత్తు వద్ద ఖగోళ మధ్యరేఖను దక్షిణం నుండి ఉత్తరం వైపు దాటే స్థానం. రైట్ ఎసెన్షన్ను అంతరిక్షంలో ఆ స్థానం నుండి పూర్తి వృత్తమంతా నిరంతరాయంగా కొలుస్తారు. ఈ కొలత తూర్పు దిశలో పెరుగుతూ పోతుంది. [2]

భూమిపై నుండి చూస్తే (ధృవాల వద్ద మినహా), 12h RA కలిగిన వస్తువులు మార్చి విషువత్తులో దీర్ఘ సమయం పాటు కనిపిస్తాయి (రాత్రంతా కనిపిస్తాయి); 0h RA కలిగిన వస్తువులు (సూర్యుడు కాకుండా) సెప్టెంబరు విషువత్తులో అలా రాత్రంతా కనిపిస్తాయి. ఆ వస్తువులు ఆ తేదీలలో అర్ధరాత్రి వేళ వాటి అత్యంత ఎత్తైన స్థానానికి (వాటి మెరిడియన్) చేరుకుంటాయి. ఎంత ఎత్తు అనేది వాటి డిక్లనేషన్‌పై ఆధారపడి ఉంటుంది; డిక్లనేషన్ 0° ఉంటే (అనగా ఖగోళ మధ్యరేఖపై ఉంటాయన్నమాట) అప్పుడు భూమి భూమధ్యరేఖ వద్ద అవి నేరుగా తలపై (అత్యున్నత స్థాయి వద్ద) ఉంటాయి.

సాంప్రదాయికంగా రైట్ ఎసెన్షన్ను గంటలు ( h ), నిమిషాలు ( m ), సెకన్లలో ( s ) కొలుస్తారు. 24h అనేది పూర్తి వృత్తానికి సమానం. పూర్తి వృత్తంలో 24h రైట్ ఎసెన్షన్ లేదా 360° ( ఆర్క్ డిగ్రీలు ) ఉంటుంది. [3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. U.S. Naval Observatory Nautical Almanac Office (1992). Seidelmann, P. Kenneth (ed.). Explanatory Supplement to the Astronomical Almanac. University Science Books, Mill Valley, CA. p. 735. ISBN 0-935702-68-7.
  2. Moulton, Forest Ray (1916). An Introduction to Astronomy. Macmillan Co., New York. pp. 125–126.
  3. Moulton (1916), p. 126.