శప్తభూమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శప్తభూమి
కృతికర్త: బండి నారాయణస్వామి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: తానా పబ్లికేషన్స్, అమెరికా
విడుదల: 2017
పేజీలు: 226

శప్తభూమి 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల. ఈ నవలను బండి నారాయణస్వామి రచించాడు.

నేపథ్యం[మార్చు]

శప్తభూమి అంటే శపించబడిన నేల అని అర్థం. 18వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన చరిత్రను రచయిత ఈ నవలలో నమోదు చేశాడు. శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం పతనం తరువాత పాలెగాళ్ళ సంస్థానాలలోని రాజకీయాలు, కక్షలు కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాలు, పాలెగాళ్ల దౌర్జన్యాలు, బసివిని వ్యవస్థ, సతీ సహగమనం వంటి అనాచారాలు, కరువు కాటకాలకు తట్టుకోలేక పసిపిల్లలను అమ్ముకునే దుస్థితి ఈ నవలలో కనిపిస్తాయి. రచయిత తనకు తెలిసిన గాలిదేవర సమాధి, గులిగానప్ప పరస, కదిరప్ప స్వామి పరస, వీరగల్లులు మొదలైన చారిత్రక దాఖలాలను ఆధారం చేసుకుని ఈ నవలను వ్రాయడానికి ఉపక్రమించాడు. అదే సమయంలో వర్తమాన సందర్భమైన తెలంగాణా ఉద్యమం రచయితను ప్రభావితం చేసింది. రాయలసీమ ప్రాంత ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన చరిత్రను నవలారూపంలో అందించాలని రచయిత భావించాడు.

సంక్షిప్త కథ[మార్చు]

1775 ప్రాంతాలలో అనంతపురం సంస్థానాన్ని హండేరాజు సిద్ధరామప్పనాయుడు పరిపాలిస్తుంటాడు. తన శత్రువులైన తాడిమర్రి సంస్థానం వారు బుక్కరాయసముద్రం చెరువుకు గండి పడేటట్లు చేసి అనంతపురాన్ని ముంచివేయాలనే కుట్ర పన్నుతారు. కానీ బిల్లే ఎల్లప్ప అనే గొర్రెల కాపరి సాహసంతో వారి కుట్రను భగ్నం చేస్తాడు. రాజు మెచ్చి అతడిని అమరనాయకుడిగా నియమిస్తాడు. అతడు ఎల్లప్పజెట్టీగా పిలువబడుతుంటాడు. తన రాజు బొక్కసం నింపడం కోసం తాడిమర్రి సంస్థానానికి చెందిన యెల్లుట్లను దోచుకుంటాడు. సిద్ధరామప్పనాయుడు మైసూరు నవాబు టిప్పుసుల్తానుకు రెండు సంవత్సరాలు ఖండినీరూకలు బాకీ పడినాడు. దానిని వసూలు చేసుకోవడానికి మైసూరు నవాబు తరఫున గుత్తి సుబేదార్ అనంతపురం సంస్థానంపై దాడికి దిగుతాడు. అతడితో చెరువులోపల్లె పరగణా కుదువ పెట్టడానికి, ఇరవై ఐదు వేల రూకలు చెల్లించడానికి ఒప్పందం కుదురుతుంది. ఐతే పద్నాలుగు వేల రూకలు మాత్రమే సర్దుబాటు కావడంతో గుత్తి సుబేదార్ కోపంతో కోటవాకిళ్లు, దివాణం వాకిళ్లు పడగొట్టి పోతాడు. తమ దొరకు జరిగిన అవమానానికి ఎల్లప్పజెట్టీ కృంగిపోతాడు. వానల కోసం వీరమంటపం ఎక్కడానికి శ్రీశైలం మల్లికార్జునస్వామికి మొక్కుకుంటాడు ఎల్లప్పజెట్టీ. గండకత్తెరతో తన శరీరంలోని అంగాలను ఆన్నింటిని కత్తిరించి మల్లికార్జునికి అర్పించి దేహ త్యాగం చేయడంతో నవల సమాప్తమౌతుంది. ఈ కథతో పాటు ఎల్లప్పజెట్టీని తిరస్కరించి వివాహ బంధం నుండి బయటపడిన ఇమ్మడమ్మ, నాయకరాజుల సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న రాచవేశ్య పద్మసాని, ఇంగ్లీషు చదువులు చదివిన ఆమె కుమారుడు మన్నారుదాసు, కండబలం వున్నా కులం బలం లేక అన్యాయాన్ని ఎదురించలేని కంబళి శరభుడు, తండ్రి మరణానికి కారకుడైన వాడిపై ప్రతీకారం తీర్చుకునే హరియక్క, మతం ముసుగుతో లైంగిక దోపిడీకి పాల్పడే నాగప్ప ప్రగడ, ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించే గురవడు, తన కూతురి దుర్గతికి కారణమైన స్త్రీలోలుడు సిద్ధప్పనాయుడి పతనానికి ఎత్తులు వేసిన బయ్యన్నగారి అనంతయ్య శ్రేష్టి మొదలైనవారి కథలు ఉన్నాయి.

శైలి, భాష[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శప్తభూమి&oldid=2791727" నుండి వెలికితీశారు