Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 53వ వారం

వికీపీడియా నుండి

గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగానూ నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కుటుంబంతో సహా చెన్నైలో నివసిస్తున్నారు.

గొల్లపూడి మారుతీ రావు ఏప్రిల్ 14, 1939ఆంధ్రప్రదేశ్  విజయనగరం లో ఒక మద్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో మరో ఎడిషన్ ప్రారంభించారు. అక్కడ ఆయన సంపాదక వర్గంలో పనిచేశాడు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికయ్యి హైదరాబాద్ కు మారాడు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశాడు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పోంది సంబల్‌పూర్ వెళ్లాడు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. తరువాత ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమాలో రంగప్రవేశం చేశాడు.

మారుతీరావు రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954 డిసెంబరు 9న వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవాడు.మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగినది. సి.నారాయణ రెడ్డి కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రిగారు ఉపాధ్యాయులు.మారుతీరావు ను ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సంధర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి