మద్దెల నగరాజకుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమారి
రూపవాణి పత్రిక ముఖచిత్రంగా మాయపిల్లలో కుమారి
జననంమద్దెల నగరాజకుమారి
1921
తెనాలి, గుంటూరు జిల్లా,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
మరణంమార్చి 3, 2008
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
నివాస ప్రాంతంవిజయవాడ, మద్రాసు
ఇతర పేర్లుకుమారి, రాజకుమారి
వృత్తినటి, గాయని
క్రియాశీలక సంవత్సరాలు1937 నుండి 1941, 1946, 1951 నుండి 1954
మతంహిందూమతం
పిల్లలుగంగాధర్
తండ్రివెంకటేశ్వరరావు
తల్లిరామమణి

మద్దెల నగరాజకుమారి అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ కుమారిగా పేరుతెచ్చుకున్నారు.[1] తెలుగు చలనచిత్రాలలో ఒకే నటుడు రెండు పాత్రలను పోషించే విధానం సతీ సులోచన (1935)తో ప్రారంభమైంది. ఆ చిత్రంలో 'మునిపల్లె సుబ్బయ్య'గా ప్రఖ్యాతి పొందిన వి.వి.సుబ్బారావు రావణుడు, ఇంద్రజిత్ పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నటిమణుల్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి కుమారి. నగరాజకుమారి, రాజకుమారి, కుమారి ఇలా మూడు పేర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. తక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ఆమె.

ప్రస్థానం

[మార్చు]

ఎందరో కళాకారులను చలనచిత్రరంగానికి అందించిన తెనాలిలో 1921లో జన్మించిన మద్దెల నగరాజకుమారికి చిన్నతనం నుండి నటన అంటే ఆసక్తి. అయితే తల్లిదండ్రుల చాటుపిల్ల కావడంతో వారి అభీష్టానికి విరుద్ధంగా ప్రవర్తించలేకపోయారు. అదీగాక ఆ రోజులలో సినిమాలలో నటిస్తే అందం కరిగిపోతుందని, ఎక్కువ కాలం బతకరని అపోహలు ఉండేవి. అందుకే నాజూకుగా, ఎంతో ఆకర్షనీయంగా కనిపించే నగరాజకుమారికి అవకాశాలు ఎక్కువ సంఖ్యలోనే వచ్చినా ఆమె తల్లి అంగీకరించలేదు. 'శ్రీకృష్ణతులాభారం', 'సీతాకళ్యాణం' తదితర చిత్రాలలో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చినా ఈ కారణం వల్లే ఆమె తల్లి అంగీకరించలేదు. అయితే కూతురికి సంగీతం నేర్పించి, ఇంట్లో తిరుగుతూ కమ్మని స్వరంతో నగరాజకుమారి హాయిగా అలా పాడుతుంటే విని ఎంతో ఆనందించేది ఆమె తల్లి. కూతురు కళ్ళ ముందు అలా కనిపిస్తే చాలుననుకునేదామె.

తొలి సినిమా

[మార్చు]

ఇదిలా ఉంటె పువ్వుల అంజయ్య రూపంలో సినిమాలలో నటించే అవకాశం నగరాజకుమారిని వెదుక్కుంటూ వచ్చింది. ఆయన కన్నాంబ నాటక సమాజంలో వయోలినిస్టుగా పనిచేస్తుండేవారు. పూర్ణా యాత్రా స్పెషల్ నిర్వహించే జి.కె.మంగరాజు క్వాలిటి పిక్చర్స్ పతాకంపై ఆ రోజులలోనే దశావతారాలు (1937) చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించాడు. నటీనటుల ఎంపిక కోసం బెజవాడ (ఈ నాటి విజయవాడ) వచ్చారు. అంజయ్య నగరాజకుమారికి దూరపుబంధువు కావడంతో ఆమె తల్లిని ఒప్పించి ఇంటర్వ్యూ నిమిత్తం బెజవాడకు పంపించారు. నగరాజకుమారిని చూసీచూడగానే ఎంపిక చేయడమే కాకుండా మూడు పాత్రలను ఆమెకి ఇచ్చారు. ఆచిత్రంలో సీత, లక్ష్మీ, యశోధర పాత్రలను రాజకుమారి పోషించారు. కలకత్తాలో ఈ చిత్రం నిర్మితమైంది. ఈ చిత్రం విజయవంతమవడంతో మరిన్ని అవకాశాలు ఆమెని వరించాయి.

అమ్మతో హీరోయిన్

[మార్చు]

రెండవ చిత్రంలోనే రాజకుమారికి నాయిక అవకాశం లభించింది. అది కలకత్తాలో నిరంజన్ పాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అమ్మ చిత్రం. 1939లో విడుదలైన ఈ చిత్రంలో రాజకుమారి పాడిన వికసిత సుమములకున్ అనే పాట, నాయకుడు సుబ్బారావుతో కలిసి పాడిన నిరీక్షించవా నాకై యుగళగీతం ఆనాటి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1939లోనె విడుదలైన ఉష చిత్రంలో చిత్రలేఖగా నటించింది. ఉష, అనిరుద్ధులను తన మంత్రశక్తితో ఒకటిగా చేసే కీలకమైన పాత్ర అది. అయితే ఈ రెండు చిత్రాలు ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో రాజకుమారికి సరైన బ్రేక్ లభించలేదు.

