వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 11వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మకరందము పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తియ్యని ద్రవము. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్తాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది, శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.


అనేక రకాల చక్కెరపదార్థాల సమ్మిశ్రమమే తేనె. ఇందులో 38 శాతం ఫ్రక్టోజ్, 31 శాతం గ్లూకోజ్, ఒక శాతం సుక్రోజ్, 17 శాతం నీరు, 9 శాతం ఇతరత్రా చక్కెర పదార్థాలు, 0.17 శాతం బూడిద ఉంటాయి. కేవలం చక్కెర ద్రావణానికి అంత చిక్కదనం ఎలా వచ్చిందాని చూస్తే - కూలీ ఈగలు మకరందాన్ని గ్రోలి తేనెపట్టు దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిల్లోని కొన్ని ఎంజైములు, అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తేనెపట్టులోకి చేరతాయి. అవి అక్కడ అనేకసార్లు రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతుంటాయి. దాంతో మకరందంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చక్కెర గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది.


తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. ....పూర్తివ్యాసం: పాతవి