మల్లికేశ్వరరావు కొంచాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లికేశ్వరరావు కొంచాడ
జననం1963 ఆగష్టు 13
తిడ్డిమి, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా
నివాస ప్రాంతంఆస్ట్రేలియా
వృత్తిరచయిత
భార్య / భర్తప్రత్యూష
పిల్లలుహరి
తండ్రికొంచాడ రామారావు
తల్లినీలమ్మ
వెబ్‌సైటు
https://telugumalli.com/

మల్లికేశ్వర రావు కొంచాడ(జననం 1963 ఆగష్టు 13) ప్రవాస భారతీయ తెలుగు రచయిత.[1][2][3]

తొలినాళ్లలో

[మార్చు]

మల్లికేశ్వర రావు కొంచాడ 1963 ఆగష్టు 13న కొంచాడ రామారావు, నీలమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో జన్మించాడు. తిడ్డిమి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి వరకూ చదివి పాతపట్నం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసాడు. తదనంతరం 1980 సంవత్సరంలో శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాదు చేరుకొని AMIE పూర్తి చేసి హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఎం.టెక్ (స్ట్రక్చరల్ ఇంజినీరింగ్) పూర్తి చేసాడు.

పాలిటెక్నిక్ లో చదువుతున్నప్పుడు చిన్నప్పటి నుండి నాటకాలపైనున్న మక్కువతో హాస్య సినీ దర్శకులు జంధ్యాల మరియు ఆదివిష్ణు వ్రాసిన ‘గుండెలు మార్చబడును’, ‘నథింగ్ బట్ ట్రూత్’ వంటి రంగస్థల నాటక ప్రదర్శనలలో ప్రముఖ పాత్రలు ధరించి ఇటు నాటక రంగంలోనూ అటు సాహితీ రంగంలోనూ ప్రవేశించారు.

కెరీర్

[మార్చు]

1982లో హైదరాబాదులో జూనియర్ ఇంజినీర్ గా తన ప్రస్థానాన్ని మొదలిడి తొలుత ఉగాది కవి సమ్మేళనాలు, రవీంద్ర భారతిలో జరిగే పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లి అక్షరంపై ఉన్న మమకారంతో కవిత్వం వైపు దృష్టి సారించాడు. పక్షపాతం లేని అక్షరం ఎప్పుడూ మన పక్షమేనని నమ్మి ఎందరో కవుల పుస్తకాలను చదవడం అలవాటు చేసుకున్నాడు. ‘కాలభ్రమణం’ అన్న మొదటి కవితతో మొదలైంది కవితా ప్రయాణం.

1996 లో న్యూ జిలాండ్ వలస వెళ్ళిన తరువాత అక్కడ వలసదార్లు పడిన ఇక్కట్లు కవితల రూపంలో వ్రాసి పలువురు తెలుగు భాషా ప్రేమికులతో పంచుకొని వారి మెప్పుని పొందాడు. పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి అక్కడి తెలుగు సంఘం అధ్వర్యంలో మూడేళ్ళు తెలుగు బడులను నిర్వహించారు. ప్రతీ శనివారం తెలుగు రేడియో కార్యక్రమాలను నిర్వహించడంలో పాత్ర వహించారు.

మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో

[మార్చు]

ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ తెలుగు వారి గురించి “తెలుగుమల్లి.కాం” అంతర్జాల పత్రికను భువన విజయ సాహితీ సంవేదిక సహకారంతో స్వీయ సంపాదకత్వంలో మల్లికేశ్వర రావు నడుపుతున్నాడు. కవితలు, కధలు, ఛందోబద్ధమైన పద్యాలు, నాటకాలు వ్రాయడం, ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో తెలుగు రచయితలను ప్రోత్సహించడం, తెలుగు బడి నిర్వహించే వారందరికీ తగినంత సహాయ సహకారాలందించడం, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడం వీరి ధ్యేయం. 2010 సంవత్సరంలో మెల్బోర్న్ భువన విజయ సాహితీ సంవేదిక ప్రచురించిన మొట్టమొదటి సంకలనం “కవితాస్త్రాలయ” పుస్తకాన్ని రూపు దిద్దటంలో కృషి చేశారు.

ఆస్ట్రేలియాలోని భాషాభిమనులందరి సహకారంతో ఇప్పటివరకూ “కవితాస్త్రాలయ” మూడు సంకలనాలు ప్రచురించారు. పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటిగా రంగస్థల పౌరాణిక నాటకాలు ”తెలుగు భాష వెయ్యేళ్ళ చరిత్ర”, “శ్రీ కృష్ణ రాయబారము”, “శ్రీ పార్వతీ కళ్యాణము” అలాగే “మహాకవి కాళిదాసు” ప్రదర్శించడంలో కీలక పాత్ర వహించారు. 2020లో ఆస్ట్రేలియాలో తెలుగు భాషను సామాజిక భాషగా గుర్తించడానికి కృషి చేసారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఎన్నో అవధానాలకు సంచాలకత్వం వహించారు. “పద్య విజయ” సమూహానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఛందోబద్ధమైన పద్యాలు వ్రాయడం నేర్చుకుంటూ “వీర సైనిక” శతకంలో కొన్ని పద్యాలు వ్రాసాడు. “అదివో అల్లదివో” పద్య లఘు కావ్యం వ్రాయడంలో కృషి చేసాడు.

2013లో సిడ్నీ నగరంలో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహోత్సవానికి అంతర్రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించి కీలక పాత్ర వహించాడు. 2018 లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన శ్రీ వంగూరి ఫౌండేషన్ వారి 6వ ప్రపంచ సదస్సుకు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించాడు. ఇది ఆస్ట్రేలియాలో మొదటి ప్రపంచ సదస్సు, 2019లో ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ మొదటి సాహితీ సమావేశానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించాడు.

2023 లో ఆస్ట్రేలియాలో తెలుగువారి ప్రస్థానం 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకాన్ని రచించి స్వయంగా ప్రచురించారు.[4][5] 2011 లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సమాజ సేవకు గుర్తింపుగా సర్వీస్ ఎక్సెలెన్స్ అవార్డును ప్రధానం చేసారు. 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాషకు వారు చేస్తున్న సేవలకు శ్రీ మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ అవార్డును ప్రధానం చేసారు.

రచనలు

[మార్చు]
  • 2023 - తూర్పు తీరంలో తెలుగు రేఖలు [6][7][8]
  • 2018 - కవితాస్త్రాలయ (మూడవ సంకలనం)
  • 2014 - కవితాస్త్రాలయ (రెండవ సంకలనం)
  • 2010 - కవితాస్త్రాలయ (మొదటి సంకలనం)
  • 2020 - వీర సైనిక శతకం
  • 2021 - అదివో అల్లదివో (పద్య లఘు కావ్యం)

సంపాదకత్వం

[మార్చు]
  • 2011 - ప్రవాస భారతి సంపాదకత్వం
  • 2013 - తెలుగుమల్లి అంతర్జాల పత్రిక స్థాపన - సంపాదకత్వం

మూలాలు

[మార్చు]
  1. Australia Telugu, retrieved 2024-08-06
  2. "రచనలతోనే సామాజిక సంస్కరణలు - Prajasakti" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-12-17. Retrieved 2024-08-06.
  3. Rajasuka, G. (2023-10-23). "Sahithi Vanam: తూర్పు తీరంలో తెలుగు రేఖలు". Telugu Prabha Telugu Daily (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-08-06.
  4. "తూర్పు తీరంలో వెల్లివిరిసిన ' తెలుగు రేఖలు' | Telugu Book Release Toorpu Teeram lo Telugu Rekhalu | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-06.
  5. "'తూర్పు తీరంలో తెలుగు రేఖలు' పుస్తకావిష్కరణ". EENADU. Retrieved 2024-08-06.
  6. "Prajasakti E-Paper". epaper.prajasakti.com. Retrieved 2023-11-05.
  7. "Telugu Book Release - 'Toorpu Teeram lo Telugu Rekhalu'". Retrieved 2023-11-05.
  8. Telugu Rekhalu Australia, retrieved 2024-08-06