Jump to content

మస్కట్

వికీపీడియా నుండి
(మస్కట్‌ నుండి దారిమార్పు చెందింది)
మస్కట్, ఒమన్
Location of Muscat, Oman
వర్గీకరణ నగరం
సుల్తాన్ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ అల్ సైద్
వైశాల్యం 3,500 చ.కి.మీ. [1]
జనాభా
 - Total (2005)
 - జనసాంద్రత
 - లెక్కించబడిన ర్యాంకు

606,024 [2]
184.57/చ.కి.మీ.
1st
టైమ్ జోన్: (UTC) +4
అక్షాంశం
రేఖాంశం
23°37′N 58°32′E / 23.61°N 58.54°E / 23.61; 58.54
వెబ్ సైటు: https://web.archive.org/web/20071010124752/http://www.omanet.om/

మస్కట్ (Muscat) ఒమన్ దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. 2005 జనాభా లెక్కల ప్రకారం నగరం జనాభా సుమారు ఆరు లక్షలు.[3]. ఇది మధ్యప్రాచ్యంలోని పురాతన నగరాలలో ఒకటి. ఒక ప్రక్క అరేబియా సముద్రం, మరోప్రక్క పర్వత శ్రేణుల మధ్య మస్కట్ నగరం తీరం వెంబడి విస్తరించి ఉంది. కనుక నగరంలో అధిక భాగం పర్వతాలే. ఒమన్ అధికంగా ఎడారి ప్రాంతపు దేశం. సహజమైన నీటి వనరులు గాని, సారవంతమైన నేల గాని లేని మస్కట్ నగరం ప్రభుత్వం, ప్రజల కృషి కారణంగా పచ్చగా కనిపిస్తుంది. పరిశుభ్రతకు, పచ్చదనానికి, ఇస్లామిక్ నిర్మాణ శైలికి నగరంలో అత్యంత ప్రాధాన్యత ఉంది.

మస్కట్ నగరం, గవర్నరేటు

[మార్చు]

మస్కట్ నగరం దేశ రాజధాని. మస్కట్ గవర్నరేటు అనేది ఆరు విలాయత్‌లతో కలిసి ఉన్న ఒక పాలనా విభాగం. చారిత్రికంగా దేశపు రాజధాని ఉన్న మస్కట్ పాత నగరాన్ని మాత్రమే మస్కట్ (ముత్రా) అని కూడా అంటుంటారు. కాని ఇప్పుడు ఈ ఆరు విలాయత్‌లూ వివిధ పరిపాలనా భవనాలతో ఒకే నగరంగా ఉన్నాయని చెప్పవచ్చును.

చరిత్ర

[మార్చు]
పాత మస్కట్ నగరం

సా.శ. రెండవ శతాబ్దం నుండి మస్కట్ నగరపు చారిత్రికాధారాలున్నాయి. ఒమన్ దేశానికి దక్షిణాన సలాలా దగ్గర ఉన్న 'ఖోర్ రోరి' నుండి ప్రపంచమంతటా సాంబ్రాణి ఎగుమతి అయ్యేది. దానిని గ్రీకు వారు 'మస్కట్' అన్నారు. భారత దేశానికి సముద్రపు దారి కనుక్కొనే ప్రయత్నంలో పోర్చుగీసు యాత్రికుడు వాస్కో డ గామా ఒమన్‌లో ఆగాడు. తరువాత 1507లో పోర్చుగీసువారు మస్కట్‍‌ను ముట్టడించి ఆక్రమించారు. 1649లో పోర్చుగీసు వారిని ఓడించి ఇమామ్ సుల్తాన్ బిన్ సైఫ్ వారిని గోవా తరిమివేశాడు. తరువాత అదే ఇమామ్ మస్కట్ రాజ్యాన్ని విస్తరించి బలవంతంగానూ, ఐశ్వర్యవంతంగానూ చేశాడు. 1737లో పర్షియన్లూ, 1803లో సౌదీకి చెందిన వహాబీలూ మస్కట్‌పై దండెత్తారు కాని వారిని వెడలగొట్టడంలో స్థానికులు సఫలమయ్యారు. 1853లో అప్పటి సుల్తాన్ 'జాంజిబార్'ను రాజధానిగా ప్రకటించడంతో మస్కట్ ప్రాముఖ్యత తగ్గింది.

1913లో సుల్తాన్ తైమూర్ బిన్ ఫైసల్ తన రాజ్యాన్ని 'మస్కట్ & ఒమన్'గా నామకరణం చేశాడు. కాని మస్కట్‌పై అధిపత్యం సుల్తానుకూ, ఒమన్‌పై అధిపత్యం ఇమామ్‌కూ ఉన్నాయి. 1947 తరువాత బ్రిటిష్‌వారి సహకారంతో సుల్తాన్ అప్పటి ఇమామ్‌ను ఓడించాడు. బురైమిఒయాసిస్‌ను కూడా తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. మొత్తం ఒమన్ ఒకే పాలకుని క్రిందికి వచ్చింది. 1964లో యెమెన్‌లోని కమ్యూనిస్టుల ప్రొద్బలంతో జరిగిన ధోఫార్ యుద్ధంలో కూడా ఒమన్ విజయవంతమైంది. తరువాత 1970లో యువరాజు 'కాబూస్ బిన్ సైద్' తన తండ్రి నుండి అధికారాన్ని హస్తగతం చేసుకొన్నాడు. అప్పటినుండి ఒమన్, మస్కట్‌ల చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. దేశం, రాజధాని నగరం వేగంగా అభివృద్ధి చెందాయి.

జనాభా, విభాగాలు

[మార్చు]
పాత మస్కట్లో శివాలయం. (ఫోటో సౌజన్యం - కాసుబాబు)
సముద్రపుతీరాన ఉన్న రియామ్ టవర్

పరిపాలనా పరంగా మస్కట్ గవర్నరేటు ఆరు విలాయత్ (జిల్లా) లుగా విభజింపబడింది.

