Jump to content

వికీపీడియా:5 నిమిషాల్లో వికీ

వికీపీడియా నుండి
అడ్డదారి:
WP:5
WP:5MIN

వికీపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. అనేక భాషల్లో వికీపీడియా నిర్మితమౌతోంది. తెలుగు వికీపీడియాను ముద్దుగా తెవికీ అని కూడా అంటారు. వికీపీడియా మనందరిదీ. ఇక్కడ ఎవరైనా వ్రాయవచ్చు, ఇతరులు వ్రాసినవి సరిదిద్దవచ్చు. అలాగే మీరు వ్రాసినవి ఇతరులు సరిదిద్దుతారు. ఇక్కడ అందరూ సమానమే! సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అయితే నిర్వహణా పరమైన కొన్ని పనులు చేసేందుకు గాను, కొందరు నిర్వాహకులు ఉంటారు. అనుభవశాలురైన సభ్యులే నిర్వాహకులుగా నియమితులవుతారు. వీరిని ఎన్నుకునేది కూడా తోటి సభ్యులే! వికీపీడియాలోని ముఖ్యాంశాల గురించి మీరీ పేజీలో చూడవచ్చు.

ఎడమవైపున ఉండే లింకులు

[మార్చు]

ఈ పేజీకి ఎడమ పక్కన గల మార్గదర్శకము, అన్వేషణ, పరికరాల పెట్టె లను చూడండి. వికీపీడియాలోని ఏ పేజీకి వెళ్ళినా మీకు ఈ లింకులు కనిపిస్తాయి. వీటి గురించి చూద్దాం:

మార్గసూచి

[మార్చు]
తెవికిలో ఎడమ భాగములోని లింకులు (మార్గదర్శకము)

ఇందులో కింది లింకులు ఉంటాయి.

మొదటి పేజీ
వికీపీడియా మొదటి పేజీకి లింకు ఇది.
సముదాయ పందిరి
వికీపీడియాలో ప్రస్తుతం ఏమేం పనులు జరుగుతున్నాయి, ఏమేం చెయ్యాలని అనుకుంటున్నారు ఇలాంటి విషయాలకు సంబంధించిన విశేషాలు ఇక్కడ చూడవచ్చు.
ప్రస్తుత ఘటనలు
జరుగుతున్న చరిత్ర లోని విశేషాల సమాహారం ఇది.
ఇటీవలి మార్పులు
ఈ మధ్య కాలంలో వికీపీడియాలో జరిగిన అన్ని మార్పులను చూపించే జాబితా ఇది.
యాదృచ్ఛిక పేజీ
ఈ లింకును నొక్కినపుడు వికీపీడియా ఏదో ఒక పేజీని ఎంపిక చేసి మీకు చూపిస్తుంది.
సహాయము
వికీపీడియాకు సంబంధించి మీకు ఏమైనా సహాయం అవసరమైతే ఈ లింకును నొక్కి తెలుసుకోవచ్చు.
విరాళములు
వికీపీడియా పూర్తిగా ప్రజల విరాళాల పైనే ఆధారపడుతుంది. విరాళం ఇవ్వదలచిన వారు ఈ లింకు నొక్కి, అక్కడి సూచనలను అనుసరించి తమ విరాళాన్ని ఇవ్వవచ్చు.

అన్వేషణ

[మార్చు]
తెవికిలో ఎడమ భాగములోని లింకులు. అన్వేషణ (నీలములో) ఇంక పరికరాల పెట్టె (ఎరుపులో)

అన్వేషణ పెట్టె కింద రెండు మీటలున్నాయి: వెళ్ళు, వెతుకు. వెళ్ళు నొక్కినపుడు, మీరు అన్వేషణ పెట్టెలో రాసిన పదాలతో ఏదైనా పేజీ ఉంటే నేరుగా ఆ పేజీని తెరచి చూపిస్తుంది. లేకపోతే లేదని చూపిస్తుంది. వెతుకును నొక్కినపుడు, పెట్టెలో వ్రాసిన పదాలు వ్యాసంలో కలిగి ఉన్న అన్ని పేజీల జాబితాను చూపిస్తుంది.

అన్వేషణ పెట్టెలో మీరు ఇంగ్లీషులో వ్రాస్తూ ఉంటే అది తెలుగులోకి మారిపోతూ ఉంటుంది. ఇంగ్లీషులోనే వ్రాయాలంటే, కీబోర్డులోని "Esc" మీటను నొక్కండి.

పరికరాలు

[మార్చు]

వ్యాసాలలో రచనలు చెయ్యడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పనులు చేసేందుకు అవసరమైనవి ఈ పరికరాలు.

ఇక్కడికి లింకున్న పేజీలు
ఈ లింకును నొక్కినపుడు ప్రస్తుత పేజీకి లింకులు కలిగిన వికీపీడియాలోని ఇతర పేజీల జాబితాను చూపిస్తుంది.
సంబంధిత మార్పులు
ఈ లింకు నొక్కినపుడు ఈ పేజీకి సంబంధించిన పేజీల్లో ఇటీవల జరిగిన మార్పుల జాబితాను చూపిస్తుంది.
ఫైలు లోడింగ్
బొమ్మలు, ఆడియో వంటి ఫైళ్ళను అప్‌లోడు చేసేందుకు అవసరమైన సాధనం ఇది.
ప్రత్యేక పేజీలు
వికీపీడియాలో వ్యాసాల పేజీలే కాక, అనేక ఇతర రకాల పేజీలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేక పేజీలు ఒకటి. (ఈ పేజీల్లో సభ్యులు దిద్దుబాట్లు చేయజాలరు.) ఈ లింకును నొక్కినపుడు అన్ని ప్రత్యేక పేజీల జాబితాను చూడొచ్చు.
ముద్రణా వెర్షన్‌
ఈ లింకును నొక్కినపుడు, ప్రస్తుత పేజీని ముద్రించుకునేందుకు వీలైన కూర్పును చూపిస్తుంది.
శాశ్వత లింకు
వికీపీడియాలోని వ్యాసాలను మీరు ఇతర చోట్ల (వికీపీడియాకు బయట) యథేచ్ఛగా ఉదహరించవచ్చు. అయితే మీరు ఉదహరించిన తరువాత, సదరు వ్యాసంలో మార్పులు చేర్పులు జరగవచ్చు. మీరు ఉదహరించిన విషయం మారిపోవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఉదహరించిన విషయానికీ, ప్రస్తుతం ఉన్న కూర్పుకూ పొంతన ఉండకుండా పోవచ్చు. దీన్ని నివారించేందుకు ఈ "శాశ్వత లింకు" సౌకర్యాన్ని కల్పించాము. దీన్ని నొక్కినపుడు, పేజీ URL కు ఒక సంకేతం చేరుతుంది. వికీపీడియా బయట మీరు చేసే రచనలో మీరు ఈ URL నే ఉదహరిస్తారు. మీ పాఠకులు దాన్ని నొక్కినపుడు వారికి పూర్వపు కూర్పే కనపడుతుంది తప్ప, కొత్తగా చేరిన మార్పులు కనపడవు.
Cite this article
వికీపీడియాకు బయట వ్యాసాలను ఉదహరించే వివిధ పద్ధతులను ఈ లింకు వివరిస్తుంది.
ఇతర భాషలు
కొన్ని పేజీల్లో ఈ లింకులు కూడా కనిపిస్తాయి. ఇతర భాషల్లో ఇదే వ్యాసానికి గల లింకులను ఇక్కడ చూడవచ్చు.

పేజీ గురించి

[మార్చు]

వికీపీడియాలో ఒక్కో వ్యాసం ఒక్కో పేజీలో ఉంటుంది. కొన్ని పెద్ద వ్యాసాలను ఒకటి కంటే ఎక్కువ పేజీలుగా విభజించవచ్చు. మీరు ప్రస్తుతం చూస్తున్న ఈ పేజీని గమనించండి..

లాగిన్ అవ్వక ముందు పేజీ పైభాగం

పేజీ పైభాగం

[మార్చు]

మీరు లాగిన్ అయి ఉంటే మీ పేరు, చర్చ, అభిరుచులు, వీక్షణ జాబితా, మీ మార్పులు చేర్పులు, నిష్క్రమణ లింకులు ఉంటాయి. ఈ లింకులన్నిటినీ కలిపి, మీ ఖాతా సమాచారం లేక ఎకౌంటు సమాచారం గా భావించవచ్చు. నా గురించి చర్చ లింకు ద్వారా మీతో ఇతరులు చేసిన చర్చ పేజీకి వెళ్ళవచ్చు. మీరు లాగిన్ అవ్వకపోతే, లాగిన్ అవ్వండి లేదా ఎకౌంటు సృష్టించుకోండి అనే లింకు వస్తుంది.

