Jump to content

వికీపీడియా:పాఠం (గుర్తుంచుకోండి)

వికీపీడియా నుండి
మొదటి పేజీ   దిద్దుబాటు   ఫార్మాటింగు   వికీపీడియా లింకులు   బయటి లింకులు   చర్చాపేజీలు   గుర్తుంచుకోండి   ఖాతా   ముగింపు    

వికీపీడియాలో రాసేటపుడు గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి.

సంపాదక విధానాలు

వ్యాస విషయాలు

వికీపీడియా మార్పు చేర్పులు చెయ్యగల విజ్ఞాన సర్వస్వం. అంచేత వ్యాసాలు విజ్ఞానం అందించేలా ఉండాలి. విజ్ఞానం అందించే విషయాలు ఏమిటనే విషయమై చర్చ ఎలాగూ ఉంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ,ప్రతి సంస్థా,ప్రతీ ఉళ్ళోని ప్రతి వీధి గురించి వ్యాసాలు ఉండాలి అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ప్రత్యేకించి కొన్ని రకాల విషయాల కోసం సోదర ప్రాజెక్టులు ఉన్నాయి.

ఓ పదానికో, పదబంధానికో నిర్వచనాన్ని మాత్రమే ఇచ్చే వ్యాసాలను విక్షనరీలో రాయాలి.

గతంలో ప్రచురించబడిన పుస్తకం వంటి మూల రచనలను వికిసోర్స్ లో రాయాలి.

సోదర ప్రాజెక్టుల పూర్తి జాబితా కోసం వికీమీడియా ప్రాజెక్టుల పూర్తి జాబితా చూడండి.

వికీపీడియా మౌలిక పరిశోధనలు చేసే స్థలం కాదు — అంటే ఇంకా సమీక్ష కాని కొత్త సిద్ధాంతాల వంటివి. మరిన్ని వివరాల కోసం ఏది వికీపీడియా కాదు చూడండి.

సభ్యులు తమ గురించి, తాము సాధించిన పనుల గురించి తామే స్వయంగా రాయకూడదని మేము భావిస్తాం. మీరు ఎన్నదగిన పనులు చేసి ఉంటే, ఏదో ఒక నాటికి ఎవరో ఒకరు మీ గురించి రాస్తారు కదా!

తటస్థ దృక్కోణం

తటస్థ దృక్కోణం వికీపీడియా సంపాదక విధానం. ఏ విషయం మీదైనా అన్ని దృక్కోణాలనూ ప్రతిఫలించడమే ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశ్యం. మా ఉద్దేశ్యం సమాచారం అందించడమే, ఒప్పించడం కాదు. వికీపీడియాలో దీన్ని NPOV (Neutral Point Of View) అని అంటారు. దీనికి వ్యతిరేకమైనది POV. మనం దీన్ని దృక్కోణం అని అనవచ్చు. పక్షపాత ధోరణితో ఉన్న వ్యాసాలను దృక్కోణంతో కూడుకున్న వ్యాసాలని అనవచ్చు.

వ్యాసాల్లో అభిప్రాయాలను రాయవచ్చు, కానీ వాటిని అభిప్రాయాలు గానే రాయాలి, వాస్తవాలుగా కాదు. అలాగే ఈ అభిప్రాయాలు ఎవరివో కూడా రాయాలి. ఉదాహరణకు.. "ప్రముఖ పాత్రికేయుడు ఫలానారావు గారి అభిప్రాయం మేరకు.."

కులం, మతం, రాజకీయం వంటి వివాదాస్పద విషయాల గురించిన వ్యాసాల్లో మీరు రాయదలిస్తే మీరు తటస్థ దృక్కోణం పై వ్యాసం చదివితే మేలు.

మూలాలను ఉదహరించడం

వ్యాసంలో మీరు రాసే సమాచారానికి సంబంధించి మూలాలను ఉదహరించాలి. అన్ని మూలాలను మూలాలు, వనరులు అనే విభాగంలో పొందుపరచాలి. వ్యాస విషయానికి సంబంధించిన ఇతర వెబ్ సైట్లను బయటి లింకులు విభాగంలో రాయాలి. అయితే ఈ లింకుల లోని సమాచారాన్ని వ్యాసానికి వనరుగా వాడుకుని ఉండరాదు.

కాపీహక్కులు

అనుమతులు లేకుండా కాపీహక్కులు గల వ్యాసాలను వికీపీడియాలో రాయకండి. వ్యాసంలో సమాచారం రాసేటపుడు, మీ స్వంత మాటల్లో రాయండి. ఇంటర్నెట్లో దొరికే ప్రతీ సమాచారమూ కాపీహక్కులు కలిగి ఉన్నదే అని మరువకండి, కాపీహక్కులు లేవు అని ప్రత్యేకించి ప్రకటిస్తే తప్ప.

మరిన్ని వివరాలకు వికీపీడియా:కాపీహక్కులు చూడండి.

ప్రవర్తన

వికీపీడియా స్నేహ సౌహార్ద్ర వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే అప్పుడప్పుడు విభేదాలు, వేడీ వాడీ అయిన చర్చలు తప్పవనుకోండి. ఆ సందర్భాల్లో వికీ సభ్యులు మర్యాదగా మెలగాలి.

అన్నిటి కంటే ముఖ్యమైనదేమిటంటే, ఇతర సభ్యుల నిబద్ధత పట్ల మీరు నమ్మకం కలిగి ఉండాలి. అవతలి వాళ్ళు దురాలోచనతో ఉన్నారని తలచకండి. మీకు కష్టం కలిగించే పని ఎవరైనా చేస్తే, సంబంధిత వ్యాసపు చర్చా పేజీలో గానీ, లేదా సభ్యుని చర్చా పేజీలో గానీ మర్యాద పూర్వకంగా ఓ సందేశం పెట్టి, ఎందుకలా చేసారో అడగండి. వారి సమాధానం తెలిసాక, తొందరపడి వారిని అనుమానించనందుకు మీరు సంతోషించవచ్చు.

ప్రవర్తనకు సంబంధించి మరిన్ని వివరాలకు, వికీపీడియా:సాంప్రదాయం చూడండి.

వ్యాసపు పేరు మార్పు

ఏదైనా వ్యాసం పేరును తప్పుగా పెట్టారని మీరు భావిస్తే, దాని పేరు మార్చవచ్చు. అయితే ఆ వ్యాసం లోని మొత్తం సమాచారాన్నంతా కాపీ చేసి, సరైన పేరుతో ఓ కొత్త పేజీ తెరిచి అందులోకి ఈ సమాచారాన్ని కాపీ చేసి కొత్త పేజీ సృష్టించకండి. దీనికి పద్ధతి ఏమిటంటే పేజీని కొత్త పేరు గల పేజీకి తరలించడమే! తరలింపు చేసే సమయంలో కనిపించే హెచ్చరికలను జాగ్రత్తగా చదవండి. అయోమయ నివృత్తి కోసం తరలిస్తుంటే, ముందు వికీపీడియా:అయోమయ నివృత్తి చదవడం మంచిది.

మరింత సమాచారానికై పేజీని తరలించడం ఎలా చూడండి.
ఇక, వికీపీడియా ఖాతా గురించి తెలుసుకోండి