Jump to content

బెంగుళూరు నాగరత్నమ్మ

వికీపీడియా నుండి
బెంగుళూరు నాగరత్నమ్మ
బెంగుళూరు నాగరత్నమ్మ
జననం(1878-11-03)1878 నవంబరు 3
భారతదేశం
మరణం1952 మే 19(1952-05-19) (వయసు 73)
వృత్తిగాయని, కళాకారిణి

బెంగుళూరు నాగరత్నమ్మ (నవంబరు 3, 1878 - మే 19, 1952) భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళ లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది.

జననము

[మార్చు]

మైసూరు దగ్గరలోని నంజనగూడు ఒక చిన్న గ్రామం. అచట నాగరత్నమ్మ 1878 నవంబరు 3 వ తేదీకి సరియైన బహుధాన్య కార్తీక శుద్ధ నవమిరోజు పుట్టలక్ష్మమ్మ అను దేవదాసికి, సుబ్బారావు అను వకీలకు జన్మించింది. ఒకటిన్నర సంవత్సరముల పిదప సుబ్బారావు తల్లీ బిడ్డలను వదిలివేశాడు. పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టాలకు ఓర్చి, బాధలను సహించి పట్టుదలతో కూతురుని పెంచింది.

బాల్యము, విద్య

[మార్చు]

తల్లిప్రేమలో నాగరత్నమ్మ బాల్యము ఒడిదుడుకులు లేకుండా గడిచింది. గిరిభట్ట తమ్మయ్య అను గురువు వద్ద సంస్కృతము, వివిధ కళలు నేర్చుకుంది. వయసుకు మించిన తెలివితేటలవల్ల ప్రతివిషయమూ చాలా త్వరగా ఆకళింపు చేసుకొనేది. మాతృభాష కన్నడము, తెలుగు, తమిళము, ఆంగ్ల భాషలు నాగరత్నమ్మకు కొట్టిన పిండి. తొమ్మిది ఏండ్లకే గురువుని మించిన శిష్యురాలై గురువు అసూయకు గురైయింది. పుట్టలక్ష్మమ్మ కూతురిని గొప్ప విదుషీమణిగా తీర్చిదిద్దిన తరువాతే మైసూరుకు తిరిగివస్తానని ప్రతినపూని మద్రాసు (చెన్నయి) చేరింది. మంచి గురువు కోసం అన్వేషణలో కంచి, చివరకు బెంగళూరు చేరింది. అచట మునిస్వామప్ప అను వాయులీన విద్వాంసుడు నాగరత్నమ్మకు సంగీతము నేర్పుటకు అంగీకరించాడు. త్యాగరాజు శిష్యపరంపరలోని వాలాజాపేట వేంకటరమణ భాగవతార్, ఆతని కొడుకు కృష్ణస్వామి భాగవతార్ల శిష్యుడు మునిస్వామప్ప. ఈవిధముగా నాగరత్నమ్మ జీవితము త్యాగరాజస్వామి వారి సేవతో ముడిపడింది. కిట్టణ్ణ అను వానివద్ద నాట్యాభ్యాసము, తిరువేంగడాచారి వద్ద అభినయకౌశలము నేర్చుకుంది. తల్లి కనుసన్నలలో, గురువుల పర్యవేక్షణలో నాలుగు సంవత్సరాలు కఠోర శ్రమచేసి సంగీత నాట్యాలలో నిష్ణాతురాలయింది. పుట్టలక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. దురదృష్ఠవశాత్తు, నాగరత్నమ్మ పదునాలుగవ ఏట తల్లి మరణించింది.

రంగ ప్రవేశము

[మార్చు]

1892 వవరాత్రుల సమయములో మైసూరు మహారాజు కొలువులోని ఆస్థాన సంగీతకారుడు వీణ శేషణ్ణ ఇంటిలో నాగరత్నమ్మ చేసిన నాట్యము పలువురు కళాకారులను, సంగీతవిద్వాంసులను ఆకర్షించింది. ఆమె సంగీతములోని సంప్రదాయ శుద్ధత, సాహిత్యములోని మంచి ఉచ్చారణ, కంఠములోని మాధుర్యము, అందమైన కల్పన ఆ విద్వత్సదస్సులోని ప్రాజ్ఞులను ఆనందపరచింది. కచ్చేరి ముగిసిన పిదప ఆమె వినయవిధేయతలతో అందరికీ నమస్కారము చేసింది. అనతికాలములోనే మహారాజావారి కొలువులో సంగీత నాట్య కళాకారిణి స్థానములో కుదురుకున్నది. నాగరత్నమ్మ పేరుప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించాయి. తల్లి ప్రతిన నెరవేర్చింది.

దిగ్విజయములు

[మార్చు]

నాగరత్నమ్మ 25వ ఏట గురువు మునిస్వామప్ప మరణం ఆమె జీవితములో ఒక పెద్ద మలుపు. 1894 డిసెంబరులో మైసూరు నుండి మదరాసు చేరి రాజరత్న ముదలియార్ అను ధనికుని ప్రాపకము సంపాదించింది. ప్రఖ్యాత సంగీతకారులు నివసించు ప్రాంతములో ఇల్లు సంపాదించి ఉండసాగింది. అచట వీణ ధనమ్మాళ్ మంచి స్నేహితురాలయ్యింది. సంగీత సాధనకు పూచి శ్రీనివాస అయ్యంగారుల ప్రోత్సాహము దొరికింది. ఆమె ఇంటిలోని కచ్చేరీలకు, భజనల కార్యక్రమములకు చాల మంది సంగీత విద్వాంసులు వచ్చేవారు. నాగరత్నమ్మ దక్షిణ భారతమంతయూ దిగ్విజయముగా పర్యటించింది. ప్రతిచోటా కళాభిమానులు నీరాజనాలిచ్చారు. రాజమహేంద్రవరములో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు తొడగిన గండపెండేరము, 1949లో గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహించడము ఆమె ప్రతిభకు తార్కాణములు.

త్యాగరాజ సేవ

[మార్చు]

నాగరత్నమ్మకు ఒక కూతురుండేది. చిన్నవయసులోనే చనిపోయింది. పిల్లలపై మమకారముతో ఒక పిల్లను పెంచుకున్నది. ఆస్తిపై కన్నేసిన పిల్ల తల్లిదండ్రులు నాగరత్నమ్మకు పాలలో విషం కలిపి ఇప్పిస్తారు. భయపడిన చిన్నపిల్ల పాలగ్లాసును జారవిడిచి నిజము చెప్పేస్తుంది. ఈ విషయము నాగరత్నమ్మ మనసును కలచివేసి ఐహికవిషయాలపై విరక్తిని కలుగచేసింది. శేషజీవితము త్యాగరాజస్వామి వారి సేవలో గడపాలని నిశ్చయించింది. తిరువయ్యారుకి మకాము మార్చింది. కావేరీ నది ఒడ్డున త్యాగరాజస్వామి వారి సమాధి శిథిలావస్థలో ఉంది. ఆ స్థలాన్ని దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసు ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని నాటగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.

సంగీత సేవ

[మార్చు]
బెంగళూరు నాగరత్నమ్మ ఆలపించిన ముకుందమాల స్తోత్రంలోని శ్లోక భాగం

కర్ణాటక సంగీతములో నాగరత్నమ్మ తనదైన ఒక కొత్త బాణీని సృష్టించుకొన్నది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. సాహిత్యము చక్కగా అర్థము చేసికొని హృదయములో హత్తుకొనేటట్లు పాడగలిగేది. మాతృభాష కన్నడము లోని దేవరనామములు ఆసక్తిగా పాడేది. ఆమె గళములో స్త్రీ కంఠములోని మాధుర్యముతో పాటు పురుష స్వరపు గాంభీర్యము కూడా మిళితమై వినసొంపుగా ఉండేది. సంగీత శాస్త్రాధ్యయనముతో బాటు నాట్య, అభినయ శాస్త్రములలో ఆమెకు పరిచయము ఉన్నందువలన ఆమె సంగీతము భావభరితము . ఆమె కచ్చేరులలో స్వరకల్పన కన్న రాగాలాపనకు ప్రాముఖ్యత అధికము. యదుకుల కాంభోజి రాగము పాడని కచ్చేరీలు అరుదు.

సాహిత్య సేవ

[మార్చు]

నాగరత్నమ్మ మాతృభాష కన్నడము అయిననూ సంస్కృతము, తెలుగు, తమిళ భాషలలో ప్రావీణ్యమును గడించింది. తిరుపతి వేంకటకవులు రచించిన శ్రవణానందము అనే పుస్తకములో ముద్దు పళని విరచితమగు రాధికా సాంత్వనము గురించి చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులో చాల తప్పులున్నాయని గ్రహించింది. వ్రాతప్రతులకు ముద్రిత ప్రతులకు చాల తేడాలున్నాయి. వ్రాతప్రతులన్నీ సంపాదించి 1911లో వావిళ్ళవారిచే పరిష్కృత పుస్తకము ప్రచురింపచేసింది. పుస్తకములో బూతు పద్యాలున్నాయని బ్రిటీష్ ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా బ్రిటిషు ప్రభుత్వము పట్టు విడవలేదు. 1927లో వావిళ్ళ దుకాణాలపై దాడి జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తరువాత టంగుటూరి ప్రకాశం పంతులు గారి హయాములో బహిష్కారము తొలగించబడింది. ఆ సమయానికి నాగరత్నమ్మ తిరువైయ్యూరులో ఒక యోగినిగా మారింది.

ఈమె రచించిన గ్రంథములు కొన్ని:

  1. శ్రీ త్యాగరాజ అష్టోత్తర శతనామావళి (సంస్కృతం)
  2. మద్యపానం (తెలుగు సంభాషణం)
  3. దేవదాసీ ప్రబోధ చంద్రోదయం (తెలుగు)
  4. పంచీకరణ భౌతిక వివేక విలక్కం (తమిళం)

బిరుదములు

[మార్చు]
  • విద్యాసుందరి
  • గానకళాప్రవీణ
  • త్యాగసేవాసక్త

ముగింపు

[మార్చు]

నాగరత్నమ్మ మే 19, 1952న త్యాగరాజస్వామిని తలుచుకొంటూ ప్రాణాలను త్యజించింది. ఆమెకు త్యాగరాజస్వామి చెంతనే దహన సంస్కారములు జరిపారు. ఆమె సమాధి త్యాగరాజస్వామి ఆలయానికి ఎదురుగానే ఉంది. ఆమె చేతులు జోడించి తన సర్వస్వమైన ఆ మహానుభావునికి నమస్కారము చేస్తూ శిలావిగ్రహముగా నేడు కూడా కూర్చుని ఉంది.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]