లాగిన్ అయిన తరువాత పై భాగములో మీ పేరు, చర్చ, అభిరుచులు, వీక్షణ జాబితా, మీ మార్పులు చేర్పులు, నిష్క్రమణ లింకులు కనపడతాయి

దానికి దిగువన పేజీలోని వ్యాసం మొదలవుతుంది. పేజీకి పై అంచున ఉన్న ట్యాబ్లను చూడండి. ఈ పేజీలోని వ్యాసానికి సంబంధించి మీరు ఏమేం పనులు చెయ్యవచ్చో అక్కడి లింకులు సూచిస్తాయి.

వ్యాసము

[మార్చు]
లాగిన్ అయిన తరువాత పేజీపైన మీకు కనపడే టాబులు

మీరు ప్రస్తుతం ఈ ట్యాబ్లోనే ఉన్నారు. ఇక్కడ విషయానికి సంబంధించిన వ్యాసం ఉంటుంది. వ్యాస విషయానికే ఇక్కడ ప్రాధాన్యత. వ్యాసం గురించిన మీ అభిప్రాయాలు ఇక్కడ వ్రాయరాదు. సభ్యుల పేర్లు, ఇతర వివరాలు ఇక్కడ వ్రాయరాదు. ఇతరులను సంబోధిస్తూ వ్రాయడం కూడా ఈ పేజీలో నిషిద్ధం. వ్యాసంలో ఏదేని విషయం తప్పని మీకు నిర్ధారణగా తెలిస్తే, నిర్మొహమాటంగా దాన్ని సరిదిద్దండి.

చర్చ

[మార్చు]

ఈ వ్యాసానికి సంబంధించి, సభ్యుల అభిప్రాయాలు, వాదనను ఇక్కడ చూడవచ్చు. వ్యాసంలో ఏదేని విషయం తప్పని మీకు అనిపిస్తే, అది ఖచ్చితంగా తప్పేనని మిరు నిర్ధారించుకోలేకపోతే, ఆ విషయాన్ని ఈ చర్చా పేజీలో వ్రాయవచ్చు. ఈ చర్చ వ్యాస విషయానికి సంబంధించి మాత్రమే అయి ఉండాలి, వ్యక్తిగత చర్చలు కూడవు.

మార్చు

[మార్చు]

తరువాతి ట్యాబు- మార్చు. వ్యాసంలోగానీ, చర్చలో గానీ ఏదైనా వ్రాయదలిస్తే ఈ ట్యాబ్ ను నొక్కాలి. రచన చేసేందుకు వీలుగా మీకో ఎడిట్ బాక్సు కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని ఆ ఎడిట్ బాక్సులో చూడవచ్చు. మీరు చెయ్యదలచిన మార్పులు, చేర్పులు చేసి భద్రపరచగానే, ఆ మార్పులు సంబంధిత (వ్యాసం లేదా చర్చ) పేజీలో కనిపిస్తాయి. మార్చు ట్యాబ్ కు వెళ్ళి నపుడు, మీరు వ్యాసం పేజీని మారుస్తున్నారా, లేక చర్చ పేజీని మారుస్తున్నారా అనేది తెలుపుతూ సంబంధిత ట్యాబ్ లు తెరుచుకుని ఉంటాయి, గమనించండి.

చరిత్ర

[మార్చు]

ఇక తరువాతది చరిత్ర. వ్యాసం పేజీలోగానీ, చర్చా పేజీలో గాని ఇప్పటి వరకు జరిగిన మార్పు చేర్పుల జాబితా ఇది.ఎవరెవరు, ఏయే మార్పులు, ఎప్పుడెప్పుడు చేసారో తెలిపే చక్కటి జాబితా ఇది. చరిత్ర ట్యాబుకు వెళ్ళి నపుడు, మీరు వ్యాసం పేజీ చరిత్ర చూస్తున్నారా, లేక చర్చ పేజీ చరిత్ర చూస్తున్నారా అనేది తెలుపుతూ సంబంధిత ట్యాబ్ లు తెరుచుకుని ఉంటాయి, గమనించండి.

