Jump to content

వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు

వికీపీడియా నుండి

గొప్ప మేధస్సులు ఆలోచనలను చర్చిస్తాయి; మధ్యమ మేధస్సులు సంఘటనలను చర్చిస్తాయి; చిన్నబుఱ్ఱలు వ్యక్తుల గురించి చర్చిస్తాయి.

వికీపీడియాలో ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలు చేయవద్దు. పాఠ్యంపై వాఖ్యానించండి, పాఠ్యాన్ని చేర్చిన వాడుకరిపై కాదు. వ్యక్తిగత దూషణలు మీరు చెప్పదలచుకున్నదానికి సహాయపడవు. వాటివల్ల ఒరిగేదేమీ లేదు. ఇవి వికీపీడియా సముదాయానికి నష్టం మాత్రమే కలుగజేస్తాయి. వాడుకరులంతా కలిసి తయారు చేస్తున్న విజ్ఞానసర్వస్వానికి ఇవి అడ్డుపడతాయి. ఇతర వాడుకరులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఏ వాడుకరి అయినా తొలగించవచ్చు. పదేపదే ఇతర వాడుకరులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, అలా దూషణలు చేసిన వాడుకరులు నిరోధానికి గురౌతారు.

వ్యక్తిగత దూషణలు ఎందుకు హానికరమైనవి

[మార్చు]

వికీపీడియాలో వ్రాస్తుండేవారు తరచూ వ్యాసాలలో తమ ధృక్కోణాన్ని పొందుపరచాలని అనుకొంటారు. తర్కబద్ధమైన చర్చల ద్వారా ఈ ధృక్కోణాలను కలిపి ఒకే వ్యాసంలో పొందుపరచవచ్చు. ఈ విధంగా తయారైన వ్యాసం అందరి దృష్టిని నిష్పాక్షిక ధోరణిలో ప్రతిఫలించి, ఉత్తమ వ్యాసంగా నిలుస్తుంది. ఇలా వ్యాసాలను దిద్దే ప్రతి వ్యక్తి ఒకే కోవకు చెందుతారు -వికీపీడియన్లు.

వ్యక్తిగత దూషణలు కూడదన్న నియమము అందరు వికీపీడియన్లకు సమానంగా వర్తిస్తుంది. గతంలో మూర్ఖంగా లేదా దురుసుగా ప్రవర్తించిన చరిత్ర కలిగిన వాడుకరిపై కూడా వ్యక్తిగత దూషణలు చేయటం నిషిద్ధం. ఒక సాధారణ వికీపీడియనుపై వ్యక్తిగత దూషణలు చేయటం ఎంత తప్పో, నిరోధానికో నిషేధానికో గురైన వాడుకరులపై వ్యక్తిగత దూషణలు చెయ్యటం కూడా అంతే తప్పు. వికీపీడియా ఒక మర్యాదపూర్వకమైన సముదాయాన్ని ప్రోత్సహిస్తుంది. వాడుకరులు తప్పులు చేస్తారు. అయితే వాటినుండి నేర్చుకొని తమ పద్ధతులను మార్చుకోవటాన్ని ప్రోత్సహించాలి. వ్యక్తిగత దాడులు ఈ స్ఫూర్తికి విరుద్ధం, విజ్ఞానసర్వస్వ కృషికి అవరోధం.

వ్యక్తిగత దూషణలు జరగకుండా జాగ్రత్తపడటం

[మార్చు]

మర్యాదపూర్వకమైన, ప్రభావవంతమైన చర్చలకు అనుగుణంగా వ్యాఖ్యలను వ్యక్తిగతం చేయకూడదు. అంటే వ్యాఖ్యలను వ్యక్తులపై సంధించకుండా విషయాన్నీ చర్యలనూ ఉద్దేశించి మాత్రమే చెయ్యాలి.

