వాడుకరి:Bvprasadtewiki/వెలువోలు సీతారామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెలువోలు సీతారామయ్య స్వాతంత్య్ర సమరంలో వెన్నుచూపని ధీరుడు, సహకారోద్యమకారుడు వెలువోలు సీతారామయ్య

బాల్యం[మార్చు]

1850లో విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణంతో తెనాలి తాలూకాలోని అన్ని గ్రామాలకు నీటి సౌకర్యం ఏర్పడింది. పంటలు బాగా పండి గ్రామాలు అభివృద్ధిపథంలో పయనించాయి. అలాంటి గ్రామాల్లో అమృతలూరు ఒకటి. అక్కడి సంస్కృత పాఠశాల పరిసర గ్రామాల్లోని ప్రజలకు విద్యావికాసాన్ని అందించింది. ఆ గ్రామంలో వెలువోలు రంగయ్య, బుల్లెమ్మ దంపతులు సంపన్న కుటుంబీకులు వారు పెట్టుపోతలకు, వినయ విధేయతలకు కొరతలేని ఆదర్శ జీవనులు. ఈ పుణ్యదంపతులకు సీతారామయ్య 1907 డిసెంబరు 24న జన్మించారు. సీతారామయ్య బాల్యం నుంచి చదువుపై దృష్టి పెట్టారు. యుక్త వయస్కులయ్యేనాటికి సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషులో పట్టు సాధించారు. పెద్దలతో సాన్నిహిత్యంతో పాటు నిరంతర గ్రంథపఠనం ఆయనను పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దాయి.అమృతలూరులోని శ్రీభాషా సంజీవని సంఘం గ్రంథాలయం సీతారామయ్యను త్యాగిగా, వ్యక్తిత్వం గల నాయకునిగా తీర్చిదిద్దింది. ఆ గ్రంథాలయ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషిచేశారు. 1933లో ఆ సంస్థకు అధ్యక్షు డయ్యారు. 1921లో గాంధీజీ విజయవాడ వస్తున్నారని తెలుసుకున్నారు. గ్రామ యువకులతో పాటు సీతారామయ్య కూడా విజయవాడ వెళ్ళి గాంధీజీని చూశారు. తర్వాత కాలంలో ఇంగ్లండ్లో చదివి వచ్చిన తన సమీప గ్రామస్థుడు కల్లూరి చంద్రమౌళిగారితో పరిచయం ఏర్పడింది. చంద్రమౌళితో పరిచయం సీతారామయ్య గారిని స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపింది.

గాంధీజీ దర్శనం[మార్చు]

1929 ఏప్రిల్ 20న అమృతలూరు గ్రామస్థులందరికీ పండుగ రోజు. భారతదేశ స్వరాజ్య సాధన కోసం పోరాడుతున్న గాంధీజీ ఆ గ్రామానికి వస్తున్నారు. గ్రామస్థులంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఊడ్చి, మామిడి తోరణాలతో అలంకరించారు. గాంధీజీ ప్రసంగించడానికి వేదికను సిద్ధం చేశారు. ఆ రోజు ఉదయం మోపర్రు నుంచి టాపులేని కారులో ప్రయాణిస్తూ తురుమెళ్ళలో ప్రసంగించిన గాంధీజీ అమృతలూరు చేరుకున్నారు. గ్రామమంతా ఆ వేదిక వద్దకు చేరుకొని గాంధీజీ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. స్వాతంత్య్రం అవసరాన్ని గాంధీజీ యువకులకు ప్రబోధించారు. సీతారామయ్యగారితో పాటు ఆ గ్రామ యువకులను గాంధీజీ ప్రసంగం స్వాతంత్ర్యోద్యమం వైపు మరలించింది. గ్రామస్థులు గాంధీజీకి రూ.1300 సమర్పించారు. కొందరు స్త్రీలు తమ నగలను గాంధీజీకి విరాళంగా అందజేశారు.

