Jump to content

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు

వికీపీడియా నుండి
రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు
తేదీఏప్రిల్ 14–18, 1981 (1981-04-14 – 1981-04-18)
వేదికకౌలాలంపూర్, మలేసియా
నిర్వాహకులుమలేసియా తెలుగు సంఘం, అంతర్జాతీయ తెలుగు సంస్థ
వెబ్‌సైటుhttp://www.worldteluguconference.com/second-wtc.html

రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు 1981 సంవత్సరం ఉగాది సమయంలో ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 18 తేదిలలో జరిగాయి. ఇవి మలేసియా రాజధాని కౌలాలంపూర్ నగరంలో వైభవంగా నిర్వహించబడ్డాయి. దీనిని మలేసియా ఆంధ్ర సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అంతర్జాతీయ తెలుగు సంస్థ సంయుక్తంగా నిర్వహించింది.

సభా విశేషాలు

[మార్చు]

ఈ సభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, సాంస్కృతిక శాఖామాత్యుడు భాట్టం శ్రీరామమూర్తి, ఇతర మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. తొలి రోజు ప్రారంభ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య అధ్యక్షత వహించగా, మలేసియా ప్రధాన మంత్రి డా.మహతీర్ బిన్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.[1] ఈ ఐదు రోజుల మహా సభలకు ఆంధ్ర రాష్ట్రం నుండే కాక భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, మారిషస్, ఫిజి, దక్షిణాఫ్రికా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన తెలుగు కళాకారులు, భాషావేత్తలు, పరిశోధకులు, కవులు ప్రతినిధులుగా హాజరయ్యారు. వీరు కాక మలేసియాలోని తెలుగు ప్రజలు ఈ సభలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం, మధ్యాహ్నం జరిగే సమావేశాలలో నిర్వాహకులు చర్చా కార్యక్రమాలను, కవి సమ్మేళనాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట తెలుగు కళాకారులతో పాటు మలేసియన్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.[1]

ఈ సమావేశాలకు భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పంపిన సందేశంలో "విదేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల ప్రేమాభిమానాలకు మనం ఋణం తీర్చుకోవాలని" పేర్కొన్నారు. ఈ మాటలు సమావేశంపై స్ఫూర్తిని నింపాయి. ఈ సమావేశాలు విజయవంతం కావడానికి మండలి వెంకటకృష్ణారావు, అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యదర్శి పి.ఎస్.ఆర్. అప్పారావు, మలేసియా తెలుగు సంఘం సభ్యులు సి.అప్పారావు, సోమయ్య నాయుడు, ఎ.అప్పన్న మొదలైనవారు ముఖ్య కారకులు.

ఈ సమావేశాల సందర్భంగా తరతరాల తెలుగు వెలుగు పేరుతో ఒక ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.[1]

ప్రత్యేక సంచిక

[మార్చు]

ఈ సందర్భంగా అంతర్జాతీయ తెలుగు సంస్థ బీసెట్టి నూకయ్య, వేమూరి కామేశ్వరశర్మల సంపాదకత్వంలో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది.[2]

ఇతర విశేషాలు

[మార్చు]

ఈ మహాసభలకు ప్రతినిధిగా హాజరయిన ఆర్.రంగస్వామిగౌడ్ సభా విశేషాలతోపాటు తన యాత్రానుభవాలను వివరిస్తూ మలేషియా మధురస్మృతులు అనే గ్రంథాన్ని రచించాడు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 వెబ్ మాస్టర్. "Second World Telugu Confrerence". World Telugu Confrerence. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతికశాఖ. Archived from the original on 22 డిసెంబరు 2019. Retrieved 26 June 2020.
  2. https://archive.org/details/in.ernet.dli.2015.390436/mode/2up