సుమంగళితో గుర్తింపు

[మార్చు]

రాజకుమారి నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం సుమంగళి. 1940లో విడుదలైన ఈ చిత్రం నుండి ఆమె కుమారిగా గుర్తింపు పొందింది. వాహిని సంస్థలో మూడు చిత్రాలలో నటించడానికి ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం 1941లో విడుదలయిన దేవత చిత్రంలో నాయికగా కుమారి నటించింది. ఈ చిత్రంలో ఆమెది అమాయకురాలైన పనిమనిషి వేషం. అప్పటికే నటులుగా, గాయకులుగా పేరు తెచ్చుకున్న నాగయ్య, టంగుటూరి సూర్యకుమారిలకు దీటుగా నిలబడి నటించి పేరు తెచ్చుకున్నారు. అమ్మ, సుమంగళి, దేవత చిత్రాల వరకూ తన పాటలు తనే పాడుకునా కుమారి ఆ తర్వాత మాత్రం నేపథ్యగాయకుల ఈదే ఆధారపడ్డారు.

చేజారిన వేషం

[మార్చు]

ఒప్పందం ప్రకారం వాహిని వారి నాలుగవ చిత్రం, దర్శకుడు కె.వి.రెడ్డి తొలి చిత్రం భక్త పోతన (1942)లో కుమారి నటించాల్సి ఉంది. అయితే అదే సమయంలో 'తులసీదాసు' చిత్రం షూటింగు నిమిత్తం వాహినీ వారి అనుమతితో కుమారి బొంబాయి వెళ్ళడంతో భక్త పోతనలో అవకాశం చేజారింది. తులసీదాసు చిత్రం కోసం ఆరు నేలలు బొంబాయిలోనే కుమారి ఉండిపోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి నాయకుడు కె.ఎస్.ప్రకాశరావు, దర్శకుడు రమణారావు. ఆరు నెలలు అక్కడే ఉన్నా షూటింగు సజావుగా సాగక ఆగిపోవడం కుమారిని మానసికంగా కుంగదీసింది. ఈ తప్పటడుగు పడకుండా ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది.

అయిదేళ్ళ విరామం

[మార్చు]

ఆ తర్వాత నటిగా ఆమెకు అయిదేళ్ళ విరామం వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల కుమారి నటనకు దూరమయ్యారు. ముగ్గురు మరాఠీలు (1946) చిత్రంతో చలనచిత్రరంగంలో తిరిగి అడుగుపెట్టారు. ఈ చిత్రం విజయవంతమైనా కుమారి కెరీర్‌కు లాభంచేకూరలేదు. ఆ తర్వాత ఆమె 'శివగంగ' చిత్రంలో నటించారు. సి.ఎస్.ఆర్. దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోవడంతో కుమారి కెరీర్‌కు మళ్ళీ తెర పడింది.

మాయపిల్లలో ద్విపాత్రాభినయం

[మార్చు]

మరో నాలుగేళ్ళు తెర వెనకున్న కుమారికి మాయపిల్ల (1951) చిత్రంతో మంచి అవకాశం లభించింది. ఇందులో దొంగల రాణి 'మాయపిల్ల' (అసలు పేరు ఆశ) గా, రూపగా ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం కోసం ఆమె పడిన శారీరక కష్టం అంతాఇంతా కాదు. కత్తి యుద్ధాలు, కొండచిలువతో యుద్ధం ఇలాంటివి చాలా చేశారు. ఆ రెండు పాత్రల కోసం ఆమె వాడిన దుస్తులు ఆ రోజులలో కుర్రకారుని వెర్రెత్తించాయి. 1951లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడు రఘుపతి సూర్య ప్రకాశ్‌ కు చివరి చిత్రం కావడం గమనార్హం. కుమారి ఇంత కష్టపడినా ఈ చిత్రం మాత్రం విజయం సాధించలేదు.

చివరి అవకాశాలు

[మార్చు]

అదే ఏడాది విడుదలైన మరో చిత్రం ఆకాశరాజులో కూడా కుమారి నాయికగా నటించారు. విశ్వనాథ సత్యనారాయణ రచన చేసిన ఈ జానపద చిత్రం కూడా విజయవంతం కాలేదు. ఒప్పందం ప్రకారం భక్త పోతన చిత్రంలో నటించలేదు కనుక 10 ఏళ్ళ అనంతరం వాహినీ సంస్థ నిర్మించిన మల్లీశ్వరి (1951) చిత్రంలో కుమారి ఒక పాత్రను పోషించాల్సి వచ్చింది. ఇందులో ఆమె మహారాణిగా కనిపిస్తుంది, అదీ కొద్దిసేపే. ఆ తర్వాత పెంపుడు కొడుకు (1953 తెలుగు, తమిళం) చిత్రంలోనూ, కాళహస్తి మహాత్యం (1954) చిత్రంలోనూ ఆమె నటించారు. కాళహస్తి మహాత్యం చిత్రంలో పి.సుశీల తన మొదటి పాటలలో ఒకటైన శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి కుమారికి పాడటం విశేషం. ఆ తర్వాత వేషాలు కరువవడంతో కుమారి చిత్రరంగానికి శాశ్వతంగా దూరమయ్యారు.

చివరి రోజులు

[మార్చు]

తనయుడు గంగాధర్ చదువు పూర్తి కావడంతో 1958లో విజయవాడకు తరలి వెళ్ళారు. 50 ఏళ్ళ పాటు అక్కడే గడిపిన కుమారి తన 87వ ఏట మార్చి 3, 2008న కన్నుమూశారు.

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "వాహిని కుమారి , Vahini Kumari". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 13 June 2017.

లింకులు

[మార్చు]