అవి

  • మస్కట్: దీనినే ప్రస్తుతం 'పాత మస్కట్' లేదా 'పాత నగరం' అని కూడా అంటారు. చారిత్రికంగా ఇది దేశపు రాజధాని. అల్ అలామ్ భవంతి ఒకప్పటి రాజనివాసం. ఇప్పటికీ ప్రధానమైన దీవాన్ కార్యాలయాలు మస్కట్‌లోనే ఉన్నాయి. పెద్ద గేటు ద్వారా (పాత) మస్కట్ నగరంలోకి ప్రవేశించ వచ్చును. చుట్టూరా కొండలు, వాటిపైన వీక్షణ స్థానాలు, మరో ప్రక్క సముద్రంతో ఇది మధ్యయుగంనాటి శత్రు దుర్భేద్యమైన నగరం. పురాతనమైన ఒక శివాలయం ఇక్కడ ఉంది. దానిని ఇటీవల పునర్నిర్మించారు. అక్కడ శివుడు (మోతీశ్వర స్వామి), హనుమంతుడు ప్రతిష్ఠ చేయబడ్డారు. 'సిదాబ్' అనేది మస్కట్‌లో ఒక ప్రాంతం.
  • మత్రా / ముత్రా: ఇది మస్కట్ వెలుపల ఉన్న ఓడ రేవు స్థలం. చారిత్రికంగా ఒమన్‌కు ఇది విదేశ వాణిజ్య కేంద్రం. అప్పటినుండి ఉన్న 'సూక్' (సంత లేదా బజారు) ఇటీవల ఆధునికీకరింపబడింది. రియామ్, కల్బూ అనేవి మత్రాలో ప్రాంతాలు. రువి, హమరియా అనేవి ఇప్పుడు ముఖ్యమైన వ్యాపార కేంద్రాలు. 'వాడి కబీర్' అధికంగా వర్క్‌షాపులు, వ్యాపార కేంద్రాలు ఉన్న స్థలం. ముఖ్యమైన బ్యాంకులు, పెద్ద ఆఫీసులు 'ఎమ్.బి.డి' లేదా 'ముత్రా బిజినెస్ డిస్ట్రిక్ట్'లో ఉన్నాయి. వత్తయా అనేచోట దాదాపు అన్ని కారుల షోరూములు ఉన్నాయి.
  • బౌషర్: ఒకప్పుడు మస్కట్ వెలుపల చిన్న గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు రాజధానికి కేంద్ర స్థానంగా వర్ధిల్లింది. అల్-ఖువెయిర్, కురమ్, ఘాలా, అజైబా, ఘుబ్రా అనేవి బౌషర్ విలాయత్‌లో భాగాలు. అత్యధికంగా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విదేశీ రాయబార కార్యాలయాలు బౌషర్ ప్రాంతంలో ఉన్నాయి. అధికంగా భారతీయ కుటుంబాలు నివసించే ప్రాంతం కూడా ఇదే.
  • సీబ్: ఇది ఇకప్పుడు మత్స్యకారుల గ్రామం. కాని ఇటీవల ముఖ్యమైన ప్రభుత్వ, రక్షణ కార్యాలయాల స్థావరంగా అబీవృద్ధి చెందింది. దేశపు అంతర్జాతీయ విమానాశ్రయం సీబ్‌లోనే ఉంది. 'రుసేయిల్' పారిశ్రామిక కేంద్రంలో ముఖ్యమైన పరిశ్రమలున్నాయి. అల్-హెయిల్, అల్-ఖోధ్, మవల్లాహ్, మొబెల్లా అనేవి ఈ జిల్లాలో ఇతర భాగాలు.
  • కురియాత్: మస్కాట్ నగరానికి కాస్త దూరంగా ఉన్న మత్స్య పరిశ్రమ కేంద్రం. ఇటీవల దీనిని పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతున్నారు.
  • అమరాత్: వాడి అడై, జహలూత్, సెహ్అల్-ధాబి అనే ప్రాంతాలు నగర పౌరుల నివాసాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి.

మస్కట్‌లోని ప్రధాన విభాగాలు క్రింద ఇవ్వబడ్డాయి.

మస్కట్ లోని ముత్రహ్ కార్నర్ దృశ్యం.

భారతీయులు, తెలుగువారు

[మార్చు]

మస్కట్‌లో "తెలుగు కళాసమితి" అధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి.

ఇతర విశేషాలు

[మార్చు]
  • జూన్ 6, 2007న మస్కట్ నగరం గోను తుఫాను కారణంగా విపరీతంగా నష్టపడింది. కాని ప్రభుత్వం పెద్దయెత్తున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి నగరాన్ని అంతకు పూర్వం ఉన్న పరిస్థితికి తీసుకు వచ్చింది.[1]

[2]

  • ప్రతియేటా జనవరి-ఫిబ్రవరి మాసాలలో 'మస్కట్ ఫెస్టివల్' జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రధానంగా దేశ సంస్కృతిని ప్రదర్శించే వేదిక. వివిధ దేశాలనుండి వచ్చిన కళాకారులు ప్రదర్శనలిస్తారు. అనేక దేశాలకు చెందిన వాణిజ్య ఉత్పత్తుల ప్రదర్శనలు కూడా జరుగుతాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Cyclone lashes Oman as Iran batters Down Archived 2007-10-15 at the Wayback Machine. Khaleejtimes.com. June 7, 2007
  2. Commercial centres and residences at Qurm, Ghubra and Ghala localities were among the worst hit. . freetheweek.com. June 6, 2007

బయటి లింకులు

[మార్చు]

మూస:Geolinks-cityscale

"https://te.wikipedia.org/w/index.php?title=మస్కట్&oldid=4373836" నుండి వెలికితీశారు