స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్పేస్ కాప్స్యూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్ (SRE లేదా SRE-1) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన ప్రయోగాత్మక అంతరిక్ష నౌక. దీన్ని ఇస్రో 2007 జనవరి 10 న ఉదయం 8:23 కు ప్రయోగించింది. పిఎస్‌ఎల్‌వి సి7 రాకెట్టుతో మరో మూడు ఉపగ్రహాలతో కలిపి దీన్ని ప్రయోగించారు. కక్ష్యలో 12 రోజుల పాటు పరిభ్రమించి, తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి, బంగాళాఖాతంలో జనవరి 22 ఉదయం 8:46 గంటలకు దిగింది.[1][2][3]

లక్ష్యాలు

[మార్చు]

SRE-1 కు ప్రధానంగా రెండు లక్ష్యాలున్నాయి:

1. మైక్రోగ్రావిటీ పరిస్థితులలో ప్రయోగాలు జరిపేందుకు గాను కక్ష్యలో పరిభ్రమిస్తూండే ప్లాట్‌ఫారము యొక్క సాంకేతికతను ప్రదర్శించడం

2. కక్ష్యలో పరిభ్రమించే ఒక వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి, భూమిపైకి తెచ్చి, క్షేమంగా రికవరీ చెయ్యడాన్ని ప్రదర్శించడం

పై ప్రదర్శనల్లో భాగంగా మళ్ళీమళ్ళీ ఉపయోగించగలిగే ఉష్ణ కవచాన్ని, నేవిగేషన్ను, గైడెన్స్ అండ్ కంట్రోలును, హైపర్‌సోనిక్ ఏరో-థెర్మోడైనమిక్స్‌ను, సమాచార అంధకారాన్ని నిర్వహించడాన్ని, వేగాన్ని తగ్గించడాన్ని, నీటిలో తేలియాడడం, క్షేమంగా రికవరీ చెయ్యడాన్నీ కూడా పరీక్షిస్తారు.[4][5][6]

డిజైను

[మార్చు]

SRE-1 555 కిలోల కాప్స్యూలు. దానిలో ఏరో థెర్మో స్ట్రక్చరు, ఇంటర్నల్ స్ట్రక్చరు, మిషన్ మేనేజిమెంట్ యూనిట్, ఆల్టిట్యూడ్ సెన్సర్లు, ఇంటర్నల్ మెజర్‌మెంట్ యూనిట్, S-బ్యాండ్ ట్రాన్‌స్పాండరు, డిసెలరేషన్, రికవరీలకు తోడ్పడే పవర్&ఎలెక్ట్రానిక్ ప్యాకేజీలు ఉన్నాయి. దానిలో రెండు మైక్రోగ్రావిటీ పేలోడ్లు కూడా ఉన్నాయి.  అది గోళ-శంకు ఆకారంలో ఉంది. ముక్కు అర మీటరు వ్యాసార్ధంతో గోళాకారంగా ఉండగా, పీఠం 2 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. దీని ఎత్తు 1.6 మీ ఉంది. పారాచూట్‌, పేలుడు పరికరాలు, ఏవియానిక్స్ పాకేజీ,  టెలిమెట్రీ, ట్రాకింగ్ వ్యవస్థ,  వ్యవస్థ పనితీరును  కొలిచే  సెన్సర్లు  మొదలైనవాటిని SRE-1 కాప్స్యూల్లో అమర్చారు. పారాచూట్లను ADRDE అందించింది.[7] 

భూవాతావరణంలో ప్రయాణించేటపుడు జనించే ఉష్ణాన్ని తట్టుకునేందుకు SRE-1 ఉపరితలంపై సిలికా పలకలతో చేసిన ఉష్ణ కవచాన్ని అమర్చారు. ముక్కుకు కార్బన్-ఫెనాలిక్ తొడుగు అమర్చారు. ఇస్రో కార్బన్-కార్బన్ కాంపౌండ్ల కవచాలపై కూడా పరిశోధనలు చేస్తోంది. వీటిని, సిలికా కవచాలనూ ఇస్రో తన పునర్వినియోగ వాహక నౌక వంటి భావి ప్రాజెక్టుల్లో వాడే అవకాశం ఉంది.  

పునఃప్రవేశం

[మార్చు]

SRE-1 భూమి చుట్టూ 637 కిమీల వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించింది. పునఃప్రవేశానికి సన్నాహంగా 2007 జనవరి 19 న దీన్ని 485 X 639 కిమీల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి  మార్చారు. కీలకమైన డీ-బూస్ట్ చర్యలను SCC, బెంగళూరు నుండి నిర్వహించారు. బెంగళూరు, లక్నో, శ్రీహరికోట, మారిషస్ఇండోనేసియా (బియాక్), కెనడా (సస్కటూన్), నార్వే (స్వాల్‌బార్డ్) ల లోని భూకేంద్రాలు, కొన్ని సముద్ర కేంద్రాలు, ఆకాశ కేంద్రాలూ దీనికి తోడ్పడ్డాయి.

2007 జనవరి 22 న ఉదయం 8:42 కు డీ-బూస్ట్ కోసం నౌక దిశను మార్చే పనులు మొదలయ్యాయి. 9 గంటలకు డీ-బూస్ట్ మొదలై, 9:10 కి పూర్తైంది. 9:17 కు దట్టమైన భూవాతావరణంలోకి ప్రవేశించేందుకు SRE-1 ను సరైన దిశలో పెట్టడం పూర్తైంది. 9:37 కు కాప్స్యూలు 100 కిమీ ఎత్తున 8 కిమీ/సె వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది.  ఉష్ణ కవచం కాప్స్యూలును  విపరీతమైన  ఉష్ణం నుండి కాపాడింది.

SRE-1 భూమి నుండి 5 కిమీ ఎత్తుకు వచ్చేటప్పటికి ఏరోడైనమిక్ బ్రేకింగు వలన వేగం 101 మీ/సెకు తగ్గిపోయింది. పైలట్ పారాచూట్, డ్రాగ్ పారాచూట్‌లు తెరుచుకుని, ఈ వేగాన్ని మరింతగా, 47 మీ/సెకు తగ్గించాయి.

నీటిలో పడడం, రికవరీ

[మార్చు]

2 కిమీ ఎత్తున ప్రధాన పారాచూట్‌ను నియోగించారు. దాని వలన వేగం మరింత తగ్గి, బంగాళాఖాతపు నీటిని 12 కిమీ/సె వేగంతో తాకింది. 9:46 గంటలకు నౌక నీటిలో పడగానే ప్లవన వ్యవస్థ పనిచేసి,  నౌక మునగకుండా నీటిపై తేలియాడేలా చేసింది. భారత నౌకాదళం, తీరరక్షక దళం కాప్స్యూలును సేకరించడంలో పాల్గొన్నాయి.

ప్రయోగాలు

[మార్చు]

కక్ష్యలో ఉండగా SRE-1 లో మైక్రోగ్రావిటీ పరిస్థితులలో కింది ప్రయోగాలు జరిగాయి.

  • భారతీయ విజ్ఞాన శాస్త్ర సంస్థ, బెంగళూరు, విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, తిరువనంతపురం సంయుక్తంగా చేపట్టిన లోహాల కరిగింత, స్ఫటికీకరణం. దీన్ని ఐసోథెర్మల్ హీటింగ్ ఫర్నేస్‌లో  నిర్వహించారు
  • నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ, జంషెడ్‌పూర్, ఇస్రో ఉపగ్రహ కేంద్రం, బెంగళూరు చేపట్టిన సింథసిస్ ఆఫ్ నానో క్రిస్టల్స్. 

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు వనరులు

[మార్చు]