వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 38వ వారం
నర్తనశాల (Narthana Sala) సినిమా పౌరాణిక ఇతివృత్తాలను వెండి తెరకెక్కించడంలో తెలుగు సినిమా దర్శకులకున్న ప్రతిభను మరొక్కసారి ఋజువు చేసింది. నటులు (నందమూరి తారక రామారావు, సావిత్రి, దండమూడి రాజగోపాలరావు, ఎస్.వి.రంగారావు వగైరా ), దర్శకుడు (కమలాకర కామేశ్వరరావు ), రచయిత (సముద్రాల రాఘవాచార్య), గీత రచయిత, సంగీత కళాదర్శకులు (సుసర్ల దక్షిణామూర్తి, టి.వి.ఎన్.శర్మ)- ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. రాజ్యం పిక్చర్స్ పతాకంపై దీనిని నిర్మించారు.
మహాభారతంలోని 'విరాట పర్వం'లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాధ ఈ చిత్రానికి ఇతివృత్తం. శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపైనుంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. అక్కడ కీచకుని కన్ను ద్రౌపదిపై బడుతుంది. మరో ప్రక్క పాండవులను కలుగులోంచి బయటకు లాగాలని దుర్యోధనుని చారులు ప్రయత్నిస్తుంటారు. ఉత్తర గోగ్రహణానంతరం పాండవుల అజ్ఞాతవాసం జయప్రదంగా ముగుస్తుంది. ఈ సినిమా చివరి సన్నివేశంలో వాడిన భారతంలోని తిక్కన పద్యాలు ఎంతో వన్నె తెచ్చిపెట్టాయి.
1964 లో జకార్తాలోని ఆఫ్రో ఆసియన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు, ఎస్వీఆర్, రేలంగి హాజరయ్యారు. ఎస్వీఆర్ స్వయంగా సుకర్నో చేతులమీదుగా అవార్డు అందుకొన్నాడు. ఈ చిత్రం యూనిట్‌కి సుకర్నో విందు ఇవ్వడం మరోవిశేషం...పూర్తివ్యాసం : వ్యాసాన్ని వినండి : పాతవి