రమణారెడ్డి (నటుడు)
రమణారెడ్డి | |
![]() | |
జన్మ నామం | తిక్కవరపు వెంకటరమణారెడ్డి |
జననం | |
మరణం | నవంబరు 11, 1974 |
ప్రముఖ పాత్రలు | బంగారుపాప , మిస్సమ్మ |
తెలుగు సినిమా హస్యనటుల్లో రమణారెడ్డి (అక్టోబర్ 1, 1921 - నవంబరు 11, 1974) (తిక్కవరపు వెంకటరమణారెడ్డి) ప్రముఖుడు. సన్నగా పొడుగ్గా ఉండే రమణారెడ్డి అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు.
జననం[మార్చు]
రమణారెడ్డి 1921, అక్టోబర్ 1 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జగదేవిపేటలో జన్మించాడు.
సినిమా విశేషాలు[మార్చు]
లవకుశ సినిమాను నిర్మించిన శంకరరెడ్డి ప్రోత్సాహంతో రమణారెడ్డి తొలిసారిగా జానపద చిత్రం మాయపిల్లలో వేషం వేశాడు. ఆ చిత్రానికి రఘపతి వెంకయ్య నాయుడు కుమారుడైన రఘుపతి సూర్య ప్రకాశ్ (ఆర్.ఎస్.ప్రకాశ్ ) దర్శకుడు. శంకరరెడ్డి, అతనూ కలిసి ఆ చిత్రం తీశారు. అందులో వాహిని పిక్చర్స్ వారి సుమంగళి, దేవత చిత్రాలలో నటించిన మద్దెల నగరాజకుమారి (కుమారి )హీరోయిన్ గా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన తొలినటీమణిగా నటించారు. ఆ జానపద చిత్రంలో రమణారెడ్డిది మంచి హాస్య పాత్రే అయినా, చిత్రం సరిగా ఆడకపోవడంతో అది పదిమంది దృష్టిలో పడలేదు. బంగారుపాప , మిస్సమ్మ చిత్రాలతో రమణారెడ్డి ప్రతిభ ప్రేక్షకులకీ, పరిశ్రమకీ బాగా తెలిసింది. బంగారుపాపలో ముక్కుగొంతుపెట్టి మాట్లాడినట్టు మిస్సమ్మ లో డేవిడ్ పాత్రని ఉషారుగా, ఓవర్ అనిపించినా పాత్రకి తగ్గట్టు చేసి - హాస్యం ఒలికించాడు. అంతకు ముందు వేషాల వేటలో, అనుభవం కోసం డబ్బింగ్ చిత్రాల్లో గాత్రదానం చేశాడు. 'నిజంగా దానమే చేశాను' కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు కూడా, అని చెప్పేవాడు రమణారెడ్డి.
రమణారెడ్డి ‘పలుకు’లో విశేషం ఉంది. అతను ఏ పాత్ర ధరించినా ఆ పాత్ర సగభాగం నెల్లూరుమాండలికంలోనే మాట్లాడుతుంది. చివరికి ‘మాయాబజార్’ లోని చిన్నమయ పాత్ర కూడా ఆ భాష నుంచి తప్పించుకోలేదు. ‘నా భాష అది. ఎట్ట తప్పించుకుంటా?’ అనేవాడు ఆయన. కాకపోయినా, దర్శకులుకూడా ‘అతని ట్రెండ్‌లో వుంటేనే అందం. అవసరం అనిపిస్తే కాస్త మార్చవచ్చు’ అనేవాడు.
స్వవిశేషాలు[మార్చు]
సినిమాలలో రాక మునుపు రమణారెడ్డి నెల్లూరులో శానిటరీ ఇన్స్‌పెక్టరుగా ఉద్యోగం చేస్తుండేవాడు. అది వదిలి పెట్టి సినిమాల్లో చేరాలని మద్రాసు వచ్చాడు. రమణారెడ్డికి ముందు నుంచి మ్యాజిక్ సరదా వుండేది. సినిమా వేషాలు దొరకనప్పుడూ, దొరికిన తర్వాత తీరిక దొరికినప్పుడూ, మ్యాజిక్ నేర్చుకున్నారు. చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. శిష్యుల్ని తయారుచేసేవారు. ‘సేవాసంఘాల సహాయనిధికి’ అంటే, ఆ సంస్థ గుణగణాల్ని పరిశీలించి, ఉచితంగా మ్యాజిక్ ప్రదర్శనలుఇచ్చేవారు.
కొన్ని షూటింగుల టైమ్‌లో విరామం దొరికితే, అందరి మధ్య కూచుని చిన్న చిన్న ట్రిక్కులు చేసి, ‘అరెరె!’ అనో, ‘అబ్బా!’ అనో అనిపించేవారు. ఆరుద్ర కూడా చిన్నచిన్న మ్యాజిక్‌లు చేసేవారుగనక, ఈ ఇద్దరూ కలిస్తే ఆ టాపిక్ వచ్చేది. కొత్తకొత్త ట్రిక్సూ వచ్చేవి. ఐతే రమణారెడ్డి ఆరోగ్యం అంత బాగుండేది కాదు. సినిమాల్లోకి వచ్చినప్పుడు వున్న బక్క పర్సనాలిటీయే - అలా కంటిన్యూ అయింది. చాలామంది అలా అలా లావెక్కుతారుగాని, రమణారెడ్డి మాత్రం ఒకే పర్సనాలిటీ ‘మెయిన్‌టెయిన్’ చేశారు. అలా వుండడమే ఆయనకో వరం. ఆ శరీరం రబ్బరు బొమ్మ తిరిగినట్టు, చేతులూ, కాళ్లూ కావలసిన రీతిలో ఆడించేది. దబ్బున కూలిపోవడం, డభాలున పడిపోవడం రమణారెడ్డికి సాధ్యమైనట్టు తక్కినవాళ్లకి సాధ్యమయ్యేది కాదు. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలందరూ రమణారెడ్డిని కోరుకునేవారు. ‘రేలంగి - రమణారెడ్డి జంట’ చాలా సినిమాల్లో విజయవంతమైన జంట. కె.ఎస్ ప్రకాశరావు, తిలక్ వంటి దర్శకుల చిత్రాల్లో రమణారెడ్డి వుండితీరాలి.
వ్యక్తిగా రమణారెడ్డి సౌమ్యుడు. తెరమీద ఎంత అల్లరీ, ఆర్భాటం చేసి నవ్వించేవారో బయట అంత సీరియస్. ఏవో జోకులువేసినా సైలెంటుగానే ఉండేవి. గట్టిగా మాట వినిపించేది కాదు. మనసుకూడా అంత నెమ్మదైనదే. ఏనాడూ ఎవరి గురించీ చెడుమాట్లాడ్డమో, విమర్శించడమో చేసేవాడు కాదు. తన పనేదో తనది, ఒకరి సంగతి తనకక్కరల్లేదు. అంత నవ్వించినవాడూ తన ఆనారోగ్యాన్ని మాత్రం నవ్వించలేకపోయాడు. అది అతన్ని బాగా ఏడిపించింది. దరిమిలా ఆయన్ని తీసుకువెళ్లిపోయి అభిమానుల్ని ఏడిపించింది. ఆయన 1974 నవంబర్ 11తేదిన మరణించాడు.
హాస్యంతో కూడుకున్న లిటిగెంట్ వేషాలూ, తిప్పలుపెట్టే పాత్రలూ చూసినప్పుడల్లా రమణారెడ్డి, అతని కొంగ కాళ్లలాంటి చేతుల విసుర్లూ స్పీడుయాక్షనూ గుర్తుకు వస్తాయి.
తనమాటల్లో 'రమణారెడ్డి'[మార్చు]
అప్పుడే నా చేత ప్రకాశరావు నారదుడి వేషం వేయించారు. ‘నేను నారదుడేమిటి? ఇవాళ నారదుడంటారు - రేపు హనుమంతుడంటారు’ అని వాదించాను. వినలేదు. విశాలమైన నా వక్షస్థలం, అస్థిపంజరం కనిపించనీయకుండా ఫుల్ జుబ్బా తొడిగారు. ‘కృష్ణప్రేమ’లో సూర్యకుమారి ఆడది గనుక జుబ్బా తొడిగారు. నేను మగాణ్ని గనక నాకూ జుబ్బా తొడిగారు. తేడాలు రెండూ వక్షస్థలాలకి సంబంధించినవే!’ అన్నారు రమణారెడ్డి ఓసారి, తను చేసిన పాత్రల గురించి చెబుతూ.
‘ధనసంపాదన కోసం సినిమా వుంది. నా సరదా కోసం, ప్రజల సహాయం కోసం మ్యాజిక్’ వుంది' అనేవాడు.
రమణారెడ్డి సినిమాల జబితా[మార్చు]
వనరులు[మార్చు]
- తెలుగుపీపుల్[permanent dead link]లో వచ్చిన వ్యాసం
- రమణారెడ్డి పేజీ.
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with GND identifiers
- 1921 జననాలు
- 1974 మరణాలు
- తెలుగు సినిమా
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా హాస్యనటులు
- నెల్లూరు జిల్లా సినిమా నటులు
- నెల్లూరు జిల్లా ఇంద్రజాలికులు