వావిళ్ల రామస్వామి శాస్త్రులు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వావిళ్ళ రామస్వామిశాస్త్రి | |
---|---|
జననం | వావిళ్ళ రామస్వామిశాస్త్రి 1826 వావిళ్ల |
మరణం | 1891 |
వృత్తి | ప్రచురణకర్త |
భార్య / భర్త | జానకమ్మ (మరణం-1873), జ్ఞానాంబ |
పిల్లలు | వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి |
తండ్రి | వెంకటేశ్వరశాస్త్రి |
తల్లి | మంగమ్మ |
వావిళ్ళ రామస్వామి శాస్త్రులు (జనన కాలం- 1826. మరణకాలం-1891) సుప్రసిద్ద తెలుగు గ్రంథ ప్రచురణ కర్త. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను ప్రచురించిన ఈయన సంస్కృతాంధ్ర పండితులు, భాషోద్ధారక బిరుదాంకితులు.
వీరు చెన్నపురిలో శృంగేరి పీఠానికి ప్రతినిధిగా ఉన్నారు. వీరు అసంఖ్యాకమైన తెలుగు, సంస్కృత గ్రంథాలు ముద్రించి ముద్రణ కళకు ఒక ప్రత్యేకతను సంపాదించారు.
వీరు 1854లో "వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్" అనే సంస్థను స్థాపించారు. ఇప్పుడు తెలుగుదేశంలో సర్వే సర్వత్ర వ్యాప్తిలో ఉన్న "గ్రేట్ ప్రైమర్" అనే టైపును 1860లో మొదట కనిపెట్టి అక్షరాలు పోత పోయించిన ధీశాలి. ఈ టైపులోనే మన ప్రాచీన గ్రంథాలు ముద్రించారు.
బాల్యము, విద్య
[మార్చు]రామస్వామి శాస్త్రి 1826లో వేంకటేశ్వర శాస్త్రి-మంగమ్మ దంపతులకు జన్మించారు. మొదట తంద్రి వద్ద ప్రాథమిక విద్యని అభ్యసించిన పిమ్మట నెల్లూరులో గట్టుపల్లి శేషయ్య శాస్త్రి, ఉడాలి శేషోపాధ్యాయుల వద్ద వేదాధ్యనం చేశారు. తరువాత చిలుకూరి పాపయ్యశాస్త్రి గారి శిష్యరికంలో ద్రాక్షారామంలో వ్యాకరణశాస్త్రం అభ్యసించారు. తరువాత చెన్నపురిలో సంస్కృత విద్యను అభ్యసించారు. కొన్నాళ్ళకి మైసూరులో రాజాదారణ లభిస్తుందని అక్కడికి చేరి అక్కడి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించారు.
ముద్రణ రంగంలో అనుభవాలు
[మార్చు]ఆ సమయంలోనే కన్నడ భాష నేర్చుకుని, అక్కడే సంస్కృత గ్రంథ ప్రచురణ కన్నడలిపిలో చేస్తే ప్రజాదరణ ఉంటుందని ఒక అచ్చుకూటం ఏర్పరుచుకుని కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అది అంత విజయవంతం కాకపోవడంతో తరువాత చెన్నపురికి తరలిపోయి అక్కడ తమ మేనమామతో కలిసి 1847లో వివేకరత్నారము అన్న మరొక ప్రెస్సును స్థాపించారు. తరువాత దానితో మరికొందరు భాగస్వాములను కలుపుకుని "హిందూభాషా సంజీవనీ ముద్రాక్షరశాల" అన్న మరొక ప్రెస్సును 1849లో స్థాపించారు. అయితే రెండేళ్ళలోనే ఇది మూతబడింది. దానితో సరస్వతి తిరువేంగడాచార్యులు అన్న మరొక పండితుడితో కలిసి "సరస్వతీనిలయము" అన్న మరొక ప్రెస్సును 1851లో స్థాపించారు. కానీ, ఆయన తిరిగి తమ స్వగ్రామానికి వెళ్ళిపోవడంతో ఇది కూడా మూతబడింది. చివరికి రామస్వామిశాస్త్రి తనంతటతానుగా, సొంతింట్లో 1854లో ఆదిసరస్వతీ నిలయము పేరిట మరొక ప్రెస్సు మొదలుపెట్టి నిలదొక్కుకున్నారు. దీనికే కొంతకాలం తరువాత రామస్వామి గారి మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన ఆయన పుత్రుడు వెంకటేశ్వర శాస్త్రి "వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్" అన్న పేరు పెట్టారు. అదే వావిళ్ళ ప్రెస్ గా పేరు పొందింది.
మూలాలు
[మార్చు]- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- తెలుగు జాతిరత్నాలు -వావిళ్ళ రామస్వామి శాస్త్రి , వజ్ఝల వేంకట సుబ్రహ్మణ్యశర్మ, సి.పి.బ్రౌన్ అకాడమీ ప్రచురణ, 2009.