లైఫ్ అఫ్ పై
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
Life of Pi | |
---|---|
దర్శకత్వం | అంగ్ లీ |
స్క్రీన్ ప్లే | David Magee |
నిర్మాత | Gil Netter Ang Lee David Womark |
తారాగణం | Suraj Sharma Irrfan Khan Tabu ఆదిల్ హుస్సేన్ Rafe Spall Gérard Depardieu |
ఛాయాగ్రహణం | Claudio Miranda |
కూర్పు | Tim Squyres |
సంగీతం | Mychael Danna |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | 20th Century Fox |
విడుదల తేదీs | సెప్టెంబరు 28, 2012(NYFF) నవంబరు 21, 2012 (US & Taiwan) డిసెంబరు 20, 2012 (UK) |
సినిమా నిడివి | 127 minutes[2] |
దేశాలు | Canada India Japan Mexico France |
భాషలు | English Hindi |
బడ్జెట్ | $120 million[3] |
బాక్సాఫీసు | $609,016,565[3] |
లైఫ్ అఫ్ పై అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ధ నవల. యాన్ మార్‌ట్టెల్ దీని రచయిత. దీనిని అంగ్ లీ దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి తరుణ వయస్సులోజరిగిన విచిత్ర సంఘటనల, అనుభవాల ద్వారా పై ఒక రచయితకు చెప్పే తన కథ.
నటీనటులు
[మార్చు]- పిస్సీన్ మోలిటర్ పై - కథానాయకుడు
- గౌతం బేలూర్ - పై, వయస్సు 5 ఏళ్లు
- అయూష్ టాండన్ - పై, వయస్సు 11/12 ఏళ్లు
- సూరజ్ శర్మ - పై, వయస్సు 16 ఏళ్లు
- ఇర్ఫాన్ ఖాన్ - పై, పెద్దయిన తరువాత
- గెరార్డ్ డిపార్డ్యూ - వంట మనిషి
- రఫే స్పాల్ - యాన్ మార్‌ట్టెల్, నిజ జీవితంలో ఈ కథ రాసిన వ్యక్తి
- టబు - గీతా పటేల్, పై తల్లి
- ఆదిల్ హుస్సేన్ - సంతోష్ పటేల్, పై తండ్రి
కథ
[మార్చు]ఫై బాల్యం
[మార్చు]పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్న రవితో కలిసి జూ ప్రాంగణంలోనే నివాసం. జూ లోని జంతువులతో సావాసం. పుట్టుకతో హిందువు, కానీ పద్నాలుగేళ్ళ వయసులో క్రిష్టియానిటీ, ఇస్లాం మతాల మీద కూడా నమ్మకం కుదిరి, మూడు మతాల ప్రార్థనలూ చేస్తుంటాడు. పైకి పదహారేళ్ళ వయసున్నప్పుడు, అతని తండ్రి ఎమర్జన్సీ టైంలో (1976 లో) పాండిచ్చేరీలో జూ నిర్వహణకీ, ఇతర వ్యాపారాలకి భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించక, కెనడా వలస పోవాలని నిర్ణయించుకున్నాడు. జూలోని కొన్ని ముఖ్యమైన జంతువులని అమెరికాలోని కొన్ని జూలకి అమ్మేసారు. ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని ఒప్పందం. తన కుటుంబం తోనూ, ఆ జంతువులతోనూ కలిసి, ఒక జపానీ ఓడలో పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం. ఓ మూడు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత ఒక తుపానులో ఓడ మునిగిపోయింది. పై మాత్రం ఎలాగో ఒక చిన్న లైఫ్ బోట్లోకి చేరుకోగలిగాడు. తన మిగతా కుటుంబం అంతా ఓడతో పాటూ మునిగిపోయింది.
File:Sumatraanse Tijger.jpg
సముద్ర ప్రయాణం
[మార్చు]ఆ లైఫ్ బోట్లో పైతో పాటూ ఒక చారలగుర్రం (జీబ్రా), ఒక ఒరాంగుటాన్ (Orangutan), ఒక దుమ్ములగొండి (హయీనా), ఒక పెద్దపులి కూడా చోటు సంపాదించుకుంటాయి. జీబ్రానీ, ఒరాంగుటాన్నీ హయీనా, ఆ హయీనాని పులీ తినెయ్యగా, చివరికి పులీ, పై పడవలో మిగులుతారు. పులి గారికి రిచ్చర్డ్ పార్కర్ (Richard Parker) అని ఓ మంచి పేరు కూడా ఉంది. మిగిలిన కథ అంతా ఆ పులితో, ఆ సముద్రంలో, పై కొనసాగించిన ప్రయాణపు వయినంతో నడుస్తుంది.
ఒక వైపు పైకి తను ఒంటరి కానందుకు కొంచెం సంతోషం, ఒకవైపు పులితో సావాసం చేస్తూ క్షణక్షణం గండంగా ఉన్న పై పటేల్ పై ముందున్నవి రెండు సమస్యలు… ఒకటి పులికి తను ఆహారం కాకుండా ఉండాలంటే, దానికి వేరే ఆహారం సమర్పించుకోవడం. రెండు ఆ చిన్న బోట్లో ఎవరి హద్దులు ఎంతవరకో, ఎవరు ఎవరికి యజమానో స్పష్టం చెయ్యడం.
రెండో దానికి తను జూ వాతావరణంలో పెరిగి, అక్కడ తండ్రి నుంచీ, ఉద్యోగుల నుంచీ గ్రహించిన ఏనిమల్ సైకాలజీ, ట్రైనింగ్ సమయానికి ఉపయోగపడ్డాయి. కానీ చుట్టూ అగాధం లాంటి మహా సముద్రంలో, పులి తినగలిగే ఆహారం సంపాదించడం ఎలా? పాపం దానికోసం పడరాని పాట్లు పడ్డాడు. శుద్ధ శాకాహారి అయిన తను, సముద్రంలో దొరికే చేపలూ, తాబేళ్ళూ పట్టి, వాటిని చంపి పులి ఆకలి తీరుస్తాడు. మొదటిసారి చేపను పట్టుకొని, దానిని చంపడానికి ఒక దుప్పటిలో చుట్టి, గొడ్డలితో కొట్టడానికి పడే సంఘర్షణ నుండి, పాశవికంగా వట్టి చేతులతో కొట్టి చంపగలిగే మనస్థితికి చేరుకుంటాడు. ఆ నేపథ్యంలో పడిన వేదన, నెమ్మదిగా ఆ పనికి అలవాటు పడి యాంత్రికంగానూ కొంచెం క్రూరంగానూ మారిన వైనం చదువుతుంటే కొంచెం వొళ్ళు జలదరిస్తుంది. జంతువుతో సమానంగా దొరికిన అడ్డమైన దాన్నీ తినడం … అసహ్యంతో పొట్టలో దేవేస్తుంది. కానీ అలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో మనిషికి వేరే దారి, విచక్షణ ఉండవు మరి.
పులికి సరిపడా తిండి పెట్టాక, దానికి తన హద్దులు ఏమిటో తెలియ చెయ్యడానికి, సర్కస్లో ఉపయోగించే ట్రైనింగ్ పద్ధతులు ఉపయోగిస్తాడు. బోట్లో ఒక వైపు మాత్రమే పులి తిరగగలిగిన ప్రదేశమనీ, ఆ లిమిట్స్ దాటి బయటకు రావటానికి వీల్లేదనీ తెలియచేసి, తన చుట్టూ ఒక రక్షణ కవచం కట్టుకున్నాడు. అయినా కూడా భయమే, ఏ నిద్రపోతున్న క్షణంలోనో అది మీదపడి అంతు చూస్తుందేమో అని. అసలు బోట్ లోంచి పులి ఆదమరపుగా ఉన్నప్పుడు సముద్రంలోకి తోసేద్దామా అనుకుంటాడు కూడా ఒకసారి, కానీ ఒంటరిగా ఆ బోట్లో గడపటం కన్నా రిస్క్ తీసుకుని పులితో కలిసి బ్రతకడమే మేలు అనుకుంటాడు. కొన్నాళ్ళకి ఇంకొక షిప్ దూరంనుంచి వెళ్తుంటే చూసి, చూడు చూడు రిచర్డ్ పార్కర్, మనం రక్షించబడే సమయం వచ్చేసింది, ఎంతో సేపు పట్టదు అని ఆనందపడతాడు. కానీ అందులో ఎవరూ వీళ్ళని చూడకుండానే దూరమయిపోతారు.
అలా ఆ లైఫ్ బోట్లో పులితో కలిపి దాదాపు ఏడు నెలలు సముద్రంలో గడిపిన తర్వాత, మెక్సికో తీరం చేరుకుంటాడు. పై కూడా చివరికి కథ సుఖాంతం అవుతున్నందుకు సంతోషపడి, ఇన్నాళ్ళు తను ఒంటరితనంతో చావకుండా తనకి తోడున్నందుకు పులికి థాంక్స్ చెప్పి వీడ్కోలు తీసుకుందాం అనుకున్నాడు. ఇంకా ఎక్కడ పులి? తీరం చూడగానే పులి ఒక్క దూకు దూకి, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రక్కనే ఉన్న అడవుల్లోకి పరిగెడుతుంది. “అయ్యో, రిచర్డ్ పార్కర్ నాకు ఆఖరిసారి వీడ్కోలు కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడో, ఇన్నాళ్ళు ఒకరికొకరం తోడుగా ఉన్నాం కదా, అలా ఎలా చెయ్యగలిగాడు?” అంటూ పై బాధపడతాడు. అన్ని నెలలుగా సరైన తిండి లేక, ఎండకు ఎండీ వానకు తడిసీ సరిగా నిలబడే శక్తి కూడా లేదు పై కి. పై అక్కడ తీరంలో స్పృహ తప్పి పడి ఉంటే, కొందరు మెక్సికన్లు అతనిని చూసి వూర్లోకి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, తిండి పెట్టి హాస్పిటల్లో చేరుస్తారు.
