Jump to content

మైసూర్ నాగమణీ శ్రీనాథ్

వికీపీడియా నుండి
మైసూర్ నాగమణీ శ్రీనాథ్
జననం1950
జోడు గుబ్బి, కర్ణాటక
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిగాయని, స్వరకర్త, గురువు

మైసూర్ నాగమణీ శ్రీనాథ్ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, బహుముఖ ప్రజ్ఞాశీలి[1].

విశేషాలు

[మార్చు]

ఈమె 1950లో కర్ణాటక రాష్ట్రంలోని జోడి గుబ్బి గ్రామంలో జన్మించింది. ఈమె తన ఐదవయేటి నుండే సంగీతాన్ని అభ్యసించింది. తన 9వ యేట మైసూరులో మొట్టమొదటి కచేరీ ఇచ్చింది. ఈమె గౌరి కుప్పుస్వామి, వి.రామరత్నం, ఆర్.విశ్వేశ్వరన్, కె.వి.నారాయణస్వామి, డి.కె.జయరామన్, టి.బృంద, టి.ముక్త, అరకెరె నారాయణరావు, ఎం.ఎల్.వసంతకుమారి, రామానంద్ కృష్ణన్ వంటి మహామహులైన విద్వాంసుల వద్ద సంగీతాన్ని నేర్చుకుంది. మైసూరు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో బి.ఎ. ద్వితీయస్థానంలో, ఎం.ఎ.ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలై బంగారు పతకాలను గెలుచుకుంది. కర్ణాటక రాష్ట్రం నిర్వహించిన విద్వత్పరీక్షలో మొదటి స్థానం సంపాదించి బంగారు పతకాన్ని పొందింది. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమాలో మొదటి స్థానాన్ని పొంది బంగారు పతకాన్ని సంపాదించుకున్నది. మైసూరులోని మహారాణీ ఆర్ట్స్ కాలేజీలో సంగీత విభాగానికి అధిపతిగా ముప్పై సంవత్సరాలు పనిచేసింది. ప్రస్తుతం బెంగళూరు విశ్వవిద్యాలయం, మహావీర్ జైన్ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నది.

ఈమె సంగీతజ్ఞురాలిగా, గురువుగా, స్వరకర్తగా, రచయిత్రిగా, వ్యవహర్తగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది.[2] ఈమె అనేక సంగీత సమ్మేళనాలలో పాల్గొన్నది. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం జాతీయ సమైక్యతపై నిర్వహించిన "స్పిరిట్ ఆఫ్ యూనిటీ" కార్యక్రమంలో ఐదు సార్లు పాల్గొన్నది. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఏ- గ్రేడు కళాకారిణిగా అనేక ప్రదర్శనలు ఇచ్చింది. సార్క్ సాంస్కృతిక ఉత్సవాలలో, జాతీయ ఉత్సవాలలో, మైసూరు దసరా ఉత్సవాలలో, అనేక సంగీత సభలలో, విశ్వవిద్యాలయాలలో, సదస్సులలో పాల్గొనింది. 2006లో ఈమె ఉత్తర అమెరికా, కెనడా దేశాలలో పర్యటించి 29 ప్రోగ్రాములను ఇచ్చింది. ఈమె సంస్కృత, కన్నడ, తెలుగు, తమిళ భాషలలో 200లకు పైగా వర్ణనలను, కృతులను, తిల్లానాలను వివిధ రాగాలలో స్వరపరిచింది. ఈమె సంగీత గురువుగా అనేక మంది శిష్యులను తయారు చేసింది. ఈమె శిష్యులలో అనేకులు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఏ -గ్రేడ్ కళాకారులుగా రాణించారు. ప్రస్తుతం ఈమె ఆన్‌లైన్ క్లాసుల ద్వారా అమెరికా, ఇంగ్లాండ్, మలేషియా, హాంగ్‌కాంగ్ దేశాలలోని విద్యార్థులకు సంగీతాన్ని నేర్పిస్తున్నది. ఈమె హరిదాస స్పందన, హరిదాస దీప్తి, భక్తి కంపన, త్యాగరాజ వైభవ, సహ్యాద్రి ఇంద చాముండియ వరగె, సనాతన సారథి, కవి కావ్య దీప్తి, కర్ణాటక వైభవ వంటి అనేక సంగీత రూపకాలకు, నృత్యనాటకాలకు సంగీత దర్శకత్వం నెరిపింది. కర్ణ - కుంతి, రాజా హరిశ్చంద్ర వంటి సంగీత నాటకాలలో నటించింది. ఈమె దూరదర్శన్ కొరకు 13 ఎపిసోడ్ల "మైసూరు వాగ్గేయకారరు" అనే సీరియల్‌ను నిర్మించింది.

ఈమె హరిదాస కీర్తనలు, శ్లోకాలు, వచనాలు, సంగీత రూపకాలు, కర్ణాటక శాస్త్రీయ సంగీతం, జుగల్‌బందీలతో 20కి పైగా ఆడియో కేసెట్లను విడుదల చేసింది[2]. "గురుకుల" పేరుతో 500 గంటల నిడివి గల డి.వి.డిలను విడుదల చేసింది. వీటిలో సంగీతంలో ప్రాథమిక పాఠాలు మొదలుకొని శ్లోకాలు, వర్ణనలు, కీర్తనలు, కృతులు, తిల్లానాలు, దేవుని నామములు, పదములు, జావళీలు, వచనాలు, మనోధర్మ సంగీతం (రాగాలాపన, స్వరకల్పన, నెరవల్, తానం, పల్లవి) మొదలైన వాటిపై పాఠాలు ఉన్నాయి.

ఈమె శ్యామశాస్త్రి, వీణ కుప్పయ్యర్, తిరువతియూర్ త్యాగయ్యర్‌ల గురించి పుస్తకాలు రచించింది. సంగీత విషయాలపై అనేక వ్యాసాలను వ్రాసి ప్రచురించింది. ఈమె కర్ణాటక ప్రభుత్వపు దసరా సాంస్కృతిక కమిటీ, కర్ణాటక సంగీత నాటక అకాడమీ వంటి అనేక సంస్థలలో సభ్యురాలిగా సేవలందిస్తున్నది. ఈమె స్వంతంగా సునాద సాంస్కృతిక కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా కర్ణాటక సంగీతాన్ని ప్రచారం చేస్తున్నది.

పురస్కారాలు

[మార్చు]

అనేక సంస్థలు ఈమెను సత్కరించి పురస్కారాలను, బిరుదుల ప్రదానం చేశాయి.

వాటిలో కొన్ని[2]:

  • మద్రాసు సంగీత అకాడమీ వారిచే మూడు పర్యాయాలు "బెస్ట్ మ్యుజీషియన్ అవార్డ్"
  • భారత ఉపరాష్ట్రపతి బి.డి.జెట్టి చేతుల మీదుగా "గాన సరస్వతి" బిరుదు.
  • కర్ణాటక సంగీత నృత్య అకాడమీ వారిచే "కర్ణాటక కళాశ్రీ" బిరుదు.
  • కర్ణాటక ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు.
  • అకాడమీ ఆఫ్ మ్యూజిక్, బెంగళూరు వారిచే "చౌడయ్య జాతీయ పురస్కారం."
  • గానకళాపరిషత్ బెంగళూరు వారిచే "గానకళాశోభన" బిరుదు.
  • తెలుగు అకాడమీ, హైదరాబాదు వారిచే ఉత్తమ గాయని పురస్కారం.
  • పూర్వాంకర సంగీత పురస్కారం.
  • శ్రీ త్యాగరాయ గానసభ వారిచే కళాభూషణ పురస్కారం.
  • కర్ణాటక ప్రభుత్వంచే కళాసంభ్రమ పురస్కారం.
  • ఉడిపి పేజావర మఠంచే "సంగీత సరస్వతి" బిరుదు.
  • కర్ణాటక ప్రభుత్వంచే రాజ్యోత్సవ ప్రశస్థి
  • సంగీత నాటక అకాడమీ అవార్డు

మూలాలు

[మార్చు]
  1. web master. "Mysore Nagamani Srinath". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 27 February 2021.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 web master. "Mysore G.N. Nagamani Srinath". నాద తరంగిణి. Retrieved 27 February 2021.