ఉప్పు సత్యాగ్రహంతో జైలు[మార్చు]

1930 ఏప్రిల్ 6న దండి లో ఉప్పు తయారుచేసి గాంధీజీ అరెస్టయ్యారు. దాంతో దేశం నలమూలలా ఉప్పు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. గుంటూరులో జరుగనున్న సత్యాగ్రహంలో పాల్గొనటానికి యువకుల బృందం అమృతలూరు నుంచి బయలుదేరింది. వారిలో మన సీతారామయ్య కూడా ఉన్నారు. ఈ బృందం గుంటూరులోని యడవల్లి వారి సత్రంలో పెద్ద బాండీలలో చీరాల నుంచి తెచ్చిన నీటితో ఉప్పు తయారుచేయడం ఆరంభించారు. ఇంతలో పోలీస్ విజిల్ మోగింది. సత్యాగ్రహులెవ్వరూ వెనుకడుగు వేయలేదు. పోలీసులు హెచ్చరిక లేకుండానే లాఠీఛార్జి ప్రారంభించారు. తర్వాత సత్యాగ్రహులనందరినీ అరెస్టుచేసి సబైలుకు తరలించారు. విచారణ అనంతరం వెలువోలు సీతారామయ్యకు 9 నెలల కఠిన కారాగార శిక్ష, రూ.50 జరిమానా విధించారు. సీతారామయ్య గారీ జైలు శిక్షను రాజమండ్రి, కోయంబత్తూరు, ఆలీపురం జైళ్ళలో అనుభవించారు. నాడు ధాన్యం బస్తా రూ.2-50 మాత్రమే.


దుర్భరమైన జైలు జీవితం[మార్చు]

ఆ రోజుల్లో జైలు జీవితం చాలా దుర్భరంగా ఉండేది. జైలు అధికారులు చాలా కఠినంగా వ్యవహరించేవారు. రాత్రివేళ లైట్లు తీసివేసేవారు. 15 మందిని ఉం గదిలో 30 మందిని ఉంచేవారు. ఉదయాన్నే మట్టి మూకుళ్ళలో గంజిని పోసేవారు. అన్నం ఇనుప పాత్రల్లో వండుట వల్ల నల్లగా ఉండేది. దానిలోకి బర్రెబచ్చలి, ముల్లంగి ఆకు కలిపిన పులుసు వేసేవారు. కప్పుకోవడానికి ఒక గొంగళిని ఇచ్చేవారు. మట్టి మూకుడు, సత్తు లోటా, జైలు దుస్తులు ప్రతివారికి తప్పనిసరి. దుర్భర జైలు జీవితం గడిపిన వెలువోలు సీతారామయ్య జైలు నుండి విడుదలైన తర్వాత స్వాతంత్ర్యోద్యమంలో మరింత చురుకుగా పాల్గొన్నారు.

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నిర్వహణ[మార్చు]

గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వెర్రెయ్యగారి మేడలో ప్రారంభించారు. తెనాలి తాలూకా ప్రాంతంలో స్వాతంత్రోద్యమ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. తనకు మిత్రులైన కల్లూరి చంద్రమౌళి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవటంతో సీతారామయ్యగారి బాధ్యతలు మరింతగా పెరిగాయి. ఆయన తరచూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వెళుతూ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తన సహకారాన్ని అందించారు. 1936లోనే అమృతలూరు గ్రామ పంచాయతి ప్రెసిడెంట్గా సీతారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే కాలంలో ఆయనను తాలూకా బోర్డు సభ్యుడి గానూ, జిల్లా బోర్డు సభ్యుడిగానూ ఎన్నుకున్నారు. గ్రామస్థుల సహకారంతో గ్రామంలో రోడ్ల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1937లో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1940 నుంచి ఆంధ్ర కాంగ్రెస్ సంఘానికి కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.

