రాఘవ పాండవీయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు. రాఘవ పాండవీయం పింగళి సూరన రచించిన తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యం.

రాఘవ పాండవీయం పింగళి సూరన రచించిన తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యం.[1][2][3] నాలుగు ఆశ్వాసాలున్న ఈ ద్వ్యర్థి కావ్యం రెండు రకాలుగా అర్థం ధ్వనిస్తుంది.[4] పింగళి సూరన, రామాయణం, మహాభారతంలోని ముఖ్య ఘట్టాలను ఏరుకుని ఆరు వందల పద్యాలతో ఈ కావ్యం రాశాడు. రామాయణ భారతాలలోని అనేక ఉపకథలను విడిచి పెట్టాడు. ఇలా చేయడం వల్ల సారం చెడకుండా సంక్షిప్తంగా కావ్యం రాయవచ్చని భావించాడు. ఉదాహరణకు రామాయణంలో ఉత్తరకాండమును, మహాభారతంలో సౌప్తికాది పర్వములు తొలగించి సంక్షిప్తంగా రాఘవ పాండవీయం రాశాడు. వేములవాడ భీమకవి కూడా రాఘవ పాండవీయం అనే గ్రంథాన్ని రచించినట్లు సూరనే ఒక పద్యంలో చెప్పినా ఆ గ్రంథము ప్రస్తుతం అలభ్యము.[5][6]

శైలి[మార్చు]

ద్వ్యర్థి కావ్యమంటే రెండు అర్థములు గల కావ్యం రామాయణ, భారత అర్థాలు ఒకే పద్యంలో అన్వయించి చెప్పడం. రామాయణ, భారత కథలకు సహజంగా పొత్తు కుదరదు. రెంటిని సంగ్రహ పరిస్తే కథల విస్తృతి తగ్గుతుంది. దీనికి సూరన ఒక కావ్య ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఒక పద్యంలో ఇలా అన్నాడు.

ఒక కథ వినియెడి తఱి వే
ఱొక కథపై దృష్టియిడిన నొక యర్థము దో
పకపోవు గాన నేకా
ర్థ కావ్య మెట్లెట్ల వినగదగు నొకటొకటిన్‌ (రాఘవపాండవీయం 1-18)

కథాగమనం జరగడం కోసం సూరన ఆరు రకాల శ్లేషలు ఎంచుకున్నాడు. అవి సంస్కృతాభి భాషా శ్లేష, శబ్ధ శ్లేష, అర్థ శ్లేష, గౌణవృత్తి శ్లేష, అర్థాన్వయ శ్లేష, శబ్ధాన్వయ శ్లేష.

అంకితం[మార్చు]

ఈ కావ్యాన్ని ఆకువీడు పెద వేంకటాద్రి ప్రేరణచే విరుపాక్షిదేవునికి అంకితం చేశారు.[7] పెద వేంకటాద్రి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడుగా తెలియవస్తున్నది.

పరిశోధకుల వ్యాఖ్యలు[మార్చు]

ఆంధ్ర గ్రంథములను బాగా పరిశోధించిన బహుజనపల్లి సీతారామాచార్యులు పింగళి సూరన గురించి ఈ విధంగా అన్నాడు.[2]

ఇతడు మిగుల దొడ్డకవి. వెన్నెలగంటి సూరన ఈయనకు ముంగలివాడు గనుక ఈయనకు పింగళి సూరన అని పేరు కలిగినది. ఇతడు క్రమముగా గరుడ పురాణమును, రాఘవ పాండవీయమును, కళాపూర్ణోదయమును, ప్రభావతీ ప్రద్యుమ్నమును మరికొన్ని కావ్యములను రచించిన వాడు. ఇందు రెండవది రాఘవ పాండవుల చరిత్రములను శ్లేషభంగిందెలుపుచు సులభ శైలిచే శోభిల్లుచున్నది. భాషా శ్లేషగా కావ్యము చెప్పు విధమునకు నితడు మార్గదర్శిగానున్నాడు. వెనుకటి కవుల లోపల నితడు సర్వతోముఖ చాతుర్యుడని చెప్పనొప్పును.

