డాక్టర్ చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ చక్రవర్తి
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి.మధుసూదనరావు
కథ కోడూరి కౌసల్యాదేవి
(చక్రభ్రమణం నవల ఆధారంగా)
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి,
జగ్గయ్య,
షావుకారు జానకి,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం,
గీతాంజలి,
పద్మనాభం,
చలం,
జయంతి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం బి.వసంత,
ఎస్.జానకి,
పి.బి.శ్రీనివాస్,
ఘంటసాల,
మాధవపెద్ది సత్యం,
పి.సుశీల
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

డాక్టర్ చక్రవర్తి, 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. కోడూరి కౌసల్యాదేవి రచించిన "చక్రభ్రమణం" ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా, నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి. మరణించిన చెల్లెల్ని తన స్నేహితుని భార్యలో చూసుకునే వ్యక్తిని ఆ స్నేహితుడు అపార్థం చేసుకోవడం ముఖ్యకథాంశంగా

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

అత్యంత జనాదరణ పొందిన కోడూరి కౌసల్యాదేవి నవల చక్రభ్రమణం ఆధారంగా సినిమా తీయాలని అన్నపూర్ణ వారు హక్కులు కొన్నారు. అంతకు కొన్నేళ్ళ క్రితం ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కె.విశ్వనాథ్ ని అన్నపూర్ణ పిక్చర్స్ లో దర్శకత్వ విభాగంలో పనిచేయమనీ, ఓ మూడు సినిమాలకు పనిచేశాకా దర్శకునిగా అవకాశం ఇస్తాననీ అక్కినేని నాగేశ్వరరావు ఆహ్వానించారు. అందుకు అంగీకరించి, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ వారి మూడు సినిమాలకు వరుసగా అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్. నాలుగో సినిమా అయిన ఈ డాక్టర్ చక్రవర్తికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించే అవకాశాన్ని నాగేశ్వరరావు కె.విశ్వనాథ్ కి ఇచ్చారు. అయితే అప్పటికి తనపై తనకు పూర్తి విశ్వాసం కలగకపోవడంతో ఆయన అప్పటికి సినిమా అవకాశాన్ని నిరాకరించారు. దాంతో ఆదుర్తి సుబ్బారావుకే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చక్రభ్రమణం నవలను సినిమాకు అనుగుణంగా మలిచి, స్క్రిప్ట్ ని గొల్లపూడి మారుతీరావు, రావూరి వెంకట సత్యనారాయణరావు తయారుచేశారు.[1]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

డాక్టర్ చక్రవర్తి (అక్కినేని), డాక్టర్ శ్రీదేవి (కృష్ణకుమారి) పూర్వాశ్రమంలో ప్రేమికులు. చక్రవర్తి సోదరి సుధ (గీతాంజలి) క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోతూ నిర్మల (షావుకారు జానకి) ను పెళ్ళిచేసుకోవలసిందిగా కోరుతుంది. దానిని మన్నించి చక్రవర్తి నిర్మలను పెళ్ళి చేసుకుంటాడు.

చక్రవర్తికి ఆప్తమిత్రుడు రవీంద్ర (జగ్గయ్య). అతని భార్య మాధవి (సావిత్రి) రచయిత్రి. వారిద్దరిదీ అనుకూల దాంపత్యం. మరణించిన చెల్లెలు సుధను మాధవిలో చూసుకుంటాడు చక్రవర్తి. దీనికి చిలవలు పలవలు కల్పించి సుర్యకాంతం వారి కాపురాల్లో జ్వాలను రగిలిస్తుంది. ఫలితంగా రవీంద్ర మిత్రుడు చక్రవర్తిని అనుమానించి అవమానిస్తాడు. పతాక సన్నివేశంలో రవీంద్ర జరిగిన పొరపాటును గ్రహించగా, డాక్టర్ శ్రీదేవి, చక్రవర్తిల సహాయంతో మాధవి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది.

పాత్రలు=పాత్రధారలు

[మార్చు]
నటుడు నటించిన పాత్ర
అక్కినేని నాగేశ్వరరావు డా. చక్రవర్తి
సావిత్రి మాధవి, రవీంద్ర భార్య
జగ్గయ్య రవీంద్ర
షావుకారు జానకి నిర్మల, చక్రవర్తి భార్య
కృష్ణకుమారి డా. శ్రీదేవి
గుమ్మడి వెంకటేశ్వరరావు శేఖర్
సూర్యకాంతం
గీతాంజలి సుధ, చక్రవర్తి చెల్లెలు
పద్మనాభం
చలం
జయంతి పద్మ

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు ఆత్రేయ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, మాధవపెద్ది సత్యం
నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది ఆత్రేయ సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా ఆత్రేయ సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
నిజం చెప్పవే పిల్లా ఎలా ఉంది ఈవేళ దాశరథి సాలూరి

రాజేశ్వర రావు

పి.సుశీల, బి.వసంత
ఒంటిగ సమయం చిక్కిందా కొసరాజు సాలూరి రాజేశ్వరరావు పి. బి శ్రీనివాస్, ఎస్. జానకి

ఇతర విశేషాలు

[మార్చు]
  • 1962లో ఆంధ్రప్రభ వారపత్రిక నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన నవల కోడూరి కౌసల్యాదేవి రచించిన "చక్రభ్రమణం". బహుళ పాఠకాదరణ పొందిన ఈ నవలను సినిమాగా తీయాలని సంకల్పించిన దుక్కిపాటి మధుసూధనరావు నవలలో ఏ పాత్ర ఎవరు ధరిస్తే బాగుంటుందని పాఠకులకు క్విజ్ నిర్వహించి, ఆ వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రధాన పాత్రల్ని ఎంపికచేశారు.
  • డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1964లో మొదలుపెట్టిన నంది అవార్డుల్లో బంగారు నంది గెలుచుకున్నది. దానిద్వారా లభించిన 50,000 రూపాయల పెట్టుబడితో అక్కినేని-ఆదుర్తి 'చక్రవర్తి చిత్ర' పతాకంపై సుడిగుండాలు, మరో ప్రపంచం అనే ప్రయోజనాత్మక చిత్రాల్ని నిర్మించారు.
  • ఈ చిత్రం విడుదలైన తర్వాత, అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై భారతదేశ సాంస్కృతిక రాయబారిగా సందర్శించారు. తన విదేశీ పర్యటన అనుభవాల్ని "నేను చూసిన అమెరికా" అనే గ్రంధంలో వివరించారు.

మూలాలు

[మార్చు]
  1. "మొదటి సినిమా-కె. విశ్వనాథ్, నవతరంగంలో". Archived from the original on 2015-08-26. Retrieved 2015-08-22.
  • బంగారు నంది నందుకొన్న తొలిచిత్రం "డాక్టర్ చక్రవర్తి", నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 205-6.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.