మరోసారి జైలుకు[మార్చు]

1940లో గాంధీజీ యువకులను వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. సీతారామయ్య తాను పాల్గొంటానని జల్లా కాంగ్రెసు దరఖాస్తు చేశారు. ఆ విధంగా జిల్లా కాంగ్రెస్కు వచ్చిన దరఖాస్తులను మహాత్ముని ఆమోదం కోసం వార్తా పంపారు. గాంధీజీ కేదర్ల వారీగా పేర్లను పరిశీలించి, కొంతమందిని ఎంపికచేసి ఎవరెవరు, ఎక్కడెక్కడ సత్యాగ్రహం చేయాలో నిర్దేశించారు. ఆ క్రమంలో సీతారామయ్య అమృతలూరులో సత్యాగ్రహం చేయడానికి నిర్ణయ మైంది. అప్పటికి సీతారామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్థులు అనేకమంది వెంటరాగా అమృతలూరు గ్రామ సెంటరుకు వెళ్ళారు. ముందుగా తెలియజేయడంతో పోలీసులూ వచ్చారు. అక్కడ ఏర్పాటుచేసిన వేదికనెక్కి సీతారామయ్య, 'భారత్ మాతాకీ జై', 'స్వతంత్ర భారత్కీ జై', 'బ్రిటీష్ వారు భారతదేశం నుంచి వైదొలగాలి', 'బ్రిటీష్ ప్రభుత్వానికి ఎవరూ సహకరించొద్దు' అంటూ నినాదాలు చేస్తుండగా పోలీసులు ఆయనను అరెస్టుచేసి తెనాలి సబ్జైలుకు తరలించారు. కోర్టు ఆయన అనారోగ్యంతో ఉన్నందున ఆయనకు 2 నెలల జైలుశిక్ష, రూ. 300 జరిమానా విధించింది. సీతారామయ్యను తిరుచిరాపల్లి జైలుకు తరలించారు. దుర్భర జైలు జీవితం అనుభవించి తెనాలి చేరిన సీతారామయ్య ఆరోగ్యం మెల్లగా కుదుటపడసాగింది.

రాజకీయ యుద్ధ ఖైదీగా[మార్చు]

1942 ఆగస్టులో గాంధీజీ క్విట్ ఇండియాకు పిలుపునిచ్చారు. డూ ఆర్ డై అంటూ చావో రేవో తేల్చుకోవాల్సిందిగా ఉద్యమకారులను కోరారు. గాంధీజీ అరెస్టు చేశారు. ఇందుకు నిరసనగా ఆగష్టు 12న తెనాలి బందు పిలుపునిచ్చారు స్థానిక నాయకులు. ఆ రోజు కార్యకర్తలు తెనాలి రైల్వే స్టేషనును ధ్వంసం చేశారు. పూరీ ప్యాసింజరు రాగా దానిని తగులబెట్టారు. గుంటూరు నుండి వచ్చిన పోలీసు బలగాలతో కార్యకర్తలు తలపడ్డారు. పోలీసులు కాల్పుల్లో గురు మరణించారు. అదే రోజు ముఖ్య నాయకులందరినీ అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. సీతారామయ్యను 'డెటిన్యూ' (రాజకీయ యుద్ధఖైదీగా) విచారణ లేకుండా రాయవెల్లూరు, తంజావూరు జైళ్ళలో ఉంచారు. తంజావూరు జైల్లో వారి ఆరోగ్యం క్షీణించగా మద్రాసు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 1945 ఎన్నికలకు ముందు విడుదల చేశారు.

ఆంధ్ర అసెంబ్లీ కాంగ్రెస్ బాధ్యతల్లో[మార్చు]

1945 నాటికి కాంగ్రెస్ పార్టీపై నిషేధం ఉంది. నాటి బ్రిటీషు ఇండియా ప్రభుత్వం తెనాలిలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని సీల్ చేసింది. బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది. నాటి కాంగ్రెస్ వాదులంతా ఆంధ్ర అసెంబ్లీ కాంగ్రెసు ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు కల్లూరి చంద్రమౌళి అధ్యక్షునిగా, నీలం సంజీవరెడ్డి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ సంస్థ కార్యకలాపాలు తెనాలి కేంద్రంగా నడిచాయి. దాంతో తెనాలి మారీసుపేటలో గల సీతారామయ్యగారి వ్యాపార కార్యాలయంలో ఆంధ్ర అసెంబ్లీ కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటు చేశారు. కార్యాలయ నిర్వహణ ఖర్చుల్ని సీతారామయ్యగారే భరించేవారు. కార్యదర్శి నీలం సంజీవరెడ్డి ఎక్కువ కాలం ఈ కార్యాలయంలో గడిపేవారు. 1945 ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థుల నిర్ణయ కమిటీ సభ్యునిగా సీతారామయ్య పనిచేశారు. జిల్లాలో అన్ని స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 1947లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి వార్తా ఆశ్రమానికి వెళ్ళి గాంధీజీతో మాట్లాడి, రామస్వామి రెడ్డియార్ మద్రాసు ప్రావిన్స్కు ప్రధాని, చంద్రమౌళిగారు మంత్రి కావడానికి కృషి చేశారు.