వివాదాల్లో వీలైనంతగా "మీరు లేదా నువ్వు" అని వేలెత్తి చూపించడాన్ని నివారించండి. అయితే విషయం మీద అభిప్రాయభేదా లేర్పడినప్పుడు, ఇతర వాడుకరులను ప్రస్తావించడం వ్యక్తిగత దాడి కాదు. "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం మీరు వ్రాసిన ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో మీరు చొప్పించిన పేరా ప్రాథమిక పరిశోధన లాగున్నది" అని వ్యాఖ్యానించడం వ్యక్తిగత దాడి కాదు. కానీ ఇదే విషయాలను "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో చొప్పించబడిన ఫలానా పేరా ప్రాథమిక పరిశోధన లాగున్నది" అని వ్రాయటం శ్రేయస్కరం. ఈ విధంగా అవతలి వ్యక్తిని మధ్యమ పురుషలో ఉదహరించడాన్ని నివారించవచ్చు; మార్పుల తేడాను సూచించే లంకె ఇస్తే అయోమయం తగ్గుతుంది. అలాగే, సముచితమైన చర్చా వేదికపై (ఉదాహరణకి: ఇతర వాడుకరుల చర్చా పేజీలో లేదా వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డులో) ఒక వాడుకరి యొక్క ప్రవర్తన లేదా చరిత్రను చర్చించడం దానంతంటకదే వ్యక్తిగత దాడి కాదు.

అభిప్రాయ భేదాలను వివరించేటప్పుడు వాడుకరులు సామరస్యంగాను, వికీ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగానూ నడచుకోవాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎదుర్కొన్నప్పుడు, విషయానికి సంబంధించినంత వరకు వ్యాఖానించి ఊరుకోవటం ఉత్తమమైన ప్రతిస్పందన. ప్రతిస్పందనగా ఎదుటి వ్యక్తిని వ్యక్తిగత దాడి చేస్తున్నావని, ఈ విధానాన్ని ఉల్లంఘిస్తున్నావని నిందించడం సరైన పద్ధతి కాదు. సరైన ఆధారాలు, హేతువులు చూపకుండా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించడం కూడా ఒక విధమైన వ్యక్తిగత దూషణగా పరిగణించబడుతుంది.

ఎలాంటివి వ్యక్తిగత దూషణలుగా పరిగణించబడతాయి?

[మార్చు]

ఇది వ్యక్తిగత దాడి అని చెప్పగలిగే నిర్దుష్టమైన సూత్రం ఏదీ లేదు. అయితే ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు కొన్నున్నాయి:

  • ఒక వాడుకరి లేదా వాడుకరులకు అన్వయించి జాత్యహంకార, లైంగిక, లింగాధార, వయో, మత, రాజకీయ, కుల, జాతీయత, ప్రాంతీయత సంబంధ వ్యాఖ్యలు లేదా మరే ఇతర వైకల్యాన్ని (ఉదాహరణకి అంగవైకల్యం ఉన్న సభ్యులు) హేళన చేస్తూ లేదా కించపరుస్తూ చేసే వ్యాఖ్యలు. కొన్ని మత, జాతి, లైంగికత వంటి వర్గాల వర్గీకరణ విషయంలో ఉన్న బేధాభిప్రాయాలు ఈ విషయంలో అవహేళన చేయటానికి సాకుగా ఉపయోగించకూడదు.
  • వాడుకరికి సంబంధమున్న అంశాలను బట్టి వారి అభిప్రాయాలను తృణీకరించడం. ఉదాహరణకు "మీరు సాఫ్టువేరు ఇంజనీరు గదా, మీకు రైలు గురించి ఏం తెలుసు?" అని మాట్లాడ్డం. ఏదైనా ఒక విషయం మీదో ఒక వ్యాసం మీదో తమ ఆసక్తుల విభేదాల గురించి ఆ వాడుకరి పేజీలో అడగడం వ్యక్తిగత దాడిగా భావించబడదు. అయితే, ఇతర వాడుకరుల నిజజీవితంపై ఊహాగానాలు చెయ్యడం ఔటింగు కిందకు వస్తుంది. అది చాలా తీవ్రమైన దాడి.
  • ఇతర వాడుకరులపై దాడిచేసే ఉద్దేశంతో బయటి జరిగిన దాడులు, లేదా ఇతర విషయాలకు లింకులు ఇవ్వటం.
  • వాడుకరులను నాజీలు, నియంతలు, అలాంటి ఇతర దుర్మార్గులతో పోల్చడం. (గాడ్విన్ నియమం కూడా చూడండి.)
  • వ్యక్తిగత ప్రవర్తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చెయ్యడం. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలను పేజీ మార్పుల మధ్య బేధాలు, లింకులు రూపంలో వికీలో నివేదించాలి.
  • వ్యక్తిగత ప్రవర్తనపై అసందర్భమైన చోట్ల విమర్శలు చేయడం లేదా ప్రస్తావించడం. ఉదాహరణకు వ్యక్తిగత ప్రవర్తనపై వ్యాఖ్యలు చేయటానికి విధానపు పేజీలు, వ్యాసపు చర్చా పేజీలు, దిద్దుబాటు సారాంశాలు సరైన వేదికలు కావు. ఇలాంటి వాటికి ఆయా వాడుకరుల చర్చా పేజీలు, వివాద పరిష్కార పేజీలు లేదా రచ్చబండ సరైన వేదికలు. ఇక్కడ, వ్యాఖ్యానించాల్సింది విషయంపై గానీ, వ్యక్తులపై కాదు అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. వివాద పరిష్కారపు పద్ధతిపై మరింత సమాచారానికి en:WP:DR చూడండి.
  • వివిధ రకాల బెదిరింపులు:
    • చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించడం
    • దాడి చేస్తానని లేదా వికీ బయట చర్యలు తీసుకుంటానని బెదిరించడం (ముఖ్యంగా ప్రాణాంతక బెదిరింపులు)
    • వాడుకరి పేజీ లేదా చర్చా పేజీలలో దుశ్చర్యలకు పాల్పడుతానని బెదిరించడం.
    • ఇతర వికీపీడియా వాడుకరులను ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగులు లేదా ఇతరులచే రాజకీయ, మత హింసకు గురిచేసేందుకు ప్రత్యక్షంగా కారణమైన చర్యలు లేదా బెదిరింపులు. ఇటువంటి ఉల్లంఘనలను నిర్వాహకులు చూసిన వెంటనే, సంబంధిత వాడుకరిపై దీర్ఘకాలపు నిషేధం విధించే అవకాశం ఉన్నది. అటువంటి ఆంక్షలు విధించిన నిర్వాహకులు గోప్యంగా ఆ విషయాన్ని మధ్యవర్తిత్వ సంఘపు సభ్యులకు వివరణాత్మకంగా (ఏం చర్య తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు?) తెలియజేయాలి
    • వాడుకరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బయటపెడతానని బెదిరించడం.

ఈ జాబితా అసంపూర్ణం. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఏ విధంగా చేయబడినది అన్న విషయాన్ని పక్కనపెట్టి, ఒక వాడుకరిని నిందిస్తూ చేసిన ఎటువంటి చౌకబారు వ్యాఖ్యలైనా వాటిని వ్యక్తిగత దూషణగానే భావిస్తారు. ఇది వ్యక్తిగత దూషణగా పరిగణించబడుతుందా, లేదా అన్న సందేహం వచ్చినపుడు, వాడుకరిని ఏమాత్రం ప్రస్తావించకుండా కేవలం వ్యాసపు విషయంపై మాత్రమే వ్యాఖ్యానించండి.

వ్యక్తిగత దూషణలకు ఎలా స్పందించాలి

[మార్చు]

తొలి తప్పిదం మరియు చెదురుమొదురు సంఘటనలు

[మార్చు]

ప్రత్యేకించిన ఒకానొక వ్యక్తిగత దాడికి స్పందించే విధానం- దాన్ని అసలు పట్టించుకోకుండా ఉండడమే. వికీపీడియా, ఇక్కడ జరిగే చర్చలూ కారణంగా కొందరు వాడుకరులపై మానసిక వత్తిడి పెరిగి వారు అతిగా స్పందించే అవకాశం ఉంది. పైగా వికీపీడియా టెక్స్టు ద్వారా మాత్రమే చర్చ జరుపుకునే మాధ్యమం. చెప్పదలచుకున్న దాన్ని, దాన్ని అర్థాన్నీ అది సరిగ్గా ప్రతిబింబించలేక, అపార్థానికి దారితీయవచ్చు. అయితే, ఈ కారణాలు చూపి, వ్యక్తిగత దాడులను సమర్ధించలేం. అయినప్పటికీ, వీలైనంతవరకు కోపంగా, అమర్యాదగా రాసిన రాతలను పట్టించుకోకుండా వదిలెయ్యడాన్ని వికీపీడియా ప్రోత్సహిస్తుంది.

