Jump to content

వినాయకరావు కొరాట్కర్

వికీపీడియా నుండి
వినాయకరావు కొరాట్కర్
వినాయకరావు కొరాట్కర్

వినాయకరావు కొరాట్కర్ (1952 లో)


తరువాత జి.ఎస్.మేల్కోటే
నియోజకవర్గం హైదరాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం 3 ఫిబ్రవరి 1895
కళంబ్, హైదరాబాదు రాజ్యం, బ్రిటీషు ఇండియా
(ప్రస్తుత మహారాష్ట్ర, భారతదేశం)
మరణం 3 సెప్టెంబరు 1962
భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి లక్ష్మీబాయి కొరాట్కర్
సంతానం 3 (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)
మతం హిందూ
వెబ్‌సైటు [1]

వినాయకరావు కొరాట్కర్ ( 1895 ఫిబ్రవరి 3 – 1962 సెప్టెంబరు 3) హైదరాబాదు రాష్ట్ర రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. ఈయన హైదరాబాదులో కేశవ్ మెమోరియల్ స్కూల్, హిందీ మహావిద్యాలయను స్థాపించాడు.[1]

వినాయకరావు, హైదరాబాదు రాజ్యంలో ప్రముఖ సాంఘిక సంస్కర్త, కేశవరావు కొరాట్కర్, గీతాబాయి దంపతులకు, ఉస్మానాబాదు జిల్లాలోని కళంబ్‌లో 1895 ఫిబ్రవరి 3న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం హరిద్వారలోని గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయంలో సాగింది. అక్కడ విద్యాలంకార్ పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఉన్నత చదువు పూణే వ్యవసాయ కళాశాలలో సాగింది. 1919 న్యాయవాద విద్య అభ్యసించడానికి ఇంగ్లాండుకు వెళ్ళాడు. ఈయన 1922లో లండన్లోని మిడిల్ టెంపుల్ నుండి బారిష్టర్-ఎట్-లా పట్టభద్రుడయ్యాడు.

భారతదేశం తిరిగివచ్చిన తర్వాత 1922లో హైదరాబాదులో లా ప్రాక్టీసు ప్రారంభించి 1950 వరకు కొనసాగించాడు. హైదరాబాదు నుండి వెలువడిన డెక్కన్ లా రిపోర్టుకు సంపాదకునిగా పనిచేశాడు. ఈయన 1924లో లక్ష్మీబాయి కొరాట్కర్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

వినాయకరావు 1930 నుండి 1950 వరకు 29 సంవత్సరాల పాటు హైదరాబాదులోని ఆర్య ప్రతినిధి సభకు అధ్యక్షత వహించాడు. ఈయన ఆర్య సమాజ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆర్యన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, హిందీ ప్రచారసభ, ఎడ్యుకేషనల్ కాన్స్ఫరెన్స్ ఆఫ్ హైదరాబాదు మొదలైన సంఘాలకు అధ్యక్షత వహించాడు. ఐదు సంవత్సరాల పాటు ఆర్య భాను అనే హిందీ వారపత్రికను స్థాపించి, నడిపించాడు.

వినాయకరావు 1950 నుండి 1956 వరకు హైదరాబాదు రాజ్యంలో మంత్రిగా అనేక హోదాల్లో పనిచేశాడు. 1952 నుండి 1956 వరకు హైదరాబాదు శాసనసభలో సభ్యుడిగా ఉంటూ బూర్గుల రామకృష్ణరావు మంత్రివర్గంలో ఆర్థికశాఖామంత్రిగా పనిచేశాడు. 1956 నుండి 1957 వరకు బొంబాయి రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1957లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రేసు అభ్యర్థిగా రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

వినాయకరావు 1962, సెప్టెంబరు 3న హైదరాబాదులో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Introduction at Hindi Mahavidyalaya website". Archived from the original on 2011-05-06. Retrieved 2014-12-21.
  2. Vinakayak Rao Koratkar, Luminaries of 20th Century, Part II, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp: 641.