Jump to content

యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా
రకంNon-profit company
పరిశ్రమNews media
News agency
స్థాపన19 డిసెంబరు 1959; 64 సంవత్సరాల క్రితం (1959-12-19)
స్థాపకుడుDr. Bidhan Chandra Roy
ప్రధాన కార్యాలయం9, Rafi Marg, New Delhi-110001,
India
కీలక వ్యక్తులు
Sagar Mukhopadhyay (Chairman)
విభాగాలుUNI Varta, UNI Urdu, UNI Kannada, UNI Photo
వెబ్‌సైట్


యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI) భారతదేశంలోని బహుభాషా వార్తా సంస్థ. 1959 డిసెంబరు 19న దీన్ని ఆంగ్ల వార్తా సంస్థగా స్థాపించారు. దీని వాణిజ్య కార్యకలాపాలు 1961 మార్చి 21 న ప్రారంభమయ్యాయి. యూనివార్తా అనే హిందీ వార్తా సేవను మొదలుపెట్టినపుడు UNI, ప్రపంచంలోని బహుభాషా వార్తా సేవల్లో ఒకటిగా మారింది. 1992లో ఇది ఉర్దూ వార్తా సేవను ప్రారంభించింది. ఉర్దూ వార్తలను అందించే మొదటి వార్తా సంస్థ ఇది. ప్రస్తుతం ఇది ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కన్నడ భాషలలో వార్తలను సరఫరా చేస్తూ భారతదేశంలో రెండవ అతిపెద్ద వార్తా సంస్థగా ఉంది. దీని న్యూస్ బ్యూరోలు భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులు, ప్రధాన నగరాల్లో ఉన్నాయి.

నేపథ్యం

[మార్చు]

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) తన మొదటి ప్రెస్ కమీషన్ నివేదిక (1952–1954)లో రెండవ వార్తా సంస్థ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. రెండు సంస్థలుంటే అవి ఒకదాని పొరపాట్లను మరొకటి సరిచేసుకుంటూ వ్యవహరిస్తాయి. [1] కానీ PCI మద్దతు నిచ్చిన తర్వాత కూడా, యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా 1958లో ఆర్థిక సమస్యల కారణంగా కుప్పకూలింది. కాబట్టి కొన్ని ప్రముఖ వార్తాపత్రికలు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు రెండవ వార్తా సంస్థ అవసరమని భావించాయి. దీనితో, డా. బిధాన్ చంద్ర రాయ్ ఆధ్వర్యంలో యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. [2] ఎనిమిది ప్రముఖ వార్తాపత్రికలైన ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది స్టేట్స్‌మన్, అమృత బజార్ పత్రిక, హిందుస్తాన్ టైమ్స్, హిందుస్తాన్ స్టాండర్డ్, డెక్కన్ హెరాల్డ్, ఆర్యావర్త దీన్ని స్పాన్సర్ చేసాయి. [3]

ప్రారంభ కాలం (1961 – 1975)

[మార్చు]

దాని ప్రారంభ రోజులలో కంపెనీ, 1958 నుండి ఉపయోగించకుండా పడి ఉన్న, తుప్పుపట్టిన పాత యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా టెలిప్రింటర్‌లను ఉపయోగించాల్సి వచ్చింది. [3] కంపెనీ తన సామర్థ్యాన్ని 1961లో 13 టెలిప్రింటర్‌ల నుండి 1975 చివరి నాటికి 408కి పెంచుకుంది. 1971లో రూ. 54.31 లక్షలున్న కంపెనీ ఆదాయం, 1974లో రూ. 67.73 లక్షలకు, రూ. 1975లో 87.14 లక్షలకూ పెరిగింది. UNI తన కార్యకలాపాలను ప్రారంభించినప్పుడు 5 గురు సిబ్బంది ఉండేవారు. అయితే 1975 చివరినాటికి అది 139 మంది జర్నలిస్టులు, 392 నాన్-జర్నలిస్టులు, 166 స్ట్రింగర్‌లతో మొత్తం 697కి విస్తరించింది. [3]