వాడుకరి చర్చా పేజీలోగానీ, వికీపీడియా నోటీసు బోర్డులోగానీ వాడుకరి ప్రవర్తనను చర్చించడం వ్యక్తిగత దాడి కాదు.

స్పందించడం అవసరం, ఆవశ్యకమూ ఐనపుడు మర్యాద పూర్వకంగా ఒక సందేశాన్ని వాడుకరి చర్చాపేజీలో పెట్టండి. వ్యాసపు చర్చా పేజీలో పెట్టకండి; ఇందువలన పరిస్థితులు విషమించవచ్చు. అలాగే, తిట్ల దాడి జరిగినపుడు కూడా మీరు సంయమనం వహించడం ముఖ్యం. ఇందుకు అవసరమైన మూసలు ఉన్నాప్పటికీ, సందర్భానికి తగినట్లుగా ఒక ప్రత్యేక సందేశాన్ని రాస్తే మరింత నయం. సాధ్యమైతే, ప్రవర్తన గురించి వాదించకుండా, ఇరు పక్షాలకూ అంగీకార యోగ్యమైన పరిష్కారం ఉందేమో పరిశీలించండి.

మరీ రెచ్చగొట్టేవి, వికీపీడియాను అడ్డగించేవీ అయిన దాడులను (భౌతిక దాడి బెదిరింపులు, చట్టపరమైన చర్యల బెదిరింపులు, జాతి, కుల, మత వివక్షకు చెందిన బెదిరింపులు, లైంగిక వివక్షకు చెందిన బెదిరింపులు మొదలైనవి) ఉపేక్షించరాదు.

పదేపదే చేసే దాడులు

[మార్చు]

ఆపమని హేతుబద్ధంగా అభ్యర్ధించాక కూడా పదేపదే దాడులు జరుగుతూ ఉంటే మధ్యవర్తిత్వం ద్వారాను, మూడో వ్యక్తి ప్రమేయం ద్వారానూ పరిష్కరించుకోవచ్చు. చాలా సందర్భాల్లో వాడుకరులు పరస్పరం సంప్రదించుకుని, పాఠ్యంపైనే దృష్టి పెట్టి వ్యక్తిగత దాడులను పరిష్కరించుకోవచ్చు, నిర్వాహకుని జోక్యం అవసరం లేకుండా చెయ్యవచ్చు.

పాఠ్యం తొలగింపు

[మార్చు]

వ్యక్తిగత దాడిని ఎప్పుడు తీసెయ్యాలి, అసలు తీసెయ్యాలా వద్దా అనేది బహు చర్చితాంశం. మీ వాడుకరి చర్చాపేజీలో ఉన్న నిర్వివాదమైన వ్యక్తిగత దాడులను తీసేసేందుకు అభ్యంతరమేమీ ఉండదు. ఇతర చర్చాపేజీల్లో, ముఖ్యంగా దాడి మీపై జరిగినపుడు, అది కచ్చితంగా వ్యక్తిగత దాడే అని స్పష్టమైన కేసుల్లో మాత్రమే తొలగింపు జరగాలి.

అయితే, కొన్ని అసాధారణ సందర్భాలుండవచ్చు. వికీపీడియన్ల వ్యక్తిగత, గోప్య సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి తిట్ల కంటే పైస్థాయికి చెందినవి. వాటి లక్ష్యం మీరైనా కాకున్నా, సముదాయం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్ని ఎదుర్కోవాలి. సున్నితమైన సమాచారం ఇమిడి ఉన్న సందర్భాల్లో ఓవర్‌సైట్ అభ్యర్ధన చెయ్యవచ్చు.

