Jump to content

వజ్జా వెంకయ్య

వికీపీడియా నుండి
వజ్జా వెంకయ్య
జననం1926
మరణం2020, నవంబరు 21
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు

వజ్జా వెంకయ్య (1926 - 2020, నవంబరు 21) తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు. సామ్యవాద సిద్ధాంతాలకు ఆకర్షితుడైన వెంకయ్య ప్రజాజీవితాన్ని సాగించి, పోరాటంలో రెండేళ్ళకు పైగా జైలుజీవితాన్ని గడిపాడు.[1]

జననం

[మార్చు]

వెంకయ్య 1926లో బుచ్చయ్య - కోటమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలంలోని మండ్రాజుపల్లిలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వెంకయ్యకు అమతమ్మతో వివాహం జరిగింది.

సాయుధ పోరాటం

[మార్చు]

1944లో నేలకొండపల్లిలో జరిగిన పాలేరు ప్రాంత పూర్వ ఆంధ్ర మహాసభలో పాల్గొనడం ద్వారా ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. ఖమ్మంలో నిర్వహించబడిన ఉద్యమానికి ముఖ్య భూమిక పోషించాడు. 1946 ఫిబ్రవరిలో మల్కాపురంలో జరిగిన 'కర్ర ట్రైనింగ్‌ క్యాంప్‌'లో శిక్షణ పొందాడు. 1946 జూన్‌లో ఏర్పడిన నేలకొండపల్లి- పాలేరు ప్రాంతీయ సాయుధ దళంలో సభ్యుడిగా చేరి రెండేళ్ళపాటు కొనసాగాడు. దళ సభ్యుడిగా నిజాం రాజుకు వ్యతిరేకంగా శిస్తులు కట్టకుండా చేయడం, దారులకు గండికొట్టి పోలీసుల ప్రయాణాలకు ఇబ్బందులు కలిగించే పనులు చేసేవాడు. 1948 సెప్టెంబరు 13న యూనియన్‌ సైన్యాలు తెలంగాణ ప్రాంతానికి వచ్చిన సమయంలో ప్రాంతీయ దళంలోని చెన్నారం పార్టీ క్యాంప్‌కు వెంకయ్య లీడర్‌గా ఉన్నాడు. భూస్వాములు, రజాకార్లలకు చెందిన భూములను ప్రజలకు పంచిపెట్టాడు.[1]

జైలు జీవితం

[మార్చు]

మూడేళ్ళపాటు అజ్ఞాతంలో ఉన్న వెంకయ్యపై పోలీసులు అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. దాంతో 1949 జనవరి 30వ తేదీన లోంగిపోయిన వెంకయ్య 1951 మార్చి 13 వరకు జైలు జీవితం గడిపాడు. మొదటగా ఖమ్మం తీగల జైలులో ఉంచి వారంలో ఒకరోజు మాత్రమే అన్నం, మిగిలిన రోజులు జన్న గుగ్గిళ్ళు పెట్టేవారు. ఖమ్మం జైలులో నాలుగు నెలల పది రోజుల తరువాత గుల్బార్గా జైలుకు తరలించారు. అక్కడ జైలులోని అసౌకర్యాల గురించి తొటి నాయకులతో కలిసి వెంకయ్య పోరాటం చేశాడు. ఆ పోరాటంలో పాల్గొన్నందుకు ఒకరోజు ఎండలో మాడ్చడం, మరొక రోజు వానలో తడపడం వంటి చిత్రహింసలను పెట్టారు. ఒకరోజు ' బాకిలే' అనే అధికారి జైలుకు వస్తే వెంకయ్య జైలులోని పరిస్థితులను రిపోర్టు చేస్తే వెంకయ్య కాళ్ళకు బేడీలు వేసి 'గంజికొట్లో' వేసి మూడురోజులు విపరీతంగా లాఠీలతో కొట్టారు. కామన్‌వెల్త్‌ కోర్టుకు అప్పీలు చేసిన తర్వాత విడుదలయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

1956 మార్చిలో తల్లంపాడు వచ్చిన వెంకయ్య, ఆ గ్రామంలో సీపీఐ (ఎం) పార్టీని స్థాపించి 1981 గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలిచాడు. తల్లంపాడు చెరువు నీటి తీరువా చైర్మన్‌గా, డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేశాడు. తన దగ్గర పనిచేసే పాలేర్లకు, కూలీలకు సన్మానాలు చేశాడు.[2]

మరణం

[మార్చు]

హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందిన వెంకయ్య 2020, నవంబరు 21న మధ్యాహ్నం మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "మార్క్సిస్టు వజ్రం 'వజ్జా'". NavaTelangana. 2020-11-22. Archived from the original on 2023-01-20. Retrieved 2023-01-20.
  2. "వజ్జా వెంకయ్య". NavaTelangana. Archived from the original on 2023-01-20. Retrieved 2023-01-20.