పులితో అనుభవం
[మార్చు]అతను ప్రయాణించిన పడవ మునుగుట, అతను పులి మాత్రమే బ్రతుకుట
పై హాస్పిటల్లో ఉండగానే, జపనీస్ ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ నుండి ఇద్దరు ఉద్యోగులు పైని కలవడానికి వస్తారు. తమ షిప్ మునిగిపోడానికి కారణం ఏంటో చెప్తాడేమో అని వాళ్ళ ఆశ. పాపం ఎంతసేపూ నేనూ రిచర్డ్ పార్కర్ అంటూ కథలు చెప్తాడే గానీ, షిప్ కి ఏం జరిగిందో తెలీదు పొమ్మంటాడు. ఆ విషయం రాబట్టడానికి వాళ్ళు నానా రకాలుగా ప్రయత్నించి విసుగెత్తి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే మీరు నా కథ నమ్మటం లేదా అని అడిగాడు. ఋజువు చూపిద్దామంటే ఉన్న ఒకే సాక్షి రిచర్డ్ పార్కర్ కనీసం చెప్పకుండా వెళ్ళిపోయాడు అని వాపోయాడు. వాళ్ళు అలా కాదు గానీ, వేరే ఇంకేదన్నా నమ్మదగిన కథ చెప్పు చూద్దాం అన్నారు. సరే అని తను ఇంతకూ ముందు చెప్పిన కథే పాత్రలు మార్చి చెప్పాడు.
ఈసారి కథలో బోట్లో తనతో పాటూ తన అమ్మ, షిప్ లోని వంటవాడు, ఒక నావికుడు ఉన్నారు. నావికుడికి షిప్ లోంచి బయటపడి బోట్లోకి వచ్చే సమయంలో కాలు విరిగి నడవలేకుండా ఉన్నాడు. వంటవాడు తను సర్వైవ్ అవ్వడానికి దేనికైనా తెగించగలిగే క్రూరుడు. తనని రక్షించుకునే ప్రయత్నంలో ఎలాగో చివరకు వంటవాడిని చంపి పై ఒక్కడే బోట్లో మిగులుతాడు. ఇదుగో కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా తేలాను, ఈ కథ ఎలా ఉంది? పోనీ ఇదైనా నమ్ముతారా లేక ఇంకేమన్నా మార్చాలా చెప్పండి అని అడిగాడు. వచ్చిన వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుని, “అలా కాదులే షిప్ ప్రమాదం గురించి ఏమైనా చెప్పగలిగితే చెప్పు చాలు. నీకు రావాల్సిన నష్టపరిహారం జపాన్ షిప్పింగ్ కంపెనీ తొందర్లోనే అందే ఏర్పాట్లు చేస్తుంది” అన్నారు. వాళ్ళు వెళ్ళిపోబోతుండగా పై ఆపి, మీరు నేను చెప్పిన రెండిటిలో ఏ వర్షన్ నమ్ముతారు అని అడిగాడు. వాళ్ళు తాము పులి ఉన్న కథే బావుంది అని చెప్తే, పై నవ్వి “so it goes with god” అంటాడు.
పుస్తకం మొదట్లో వచ్చే దాదాపు మూడోవంతు భాగం, జూ లోని జంతువుల సైకాలజీ, వాటి శిక్షణ, అలవాట్ల గురించీ అవసరమైన దానికన్నా ఎక్కువ వివరాలుంటాయి. మొదటిసారి చదివేటప్పుడు, ఇవన్నీ ఇంత వివరంగా అవసరమా అనిపిస్తుంది. కానీ పుస్తకం చదవటం పూర్తయ్యాకా, లేదా మళ్ళీ రెండో సారి చదువుతున్నప్పుడు ప్రతీ వివరం “yes, makes sense and related” అనిపిస్తుంది. అలానే సముద్రంలో కనిపించే రకరకాల జీవజాలం గురించి కూడా ఎన్నో వర్ణనలూ, వివరాలూ. మనిషి వేరే మనిషితో కన్నా, తనతో తనే ఎక్కువగా మాట్లాడుకోగలడు అనిపించేలా, పై అంతులేని ఆలోచనలు పేజీల కొద్దీ. అంతా రచయిత మాటల గారడీ, మెస్మరిజం…. ఒక్కోసారి నిజమేనేమో అని నమ్మేలా, ఒక్కోసారి నిజంగానా అని తర్కించుకునేలా. వెరసి కనీసం ఒకసారి చదవాల్సిన పుస్తకం. చదవాలని అనుకుంటే అప్పుడప్పుడూగా కాకుండా ఏకబిగిన చదవగలిగిన సమయం చూసుకుని చదవాల్సిన పుస్తకం.
ముగింపు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Life of Pi - The Hollywood Reporter". Hollywood Reporter. Retrieved December 15, 2013.
- ↑ "LIFE OF PI (PG)". British Board of Film Classification. November 9, 2012. Retrieved November 23, 2012.
- ↑ 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;bom
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు