విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం

వికీపీడియా నుండి
(విక్రమ్‌ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
S. Somanath, Director of VSSC, ISRO, speaks during the Heads of Agency Plenary of the 70th International Astronautical Congress
2019 సంవత్సరం 70వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ ఏజెన్సీ ప్లీనరీ సందర్భంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ISRO డైరెక్టర్ ఎస్.సోమనాథ్, వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్, వాషింగ్టన్ లో ప్రసంగించారు.

విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC) భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం. ఇది భారత ఉపగ్రహ కార్యక్రమానికి చెందిన అంతరిక్ష వాహనాలను అభివృద్ధి చేస్తుంది.[1] ఇది కేరళ లోని తిరువనంతపురంలో ఉంది. ఈ కేంద్రం 1962 లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషనుగా మొదలైంది. 1971 డిసెంబరు 30 న భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడైన డా. విక్రం సారాభాయ్ మరణం తరువాత, ఈ కేంద్రానికి ఆయన పేరు పెట్టారు.

ఈ కేంద్రం ఇస్రో పరిశోధనా కేంద్రాల్లో ఒకటి. సౌండింగు రాకెట్లు, రోహిణి, మేనక లాంచర్లు, ఎస్సెల్వీ, ఏఎస్సెల్వీ, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 మొదలైన వాహక నౌకల రూపకల్పన కేంద్రమిది.

చరిత్ర[మార్చు]

ఇస్రో కేంద్రాలన్నింటిలోకీ VSSC పెద్దది. వాహకనౌకల కవసరమైన ఏరోనాటిక్స్, ఏవియానిక్స్, కాంపోసైట్స్ వంటి సాంకేతికతల అభివృద్ధిపై ఈ కేంద్రం దృష్టి పెట్టింది.

1962 లో భారతీయ అంతరిక్ష పరిశోధనల కమిటీ ఏర్పాటు అయిన వెంటనే అది తుంబా ఈక్వటోరియల్  రాకెట్ లాంచింగు స్టేషన్ను (TERLS) నెలకొల్పింది. తుంబా జియోమాగ్నెటిక్ ఈక్వేటరుపై ఉండడంతో ఆ స్థలాన్ని ఎంపికచేసారు.

1963 నవంబరు 21 న తుంబా నుండి నైకి అపాచీ సౌండింగు రాకెట్టును ప్రయోగించడంతో భారత అంతరిక్ష ప్రయోగాల యాత్ర మొదలైంది.తొలి రాకెట్లను అమెరికాలో తయారుచేసారు. 

విక్రమ్‌ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (విఎస్‌ఎస్‌సి)
సంస్థ వివరాలు
స్థాపన నవంబరు 21, 1963; 60 సంవత్సరాల క్రితం (1963-11-21)
అధికార పరిధి భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం
ప్రధానకార్యాలయం తిరువనంతపురం, in కేరళ, భారత్
8°31′48″N 76°52′18″E / 8.53000°N 76.87167°E / 8.53000; 76.87167
ఉద్యోగులు తెలియదు (2008)
వార్షిక బడ్జెట్ ఇస్రో బడ్జెట్ చూడండి
కార్యనిర్వాహకులు కె. శివన్, డైరెక్టరు
Parent agency ఇస్రో
వెబ్‌సైటు
ISRO VSSC home page

భారత్‌లో తొట్టతొలిగా రూపొందించి, తయారుచేసిన రాకెట్, RH-75. 1967 నవంబరు 20 న దాని తొలి ప్రయోగం జరిగింది. తుంబా నుండి చేసిన సౌండింగు రాకెట్టు ప్రయోగాల్లో ఇది 52 వది. 1967 లో మరో రెండు సార్లు, 1968 లో 12 సార్లూ మొత్తం 15 సార్లు RH-75 ను ప్రయోగించారు.

తుంబా నుండి ప్రయోగించిన సౌండింగు రాకెట్లలో మరి కొన్ని: అర్కాస్-1, అర్కాస్-11, సెంటార్-1, 11A, 11B, డ్రాగన్-1, డ్యూయల్ హాక్, జూడీ హార్ట్, మేనక-1, మేనక-1Mk 1, Mk11, నైకి టోమహాక్, M-100, పెట్రెల్, RH-100, RH-125, RH-200 (S), RH-300, RH-560 మొదలైనవి. మొత్తం అన్నీ కలిపి 2200 సౌండింగు రాకెట్‌లను ప్రయోగించారు.

విఎస్‌ఎస్‌సి రోహిణి సౌండింగు రాకెట్లు అనే పేరుతో సౌండింగు రాకెట్ కుటుంబాన్ని అభివృద్ధి చేసింది.  వీటితో అనేక శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు చేసారు. ప్రస్తుతం ఆపరేషనులో ఉన్న రోహిణి రాకెట్లు RH-200, RH-300, RH-560 మొదలైనవి. వీటి సాయంతో 500 కి.మీ. ఎత్తువరకు వాతావరణంపై పరిశోధనలు చేస్తారు.

తుంబా ఈక్వటోరియల్ కేంద్రాన్ని 1968 ఫిబ్రవరి 2 న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ లాంఛనంగా ఐక్యరాజ్యసమితికి అంకితం చేసారు. ఐక్యరాజ్యసమితి నుండి నేరుగా నిధులేమీ రానప్పటికీ, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాను, జర్మనీ, ఇంగ్లండు వంటి వివిధ దేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు తమ రాకెట్ పరిశోధనల కోసం ఈ కేంద్రాన్ని వినియోగిస్తూనే ఉన్నారు. సోవియట్ యూనియన్‌కు చెందిన M-100 అనే సౌండింగు రాకెట్‌ను 1970, 1993 మధ్య 1161 సార్లు ప్రయోగించారు.

1980 ల్లో ఎస్‌ఎల్‌వి-3 అభివృద్ధిలో విఎస్‌ఎస్‌సిది ప్రధాన పాత్ర. దీని తరువాత, 1980 ల చివర్లో సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక (ఏఎస్సెల్వీ), అభివృద్ధి జరిగింది. భూనిమ్న కక్ష్యల్లోకి 150 కిలోల ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం దీని లక్ష్యం. 1990 ల్లో పిఎస్‌ఎల్‌వి అభివృద్ధిలో కూడా విఎస్‌ఎస్‌సి పాలుపంచుకుంది.

వసతులు[మార్చు]

తుంబా, వేళి ల్లో ఉన్న ప్రధాన కేంద్రాలతో పాటు, విఎస్‌ఎస్‌సి కి వళియమాలలో ఇంటెగ్రేషన్, చెకౌట్ కేంద్రాలు కూడా ఉన్నాయి. రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్, కాంపోసైట్ల అభివృద్ధి కోసం తిరువనంతపురం లోని వట్టియూర్కావులో వసతు లున్నాయి. ఘన ఇంధన మోటార్ల కోసం వాడే అమ్మోనియం పెర్క్లోరేట్ను అలువాలో తయారుచేస్తారు.  స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ కూడా విఎస్‌ఎస్‌సిలో ఉంది. విఎస్‌ఎస్‌సిలో 4500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది కీలకమైన శాస్త్ర విభాగాల్లో నిపుణులే.

కార్యక్రమాలు[మార్చు]

గత నాలుగు దశాబ్దాలుగా వాహకనౌకల సంకేతికతలో విఎస్‌ఎస్‌సి  అగ్రగామి సంస్థగా అవిర్భవించింది.[2] విఎస్‌ఎస్‌సి కార్యక్రమాల్లో ముఖ్యమైనవి: పిఎస్‌ఎల్‌విMajor programmes of VSSC include the పిఎస్‌ఎల్‌విజిఎస్‌ఎల్‌వి, రోహిణి సౌండింగు రాకెట్లు, స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ప్రయోగం, పునర్వినియోగ వాహక నౌకలు, ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్.

విఎస్‌ఎస్‌సి  ప్రస్తుతం జిఎస్‌ఎల్‌వి మార్క్ 3, పునర్వినియోగ వాహనం సాంకేతికత ప్రదర్శకంల అభివృద్ధిలో నిమగ్నమై ఉంది.

2007 జనవరిలో స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్ (SRE-1) 10 రోజులు అంతరిక్షంలో గడిపిన తరువాత భూమికి తీసుకువచ్చారు. విఎస్‌ఎస్‌సి అభివృద్ధి చేసిన అనేక సాంకేతికతలను ఈ ప్రయోగంలో వాడారు. రీఎంట్రీ సమయంలో ఉత్పత్తయ్యే విపరీతమైన ఉష్ణం నుండి వాహనాన్ని కాపాడే ఉష్ణ కవచ వ్యవస్థ వీటిలో ఒకటి. చంద్రయాన్-1 ప్రయోగంలో విఎస్‌ఎస్‌సి కీలకపాత్ర పోషించింది. ఘన ఇంధనాలను తయారుచెయ్యడం విఎస్‌ఎస్‌సి కార్యక్రమాల్లో ఒకటి. నేవిగేషన్ వ్యవస్థల అభివృద్ధి కోసం ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్‌ను వట్టియూర్కావులో నెలకొల్పారు. విఎస్‌ఎస్‌సి పునర్వినియోగ వాహనాల రూపకల్పనలో కూడా పాలుపంచుకుంటోంది. 

విఎస్‌ఎస్‌సి అంతరిక్ష విజ్ఞానాన్ని జనజీవనంలో వినియోగించే దిశలో పనిచేస్తోంది. గ్రామాల్లోను, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, విపత్తు సంసిద్ధత, డైరెక్ట్ టు హోమ్‌ టీవీ ప్రసారాల వంటి అంశాల్లో విఎస్‌ఎస్‌సి కృషి చేస్తోంది.

మూలాలు[మార్చు]

  1. "Welcome To ISRO :: Centres :: Thiruvananthapuram :: Vikram Sarabhai Space Centre(VSSC)". Isro.gov.in. Archived from the original on 2013-05-01. Retrieved 2013-11-30.
  2. "Government of India, Vikram Sarabhai Space Centre". Vssc.gov.in. Archived from the original on 2014-01-08. Retrieved 2013-11-30.