తరలించు

[మార్చు]

తరువాతి ట్యాబు, తరలించు. వ్యాసంలో మార్పులు చెయ్యాలనిపిస్తే ఎలా మార్పులు చెయ్యాలో చూసాం. కానీ వ్యాసం పేరు తప్పైతే, దాన్ని మార్చడం ఎలా? వ్యాసం పేరు అంటే పేజీ పేరు. అంటే పేజీ పేరును మార్చాలన్నమాట! దానికి వీలు కల్పించేదే ఈ తరలించు. దీన్ని నొక్కినపుడు, ఈ పేజీని ఏ పేజీకి తరలించాలో అడుగుతూ ఒక పెట్టె కనబడుతుంది. ఆ పెట్టెలో కొత్త పేజీ పేరు వ్రాసి మీటను నొక్కగానే వ్యాసం కొత్త పేజీకి తరలిపోతుంది. వ్యాసం పేరు కూడా ఆటోమాటిగ్గా మారిపోతుంది.

వీక్షించు/వీక్షించవద్దు

[మార్చు]

ఇక చివరి ట్యాబు - వీక్షించు లేదా వీక్షించవద్దు. ఒకసారి నొక్కితే వీక్షించు అవుతుంది, మరోసారి నొక్కితే వీక్షించవద్దు అవుతుంది. వీక్షించేటపుడు ఆ పేజీలో జరిగిన మార్పులు జరిగిఉంటే, ఇటీవలి మార్పులు లో ఆ పేజీ పేరు బొద్దు అక్షరాలతో కనిపిస్తుంది. వద్దనుకుంటే మామూలుగా కనపడుతుంది.

నేం స్పేసులు

[మార్చు]
  • ఈ నేంస్పేసులేంటి?
    వికీపీడియా అనేది ప్రజలే స్వయంగా తయారుచేస్తున్న ఒక విజ్ఞాన సర్వస్వం. ఈ బృహత్తర కార్యంలో ఎవరైనా పాల్గొనవచ్చు. సార్వజనీనమైన ఈ పనిలో సాఫ్ట్ వేరు రంగములో ప్రవేశము లేని వారు కూడా పాలుపంచుకుంటారు. కాబట్టి, వికీపీడియా అనేది ఎవరైనా తేలికగా పనిచెయ్యగలిగేలా ఉండాలి. ఈ సౌలభ్యాన్ని సాధించేందుకు వికీపీడియాను అనేక విభాగాలుగా విభజించారు. ఆ విభాగాలే నేంస్పేసులు. పేజీ పేరుకు ముందు ఈ నేం స్పేసు వస్తుంది. ఉదాహరణకు వికీపీడియా:5 నిముషాల్లో వికీ అనే పేజీలో వికీపీడియా అనేది నేం స్పేసు పేరు. ఏ నేం స్పేసూ లేకపోతే అది విజ్ఞాన సర్వస్వం వ్యాసమని అర్థం, అవి మొదటి నేం స్పేసుకు చెందుతాయి. వికీపీడియాలో కింది నేంస్పేసులు ఉన్నాయి.
  1. మొదటి: వికీపీడియాలోని విజ్ఞాన సర్వస్వం పేజీలన్నీ ఇందులో ఉంటాయి. పేజీ పేరుకు ముందు ఏమీ ఉండదు.., పదం పేరే పేజీ పేరవుతుంది.
  2. చర్చ: పై పేజీలకు సంబంధించిన చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.
  3. సభ్యుడు: సభ్యుల స్వంత పేజీలు ఇందులో ఉంటాయి. సభ్యులు తమ వివరాలను ఇక్కడే వ్రాసుకుంటారు.
  4. సభ్యునిపై చర్చ: సభ్యులకు సంబంధించిన చర్చా పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి.
  5. వికీపీడియా: వికీపీడియా అంతర్గత విషయాల కోసం ఈ నేంస్పేసు ప్రత్యేకించబడింది.
  6. వికీపీడియా చర్చ: వికీపీడియా అంతర్గత విషయాలపై చర్చ కోసమిది.
  7. బొమ్మ: ఈ నేంస్పేసులో బొమ్మలు ఉంటాయి.
  8. బొమ్మపై చర్చ: బొమ్మల పేజీలపై చర్చా పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి.
  9. మీడియావికీ: వికీపీడియాను నడిపించే సాఫ్టువేరు మీడియావికీ. దీనికి సంబంధించిన పేజీలు ఈ నేం స్పేసులో ఉంటాయి
  10. మీడియావికీ చర్చ: మీడియావికీ పేజీలపై చర్చా పేజీలు ఈ నేం స్పేసులో ఉంటాయి.
  11. ప్రత్యేక: కొన్ని ప్రత్యేక పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి. ఈ పేజీలను సభ్యులు సృష్టించేవి కావు.. సాఫ్ట్‌వేరే వీటిని సృష్టిస్తుంది.
  12. మూస: మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకొనగల మూసలను ఈ నేంస్పేసులో తయారు చెయ్యాలి.
  13. మూస చర్చ: మూసలకు సంబంధించిన చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.
  14. సహాయము: వికీపీడియాలో పనిచెయ్యడం ఎలా అనే విషయమై సహాయం పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి
  15. సహాయము చర్చ: సహాయం పేజీలపై చర్చ పేజీలు ఇందులో ఉంటాయి.
  16. వర్గం: వికీపీడియాలోని పేజీలను అనేక వర్గాలుగా విభజించాము. ఒక్కో పేజీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందవచ్చు. ఈ వర్గాల పేజీలు ఇక్కడ ఉంటాయి
  17. వర్గం చర్చ:వర్గాల చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.

ఎలా వ్రాయాలి

[మార్చు]

తెలుగు వికీపీడియాలో వ్యాసములను తెలుగులో మాత్రమే వ్రాయటానికి ప్రయత్నించండి. తెలుగులో వ్రాసేందుకు అవసరమైన సమాచారం కొరకు, వికీపీడియా:Setting up your browser for Indic scripts పేజీని చూడండి. చివరకు వీలుకాకపోతే, వ్యాసముయొక్క చర్చ పేజీలో మీరు చేర్చదలచుకొన్న మార్పులను వేసి సంతకం పెట్టండి. అనువాదము చేయగల సభ్యులు త్వరలో ఆ అంశాన్ని సముదాయపరుస్తారు. అనువాదము అనే మూసను కూడా వాడవచ్చు.

దిద్దుబాటు విధానం

[మార్చు]

ఇప్పటికే ఉన్న వ్యాసంలో మార్పు చేర్పులు చెయ్యాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకటి, పైనున్న టాబుల్లోని మార్చు లింకును నొక్కడం. ఈ పద్ధతిలో మొత్తం వ్యాసమంతా మార్పుకు సిద్ధమౌతుంది. రెండో పద్ధతి.. వ్యాసంలోని ఏదో ఒక విభాగాన్ని మాత్రమే సరిదిద్దడం. వ్యాసంలోని ప్రతి విభాగానికి పక్కన మార్చు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కినపుడు కేవలం సదరు విభాగం మాత్రమే మార్పుకు సిద్ధమౌతుంది.

క్లుప్తంగా దిద్దుబాటు చేసే విధానం ఇలా ఉంటుంది.

  1. దిద్దుబాటు చెయ్యదలచిన పేజీ లేదా విభాగపు "మార్చు" లింకును నొక్కండి.
  2. దిద్దుబాటు పేజీ ప్రత్యక్షమౌతుంది.
  3. అక్కడ మీరు చెయ్యదలచిన మార్పులు చెయ్యండి.
  4. మీరు చేసిన మార్పులను వివరిస్తూ ఒక చిన్న సారాంశాన్ని కిందనున్న పెట్టెలో రాయండి.
  5. మీరు చేసింది చిన్న మార్పయితే, చిన్నమార్పు పెట్టెను టిక్కు చెయ్యండి.
  6. ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేర్చాలనుకుంటే.. ఆ పెట్టెను కూడా టిక్కు చెయ్యండి.
  7. పేజీని భద్రపరచేముందు, సరిచూడు మీటను నొక్కి, మీరు చేసిన మార్పులను ఒక్కసారి సరిచూసుకోండి.
  8. అంతా బాగుందనుకుంటే, భద్రపరచు మీటను నొక్కి, మీ మార్పులను భద్రపరచండి.

అయితే మీరు వ్రాసిన గద్యాన్ని ఒక ఆకృతిలో పెట్టదలిస్తే దానికి అనుగుణంగా తగు అలంకారాలు చెయ్యాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొంత భాగాన్ని బొద్దుగా చెయ్యడం, ఇటాలిక్కుగా మార్చడం, ఒక కొత్త విభాగం తయారుచెయ్యడం, ఒక జాబితాను కూర్చడం, ఒక నిర్వచనాన్ని వ్రాయడం వంటి అనేక అలంకారాలు ఈ ఎడిటరు ద్వారా చెయ్యవచ్చు. అయితే ఈ ఎడిటరు, ఏది వ్రాస్తే అదే, ఎలా వ్రాస్తే అలానే కనపడే WYSYWYG రకం కాదు. ఫలానా అలంకారం కావాలంటే ఫలానా విధంగా వ్రాయాలి అనే పద్ధతులున్నాయి. ఆయా పద్ధతులను వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి పేజీలో చూడండి.


కొత్తపేజీని సృష్టించడం:ఈ క్రింది పెట్టెలో వ్యాసం పేరు వ్రాసి, వ్యాసాన్ని సృష్టించు మీట నొక్కండి. కొత్త ఎడిట్ పేజీ ప్రత్యక్షం అవుతుంది. అందులో వ్రాయదలచినది వ్రాసి, పేజీ క్రింద భాగములో పేజీ భద్రపరచు మీట నొక్కి భద్రపరచండి.


కొత్త పేజీని సృష్టించేందుకు వేరే మార్గం కూడా ఉంది. ఏదో ఒక పేజీయొక్క మార్చు లింకును నొక్కండి. ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును వ్రాసి దానికి లింకులు ఇవ్వడి. లింకులు ఇవ్వడమంటే [[ ]] బ్రాకెట్లను ఆ పేరుకు రెండువైపులా చేర్చడమే! ఉదాహరణకు మా ఊరు అనే పేజీని సృష్టించాలనుకుందాం.. ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కి, ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో, అన్నిటి కంటె పైన [[మా ఊరు]] అని వ్రాసి, ఎడిట్ పెట్టెకు కింద ఉన్న సరిచూడు మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో మా ఊరు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, మా ఊరు పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు వ్రాయదలచింది వ్రాసేసి, భద్రపరచండి. అంతే.. పేజీ తయారు!

కొత్త పేజీలకై మార్గదర్శకాలు

[మార్చు]

కొత్తగా చేరిన సభ్యులు అనుభవం వచ్చేదాక వ్యాసాల విస్తరణ, దోషాల సవరణ చేపట్టటం మంచిది. ఆరేడు వాక్యాలు వ్రాయకలగితేనే లేక వ్యాసంలో బొమ్మ చేర్చే అవకాశముంటే కొత్తపేజీ సృష్టించండి. లేనిచో మీరు సృష్టించే వ్యాసాలు తొలగింపబడుతాయి. అలా జరగుకుండా వుండాలంటే మీరు ఖాతా తీసుకొని కొత్తపేజీ సృష్టించి ఒక వారం రోజులలో విస్తరించండి. లేదా మీ వాడుకరిపేజీలో లేక దాని వుపపేజీలో ఎటువంటి వ్యాసాలైనా సృష్టించొచ్చు. ప్రయోగాలకు మీ వాడుకరి పేజీ లేక దాని వుపపేజీలతో పాటు సాధారణ వికీపీడియా:ప్రయోగశాల వాడండి

మూసలు, వర్గాలు

[మార్చు]

వికీపీడియాలో తరచూ వాడే పేజీలు మూసలు, వర్గాలు. మూసలు వ్యాసాలను రచించడంలో ఉపకరిస్తాయి. వర్గాలు పేజీలను వెతకడంలో ఉపకరిస్తాయి.

మూసలు

[మార్చు]

ఏదైనా ఒక సమాచారం అనేక పేజీలకు సామాన్యంగా ఉంటే, సదరు సమాచారాన్ని ప్రతీ పేజీలోనూ వ్రాసే పని లేకుండా చేసిన ఏర్పాటు, మూస. ఆ సమాచారంతో ఓ కొత్త పేజీని తయారుచేస్తాం. అదే మూస. ఈ మూస పేరును మా..త్రం ఆయా పేజీల్లో వ్రాస్తే చాలు, సదరు సమాచారం ఆ పేజీల్లో వచ్చి చేరుతుంది. దీనివలన ప్రతీపేజీలోను ఆ సమాచారం వ్రాసే అవసరం తప్పుతుంది. మరింత సమాచారం కొరకు వికీపీడియా:మూస చూడండి.


మూసను మామూలు పేజీని సృష్టించినట్లే సృష్టించవచ్చు. అయితే కొత్త మూసను సృష్టించేటపుడు రెండు పద్ధతులలో సూచించవచ్చు. మామూలు పేజీలను సూచించినట్లుగా [[మూస:నా మూస]] లాగా వ్రాయవచ్చు. అలాగే {{నా మూస}} లాగా కూడా వ్రాయవచ్చు. మొదటి పద్ధతిలో స్క్వేరు బ్రాకెట్టులు వాడాము, ముందు నేం స్పేసును రాసాము. రెండో పద్ధతిలో మీసాల బ్రాకెట్టును వాడాము, నేం స్పేసును వ్రాయలేదు.


ఉదాహరణకు నామూస అనే మూసను ఎలా సృష్టించాలో చూద్దాం..

ఏదో ఒక పేజీయొక్క మార్చు లింకును నొక్కండి. ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన మూస పేరునుపేజీ పేరును [[మూస:నా మూస]] అని గానీ, లేదా {{నా మూస}} అని గాని రాయండి. ఎడిట్ పెట్టెకు కింద ఉన్న సరిచూడు మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో నా మూస అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, నా మూస పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు వ్రాయదలచింది వ్రాసేసి, భద్రపరచండి. అంతే.. మూస తయారు!

ఈ మూసను ఏదైనా పేజీలో వాడేటపుడు ఆ పేజీలో మీరు వాడదలచిన చోట ఇలా వ్రాయాలి: {{నా మూస}}. అంతే! ఆ మూసలో ఉన్న సమాచారం ఈ పేజీలోకి వచ్చి చేరుతుంది.


[[మూస:నా మూస]], {{నా మూస}} ల మధ్య తేడాలు:

కొత్త మూసను సృష్టించేటపుడు, ఈ రెంటి మధ్య తేడా ఏమీ లేదు. ఏ పద్ధతిలోనైనా వ్రాయవచ్చు. అయితే, సృష్టించిన మూసను వివిధ పేజీల్లో వాడేటపుడు మాత్రం తేడా ఉంటుంది. ఉదాహరణగా అనువాదము అనే మూసను తీసుకుందాం.

[[మూస:అనువాదము]] అని రాసినపుడు మూసలో వ్రాసిన గద్యం ఈ పేజీకి చేరదు, ఆ మూస పేజీకి లింకు మాత్రమే ఏర్పడుతుంది, ఇలాగ: మూస:అనువాదము

{{మూస:అనువాదము}} అని వ్రాసినపుడు మూసలో వ్రాసిన గద్యం ఈ పేజీకి చేరుతుంది, కింది విధంగా:

ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి

వర్గాలు

[మార్చు]

సభ్యత్వం

[మార్చు]

వికీపీడియాలో వ్రాయాలంటే మీరు సభ్యత్వం తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. కాని, తీసుకుంటే మంచిది.

  1. సభ్యత్వం లేకుండా, లాగిన్ అవకుండా వ్రాస్తే, మీ రచనలు మీ పేరిట ఉండవు. ఏదో ఐ.పి.అడ్రసు పేరిట చేరుతాయి.
  2. మీతో చర్చించడం ఇతరులకు సౌకర్యంగా ఉండదు. ఓ శంకరరావు గారితోటో, లక్ష్మి గారితోటో కలిసి పనిచెయ్యడానికి బాగుంటుందిగానీ, ఏ 66.221.78.112 తోటో కలిసి పని చెయ్యాలంటే కష్టమే కదండీ! చర్చలో పాల్గొన్నపుడు తాము ఎవరితో చర్చిస్తున్నామో మిగతా సభ్యులకు తెలుస్తుంది. అంచేత వారు మరింత చొరవగా చర్చలో పాల్గొనగలుగుతారు.
  3. అన్నిటికీ మించి, అజ్ఞాతంగా వ్రాస్తున్నపుడు, మీ పేరుకు బదులు మీ ఐ.పి.అడ్రసు నమోదవుతుంది. అదే అడ్రసుతో ఇతరులు కూడా వ్రాసే సంభావ్యత ఉంది. ఒకవేళ వారు తప్పుడు పనులు చేస్తే..దానిపై నిర్వాహకులు చర్య తీసుకుంటే.., దానికి మీరు అనవసరంగా బలవుతారు.. అన్యాపదేశంగా బాధ్యులూ అవుతారు.

అంచేత మీరు సభ్యులుగా నమోదయి, లాగిన్ అయిన తర్వాతే రచనలు చేస్తే మంచిది. సభ్యులైన వారికి మాత్రమే నిర్వాహకుని హోదా లభించే అవకాశం ఉంది.

