రావెళ్ళ సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావెళ్ళ సత్యనారాయణ
జననం1927, జనవరి
గోకినపల్లి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
మరణం1985, ఫిబ్రవరి 2
మరణ కారణంగుండెపోటు
ప్రసిద్ధితెలంగాణా పోరాటయోధుడు
కమ్యూనిస్టు నాయకుడు

రావెళ్ళ సత్యనారాయణ (రావెళ్ళ సత్యం), తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడాడు. సమితి ప్రెసిడెంట్‌గా, జిల్లా మార్కెటింగ్‌ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టాడు.[1]

జననం[మార్చు]

సత్యనారాయణ 1927, జనవరిలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, గోకినపల్లి గ్రామంలోని మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. తన చిన్నతనంలో మామిడి చెట్టుపై కిందపడినప్పుడు, చేతికి తగిలిన తీవ్రమైన దెబ్బ కారణంగా కుడి మోచేతి వరకు తొలగించబడింది. 1945-46 కాలంలో ఉర్ధూలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేశాడు.[1]

ఉద్యమ జీవితం[మార్చు]

తన ఇంటి ఆవరణలోని పశువుల పాకలో ఒక పాఠశాలను నిర్వహించి, ఆ తరువాతకాలంలో కమ్యూనిస్టు పార్టీకి వేదికగా మార్చుకున్నాడు. 1946-48 మధ్య ఎన్టీఆర్ జిల్లా, మల్కాపురం సరిహద్దు క్యాంపుకు చేరుకొని శిక్షణ పొంది, కమిటీ ఆదేశాలమేరకు పనిచేశాడు. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో నిజాం ప్రభుత్వం చేత అరెస్టయి మద్రాస్‌ రాష్ట్రం కడలూరు సెంట్రల్‌ జైలుకు వెళ్ళాడు. జైలులో కమ్యూనిస్టు నాయకులు మోటూరు హనుమంతరావు, రాయల వీరయ్య తదితరులు పరిచయమయ్యారు. 1951 సాధారణ ఎన్నికలు వెలువడిన సమయంలో కమ్యూనిస్టు నాయకులతోపాటు జైలు నుంచి విడుదలయ్యాడు. 1964లో హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలులో 16నెలలపాటు జైలు జీవితం గడిపాడు. 1966-68లో గ్రామాల్లో భూపోరాటాలు, రైతు కూలీ ఉద్యమాలు నిర్వహించాడు. అనేక ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాడు.[1]

తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడైన చిర్రావూరి లక్ష్మీనరసయ్య నాయకత్వంలో మంచికంటి రాంకిషన్‌ రావు, పర్సా సత్యనారాయణ, బోడేపూడి వెంకటేశ్వరరావు, బోజడ్ల వెంకటనారాయణ, చింతలపూడి జగ్గయ్య, కె.ఎల్.నరసింహారావు, రాయల వీరయ్య, ఏలూరి లక్ష్మీనారాయణ, టివిఆర్‌ చంద్రం, బండారు చంద్రరావులతో కలిసి సత్యనారాయణ ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని ముందుకుతీసుకుపోవడంలో అద్వితీయ పాత్ర నిర్వహించాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

1964 ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిక సందర్భంలో 1968 నక్సలైట్‌ ఉద్యమ సమయంలో మార్క్సిస్టు పార్టీవైపు నిలబడ్డాడు. 1970-82 మధ్యకాలంలో సహకార సంఘానికి జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షుడిగా 1982లో ఖమ్మం సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుండి సత్యనారాయణ చేత పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది.

మరణం[మార్చు]

సత్యనారాయణ 1985, ఫిబ్రవరి 2న గుండెపోటుతో మరణించాడు.[1]

గుర్తింపులు[మార్చు]

నేలకొండపల్లిలోని భవనానికి రావెళ్ళ సత్యనారాయణ భవన్​ అని పేరు పెట్టబడింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం.. | ఖమ్మం". NavaTelangana. 2021-02-01. Archived from the original on 2023-02-09. Retrieved 2023-02-09.
  2. వనం, జ్వాలా నరసింహారావు (2023-01-18). "ఉద్యమాల గుమ్మంలో బీఆర్‌ఎస్ తొలి నగారా!". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-18. Retrieved 2023-02-09.