వికీ బయట దాడులు

[మార్చు]

వికీపీడియా, వికీమీడియా ఫౌండేషను యొక్క నియంత్రణలో లేని మాధ్యమాలలో వాడుకరుల ప్రవర్తనను నియంత్రించలేదు. కానీ ఇతర ప్రదేశాలలో చేసిన వ్యక్తిగత దూషణలు ఆ వాడుకరి వికీలో చేసే పనుల యొక్క సదుద్దేశాన్ని శంకించేలా చేస్తాయి. వికీపీడియా బయట వ్యక్తిగత దాడులు చెయ్యడం, ప్రతిష్ఠను బజారుకీడవడం వంటివి వికీ సముదాయానికి, సముదాయంతో సదరు వాడుకరికి ఉన్న సంబంధానికీ నష్టం కలిగిస్తుంది -మరీ ముఖ్యంగా సదరు వాడుకరి యొక్క గోపనీయ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసే సందర్భంలో. నిర్వాహకులు అటువంటి దాడులను పరిస్థితిని విషమింపజేసే అంశాలుగా పరిగణించే అవకాశం ఉంది. వాటిని వివాద పరిష్కారాలకూ, పంచాయితీలోనూ సాక్ష్యాలుగా పరిశీలించే అవకాశమూ ఉంది.

బయటి లింకులు

[మార్చు]

వికీపీడియా వాడుకర్లపై బయటి సైట్లలో జరిగిన దాడులకు లింకులిస్తూ మరో వికీపీడియా వాడుకరిపై దాడి చేసేందుకు వాటిని వాడుకోవడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఇలా బయటి లింకులిస్తూ వికీపీడియా వాడుకరిపై దాడి చెయ్యడం, వేధించడం, వ్యక్తిగత గోప్యతను అతిక్రమించడం మొదలైన వాటికి అనుమతి లేదు. బయటి లింకులివ్వడం సర్వే సర్వత్రా తప్పు అని అనుకోరాదు. వ్యాసాల్లో వ్యాస విషయాన్ని బలపరచేందుకు గాను బయటి లింకులివ్వడం వ్యాస నాణ్యతకు ఉపయోగపడే అంశం. అది పూర్తిగా సమంజసం, వాంఛనీయం.

వ్యక్తిగతదాడుల పర్యవసానాలు

[మార్చు]

చెదురుమదురుగా జరిగే వ్యక్తిగత దాడులను పట్టించుకోవద్దని లేదా మర్యాదపూర్వకంగా బదులివ్వమని వాడుకరులను ప్రోత్సహించినా, అలాంటి దాడులు అంగీకరించదగినవని అనుకోకూడదు. పదేపదే వైరత్వంతో వ్యవహరిస్తే, సదుద్దేశ్యంతోనే వ్యవహరిస్తున్నారులెమ్మని సముదాయం అనుకొనే సంభావ్యత తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో అది ఆటంకపూరితమైన దిద్దుబాటుగా భావించబడుతుంది. గొడవపెట్టుకునే విధంగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత దాడులకు దిగే వాడుకరులు వివాద పరిష్కార ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కొనే అవకాశమున్నది.

మరీ తీవ్రమైన సంఘటనల్లో చెదురుమొదురు వ్యక్తిగత దాడులు కూడా వాడుకరి నిరోధానికి గురయ్యేందుకు దారితీస్తాయి. చంపుతాననే బెదిరింపులు, ఇంకా అలాంటి తీవ్రమైన బెదిరింపుల సందర్భాల్లో ఏ హెచ్చరికా లేకుండా నిరోధం విధించవచ్చు. తక్కువ స్థాయి వ్యక్తిగత దాడులు జరిగినపుడు హెచ్చరికతో సరిపెట్టవచ్చు. హెచ్చరికల తరువాత కూడా ఇవి ఆగకపోతే, నిరోధాలు విధించవచ్చు. అయితే, నిరోధాల కంటే కూడా ఇతర పరిష్కార మార్గాలు అవలంబించడం వాంఛనీయం -సదరు ప్రవర్తన ప్రాజెక్టును అడ్డుకుంటోందనే సంగతి స్పష్టంగా తెలీనపుడు. పదేపదే జరిగే దాడులు వికీకి అవరోధంగా భావించేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. వ్యక్తిగత దాడుల కేసుల్లో నిరోధించడం అనేది మరిన్ని దాడులు జరక్కుండా చూసేందుకు తప్ప, చేసిన దాడులకు శిక్షగా మాత్రం చెయ్యరాదు. వాడుకరి వ్యక్తిగత దాడులను కొనసాగించే సూచనలు ఉన్నప్పుడు నిరోధం విధించడం అవసరం కావచ్చు.