Jump to content

శభాష్ పాపన్న

వికీపీడియా నుండి
శభాష్ పాపన్న
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం షహీద్ లాల్
నిర్మాణం డి. రామారావు
తారాగణం జగ్గయ్య,
విజయ నిర్మల,
నాగయ్య,
రామరాజు,
విజయభాను
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నిర్మాణ సంస్థ సౌభాగ్య కళా చిత్ర
భాష తెలుగు

శభాష్ పాపన్న 1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం.సౌభాగ్య కళా చిత్ర పతాకంపై డి.రామారావు నిర్మించిన ఈ చిత్రం లో కొంగర జగ్గయ్య, విజయ నిర్మల జంటగా నటించిన ఈ చిత్రానికి షహీద్ లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: షహీద్ లాల్
  • ఛాయాగ్రహణం: షహీద్ లాల్
  • మాటలు, పాటలు: ఆరుద్ర
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, మాధవపెద్ది, స్వర్ణలత, వి.రామకృష్ణ
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • కళ: సూరన్న
  • కూర్పు: మార్తాండ్
  • నృత్యం: వెంపటి సత్యం
  • విడుదల:1972: సెప్టెంబర్:08.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

సర్దార్ సర్వాయి పాపన్న సుమారు రెండు వందల ఏండ్లక్రితం గోలుకొండ రాజ్యాన్ని ఏలిన తెలంగాణా వీరుడూ, విలాస పురుషుడు. ఢిల్లీ సైన్యాలతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందాడు. తనను ప్రేమించిన 'చిలక పాపమ్మ 'అనే ముద్దరాల్ని పెళ్ళాడతానని చేసిన బాస చెల్లించుకోకుండానే, అతని కాలం తీరిపోయింది. ఏడు తరాలలోగా తన యింటి పడుచును మనువాడే వరకూ సర్వాయి పాపన్న ప్రేతమై ఉంటాడని చిలక పాపమ్మ శాపం పెట్టింది. భూమి మీద నిలిచి, భూలోక వాసులకు ఒక మేలు చేయనిదే ఆ శాపం తీరదు. యిప్పటికి ఆరు తరాలు గడిచిపోయింది. ఏడవ తరంలో ఆ యింటి ఆడపడుచు పాపమ్మ సర్వాయి పాపన్న రాక కోసం నోము పట్టి కూచుంది.

రాజు సంపన్న కుటుంబంలో పుట్టినవాడు. ఆటలలోనూ, వ్యాయామ క్రీడలలోనూ ఛాంపియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన కాళ్ళమీద తాను నిలబడాలనే దీక్షతో ఉద్యోగం సంపాయించి పాపమ్మ ఉండే ఊరికి వచ్చాడు. ఆమె యింట్లోనే మకాం పెట్టాడు.

కాలేజీ కమిటీ అధ్యక్షుడూ, జిల్లా పరిషత్ ఛైర్మనూ అయిన సత్యం ఆ ఊళ్ళో చండశాసనుడు. తమ కాలేజీలో పని చేస్తున్న 'రాజ్యం' అనే అమ్మాయిని వశపరుచుకోవాలని ఉబలాట పడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. రాజ్యం తండ్రి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కన్ను మూసిన త్యాగమూర్తి. ఆయన నెలకొల్పిన అనాథాశ్రమాన్ని, రాజ్యం, ఆమె తల్లీ అనేక కష్టాలకోర్చి నడుపుకుంటూ వస్తున్నారు. రాజ్యానికీ, రాజుకీ మధ్య స్నేహం ప్రణయంగా మారింది. తన దారికి అడ్డు వచ్చిన రాజును అంతం చేయాలని ప్రయత్నిస్తాడు సత్యం.

ఒక చీకటి గదిలో రాజు బూజు పట్టిన తాళపత్ర గ్రంథం తీసి చదువుతుండగా ఆ మంత్ర ప్రభావానికి సర్దార్ పాపన్న మానవలోకంలో సాక్షాత్కరిస్తాడు. తొలి చూపులోనే రాజు మీద అతనికి అభిమానం ఏర్పడింది. ఒక్క రాజుకు తప్ప అతని రూపం కనిపించదు. అతని మాట వినిపించదు.

రాజుని అంతం చేయాలని సత్యం పన్నిన పన్నాగాలు అదృశ్యంగా అతడి వెంట ఉండే పాపన్న మూలంగా విఫలమౌతాయి. కానీ, ఈనాటి సంఘాన్నీ, జీవితాన్నీ, అర్థం చేసుకోలేక పాపన్న చేసే కొన్ని చర్యలకు రాజు చిక్కులలో పడుతుంటాడు. రాజు పాపన్నల మధ్య జరిగే వాగ్వాదాలను విన్న వాళ్ళందరూ రాజుకు పిచ్చెక్కిందనుకుంటారు. సత్యం ఈ అవకాశాన్ని ఆధారం చేసుకుని, రాజుని పిచ్చాసుపత్రిలో పెట్టిస్తాడు.

యిప్పుడైనా రాజ్యం తనని పెళ్ళి చేసుకోవాలని లేకపోతే అనాథాశ్రమం మీద ఉన్న అప్పు క్రింద ఆశ్రమాన్ని జప్తు చేస్తాననీ సత్యం బెదిరిస్తాడు.

పిచ్చాసుపత్రి నుంచి పాపన్న సహాయంతో తప్పించుకున్న రాజు అనాథాశ్రమాన్ని కాపాడడానికి డబ్బు తెచ్చేనిమిత్తం, రాజ్యంతో సహా మద్రాసు ప్రయాణమౌతాడు. పాపన్న కూడా అదృశ్యంగా వాళ్ళని అనుసరిస్తాడు.

మద్రాసు గుర్రప్పందాలలో రాజ్యానికి తెలియకుండా ఆమె చేతి సంచిలో ఉన్న డబ్బుతో పాపన్న ఒక పనికిమాలిన గుర్రం మీద పందెం కడతాడు. తన తప్పు తాను తెలుసుకుని చివరికెలాగో ఆ గుర్రాన్ని తానే గెలిపిస్తాడు. దాంతో రాజుకీ, రాజ్యానికీ బోలెడంత డబ్బు లభిస్తుంది.

తెల్లవారితే ఆశ్రమం వేలం వేస్తారు. అందుకని రాత్రికి రాత్రే రాజు, రాజ్యం తిరుగు ప్రయాణం చేస్తారు. త్రోవలో సారా దుకాణాన్ని చూసిన పాపన్న సహజ చాపల్యంతో కారులో నుంచి దిగి పోతాడు. ఈ సంగతి తెలియని రాజూ, రాజ్యం చాలా దూరం వెళ్ళాక సత్యం అనుచరులు దారికాచి, కారును ఆపి రాజును గాయపరచి, డబ్బుతో సహా రాజ్యాన్ని అపహరించుకుని పోతారు. దుర్మార్గులను తేలికగా వదిలే స్వభావం కాదు పాపన్నది. చివరికి తాననుకున్నది సక్రమంగా నెరవేర్చి 'శభాష్ పాపన్న ' అని అందరిచేత అనిపించుకుంటాడు.[1]

పాటలు

[మార్చు]
  • అనురాగరాశీ ఊర్వశీ నా ఆనందసరసీ ప్రేయసీ - ఘంటసాల, సుశీల - రచన: ఆరుద్ర
  • ఇవి నాజూకు అందాలురా నవనవలాడే నా చెలువాలు_పులపాక సుశీల బృందం_రచన:ఆరుద్ర
  • మోజుపడిన చిన్నవాడు పూలరంగడైనాడు_శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,ఎల్ . ఆర్ ఈశ్వరి _రచన:ఆరుద్ర
  • వీలుచూసి జనులకొరకు మేలుచెయ్యరా_మాధవపెద్ది సత్యం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం_రచన:ఆరుద్ర
  • సర్వాయి పాపారాయుడు (బుర్రకథ)_మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, కుమ్మరి మాస్టర్
  • ఈ తెలంగాణా గడ్డ తల ఎన్నడూ వంచని పోతుగడ్డ(పద్యం)_మాధవపెద్ది సత్యం
  • పడుచు నోము పండే పసుపు కుంకుమలతో (పద్యం)_విస్సంరాజు రామకృష్ణ దాస్.

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 March 1972). "సౌభాగ్య కళాచిత్ర శభాష్ పాపన్న ప్రివ్యూ". విజయచిత్ర. 6 (9): 51–53.