వికీ విధానాలు

[మార్చు]
  • మౌలిక పరిశోధనలు నిషిద్ధం: వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. మీరు వ్రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం.. మీరు వ్రాసిన విషయానికి సంబంధించిన విశ్వసనీయ మూలం లేదా వనరులను ఉదహరించడమే!
  • రచనలో తటస్థ దృక్కోణం ప్రతిఫలించాలి. దీన్నే ఇంగ్లీషు వికీలో NPOV (Neutral Point Of View) అంటారు. రచనలో తటస్థత ఉండాలి. వివాదాస్పద విషయాలలో ఏదో ఒక దృక్కోణం రాయక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు, వివాదంలో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసాన్ని వ్రాయాలి.
  • నిర్ధారత్వం: మీరు ఉదహరించిన వనరులును సంప్రదించి, విషయాన్ని నిర్ధారించుకునేందుకు వీలుగా ఉండాలి.

వికీ రచనా శైలి

[మార్చు]

వికీ ఒక విజ్ఞాన సర్వస్వం. పాఠకులకు ఇది ఒక పాఠ్య పుస్తకంలాగా ప్రామాణికంగా ఉండాలి. రచయిత ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తన అభిప్రాయాలు వ్రాయరాదు. కింది సూచనలను పాటించండి.

  • నేను భావిస్తున్నాను, నాకు తెలిసినంతవరకు, నా అనుభవంలో.. ఇలాంటి వాక్యాలు వ్రాయవద్దు.
  • వ్యాస విషయానికి సంబంధించి అవసరమైన చోట్ల దృష్టాంతాలను, రుజువులను ఉదహరించండి.
  • గౌరవ వాచకాలు వికీపీడియా శైలి కాదు. అంచేత గారు, శ్రీ వంటివి వ్రాయవద్దు. అలాగే చెప్పారు, వెళ్ళారు, చేసారు వంటి మాటలకు బదులుగా చెప్పాడు, వెళ్ళింది, చేసాడు వంటి పద ప్రయోగం ఉండాలి. ఈ విషయమై మీ అభిప్రాయాలను రచ్చబండలో వ్రాయండి. చర్చా పేజీలు ఇందుకు మినహాయింపు.
  • వికీపీడియా వ్యాసంలో తమ పేరు నమోదుచేయకూడదు. ఉదాహరణకు కూర్పు, సంగ్రహణ లేదా మూలం అని తమ స్వంతపేర్లు వ్రాయకూడదు.

వికీ చిట్కాలు

[మార్చు]
  • సంతకం: చర్చా పేజీలలో మీ వాదన వ్రాసినపుడు నాలుగు టిల్డె లతో - ~~~~ - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, సమయం ప్రింటవుతాయి. ఐదు టిల్డెలు రాస్తే ఏం జరుగుతుందో చూడండి! సంతకం కేవలం చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, ఇతర పేజీలలో చెయ్యరాదు. సంతకం గురించిన మరిన్ని వివరాలకు సంతకం పేజీ చూడండి.

ఉపయోగపడే లింకులు

[మార్చు]

కొత్తవారికి ఉపయోగపడే కొన్ని లింకులు:

  • ఖాతా మొదలుపెట్టండి లేదా లాగిన్ అవ్వండి
  • తెలుగు వికీపీడియాలో, తెలుగులో టైపు చేయడానికి, తెలుగు టైపింగు సహాయాన్ని చూడండి.
  • ఒక వ్యాసము కోసము వెతుకుతున్నారా? ఇక్కడ అన్వేషించండి
  • అన్ని వ్యాసాలను అక్షరక్రమములో చూడాలనుకుంటున్నారా? - Special:Allpages
  • కనిపించిన ఒక వ్యాసంలో మార్పులు చేయాలనుకుంటున్నారా? - ఆ వ్యాసము పైభాగములో ఉన్న మార్పు బటన్ నొక్కండి
  • ఇక్కడలేని కొత్త వ్యాసాన్ని సృష్టించాలనుకుంటున్నారా? ఈ క్రింది పెట్టెలో వ్యాసము పేరు వ్రాసి. వ్యాసాని సృష్టించు బటన్ నొక్కండి. అందులో వ్రాయదలచినది వ్రాసి పేజీ క్రింద భాగములోని "పేజీ భద్రపరచు" మీట నొక్కండి. ఒక సూచన.. మీరు సృష్టించదలచిన వ్యాసం అదేపేరుతో గాని, దానికి సంబంధించిన మరో పేరుతో గాని ఉందేమో ఒకసారి అన్వేషణ పెట్టె ద్వారా వెతికి, లేకపోతేనే కొత్త వ్యాసం మొదలుపెట్టండి.