UNI అనేక వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టింది, ఇది దాని ప్రజాదరణను పెంచడానికి దారితీసింది. 1968లో, ఇది లోతైన నేపథ్య పరిజ్ఞానంతో చక్కగా డాక్యుమెంట్ చేయబడిన ప్రస్తుత అంశాల కోసం వారపు నేపథ్య సేవను ప్రవేశపెట్టింది. 1970లో, UNI వ్యవసాయ వార్తలు ఫీచర్ సర్వీస్‌ను పరిచయం చేయడం ద్వారా వ్యవసాయ జర్నలిజం రంగానికి కొత్త కోణాన్ని అందించింది. భారతీయ, విదేశీ మార్కెట్‌ల విశేషాలను నివేదించడం కోసం, UNI ఎయిర్‌మెయిల్ న్యూస్ సర్వీస్ (1971) వంటి ఫైనాన్షియల్, కమర్షియల్ సర్వీస్ వంటి అనేక ఇతర పథకాలను విజయవంతంగా ప్రారంభించింది. సైన్స్ రిపోర్టేజ్ రంగంలో పూర్తి కాలపు సైన్స్ కరస్పాండెంట్‌ను నియమించిన మొదటి సంస్థ ఇది. [3]

అత్యవసర కాలం (1975 – 1978)

[మార్చు]

ఎమర్జెన్సీ కాలంలో, 1975 జూలై 26న ఇందిరా గాంధీ ప్రభుత్వం, భారతదేశంలోని నాలుగు టెలిప్రింటర్ వార్తా సంస్థలను విలీనం చేసి ఒకే సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. [2] ఒకే వార్తా సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనను అంగీకరిస్తూ ఆ నాలుగు ఏజెన్సీల ఉద్యోగుల సంఘాలు తీర్మానాలు కూడా చేసాయి. [4] అందువల్ల 1976 ఫిబ్రవరిలో, UNIని PTI, హిందుస్థాన్ సమాచార్, సమాచార్ భారతి అనే ఇతర మూడు సంస్థలతో కలిపి కొత్త <i>సమాచార్‌</i> అనే సంస్థను ఏర్పరచారు. [5] [6] [7] [8] [9] 1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, పత్రికా స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకుని సమాచార్ పనితీరును, స్వతంత్రతనూ పరిశీలించడానికి కొత్త ప్రభుత్వం కులదీప్ నాయర్ కమిటీని ఏర్పాటు చేసింది. [5] 1977 నవంబరు 14 న, సమాచార్‌ను వార్తా, సందేశ్ అనే రెండు వార్తా సంస్థలుగా విడదీయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. [10] కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, సమాచార్‌ను విభజించి, గతంలో విలీనమైన నాలుగు ఏజెన్సీలను తిరిగి ఏర్పాటు చేసింది. [11] ఆ విధంగా 1978 ఏప్రిల్ 14 న UNI, మిగతా మూడు వార్తా సంస్థలతో సహా మళ్లీ పునరుద్ధరించబడింది. [12]

ఎమర్జెన్సీ తర్వాత కాలం (1978 – ప్రస్తుతం)

[మార్చు]

ఎమర్జెన్సీ తరువాత UNI దాని చందాదారుల సంఖ్య పెరిగింది. 1979 జనవరిలో, వాల్ స్ట్రీట్, NASDAQ ల నుండి యూరోపియన్, ఆసియా మార్కెట్‌ల దాకా ఆర్థిక వస్తువుల మార్కెట్‌ల కవరేజీని అందించడానికి UNI ఫైనాన్షియల్ సర్వీసెస్ (UNIFIN) ప్రారంభించింది. UNIFIN ఆర్థిక ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన రాజకీయ కథనాలను కూడా ఇస్తుంది. [13]

