వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 07వ వారం
కల్వకుంట్ల చంద్రశేఖర రావు (జ: 17 ఫిబ్రవరి, 1954) నూతనంగా యేర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. ఇతడు మొదట తెలుగుదేశం పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసుతో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాత కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లానందలి చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నందలి ఎం.ఎ(తెలుగు సాహిత్యం) పూర్తి చేశారు. ఆయన ఏప్రిల్ 23 1969 న శ్రీమతి శోభ ను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె. కల్వకుంట్ల కవిత లు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. కుమారుడు కె.తారకరామారావు శాసన సభ్యులుగానూ, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలుగా యున్నారు.
(ఇంకా…)