1952లో సంజీరెడ్డిగారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నపుడు వీరిని ఆంధ్ర కాంగ్రెస్ ఎన్నికోద్యోగి (రిటర్నింగ్ అధికారిగా నియమించారు. వాటి నిర్వహణలో సీతారామయ్యగారి పాత్ర కీలకం. చిలువూరులో నిర్వహించిన రాజకీయ పాఠశాల నిర్వహణలోనూ బాధ్యత తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ రాష్ట్ర నాయకులతో విస్తృత సంబంధాలు కలిగిన సీతారామయ్య తన కార్యరంగాన్ని సహకార రంగం వైపు మళ్ళించారు. 1946 మే లో గోవాడలో ఎన్జీ రంగాగారి ఆధ్వర్యంలో రైతు మహాసభలు జరిగాయి. ఆ సభలకు వచ్చి వెళ్ళుచున్నవారిపై అమృతలూరులో కమ్యూనిస్టులు దాడికి దిగారు. విషయం తెలిసిన సీతారామయ్య అచటకు వెళ్ళి ఇరు వర్గాలను శాంతింపచేయ ప్రయత్నించారు. ఆ ఘర్షణలో సీతారామయ్య తలకు గాయమైనా లెక్కచేయక ఇరువర్గాలను శాంతింపజేశారు. తరువాత తనను విచారింప వచ్చిన పోలీసులకు కూడా ఆయన ఎవరిపై నేరారోపణ చేయలేదు. తాను ఇరువర్గాలను సర్దుతున్నప్పుడు పొరపాటున దెబ్బ తగిలింది కానీ ఎవరూ దురుద్దేశంతో కొట్టలేదని, పోలీసులకు తెలిపారు. అదీ సీతారామయ్యగారి గాంధేయ వాదం.

సహకార రంగంలో[మార్చు]

మద్రాసు రాష్ట్ర సహకార బీమా సొసైటీకి డైరెక్టరుగా, పాలక మండలి సభ్యునిగా 1949-1953 వరకు పనిచేశారు. 1948 నుంచి 1955 వరకు గుంటూరు జిల్లా హోల్సేల్ కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టరుగా చేశారు. 1950-57, 1976-80 వరకు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా ఉన్నారు. రైతు సోదరులకు విశేషంగా పరపతి సౌకర్యాన్ని పెంచారు. రైతుల దీర్ఘకాల రుణావసరాల నిమిత్తం తెనాలి ప్రాంతంలో ఒక బ్యాంకు అవసరమని వెలువోలు వారు గుర్తించారు. తన మిత్రులతో కలిసి తెనాలి భూమి తనఖా బ్యాంకును 1960లో ఏర్పాటు చేశారు. ఆ బ్యాంకుకు ఆయన 16 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా వ్యవహరించారు. తెనాలి ప్రాంత రైతులకు దీర్ఘకాలిక రుణాలను అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ భూమి తనఖా బ్యాంకు డైరెక్టరుగానూ సీతారామయ్య పనిచేశారు. 1980లో గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ డైరెక్టరుగా ఎన్నికయ్యారు. రైతులకు ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చారు. 1960లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కో-ఆపరేటివ్ సలహాదారునిగా నియమితులయ్యారు. సహకార సంఘాల మెరుగైన పనితీరుకు విలువైన సలహాలనిచ్చారు. 1980లో భారత ప్రభుత్వం వ్యవసాయ సహకార సంఘాల పనితీరుపై ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యుడిగా అవకాశం లభించిన సీతారామయ్య వివిధ రాష్ట్రాలలోని సహకార సంస్థల పనితీరును పరిశీలించి నివేదికను సమర్పించారు.

సాహితీ సౌరభం[మార్చు]

సీతారామయ్యగారు పద్యరచనలోనే గాక గద్యరచనలోను ప్రావీణ్యం సంపాదించారు. బెంగాలీ భాషలో అశ్వనీకుమార దత్తు రాసిన 'ప్రేమ' అను గ్రంథాన్ని హిందీ నుండి తెలుగుకు మన సీతారామయ్యగారు అనువదించారు. ఈ గ్రంథాన్ని నాటి పత్రికలే కాక, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి, శ్రీ స్వామి సీతారామ్ ప్రశంసించారు. నాటి 'భారతి' పత్రికలో సీతారామయ్య 1935 వరకు వ్యాసాలు[1] రాశారు. సీతారామయ్య గారి అధ్యక్షతన తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారికి నిడుబ్రోలులో కనకాభిషేకం నిర్వహించడం వారి సాహితీ సేవకు నిదర్శనం. హైదరాబాద్ రాజభవన్లో నాటి గవర్నర్ కందుభాయ్ దేశాయ్ స్వాతంత్య్ర సమరయోధులు సీతారామయ్యను సన్మానించి వారి సేవలను, త్యాగాన్ని ప్రశంసించడం జరిగింది. 1981లో తానా ఆధ్వర్యంలో చికాగోలో జరిగిన సభలలో 'మానవత్వం' పై సీతారామయ్య ప్రసంగించారు. ఆయన కెనడా, అమెరికాలలో 3 నెలలపాటు విస్తృతంగా పర్యటించారు.

విద్యాసంస్థల ఆవిర్భావంలోనూ[మార్చు]

తెనాలిలో 1950లో ఏర్పాటైన వి.ఎస్.ఆర్. కళాశాల స్థాపనలో విశేష కృషి చేశారు. ఆ కళాశాల పాలకవర్గ కోశాధికారిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా వివిధ బాధ్యతల్లో కళాశాల అభివృద్ధికి ఆయన చిరస్మరణీయమైన సేవలు అందించారు. మరోవైపు గాంధీజీ స్ఫూర్తితో హిందీ భాషాభివృద్ధికి[2] విశేష కృషి చేశారు. తెనాలిలో గల హిందీ ప్రేమీ మండలికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ తత్త్వవేత్త. శ్రీ అరవిందయోగి సిద్ధాంతాలతో తెనాలిలో ఏర్పాటుచేసిన శ్రీఅరవింద విద్యాకేంద్రం అధ్యక్షునిగా పనిచేశారు. శ్రీ అరవిందుల సిద్ధాంతాల ప్రచారానికి కృషిచేశారు. స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కమిటీకి గుంటూరు జిల్లా ప్రతినిధిగా పనిచేశారు (మరణించే వరకు) 1988 మార్చిలో భార్య శ్రీమతి సీతారామమ్మ మరణించారు. 1991 డిశంబరు 27న వెలువోలు సీతారామయ్య కీర్తిశేషులయ్యారు.

కుటుంబ జీవితం[మార్చు]

సీతారామయ్య కుటుంబ విషయానికొస్తే, ఆయనకు నలుగురు సోదరీమణులు. ఒక సోదరుడు ఉన్నారు. సీతారామయ్యగారి అక్క ధనరత్నమ్మ వివాహం గరికపాటి నాగయ్యతో జరిగింది. 1915లో సీతారామయ్య తండ్రి. రంగయ్యగారు మరణించారు. దాంతో ఆ కుటుంబ బాధ్యతలను చేపట్టిన నాగయ్య మరింత శ్రద్ధతో చూశారు. సీతారామయ్య తన సోదరి నాగభూషణం వివాహం అమృతలూరు వాస్తవ్యులు చదలవాడ చలమయ్యగారితో జరిపించారు. సోదరి అహల్యాదేవిని రాపర్ల వెంకట శివయ్యగారికిచ్చి వివాహం చేశారు. మరో సోదరి నాగరత్నమ్మ వివాహం పెదపూడి వాస్తవ్యులు తుమ్మల కోటయ్యగారితో జరిపించారు. 1923లో సీతారామయ్యగారికి కావూరు వాస్తవ్యులు నాగళ్ళ వెంకటరత్నం, లక్ష్మమ్మల కుమార్తె సీతారామమ్మతో వివాహం జరిగింది. శ్రీమతి సీతారామమ్మ అనుకూలవతియైన భార్య. ప్రజా జీవితం, జైలు జీవితాలు, స్వాతంత్ర్యోద్యమం నిమిత్తం ఖర్చులు, శ్రీమతి సీతారామమ్మ ఏనాడూ అభ్యంతరపెట్టని విషయాలు. ఆమె పూర్తి సహకారంతోనే సీతారామయ్యగారి ప్రజాసేవా జీవితం నడిచింది. సీతారామయ్య సోదరుడు ఆనందరావు అందరికంటే చిన్నవారు. రాముడికి లక్ష్మణుడు వంటివారు. సీతారామయ్యగారు తెనాలిలో ఉంటున్నా, జైలు జీవితం గడుపుతున్నా, ప్రజాహిత కార్యకలాపాల్లో తలమునకలై ఉన్నా ఆనందరావు | అన్నగారి భూముల నిర్వహణ అంతా చూసేవారు. ఆనందరావు గారికి అమృతలూరు వాస్తవ్యులు కొత్తపల్లి లక్ష్మీనారాయణ, బుల్లెమ్మల కుమార్తె వసంత పుష్పావతితో వివాహం జరిగింది.

ఉన్నత స్థాయికి ఎదిగిన సంతానం[మార్చు]

సీతారామయ్యగారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడు బసవయ్య ఆర్థిక శాస్త్రవేత్త. వీరు ఇండో-కెనేడియన్ అసోసియేషన్ల సమాఖ్యకు అధ్యక్షునిగా పనిచేశారు. కెనడాలో గల హిందు టెంపుల్స్ సొసైటీకి అధ్యక్షునిగా మూడు పర్యాయాలు పనిచేశారు. 1977లో అమెరికాలో ప్రారంభించిన తానా వ్యవస్థాపకులలో ఒకరు. భార్య భానుమతి. వీరు కెనడాలో ఉంటున్నారు. వారి ఏకైక కుమార్తె అనిత, డాక్టర్ శ్రీనివాస్ ను వివాహం చేసుకున్నారు. వారు అమెరికాలో ఉంటున్నారు. రెండో కుమారుడు చిత్తరంజన్ హైదరాబాద్ కో-ఆపరేటివ్ డిపార్టుమెంట్లో పనిచేశారు. భార్య ఝాన్సీ ఇటీవలే... వీరిరువురూ కాలధర్మం చెందారు. మూడో కుమారుడు జగదీష్బాబు, భార్య డాక్టర్ బేబీరత్నం, అమెరికాలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు డాక్టర్ అనిల్ కుమార్తె డాక్టర్ అనుజ. జగదీష్బాబు ఇటీవలే కీర్తిశేషులయ్యారు. నాలుగో కుమారుడు శ్యామ్బాబు. భార్య అమ్మాజీ. అమెరికాలో ఉంటున్నారు. వీరి కుమార్తె సమత. సీతారామయ్య ఏకైక కుమార్తె శోభాదేవికి తుమ్మల రంగారావుతో వివాహం జరిగింది. వారు విఎస్సార్ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. వీరు ఆంధ్రప్రదేశ్ కాలేజీ అధ్యాపకుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. వీరి కుమారుడు సుజిత్బాబు, కోడలు రాజ్యలక్ష్మి. వీరి కుమార్తె రీనాదేవి, అల్లుడు డాక్టర్ శివశంకరరావు.

మూలాలు[మార్చు]

  1. https://archive.org/details/in.ernet.dli.2015.328979/page/n3/mode/2up. https://archive.org/details/in.ernet.dli.2015.328979/page/n3/mode/2up. {{cite web}}: External link in |last= (help); Missing or empty |title= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. https://sanchika.com/tummala-kanakabhisheka-sanmana-sanchika-1/. {{cite web}}: Missing or empty |title= (help)