జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)
జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి | |
---|---|
జననం | జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి జనవరి 14 , 1951 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం |
మరణం | జూన్ 19 ,2001 హైదరాబాదు |
మరణ కారణం | గుండె పోటు |
ఇతర పేర్లు | జంధ్యాల |
ప్రసిద్ధి | తెలుగు సినిమా రచయిత, దర్శకుడు |
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (జనవరి 14, 1951 - జూన్ 19,2001 ) తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం
జీవిత విశేషాలు
[మార్చు]జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.
1974లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించాడు.
జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు సాహితి, సంపద.
సినిమా ప్రస్థానం
[మార్చు]1976 లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టాడు. ఐదేళ్ళలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80 శాతం సినిమాలు ఘనవిజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు.[1] తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. హాస్యబ్రహ్మ అని పేరుపొందాడు.
జంధ్యాల చెణుకులు
[మార్చు]- ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు: "నేను రామానాయుడి గారి సినిమాకు పనిచేసేటపుడు నాపేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటపుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్..." అలా అనేవాడు తప్ప, తన అసలుపేరు ఎక్కడా చెప్పుకోలేదు. జంధ్యాల అసలు పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.
- హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు: "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం"
అవార్డులు
[మార్చు]జంధ్యాలకు లభించిన కొన్ని అవార్డులు:
- 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడు జాతీయ అవార్డు
- 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు
- 1987, "పడమటి సంధ్యారాగం" చిత్రానికి ఉత్తమ కథారచయిత అవార్డు
- 1992, "ఆపద్బాంధవుడు" చిత్రానికి ఉత్తమ మాటల రచయిత అవార్డు
జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు
[మార్చు]జంధ్యాల తన సినిమాల ద్వారా అనేకమంది నటులను సినిమా రంగానికి పరిచయం చేసాడు. వారిలో కొందరు:
జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు
[మార్చు]- వివాహ భోజనంబు చిత్రం నుంచి
మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ-- (ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే, వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే, ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.
- వేటగాడు చిత్రం నుంచి
రావు గోపాలరావు, సత్యనారాయణతో -రాజా ప్రియురాలు రోజా మేజా బల్ల మీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతోంటే నువ్వేంచేస్తున్నావురా కూజా" అన్నప్పుడు సత్యనారాయణ చిన్నబుచ్చుకున్న కోపంతో రావుగోపాలరావు ప్రాసల బలం ఎంతుందో చూపమంటాడు. అప్పుడు రావుగోపాలరావు - " రాజుగారి పెద్ద కొడుకు బెస్టుగా ఫస్టు క్లాసులో పాసయ్యాడని, బావుండదని గెస్టుగా ఫీస్టుకి పిలిచి, హోస్టుగా నేనుండి సపర్యలు చేస్తోంటే, సుస్టుగా భోంచేసి, పొద్దున్నే లేచి మన పేస్టుతోనే పళ్లు తోంకుని, ఉడాయించాడు భ్రస్టు వెధవ" అన్నప్పుడు ఇదంతా విని రొప్పుతున్న సత్యనారాయణని చూసి - " ఇంకా విసరమంటావా నా మాటల తూటాలు" అంటాడు.
జంధ్యాల సినిమాలు
[మార్చు]దర్శకునిగా
[మార్చు]సినిమా | తారాగణం | విడుదల తేది |
---|---|---|
ముద్ద మందారం | ప్రదీప్, పూర్ణిమ | 1981 |
మల్లె పందిరి | విజ్జి బాబు, జ్యోతి, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 1982 |
నాలుగు స్తంభాలాట | నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి | 15-5-1982 |
నెలవంక | రాజేష్, గుమ్మడి, జె.వి.సోమయాజులు | 25-1-1983 |
రెండుజెళ్ళ సీత | నరేష్, ప్రదీప్, రాజేష్, సుధాకర్, మహాలక్ష్మి | 30-3-1983 |
అమరజీవి | అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద | 19-8-1983 |
మూడు ముళ్ళు | చంద్రమోహన్, రాధిక, గీత | -9-1983 |
శ్రీవారికి ప్రేమలేఖ | నరెష్, పూర్ణిమ | 2-3-1984 |
ఆనంద భైరవి (తెలుగు & కన్నడం) | గిరీష్ కర్ణాడ్, మాళవిక | -4-1984 |
రావు - గోపాలరావు | రావు గోపాలరావు, చంద్రమోహన్, ముచ్చర్ల అరుణ | 1984 |
పుత్తడి బొమ్మ | నరేష్, పూర్ణిమ, ముచ్చర్ల అరుణ | 1985 |
బాబాయ్ అబ్బాయ్ | బాలకృష్ణ, అనితా రెడ్డి, సుత్తి వీరభద్ర రావు | 8-2-1985 |
శ్రీవారి శోభనం | నరేష్, అనితా రెడ్డి | 1985 |
మొగుడు పెళ్ళాలు | నరేష్, భానుప్రియ | 5-8-1985 |
ముద్దుల మనవరాలు | భానుమతి, సుహాసిని, జయసుధ, చంద్రమోహన్, శరత్ బాబు | 1985 |
రెండు రెళ్ళు ఆరు | రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, రజని, ప్రీతి | 11-1-1986 |
సీతారామ కళ్యాణం | బాలకృష్ణ, రజని | 18-4-1986 |
చంటబ్బాయి | చిరంజీవి, సుహాసిని | 22-8-1986 |
పడమటి సంధ్యారాగం | విజయశాంతి, టామ్, గుమ్మలూరి శాస్త్రి | 11-4-1987 |
రాగలీల | రఘు, సుమలత, తులసి, సంధ్య | 4-6-1987 |
సత్యాగ్రహం | చల్లా రామకృష్ణా రెడ్డి, సరిత, గుంటూరు శాస్త్రి | 1987 |
అహ నా పెళ్ళంట | రాజేంద్ర ప్రసాద్, రజని | 27-11-1987 |
చిన్ని కృష్ణుడు | రమేష్, కుషుబూ, శరత్ బాబు | -4-1988 |
వివాహ భోజనంబు | రాజేంద్ర ప్రసాద్, అశ్విని | -4-1988 |
నీకు నాకు పెళ్ళంట | డా.రాజశేఖర్, అశ్విని | 8-1988 |
చూపులు కలసిన శుభవేళ | నరేష్, మోహన్, అశ్విని, సుధ | 7-10-1988 |
హై హై నాయకా | నరేష్, శ్రీ భారతి | 23-2-1989 |
జయమ్ము నిశ్చయమ్మురా | రాజేంద్ర ప్రసాద్, సుమలత, చంద్రమోహన్, అవంతి | 6-7-1989 |
లేడీస్ స్పెషల్ | సురేష్, వాణీ విశ్వనాథ్, రశ్మి, సుత్తివేలు | 1991 |
బావా బావా పన్నీరు | నరేష్, రూపకళ | 9-8-1991 |
ప్రేమ ఎంత మధురం | నరేష్, మయూరి | 6-9-1991 |
విచిత్రప్రేమ | రాజేంద్ర ప్రసాద్, అమృత | 1991 |
బాబాయి హోటల్ | బ్రహ్మానందం, కిన్నెర | 5-6-1992 |
ప్రేమా జిందాబాద్ | రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, శుభలేఖ సుధాకర్ | - |
అ ఆ ఇ ఈ | వరుణ్ రాజ్, అచ్యుత్, విజయ్ కుమార్ | - |
ష్ గప్‌చుప్ | వరుణ్ రాజ్, భానుప్రియ | 12-5-1994 |
ఓహో నా పెళ్ళంట | హరీష్, సంఘవి | 20-3-1996 |
విచిత్రం | గజల్ శ్రీనివాస్, చంద్రశ్రీ, శ్రీ హర్ష, చార్మి | 6-11-1999 |
రచయితగా
[మార్చు]- డ్రైవర్ రాముడు (1979)
- అల్లుడు పట్టిన భరతం (1980) (సంభాషణల రచయిత)
- నారీ నారీ నడుమ మురారి
- అడవి రాముడు
- వేటగాడు (1979)
- రహస్య గూఢచారి
- సీతాకోక చిలుక
- హత్యాపేటిక (డిటెక్టివ్ నవల, 1954)
- అల్లుడు దిద్దిన కాపురం (1991)
- Jagadeka veerudu athiloka sundari
మూలాలు
[మార్చు]- ↑ జంధ్యావందనం 1, పులగం చిన్నారాయణ
బయటి లింకులు
[మార్చు]- నంది పురస్కారాలు
- తెలుగు సినిమా దర్శకులు
- తెలుగు సినిమా రచయితలు
- నంది ఉత్తమ దర్శకులు
- 1951 జననాలు
- 2001 మరణాలు
- నంది ఉత్తమ కథా రచయితలు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా దర్శకులు
- ఇంటిపేరుతో ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా రచయితలు
- పశ్చిమ గోదావరి జిల్లా నాటక రచయితలు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు