విలియం కర్క్‌పాట్రిక్
విలియం కర్క్‌పాట్రిక్ | |
---|---|
జననం | 1754 |
మరణం | 22 ఆగష్టు 1812 |
రాజభక్తి | యునైటెడ్ కింగ్డమ్ |
సేవలు/శాఖ | ఈస్టిండియా కంపెనీ |
సేవా కాలం | 1771–1812 |
ర్యాంకు | మేజర్-జనరల్ |
విలియం కర్క్‌పాట్రిక్ (1754-1812) ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి, దౌత్యవేత్త, కంపెనీ పాలన కాలంలో భారతదేశంలో క్రియాశీలకమైన ప్రాచ్యవిషయాల నిపుణుడు.
జీవితం
[మార్చు]విలియం కర్క్‌పాట్రిక్, మద్రాసు సైన్యంలో కల్నల్‌గా ఉన్న జేమ్స్ కర్క్‌పాట్రిక్ పెద్ద కుమారుడు. రచయిత ఎమ్. డి. జేమ్స్ కర్క్‌పాట్రిక్ మనవడు. ఈయన తండ్రి 1777లో సుమత్రా ఫోర్ట్ మార్ల్‌బరో వద్ద సైనికదళాలకు నాయకత్వం వహించి, 1779లో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ మొన్రో కుమార్తె కేథరీన్ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు - విలియం, జార్జ్, జేమ్స్ అఖిల్స్. ఈయన 1818లో 89 సంవత్సరాల వయసులో కెంట్‌లోని హాలీడేల్‌లో మరణించాడు.విలియం, జార్జ్ బొంబాయి సివిల్ సర్వీస్లో పనిచేశారు.
పెద్ద కుమారుడైన విలియం కర్క్‌పాట్రిక్ 1771లో సైన్యంలో క్యాడెట్ అయ్యాడు. 1773 జనవరి 17న బెంగాల్ పదాతిదళంలో చేరాడు. 1777, ఏప్రిల్ 9 న లెఫ్టినెంట్‌గా, 1781, ఏప్రిల్ 3 న కెప్టెన్‌గా, 1794, మార్చి 1 న మేజర్‌గా పదోన్నతులు పొందాడు. బెంగాల్లో, 1777 నుండి 1779 వరకు, మరలా 1780 నుండి 1785 వరకు కమాండర్-ఇన్-ఛీఫ్‌గా ఉన్న గైల్స్ స్టిబ్బర్ట్‌కు పర్షియన్ అనువాదకుడిగా పనిచేసి, యుద్ధ పత్రాలకు పర్షియన్ అనువాదాన్ని సిద్ధం చేశాడు (1782లో ముద్రించబడింది). తరువాత ఈయన గ్వాలియర్ మహద్జీ సింధియా వద్ద బ్రిటీషు రెసిడెంటుగా ఉన్నాడు. 1790-1791లో మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో లార్డ్ కార్న్‌వాలిస్ సిబ్బందిలో పర్షియన్ అనువాదకుడిగా పనిచేశాడు.
1793లో, నేపాల్, టిబెట్‌ల మధ్య వివాదాలు రేగిన తరువాత, చైనా సైన్యం టిబెట్ దాటుకొని వచ్చి ఖాట్మండు సమీపంలో స్థావరం ఏర్పరచింది. నేపాలీలు ఈస్టిండియా కంపెనీ మద్దతును కోరారు. కార్న్‌వాలిస్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చి, కర్క్‌పాట్రిక్‌ను పాట్నా వద్ద నేపాల్ దౌత్యవేత్తలను కలవడానికి ఒక దౌత్యకార్యంపై పంపాడు. వారు నేపాల్ పాలకులు ఆస్థానాన్ని నిర్వహించిన నయాకోటకు వెళ్లారు. ఆ మిషన్లోని బ్రిటిష్ అధికారులు అప్పటికి ఎవరూ పర్యటించని అజ్ఞాత పర్వత దేశమైన నేపాల్‌ను సందర్శించిన తొలి విదేశీయులు.
1795లో కర్క్‌పాట్రిక్ హైదరాబాద్ నిజాం వద్ద బ్రిటీషు రెసిడెంటుగా నియమించబడ్డాడు, కానీ 1797లో కేప్‌టౌన్ కు బదిలీ చేయబడ్డాడు, ఈయన స్థానంలో ఈయన సోదరుడు జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్ నియమించబడ్డారు. కేప్ టౌన్‌లో కర్క్‌పాట్రిక్ రిచర్డ్ వెల్లెస్లీ, 1వ మార్కీస్ వెల్లెస్లీ ని కలుసుకున్నాడు. వెల్లెస్లీ ఈయన్ను నమ్మకస్తుడైన సైనిక కార్యదర్శిగా తిరిగి భారతదేశానికి తీసుకువెళ్ళాడు. ఈయన 1798 జనవరి 1న, 12 వ స్థానిక పదాతిదళంలో లెఫ్టినెంట్-కల్నల్‌గా, 1804 జూన్ 30న, 8 వ స్థానిక పదాతి దళంలో లెఫ్టినెంటల్-కల్నాల్ కమాండెంట్‌గా, 1808 ఏప్రిల్ 25న, 6 వ స్థానిక పదాతిక దళంలో కల్నల్‌గా, 1811, జూన్ 4న మేజర్ జనరల్‌గా పదోన్నతులు పొందాడు. టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా కర్క్‌పాట్రిక్ చేసిన సహాయానికి తాను ఎంతగానో రుణపడి ఉన్నానని, వెల్లెస్లీ 1802 జనవరి 10న పంపిన వర్తమానంలో ప్రకటించాడు.
శ్రీరంగపట్నం పతనం తరువాత మైసూరు విభజనకు నియమించబడిన కమీషనర్లలో కర్క్‌పాట్రిక్ కూడా ఒకడు. దీని కోసం ఈయన పది వేల పగోడాల వేతనాన్ని అందుకున్నాడు. 1801లో ఆయన పూణేలో రెసిడెంటుగా నియమించబడ్డాడు, కానీ అనారోగ్యం కారణంగా, ఆ సంవత్సరం చివర్లో భారతదేశం విడిచి వెళ్ళిపోయాడు.
కర్క్‌పాట్రిక్ 1812 ఆగస్టు 22న, 58 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈయనకు మాజీ భార్య మరియా, భారతీయ ప్రేమికురాలు ధులారీ బీబీ ఉన్నారు. వీరిద్దరికీ తన వీలునామాలో గణనీయమైన సంపదను విడిచిపెట్టాడు.[1] కర్క్‌పాట్రిక్ బెంగాల్ మిలిటరీ ఫండ్‌ను సూచించి, ప్రోత్సహించి, ఇండియా కార్యాలయానికి వెళ్ళే ఇండియా లైబ్రరీని ఎంచుకోవడానికి సహాయపడ్డాడు. ఉపఖండంపై ఆయనకున్న అవగాహనను రిచర్డ్ వెల్లెస్లీ ప్రశంసించాడు, కానీ ఆయన సోదరుడు ఆర్థర్ వెల్లెస్లీకి కర్క్‌పాట్రిక్ కుటుంబంపై అంత గొప్ప అభిప్రాయం లేదు.[2]
పనులు
[మార్చు]కర్క్‌పాట్రిక్ "గ్రామర్ ఆఫ్ ది హిందూ డయలెక్ట్ అండ్ ఆన్ అరబిక్ అండ్ పర్షియన్ వొకాబ్యులరీ" (1782) ఈస్టిండియా కంపెనీ మద్దతుతో ప్రచురించారు. ఈయన పర్షియన్ నుండి రచనలను అనువదించి, డైరీ అండ్ లెటర్స్ ఆఫ్ టిప్పూ సుల్తాన్ (లండన్, 1804), "యాన్ అకౌంట్ ఆఫ్ ది మిషన్ టు నేపాల్ ఇన్ 1793" (లండన్, 1811)ల అనువాదాల్ని కూడా ప్రచురించాడు.
కుటుంబం
[మార్చు]కర్క్‌పాట్రిక్ 1785 సెప్టెంబరులో యార్క్‌షైర్ కులీన వర్గానికి చెందిన మరియా పాసన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె విలియంతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చింది. వారి సంబంధం ఫలితంగా నలుగురు పిల్లలు పుట్టారు. కానీ ఆ తర్వాత, త్వరగా సంబంధం దెబ్బతిని విడిపోయారు. 1788లో మరియా తన పిల్లలతో కలిసి ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుండి, కర్క్‌పాట్రిక్ ఆమెతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాడు, కానీ వారు మరింత దూరమై, 1797లో చట్టబద్ధంగా విడిపోయారు. పర్యవసానంగా పిల్లలను విలియం కుటుంబం సంరక్షణలో ఉంచారు. మరియా తన కొత్త ప్రేమికుడితో తిరిగి భారతదేశానికి వచ్చింది.[1] దీనికి విరుద్ధంగా, భారతీయ మహిళ అయిన ధూలారీ బీబీతో కర్క్‌పాట్రిక్ సంబంధం చాలా ఎక్కువ కాలం పాటు నిలచింది. వీరు 1777 కి ముందు నుండి 1785 లో మరియాతో విలియం వివాహం జరిగే వరకు కలిసి ఉన్నారు. మరలా 1788 లో విలియం భార్య భారతదేశాన్ని వదిలివెళ్లినప్పుడు ధూలారీ బీబీతో వ్యవహారం పునరుద్ధరించాడు.[1]
కర్క్‌పాట్రిక్‌కు మరియాతో నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారు
- క్లెమెంటినా - అడ్మిరల్ సర్ జాన్ లూయిస్, 2 వ బారోనెట్ వివాహం చేసుకుంది
- బార్బరా - చార్లెస్ బుల్లర్ M. P. వివాహం చేసుకుంది
- జూలియా - 1వ బారోనెట్ సర్ హెన్రీ స్ట్రాచీ కుమారుడు, ఎడ్వర్డ్ స్ట్రాచీని వివాహం చేసుకుంది. ఈమె సర్ ఎడ్వర్డ్ స్ట్రాట్చీ, 3వ బారోనెట్‌కు తల్లి.
- ఎలిజా - ఆమె అవివాహితగా మరణించింది.
అదనంగా, ఈయన ధూలారీ బీబీతో ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. వీరిని చట్టబద్ధంగా అంగీకరించాడు. వీరిద్దరూ ఇంగ్లాండ్లో చదువుకున్నారు [1]
- రాబర్ట్ (1777)
- సిసిలియా