కందుకూరి వీరేశలింగం పంతులు తన కవి జీవితం పుస్తకంలో ఇలా అన్నారు.[2]

రాఘవపాండవీయం క్లిష్టార్థములు లేకుండా మృదుమధుర సులభ పదములతో రామాయణ భారతార్థములు వచ్చునట్లుగా, రచియింపబడిన శ్లేష కావ్యము. ఇంతటి సులభ శైలితో సంపూర్ణ శ్లేష కావ్యమును రచియించుట మరొకరికి సాధ్యము గాదు. తిక్కన సోమయాజికి తర్వాత నింత ప్రౌఢముగా కవిత్వము చెప్పిన తెనుగు కవి మరియొకడు లేడు.

భీమకవి ప్రస్థావన[మార్చు]

ఒకానొక పద్యంలో వేములవాడ భీమకవి ముందుగా రాఘవ పాండవీయం రాసినట్లు విన్నా అది తనకు దొరకలేదని తెలిపాడు.

భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయె కాని యందు నొం
డేమియు నెయెడన్నిలుచు టెవ్వరుగాన రటుండనిమ్ము నా
నామహిత ప్రబంధరచనా ఘన విశ్రుతి నీకు గల్గుటన్
నామది దద్వయార్థ కృతి నైపుణియం గలదంచు నెంచెదన్ - రాఘవ పాండవీయం

రామాయణ భారతాలకు లంకెలు[మార్చు]

ఈ కావ్యంలో కథానాయకులు బలవిక్రమ పౌరుషాదులను బట్టి చమత్కారంతో జతపరిచాడు.

లంకెలు
రామాయణం మహాభారతం
అయోధ్య వారణపురి
దశరథుడు పాండురాజు
నీలుడు ధృష్టద్యుమ్నుడు
సుగ్రీవుడు కర్ణుడు
ఆంజనేయుడు భీముడు

ఉదాహరణ పద్యం[మార్చు]

క. అతివినయాన్విత కుంతియు
ధృతమహిమాద్రియునగుచు నతిప్రీతి తరం
గితమతులై తను, గొలువఁగఁ
జతురమృగయు లేఁగుఁదేర జనియె న్వనికిన్

రామాయణార్థం

మిక్కిలి అణకువ కలిగిన వాడునూ, ఈటెలు మున్నగు ఆయుధలు ధరించిన సైనికులు గల వాడునూ, పర్వతంతో సమానమైన ధైర్య మహిమ కలిగిన వాడునూ అయిన దశరథుడు, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన, సమర్థులైన వేటగాళ్ళు తనతో వచ్చుచుండ అడవి కేగెను. ఇక్కడ కుంతియు అనే శబ్దానికి ఈటెలు ధరించిన వారు అని అర్థాన్ని అన్వయించుకోవాలి.

భారతార్థం

అత్యంత వినయము కలిగిన కుంతీ దేవి, ధైర్యానికి స్థానమైన మాద్రి నవ్వుతూ తనను కొలుస్తూ వస్తుండగా, వేటగాళ్ళు తనతో వచ్చుచుండగా పాండురాజు అడవికి వేటకై బయలు దేరెను.

మూలాలు[మార్చు]

  1. "ఈనాడు ప్రతిభ సమాచారం" (PDF).[permanent dead link]
  2. 2.0 2.1 2.2 పింగళి, సూరన; ఎ. వి, నరసింహం పంతులు (1932). రాఘవ పాండవీయము. p. 1.
  3. "శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు - వారి రచనలు". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. 9 March 2018. Retrieved 20 November 2018.[permanent dead link]
  4. కె., రామకృష్ణ (16 March 2017). "తెలుగులో తొలి ద్వ్యర్థి కావ్యము ఎవరు రచించారు?". navatelangana.com. Archived from the original on 21 అక్టోబర్ 2018. Retrieved 20 November 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. అమరేష్, దత్తా (2003). Encyclopaedia of Indian Literature. ఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడెమీ. p. 503.
  6. మందలపర్తి, కిషోర్ (4 April 2018). "నీ యశం బారభ మానతారకర హార విలాసము". andhrabhoomi.net. ఆంధ్రభూమి. Retrieved 20 November 2018.
  7. కెంగార, మోహన్ (8 June 2015). "భువన విజయంలో కవనరాజు 'పింగళి సూరన'". prajasakti.com. ప్రజాశక్తి. Retrieved 20 November 2018.[permanent dead link]