వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 29వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యానాం విమోచనోద్యమం - 'యానాం, గోదావరి ఒడ్డున ఉన్న ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది భౌగోళికంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచ్చేరితో అనుసంధానింపబడి ఉంటుంది. పుదుచేరీ, కారైకాల్, మాహే మరియు యానాంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, 1954లో స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి. యానాం విమోచనం జూన్ 13, 1954న చర్చల ద్వారా, అహింసాయుత పద్దతుల ద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటి నాలుగు ఫ్రెంచి కాలనీలలో, యానామే మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమే.


ఉద్యమకారుల దృష్టిలో యానాం విమోచనమనేది ఫ్రెంచి పాలనా దాశ్య సృంఖలాలనుండి విముక్తమై స్వాతంత్ర్య భారతావనిలో విలీనం కావటానికి జరిపిన మహోద్యమము. భారత ప్రభుత్వము యానాం విమోచనాన్ని స్వాగతించదగిన దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించింది. భారత ప్రభుత్వం తన దేశ భక్తులతో చేయించిన ముట్టడిగా దీన్ని ఫ్రెంచి ప్రభుత్వం భావించింది. యానాం నాయకులు ఆంధ్రా ప్రజలతో కలసి ఫ్రెంచి వారినుండి అధికారాలను చేజిక్కించుకొని యానాం విమోచనం చెందిందని ప్రకటించారని కొంతమంది స్థానికులు భావించారు.


ఈ మహత్కార్యాన్ని భుజాన వేసుకొన్న నాయకులు ఈ ఉద్యమాన్ని శాంతియుత, ప్రజాస్వామ్యయుతంగా నడిపించిన తీరు అనన్యమైనది. వారి దార్శనికత అత్యంత ఉన్నతమైనది. ఫ్రెంచి ప్రభుత్వం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే తన మూడు సూత్రాలకు అనుగుణంగా ఈ కాలనీల పరిపాలన సాగించటంవలన ప్రజలు ఫ్రెంచి వారి పట్ల మమకారాన్ని ఏర్పరచుకున్నారు. తమ పొరుగు ప్రాంతంలో బ్రిటీష్ వారు సాగించిన దుష్టపాలన, ఈ కాలనీల వాసులలో ఫ్రెంచి వారిపట్ల ప్రేమను బలోపేతం చేసింది. అందుచేత తరతరాలుగా జీర్ణించుకున్న "సంస్కృతి" వలన ఉన్నపళంగా బయటకు వచ్చేయడం అంత సులువు కాలేదు. కనుక ఆ తరంలోని కొంతమంది తమ ఫ్రెంచి విధేయతకు, మారుతున్న రాజకీయ పరిస్థితులకు మద్య సంఘర్షణను ఎదుర్కోవలసి వచ్చింది. ......పూర్తివ్యాసం: పాతవి