1982 మేలో, UNI తన హిందీ సేవ, యూనివార్తా ను ప్రారంభించింది. దీని తర్వాత 1992 జూన్ 5 న ఉర్దూ వార్తా సేవను ప్రారంభించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి టెలిప్రింటరు ద్వారా ఉర్దూలో వార్తలను సరఫరా చేసిన సంస్థ, అలా చేసిన ఏకైక వార్తా సంస్థ ఇది. [13] [14] 2005 తర్వాత, భారతదేశం, గల్ఫ్ దేశాల్లో దాని కమ్యూనికేషన్ నెట్‌వర్కు 90,000 కి.మీ. అన్ని ప్రధాన ప్రపంచ నగరాల్లో దీనికి కరస్పాండెంట్లు ఉన్నారు. దీనికి రాయిటర్స్‌తో సహా అనేక విదేశీ వార్తా సంస్థలతో సహకార ఒప్పందాలున్నాయి. [15]

UNI అనేక ఇతర కార్యక్రమాలు కూడా చేపట్టింది. UNI ఫోటో సర్వీస్, UNI గ్రాఫిక్స్‌ను ప్రారంభించిన మొదటి వార్తా సంస్థ ఇది. [14] [16] ప్రస్తుతం ఇది దూరదర్శన్ వార్తల క్లిప్‌లు, ఫీచర్ల కోసం యూనిదర్శన్ (1986 జూలైలో ప్రారంభమైంది), యునికాన్ (UNI ఎకనామిక్ సర్వీస్, 1979లో ప్రారంభమైంది), UNEN (UNI ఎనర్జీ న్యూస్ సర్వీస్, 1980 సెప్టెంబరులో ప్రారంభమైంది) వంటి అనేక సేవలను అందిస్తోంది. UNI అగ్రికల్చర్ సర్వీస్ (1967లో మొదలైంది), UNI బ్యాక్‌గ్రౌండర్ సర్వీస్ (1968లో మొదలైంది), UNI ఫీచర్స్, UNISCAN, UNIStock, UNIFIN (1979 జనవరిలో మొదలైంది) మొదలైన సేవలను కూడా నడుపుతోంది. [16] [17]

పరిపాలన

[మార్చు]

భారతీయ కంపెనీల చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం UNI ని లాభాపేక్ష లేని కంపెనీగా నమోదు చేసారు. ఈ సంస్థ దాని షేర్లను కొనుగోలు చేసిన వార్తాపత్రికల స్వంతం. వార్తాపత్రికలు బోర్డు ఆఫ్ డైరెక్టర్లను ఎన్నుకుంటాయి. ఈ బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో ఉంటుంది. వార్తా సంస్థ యొక్క విధాన రూపకల్పనలో ఛైర్మనే ప్రధాన అధికారి. ఛైర్మన్ నేతృత్వంలోని బోర్డులో ప్రముఖ వార్తాపత్రికల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. 

మూలాలు

[మార్చు]
  1. Shrivastava 2007, p. 48.
  2. 2.0 2.1 Kumar 2000.
  3. 3.0 3.1 3.2 3.3 Shrivastava 2007, p. 49.
  4. Shrivastava 2007, p. 56.
  5. 5.0 5.1 Mehta 1979, p. 84.
  6. Shrivastava 2007, p. 51.
  7. Aggarwal 1989, p. 190.
  8. Kanung 2001, p. 114.
  9. Jones 2015.
  10. Mehta 1979, p. 85.
  11. Mehta 1979, p. 87.
  12. Shrivastava 2007, p. 57.
  13. 13.0 13.1 Shrivastava 2007, p. 61.
  14. 14.0 14.1 Mehta 1979, p. 94.
  15. Shrivastava 2007, p. 60.
  16. 16.0 16.1 Shrivastava 2007, p. 62.
  17. Mehta 1979, p. 95.